Breaking News

రంపాలు మొలుస్తాయి

Published on Tue, 11/03/2026 - 04:31

ఇంటి పిల్లాడు చాక్లెట్‌ కొనివ్వలేదనో, ట్యూషన్‌కు వెళ్లననో కాళ్లు నేల మీద గట్టిగట్టిగా తాటిస్తాడు. అప్పుడు ఇంట్లో ఉండే నానమ్మ దగ్గరకు తీసుకుని ‘అలా నేల మీద కాళ్లు రుద్దకు నాయనా. భూదేవికి నొప్పి పుట్టి ఏడుస్తుంది’ అని చెప్పేది. ఆ తర్వాత ఆ పిల్లాడు నేల మీద గట్టిగా నడవడానికి కూడా జంకేవాడు. తూనీగకు దారం కట్టి ఆడుతూ ఉంటే ‘పాపంరా... అలా చేయకు’ అని తల్లి కచ్చితంగా కోప్పడేది.

‘చీమల దారికి అడ్డంగా నీళ్ళు పోస్తారా ఎవరైనా... అవి ఇల్లు కట్టుకుంటున్నాయిరా’ అని అదిలించేవారు ఇంట్లో కచ్చితంగా ఉండేవారు. ‘చెట్టుమీద రాయి విసరకు. చెట్టుకు దెబ్బ తగులుతుంది’ అని గదమాయించే పెద్దలు ఇటూ అటూ సిద్ధం. ఇవన్నీ కేవలం పెద్దల మాటలు కాదు. పిల్లల గుండెలోకి కరుణను ఎక్కించే సూది మందులు. పిల్లాడి మణికట్టుపై కట్టే దయాదారాలు. తోటి ప్రాణి నొప్పిని తన నొప్పిగా భావించడం నేర్పే మొదటి బడి ఇల్లే. 

పిల్లాడు పెద్దయి బడికి వెళ్తే అక్కడ మరో తల్లి ఎదురయ్యేది.. టీచర్‌. ఆమె అక్షరాలతో పాటు కరుణను కూడా దిద్దించేది. అందరి వేళ్లూ తెగ నరికే అంగుళీమాలుడిని చూసి బుద్ధుడు ‘నేను ఆగిపోయాను.... నీవే ఆగాలి’ అని ఎలా ఆపాడో చెప్పేది. ‘నేను అన్ని ప్రాణులను హింసించడం ఆపేశాను. కరుణలో స్థిరంగా ఆగిపోయాను. 

కానీ నీవు ఇంకా హింసలో పరిగెడుతూనే ఉన్నావు’ అన్న బుద్ధుడి మాటల్లో కారుణ్యం క్లాస్‌రూమ్‌లో పిల్లల మనసులను తాకేది. గాంధీ తాత పరుగెత్తే గుర్రపు బగ్గీ కింద పడ్డ కుక్కపిల్ల కోసం పరీక్ష మానుకున్నారని చెప్తే మరువగలమా ఆ పాఠాన్ని? పిల్లల్లో ఇల్లు కరుణను నాటితే బడి దానికి నీళ్ళు పోసేది. ఆ తర్వాత సమాజం ఆ మొక్కను ఎదగనిచ్చేది.

ఊళ్లో పెద్దల మాట అంటే హడల్‌. ఎవరు ఎవరి మీదైనా హింస చేస్తే పెద్దలు వాళ్లను పట్టుకొచ్చి రచ్చబండ దగ్గర రేవు పెట్టేవారు. అంటే మనం ఎవరినైనా బాధిస్తే సంఘం దృష్టిలో చులకనవుతామనే భయం నాటుకునేది. పశువును కొట్టినా పిట్టపై గులేర్‌ రాయి ఎక్కుపెట్టినా చెవి మెలేసే పెద్దలు పెట్టిన భయం మనసులో స్థావరం చేసుకునేది. చెట్టుకింత నీరు, పక్షికి నాలుగు గింజలు, ఆకలిగొన్నవాడికి పట్టెడు అన్నం... అదే జీవితం అని సంఘం పాఠం చెప్పేది. తన బలం, తన కోపం, తన ప్రేమ ఇతరులను నొప్పించడానికి వాడకూడదని అది గట్టిగా అర్థం చేయించేది.

అదంతా గతం. ఇప్పుడు? అమ్మమ్మలు నానమ్మలు ఇళ్లల్లో ఉండటమే లేదు. తల్లిదండ్రులకు పిల్లలతో కూర్చుని కథ చెప్పేంత సమయం లేదు. ఫోనో, టాబ్లెటో ఇచ్చి వాళ్ల పరుగుల్లో వాళ్లున్నారు. దాంతో వాడు తూనీగకు దారం కట్టడం కాదు స్క్రీన్‌ మీద డ్రాగన్‌లను నరకడం నేర్చుకుంటున్నాడు. బడిలో విలువలు చెప్పాల్సిన టీచర్‌ సిలబస్‌ పూర్తి చేయడానికి తలమునకలవుతున్నాడు. పరీక్ష మార్కులే కొలతలుగా మారిన చోట మనిషితనానికి పడే మార్కుల ఊసే లేదు. ఇక సంఘం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 

ఇదీ చ‌ద‌వండి: స్నేహితురాలి ప్రాణం కాపాడిన బాలిక‌ 

వీధిలో హత్య జరుగుతుంటే రీల్‌గా మార్చడంలో మజా అనుభవిస్తోంది. యువత వీటన్నింటి ప్రతిఫలంగా సినిమాల్లో రక్తపిపాస పెరిగింది. ఓటీటీల డార్క్‌ కంటెంట్‌. హీరో ఒక అమ్మాయిని వేధిస్తే అది ప్రేమగా, ఆమె కాదంటే  పట్టుదలగా, ఆమెను కొడితే మగతనంగా చూపించే సినిమాలూ, వాటిని తీసే సినిమా బృందం జవాబుదారీతనం లేని వింత మృగాలవుతున్నారు. రంపాలు, గొడ్డళ్ళు, తుపాకులు హీరోయిజం సింబల్స్‌. మనిషిని చంపడం ఎంత ఈజీయో స్క్రీన్‌ మీద చూసి చూసి, పిల్లాడి మనసులో హింస ఒక సాధారణ విషయంగా మారిపోతోంది. 

అనంతపురం క్లాస్‌రూమ్‌లో రంపంతో దాడి చేసిన పిల్లాడు ఒక్కడే నేరస్తుడా? ఆ రంపాన్ని మనమే ఇచ్చాం. కరుణ నేర్పని ఇల్లు, విలువలు చెప్పని బడి, హింసను హీరోయిజం చేసిన సినిమా ఇచ్చింది. ‘వద్దు అంటే వదిలేయాలి’ అని చెప్పని సమాజం ఇచ్చింది. అందుకే అది ఒక పిల్లాడి నేరం కాదు, ఒక తరం వైఫల్యం. అంతా ముగిసిపోయింది కనుక మళ్ళీ మొదటి నుంచి మొదలు కావడమే మార్గం. అమ్మమ్మ మళ్ళీ గొంతు విప్పి దయ నేర్పాలి. టీచర్‌ మళ్ళీ బ్లాక్‌ బోర్డ్‌ మీద కరుణ రాయాలి. సంఘం తన అంతస్తును తాను పెంచుకోవాలి. అంతవరకు ప్రతి క్లాస్‌రూమ్‌లో ఒక రంపం తిరుగుతూనే ఉంటుంది.       

ఖదీర్‌    

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)