Breaking News

అందమైన జుట్టు కోసం.. తలకట్టు.. దీర్ఘమూ..!

Published on Tue, 06/30/2026 - 07:59

చిన్నప్పుడు అక్షరాలు దిద్దే టైమ్‌లో తలకట్టూ, దీర్ఘం చదువుకుంటాం. స్టైల్‌గా అక్షరంపైన స్టైల్‌గా, ఠీవిగా ఉండే దాన్ని తలకట్టు అంటాం కదా. అలా తలపైనా అందంగా, స్టైల్‌గా ఉండేజుట్టునీ తలకట్టు అంటాం. అమ్మాయిల అందం ఇనుమడించాలంటే ఆ తలకట్టు పొడవుగా, సు‘దీర్ఘం’గా ఉండాలి. చదువుకుంటూ అక్షరాలు దిద్దినప్పుడు ఉండే ఆ తలకట్టూ, దీర్ఘాలే యుక్తవయసు దాటాక కూడా కొనసాగాలనేది టీనేజ్‌ నుంచీ యువతీయువకులందరి కోరిక.

ఇక అమ్మాయిలూ మహిళలూ కోరుకునేది మంచి పొడవాటి జడ. ఒకవేళ ఈ రోజుల్లో జడ ఎవరూ వేసుకోవడం లేదనుకున్నా... జలపాతంలా జారిపోయే మృదువైన పొడవైన జుట్టు. మంచి అందమైన, పొడవైన జుట్టుకోసం అమ్మాయిలూ, హీరో లాంటి లూక్‌ కోసం అబ్బాయిలూ... ఎవరెవరు ఎంతెంత ఖర్చు పెడుతుంటారో లేక్కేలేదు. మాటల్లో ‘ఆఫ్టరాల్‌ వెంట్రుక...’ అంటూ వ్యవహరించే ఈ జుట్టు కోసం కోట్లాది రూపాయల బిజినెస్‌ జరుగుతుందంటే అతిశయోక్తే కాదు. ఆ జుట్టు ఎందుకు, ఎలా పెరుగుతుంటుంది, ఎందుకు రాలుతుంది అలా రాలకూడదంటే ఏం చేయాలి లాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల సమాహారమే ఈ కథనం.

జుట్టు, రోమాలు, తలకట్టు, వెంట్రుకలు, అందమైన భాషలో కురులు అంటూ పిలిచే ఆ నల్లటి, సన్నటి, పొడవైన తీగలాంటి జుట్టు నిర్మాణం నిజానికి చాలా సంక్లిష్టం. చూడ్డానికి సింపుల్‌గా కనిపించే ఆ జుట్టు కథ ఏమిటో, ఎలా పుడుతుందో, దానికి వచ్చే రకరకాల సమస్యలేమిటన్న అనేక అంశాలను విపులంగా తెలుసుకుందాం.

జుట్టు ఎలా పెరుగుతుందంటే... 
ప్రతిరోజూ వెంట్రుక 0.3 మి.మీ. నుంచి 0.4 మి.మీ. వరకు పెరుగుతుంది. అంటే ఏడాదికి దాదాపు ఆరు అంగుళాలు పెరుగుతుంది. వెంట్రుక పెరుగుదలలో కెటాజెన్, టిలోజెన్, అనాజెన్‌ అనే దశలు ఉంటాయి.

కెటాజన్‌ : మొత్తం జుట్టులో కనీసం మూడు శాతం ఎప్పుడూ ఈ దశలోనే ఉంటుంది. నిజానికి వెంట్రుక పెరుగుదలలో ఇదో సంధి దశ. ఈ దశలో వెంట్రుక 2 – 3 వారాలు ఉంటుంది. ఈ దశలో వెంట్రుక నిద్రాణంగా ఉండటం వల్ల దానిలో పెరుగుదల ఏమాత్రం ఉండదు.

టిలోజెన్‌ : మన మొత్తం జుట్టులో 10–15 శాతం ఎప్పుడూ ఈ దశలో ఉంటుంది. ఈ దశ మాడుపై ఉన్న వెంట్రుకలలో సాధారణంగా 100 రోజుల పాటు కొనసాగుతుంది. ఇక కనుబొమలు, కనురెప్పలు, బాహుమూలాల్లో ఉండే వెంట్రుకల్లో ఈ దశ మరింత దీర్ఘకాలం ఉంటుంది. ఈ దశలోనే వెంట్రుక తన పూర్తిస్థాయి పొడవులో ఉంటుంది. ఈ దశలో ఉన్నప్పుడు పీకితే వెంట్రుక కింద దాని గసగసాల్లా ఉండే గుండ్రటి, తెల్లటి భాగం కనిపిస్తుంది.

అనాజెన్‌ : వెంట్రుక పెరుగుదల తాలూకు దశలన్నింటిలోనూ అనాజెన్‌ చురుకైన దశ. ఈ దశలో వెంట్రుక మూలంలో కణవిభజన వేగంగా జరుగుతుంటుంది. కింద కొత్త కణాలు వస్తున్న కొద్దీ పాత కణాలు ముందుకు వెళ్తుంటాయి. దాంతో కింది నుంచి వేగంగా వెంట్రుక పెరుగుతూ పోతుంది. ఈ దశలో ప్రతి 28 రోజులకు వెంట్రుక ఒక సెం.మీ. పెరుగుతుంది. ఈ పెరుగుదల ఇలా రెండు నుంచి ఆరేళ్లు కొనసాగుతుంది. కొందరిలో ఆ వ్యవధి తర్వాత వెంట్రుక అదే వేగంతో పెరగదు. కొంత పొడవు పెరిగి ఆగిపోతుంది. అయితే తల మీద ఉన్న వెంట్రుకలు రెండు నుంచి ఆరేళ్లు పెరుగుతాయి. బాహుమూలాల్లో, కాళ్లపైనా, కనుబొమలు, కనురెప్పపై ఉండే వెంట్రుకల్లో ఈ వ్యవధి 30–45 రోజులు మాత్రమే ఉంటి, ఆ తర్వాత పెరుగుదల ఆగిపోతుంది. ఈ కారణం వల్లనే ఈ ప్రాంతాల్లోని వెంట్రుకలు మాడుపై ఉండే వెంట్రుకలంతగా పెరగవు.

వెంట్రుకల తీరుతెన్నులు : కొందరిలో వెంట్రుకలు స్ట్రెయిట్‌గా పెరుగుతాయి. ఇలా పెరిగే వారి జుట్టు సాఫీ (స్ట్రెయిట్‌)గా ఉంటుంది. అదే కొందరిలో జుట్టు పెరుగుతున్న కొద్దీ వెంట్రుక ఒంపు తిరుగుతుంటుంది. ఇలా జరిగేవారికి రింగులు రింగులుగా ఉండే ఉంగరాల జుట్టు వస్తుంది. వెంట్రుకను అడ్డుగా కోసినప్పుడు ఆ అడ్డుకోత గుండ్రంగా ఉంటే అది సాఫీగా (స్ట్రెయిట్‌)గా పెరుగుతుంది. అదే ఒకవేళ ఆ అడ్డుకోత దీర్ఘవృత్తంలా ఉంటే అది రింగులుగా పెరుగుతుంది. సాఫీగా (స్ట్రెయిట్‌గా) ఉండే జుట్టుకు... అడుగున ఉండే సబేషియస్‌ గ్రంథి నుంచి పోషకాలు సాఫీగా అందుతాయి. దాంతో ఇవి మరింత జీవంతో ఉంటాయి. ఇలా కనిపించడం కోసమే చాలామంది జుట్టును తిన్నగా ఉండేలా (హెయిర్‌ స్రెయిటెనింగ్‌) చేయించుకుంటుంటారు. అదే ఉంగరాల్లా తిరిగే జుట్టు వారిలో పోషకాలు చివరివరకూ చేరడానికి కాస్త అడ్డంకులు ఉండటంతో పొడవు జుట్టు ఉన్నవారి కంటే ఉంగరాల జుట్టు కాస్తంత మెరుపు తక్కువగా ఉంటుంది.


జుట్టు రాలడానికి కారణాలు 
శారీరక ఒత్తిడి : రోజూ తీవ్రమైన శారీరక ఒత్తిడులు లేదా తీవ్రంగా జబ్బు పడటం వంటి అంశాలు జుట్టులో భౌతికంగా మార్పులు తెచ్చి వాటిని రాలిపోయేలా చేస్తాయి. ఇలా జుట్టు రాలడాన్ని ‘టిలోజెన్‌ ఎఫ్లూవియమ్‌’ అంటారు. అంటే ఈ దశలో జుట్టు ఊడిపోయే దశ అయిన టిలోజెన్‌ వైపునకు ప్రయాణం కొనసాగి, టిలోజెన్‌ దశ దీర్ఘకాలం కొనసాగుతుంది. దాంతో తలపై జుట్టు పలచబడినట్లుగా కనిపిస్తుంది. ఈ దశలో రాలిన జుట్టు చివరి భాగంలోని తెల్లని పదార్థం పచ్చిగా కాకుండా ఎండిపోయినట్లుగా ఉండటాన్ని గమనించవచ్చు.

పరిష్కారం ఇలా : ఇలా రాలిన జుట్టు సాధారణంగా ఒత్తిడి తొలిగాక మళ్లీ మొలుస్తుంది.

గర్భధారణ తర్వాత : చాలామంది మహిళల్లో ప్రసవం తర్వాత తలపై జుట్టు రాలిపోయి మాడుపై జుట్టు బాగా పలచబారిపోయినట్టుగా కనిపిస్తుంటుంది. ఈ దశలో మహిళల శారీరక ఒత్తిడి కూడా జుట్టు రాలడానికి ఒక కారణం. పైగా జుట్టుకు అందాల్సిన పోషకాలు అందకుండా పోవడం కూడా మరో కారణం. ఆ సమయంలో జుట్టుకు అవసరమైన ఐరన్, ఫోలిక్‌ యాసిడ్, ఇతర విటమిన్లు కడుపులోని బిడ్డకు అందడంతో ఇలా పోషకాలు జట్టుకు అందకుండాపోతాయి. 
పరిష్కారం ఇలా : తగినంత ఐరన్‌ సప్లిమెంట్లు, మల్టీవిటమిన్‌లు జుట్టుకు అందే విధంగా చూడటం వల్ల దీన్ని అరికట్టవచ్చు.

ప్రోటీన్‌ లోపాలతో : ప్రోటీన్‌లోపం కారణంగా జుట్టు రాలిపోవడం చాలా మందిలో కనిపిస్తుంటుంది. ఇలాంటివారు తమ ఆహారంలో తగినంతగా ప్రోటీన్‌  తీసుకోకపోవడమే ఇందుకు కారణం. ఈ ప్రోటీన్లే అమైనో ఆసిడ్స్‌గా మారి జుట్టు పెరుగుదలకూ, రిపేర్లకూ ఉపయోగపడతాయి.

పరిష్కారం ఇలా : ఈ కారణంతో జుట్టు ఎక్కువగా రాలుతున్నవారు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారమైన చేపలు, గుడ్లు, మాంసాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. శాకాహారులైతే ప్రోటీన్‌ మోతాదులు ఎక్కువగా ఉండే... గ్రీన్‌పీస్, నట్స్, శనగలు, పప్పుధాన్యాలు, సోయా తీసుకోవాలి.

విటమిన్‌–ఏ మరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల : ఆహారంలో విటమిన్‌–ఏ మోతాదులు మరీ ఎక్కువైతే కూడా జుట్టు రాలుతుంది. విటమిన్‌–ఏ మనకు ప్రతిరోజూ 5000 ఐయూ (ఇంటర్నేషనల్‌ యూనిట్స్‌) అవసరం. ప్రతిరోజూ విటమిన్‌–ఏ ను 10,000 ఐయూ కంటే ఎక్కువగా తీసుకునేవారు దాన్ని అదేపనిగా చాలాకాలం పాటు తీసుకుంటూ ఉంటే జుట్టు రాలే అవకాశాలు ఎక్కువ.

పరిష్కారం ఇలా : విటమిన్‌–ఏ టాబ్లెట్లు తీసుకునేవారు కేవలం డాక్టర్ల సలహా మేరకు మాత్రమే, వారు నిర్ణయించిన మోతాదులోనే తీసుకోవాలి. 

హార్మోన్‌ లోపాల (హార్మోనల్‌ ఇంబ్యాలెన్స్‌) వల్ల : సాధారణంగా హార్మోన్‌ లోపాల సమస్య మహిళల్లో ఎక్కువ. స్త్రీలలో కూడా పురుష హార్మోన్‌ అయిన టెస్టో స్టెరాన్‌ కొద్ది మోతాదులో స్రవిస్తుంటుంది. పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌ (పీసీఓఎస్‌) ఉన్నవారిలో టెస్టోస్టెరాన్‌ ఎక్కువగా స్రవిస్తుంది. ఇది జుట్టు రాలిపోడానికి ఒక కారణమవుతుంది. హైపోథైరాయిడిజమ్‌ కండిషన్‌ కూడా జుట్టు రాలడానికి మరో కారణం.

పరిష్కారం ఇలా : పీసీఓఎస్‌తో బాధపడే మహిళలు హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ ద్వారా... అలాగే హైపోథైరాయిడిజమ్‌తో బాధపడేవారు థైరాక్సిన్‌ సప్లిమెంట్స్‌ తీసుకోవడం జుట్టు రాలడం తగ్గవచ్చు.

కొన్ని ఆటోఇమ్యూన్‌ కండిషన్ల వల్ల : తమ సొంత వ్యాధి నిరోధకశక్తే తమకు దేహంపై ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే జబ్బులను ఆటోఇమ్యూన్‌గా చెబుతారు. ఉదాహరణకు...

  • పేనుకొరుకుడు (అలొపేషియా ఏరేటా) వల్ల... మాడు, కనుబొమలు, మీసం, గడ్డం, శరీరంలో ఏభాగంలోనైనా వెంట్రుకలన్నీ రాలిపోయి  ప్యాచ్‌లుగా కనిపిస్తుంటాయి.

  • లైకెన్‌ ΄్లానస్‌ అనే ఆటోఇమ్యూన్‌ కండిషన్‌ వల్ల జుట్టు శాశ్వతంగా ఊడిపోయే అవకాశం ఉంది. ∙లూపస్‌ అనే మరో ఆటో ఇమ్యూన్‌ కండిషన్‌ వల్ల కూడా శాశ్వతంగా జుట్టు రాలిపోయే ముప్పు ఉంటుంది.

పరిష్కారం ఇలా : ఆటోఇమ్యూన్‌ కారణాల వల్ల జుట్టు రాలిపోవడాన్ని నివారించడానికి డ్యాప్సోన్‌ అనే మందులు కొంతవరకు పనిచేస్తాయి.

ఏయే మందులతో జుట్టు రాలవచ్చు...

  • మొటిమలకు వాడే మందులు (ఆక్నే మెడిసిన్స్‌),

  • కొన్ని యాంటీబయాటిక్స్‌ 

  • కొన్ని యాంటీ ఫంగల్‌ మందులు,

  • యాంటీ డిప్రెసెంట్స్‌

  • నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మందులు,

  • రక్తాన్ని పలచబార్చే యాంటీ కోయాగ్యులెంట్స్‌ (బ్లడ్‌ థిన్నర్స్‌),

  • యాంటీకొలెస్ట్రాల్‌ మందులు ∙ఇమ్యునోసప్రెసెంట్స్,

  • కీమోథెరపీ మందులు.

  • మూర్చ చికిత్సలో వాడే ఎపిలెప్సీ మందులు,

  • హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీలో వాడే ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్, పురుషులకు వాడే టెస్టోస్టెరాన్, యాండ్రోజెన్,

  • ఇంటర్‌ఫెరాన్స్,

  • వేగంగా మారిపోయే మూడ్స్‌ను నియంత్రించడానికి వాడే మూడ్‌ స్టెబిలైజేషన్‌ మందులు,

  • నొప్పినివారణకు వాడే ఎన్‌ఎస్‌ఏఐడీ మందులు,

  • స్టెరాయిడ్స్, ∙థైరాయిడ్‌ మందులు.

పరిష్కారం ఇలా...

  • మందులు వాడటం మానేయగానే సాధారణంగా జుట్టు మళ్లీ రావచ్చు.

  • జుట్టు రాలడం మరీ ఎక్కువగా ఉంటే కొన్ని మందులు వాడటం ద్వారా.

  • జుట్టు రాలడాన్ని అరికట్టే మందులు వాడటం ద్వారా

  • కీమోథెరపీ ఇచ్చే సమయంలో హైపోథెర్మియా అనే ప్రక్రియను ఉపయోగించడం ద్వారా. ఈ ప్రక్రియలో కీమోథెరపీ ఇచ్చే ముందర... ఇచ్చిన అరగంట తర్వాత మాడుపై ఐస్‌తో రుద్దుతారు. ఫలితంగా కీమోథెరపీలో ఇచ్చిన మందు ఫాలికిల్‌లోకి అంతగా ప్రవేశించదు. ఇలా చల్లబరిచే ప్రక్రియ హెయిర్‌ ఫాలికిల్‌ను కాస్త నెమ్మదించేలా చేసి, జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.

స్కారింగ్‌ అలొపేషియా : ఈ సమస్య కారణంగా దాదాపు మూడు శాతం మందిలో జుట్టు రాలిపోతుంటుంది. ఇలా రాలిపోయే జుట్టు మళ్లీ రాదు. ఎందుకంటే ఇందులో ఫాలికిల్‌ శాశ్వతంగా దెబ్బతింటుంది. ఆ స్థానంలో స్కార్‌ కణజాలం భర్తీ అవుతుంది. అందుకే ఈ కారణంగా జుట్టు రాలిపోతే అది మళ్లీ మొలవదు. ఇలా జుట్టు రానప్పుడు అది  ప్యాచ్‌లు  ప్యాచ్‌లుగా ఉండి, ఆ  ప్యాచులు క్రమంగా పెరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో జుట్టు రాలిన చోట కనిపించే  ప్యాచ్‌లలో దురద, మంట, నొప్పి కూడా ఉండవచ్చు. డిసెక్టింగ్‌ సెల్యులైటిస్, ఇసినోఫిలిక్‌ పస్ట్యూల్‌ ఫాలిక్యులైటిస్, ఫాలిక్యులార్‌ డీజనరేషన్‌ సిండ్రోమ్, లైకెన్‌ ΄్లానో పైలారిస్, సూడోపెలేడ్‌ ఆఫ్‌ బ్రాక్‌ అనే కండిషన్లు... స్కారింగ్‌ అలొపేషియాకు కారణమవుతాయి.

జుట్టును రాల్చే ఇన్ఫెక్షన్లు...

రింగ్‌వార్మ్‌ : ఇది ఒక రకం ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌. ఈ కండిషన్‌ను టీనియా కాపిటిస్‌ అంటారు. ఇది ఫంగస్‌ కారణంగా మాడుపై వస్తుంది. మొదట చిన్న మొటిమలా వచ్చి క్రమంగా పరిమాణం పెరుగుతూ పోతుంది. విస్తరించిన చోట పొలుసుల్లా వచ్చి... ఆ ప్రదేశంలో తాత్కాలికంగా జుట్టు మొలవదు.

చికిత్స: టెర్బినఫిన్, ఫ్లుకోనజోల్, గ్రీషియోఫల్విన్, ఇట్రాకొనజోల్‌ వంటి యాంటీఫంగల్‌ మందులతో చికిత్స చేయవచ్చు.

ఫాలిక్యులైటిస్‌ : ఇది జుట్టు ఫాలికిల్‌ (అంకురాల్లో) ఇన్‌ఫ్లమేషన్‌ (వాపు, నొప్పి) వచ్చే కండిషన్‌. ఇది వచ్చినవారిలో వెంట్రుక మొదల్లో ఎర్రటి పొక్కులు వచ్చినట్లుగా కనిపిస్తుంటుంది. ఇది స్టెఫలోకాకస్, సూడోమొనాస్‌ వంటి బ్యాక్టీరియా కారణంగా వస్తుంది.

చికిత్స : యాంటీబయాటిక్‌ మందులతో దీన్ని తగ్గించవచ్చు.

పీడ్రా : ఇది వెంట్రుకకు వచ్చే ఒక రకం ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌.

డెమోడెక్స్‌ ఫాలిక్యులోరమ్‌ : ఇది కనురెప్పల వెంట్రుకలను ప్రభావితం చేసే కండిషన్‌. ఈ జబ్బుకు దారితీసే సూక్ష్మజీవి కనురెప్పలను మెరిసేలా చేసే నూనెను ఎక్కువగా స్రవించేలా చేయడం వల్ల ఈ రుగ్మత వస్తుంది.

సెబోరిక్‌ డర్మటైటిస్‌ : వాస్తవానికి ఇది ఇన్ఫెక్షన్‌ కాని కండిషన్‌. ఈ కండిషన్‌లో చర్మం పగుళ్లు ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌తో పాటు కలిసి వస్తాయి. ఈ పరిస్థితిని సల్ఫర్, సెలీనియమ్‌ సల్ఫైడ్, జింక్‌ పైరోథియాన్‌ (జడ్‌పీటీఓ), తార్, శాల్సిలిక్‌ ఆసిడ్‌ లేదా ఆయిల్‌ ఆఫ్‌ లేడ్, కార్టికోస్టెరాయిడ్‌ లోషన్లతో చికిత్స చేసి, నియంత్రణలోకి తెస్తారు.

వెంట్రుక తీగ (షాఫ్ట్‌)కు వచ్చే లోపాలు...
వెంట్రుకలో మనకు పైకి కనిపించే తీగ వంటి భాగాన్ని షాఫ్ట్‌ అంటారు. ఈ లోపాలకు ప్రధాన కారణం జన్యుపరమైనవి. వాటిలో కొన్ని...

లూజ్‌ అనాజెన్‌ సిండ్రోమ్‌ : దీన్నే లూజ్‌ హెయిర్‌ సిండ్రోమ్‌ అంటారు. దీని పేరే దీని వల్ల కలిగే లోపాన్ని సూచిస్తుంది. అంటే అనాజెన్‌ దశలో వెంట్రుక వదులుగా అయి చిన్నగా లాగినా ఊడి వచ్చేస్తుంది. ముఖ్యంగా యుక్తవయస్కులైన బాలికల్లో ఈ లోపం కనిపిస్తుంది. ఇలా ఊడిన జుట్టు ఒకపట్టాన తేలిగ్గా మొలవదు. అందుకే మాడుపై జుట్టు పలచబారే అవకాశం ఉంది.

పరిష్కారం : సాధారణంగా ఇలా ఊడిన జుట్టు దానంతట అదే రావాల్సిందే. చికిత్సతో పెద్దగా ప్రభావం ఉండదు.

ట్రాక్షన్‌ అలొపేషియా: చాలామంది తల్లులు జడవేసే సమయంలో తమ పిల్లలకు జుట్టును బాగా లాగి టైట్‌గా జడవేస్తుంటారు. ఇలా చాలాకాలం పాటు జుట్టును చాలా బలంగా లాగుతుండటం వల్ల జుట్టు శాశ్వతంగా దెబ్బతింటుంది.

ట్రైకో టిల్లోమేనియా : ట్రైకో టిల్లోమేనియా అనే కండిషన్‌లో కొందరు తమ జుట్టును తామే బలంగా పీకేసుకుంటుంటారు. బాగా ఒత్తిడితో ఉండేవారు తమ గోళ్లు విపరీతంగా కొరుక్కున్నట్టుగానే ఈ సమస్య ఉన్నవారు తమ జుట్టు తామే పీకేసుకుంటుంటారు. వీళ్లు తమ కనురెప్పల వెంట్రుకలు, కనుబొమల వెంట్రుకలు కూడా లాగుతూ ఉంటారు.

ట్రైకోఫేజియా : ఇది కూడా తమ జుట్టు తాము లాక్కోవడం లాంటిదే. అయితే ఈ రుగ్మత ఉన్నవారు అలా లాగిన జుట్టును తినేస్తుంటారు. ఇది చాలా తీవ్రమైన జబ్బు. ఇలాంటి వారికి తక్షణమే చికిత్స (ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్‌) ఇవ్వడం అవసరం. 
చివరగా... జుట్టు రాలుతున్నప్పుడు వెంట్రుకలకు ఉన్న సమస్య ఏమిటో తెలుసుకుని... ఆ మేరకు చికిత్స అందించాల్సి ఉంటుంది. అయితే ఇటీవల వైద్యపరంగా తగిన విద్యార్హతలు లేనివారు జుట్టుకు చికిత్స అందిస్తున్నారు. దీనివల్ల జుట్టు శాశ్వతంగా దెబ్బతినడం లేదా రాలిపోవడం జరగవచ్చు. అందుకే తమ జుట్టు సమస్యలకు తగిన విద్యార్హతలు ఉన్న నిపుణలను సంప్రదించడం అన్న జాగ్రత్త తీసుకోవడం మంచిది.

తొలి రోమం పుట్టేదిలా... 
బిడ్డ తన తల్లి కడుపులో ఉన్నప్పుడు పిండం తాలూకు 22వ వారంలోనే వెంట్రుక మూలాలు చిన్నారి తాలూకు దేహమ్మీద ఆవిర్భవిస్తాయి. వాటిని ఫాలికిల్స్‌ అంటారు. అంటే పుట్టుకకు ముందే బిడ్డ శరీరంపై 50 లక్షల ఫాలికిల్స్‌ ఉంటాయి. వీటిల్లో పదిలక్షలు తల (మాడు) మీద ఉంటాయి. పుట్టుకకు ముందు ఈ ఫాలికిల్స్‌ (వెంట్రుక మూలాలు) ఎన్ని ఉంటాయో జీవితాంతం అన్నే ఉంటాయి. అంతేతప్ప వీటి సంఖ్య జీవితకాలంలో ఎప్పుడూ పెరగదు. పైగా వ్యక్తులు పెరుగుతున్నకొద్దీ వీటి సంఖ్య తగ్గుతూ పోతుంది.

వెంట్రుక నిర్మాణం ఇలా... 
వెంట్రుకను ప్రధానంగా రెండు భాగాలుగా చెప్పవచ్చు. అదే మాడు మీది చర్మం లోపల ఉండే ‘అంకురం’ (బల్బ్‌) భాగం. ఇక మనకు బయటకు కనిపించే భాగాన్ని ‘వెంట్రుక’ (షాఫ్ట్‌) అంటారు. ఇలా వెంట్రుకలో బల్బ్‌ అలాగే షాఫ్ట్‌ అని రెండు భాగాలుంటాయి.

బల్బ్‌ అని పిలిచే ఈఅంకురంలో అనేక పొరలు ఉంటాయి. అంకురం లోపల ఒక మోలక(్రపొజెక్షన్‌)లా ఉండే భాగాన్ని పాపిల్లా అంటారు. దీనికి రక్తసరఫరా ఉంటుంది. వెంట్రుకలో జీవంతో ఉండే భాగం ఇదే. ఈ బల్బ్‌లో ఎప్పుడూ కణవిభజన జరుగుతూ ఉంటుంది. ఇంత వేగంగా శరీరంలోని మరేప్రాంతంలోనూ కణవిభజన జరగదు. ప్రతి 23 నుంచి 72 గంటలకొకసారి కణాల విభజన జరుగుతూ ఉండటం వల్ల వెంట్రుకలు పెరుగుతూ ఉంటాయి. ఇక ప్రతి అంకురం పక్కనే ఒక గ్రంథి ఉంటుంది. దాన్ని ‘సబేషియస్‌ గ్రంథి’ అంటారు. ఇది నూనెలాంటి ద్రవాన్ని స్రవిస్తుంటుంది. ఇది జుట్టుకు స్వాభావికమైన (నేచురల్‌) కండిషనర్‌లా పనిచేస్తుంటుంది. చిన్నపిల్లలు తమ టీనేజీలోకి రాగానే ఈ గ్రంథి నుంచి స్రావం ఎక్కువై జుట్టులో మెరుపును పెంచి, ఆ వయసులో కౌమార బాలబాలికలు మరింత అందంగా కనిపించేలా చేస్తుంది.

మందుల వల్ల...
రకరకాల ఆరోగ్య సమస్యలకు కొన్ని రకాల మందులు వాడుతున్న కొందరిలో వాటి దుష్ప్రభావం వల్ల జుట్టు రాలడం సాధారణంగా జరుగుతుంటుంది. కొందరిలోనైతే ఇది అవాంఛిత రోమాల పెరుగుదలకూ దారితీస్తుంది. ఈ మందులు జుట్టు పెరుగుదలలో ఉండే అనాజెన్, కెటాజెన్, టిలోజెన్‌ దశల్లో జోక్యం చేసుకోవడం వల్ల జుట్టు పెరుగుదల/జీవిత చక్రాల (సైకిల్‌)లో మార్పు వస్తుంది. ఫలితంగా టిలోజెన్‌ ఎఫ్లువియమ్, అనాజెన్‌ ఎఫ్లూవియమ్‌ అనే రెండు రకాల మార్పులు వచ్చి అవి జుట్టు రాలేలా చేస్తాయి.

టిలోజెన్‌ ఎఫ్లూవియమ్‌ : ఏదైనా రుగ్మతకు మందులు వాడటం మొదలుపెట్టాక 2 నుంచి 4 నెలల్లో మందు ప్రభావంతో వెంట్రుక ఫాలికిల్‌ విశ్రాంతి దశలోకి వెళ్తుంది. ఫలితంగా జుట్టు రాలాక మళ్లీ మొలవడం ఆలస్యం అవుతుంది.

అనాజెన్‌ ఎఫ్లూవియమ్‌ : ఈ దశలో జుట్టు రాలడం విషయంలో... వెంట్రుకలు తమ పెరుగుదల దశలోనే రాలిపోతుంటాయి. ఈ ఫలితం మందు వాడటం మొదలుపెట్టిన కొద్దిరోజుల్లోనే ఇది కనిపిస్తుంది. ఉదాహరణకు కీమోథెరపీ తీసుకునేవారిలో అనాజెన్‌ ఎఫ్లూవియమ్‌ వల్లనే జుట్టురాలడం సంభవిస్తుంది. ఈ మందుల వల్ల కేవలం తలపైన ఉండే జుట్టే కాకుండా కనుబొమలు, కనురెప్పల వెంట్రుకలూ రాలిపోతాయి.

జుట్టు... దానిపై రసాయనాల ప్రభావం... 
జుట్టుకు రంగువేయడం, స్ట్రెయిటెన్‌ చేసుకోవడం, బ్లీచింగ్‌ వంటి ప్రక్రియల్లో వెంట్రుకలు... రసాయనాలకు ఎక్స్‌పోజ్‌ అవుతుంటాయి. ఫలితంగా వాటిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. దీనివల్ల ఒక్కోసారి వెంట్రుకలు మళ్లీ రిపేర్‌ చేయలేని విధంగా దెబ్బతినవచ్చు. మనకు కనిపించే వెంట్రుక పై పొర అయిన క్యూటికిల్‌ పూర్తిగా దెబ్బతినవచ్చు. ఇలా వెంట్రుక పైపొర అయిన క్యూటికిల్‌ దెబ్బతింటే లోపల ఉండే కార్టెక్స్‌ అనే భాగం బయటకు కనిపిస్తుంది. ఇది పైపొరలా నునుపుగా కాకుండా కాస్త గరుకుగా ఉంటుంది. ఈ కార్టెక్స్‌ భాగం బయటపడిన జుట్టు నిర్జీవంగా కనిపిస్తుంటుంది. ఇక నీళ్లలో, వాతావరణంలో, షాంపూల్లో, హెయిర్‌స్ప్రేలలో ఉండే రసాయనాలు క్యూటికిల్‌నే కాకుండా కార్టెక్స్‌నూ దెబ్బతీయవచ్చు. అప్పుడు వెంట్రుక తేలిగ్గా విరిగిపోతూ ఉంటుంది.

వెంట్రుకను దెబ్బతీసే భౌతిక పద్ధతులు : విపరీతంగా దువ్వడం, చాలా బలంగా దువ్వడం, జుట్టు తడిగా ఉన్నప్పుడే దువ్వడం, వెనక్కు దువ్వడం, బలమైన వేడిగాలి తగిలేలా డ్రైయర్‌ను ఉపయోగించడం వంటి ప్రక్రియలు సైతం వెంట్రుకలను దెబ్బతీస్తాయి. ఇలా భౌతికపద్ధతుల ద్వారా దెబ్బతిన్న వెంట్రుక సాఫీగా లేకుండా ఒకచోట ఉబ్బు మరోచోట పలచబారినట్లుగా ఉంటుంది. ఇలా కనిపించే వెంట్రుకలను ‘బబుల్‌డ్‌ హెయిర్‌’ అంటారు. ఇలాంటి వెంట్రుకలు బలహీనంగా, తేలిగ్గా విరిగిపోయేలా ఉంటాయి.

పుట్టుకతోనే జుట్టు రాలిపోయే కండిషన్లు... 
హైపోట్రైకోసిస్‌ : జుట్టు సమస్యల్లో ఇదో రకం. అలొపేషియాలో మొదట జుట్టు ఉన్న చోట రాలిపోయి, మళ్లీ మొలవడంలో ఇబ్బందులు ఏర్పడితే... ఈ ‘హైపోట్రైకోసిస్‌’ అనే సమస్యలో అసలు జుట్టు పెరగాల్సిన చోట... మొదట్నుంచి కూడా వెంట్రుకలే మొలవవు. దాంతో పుట్టుకతోనే జుట్టు మొలవకపోవడంతో పాటు... జీవితకాలంలో అసలెప్పుడూ వారిలో జుట్టు మొలవదు. ఇందుకు కారణాలు ప్రధానంగా జన్యుపరమైనవి. ఇక పిండదశలో వచ్చే లోపాల వల్ల కూడా ఇలా జరగవచ్చు. ఈ సమస్యతో పాటు కనిపించే గ్రాహమ్‌ లిటిల్‌ సిండ్రోమ్, ఒఫ్యూజీ సిండ్రోమ్, మేవిక్‌ క్లేవ్‌ సిండ్రోమ్‌ వంటివి కూడా ఇందుకు కారణమవుతాయి.

కంజెనిటల్‌ అలొపేషియా : ఈ కండిషన్‌ కారణంగా పుట్టుకతోనే బట్టతల వస్తుంది.

ట్రైయాంగ్యులార్‌ అలొపేషియా : ఈ కండిషన్‌లో కణతల వద్ద జుట్టు రాలిపోతుంది. 
కంజెనిటల్‌ ఏట్రికియా : పిల్లల్లో కనిపించే ఈ కండిషన్‌లో మొదట వారికి ఒత్తైన జుట్టు ఉండి, అది రాలిపోయి మళ్లీ మొలవదు.


- డా. విజయ గౌరి బండారు, సీనియర్‌ కన్సల్టెంట్‌ డెర్మటాలజిస్ట్‌.

నిర్వహణ : యాసీన్‌

Videos

నిప్పుల కొలిమిగా యూరప్... పిట్టలా రాలిపోతున్న జనాలు!

2029లో మీరు రాజారెడ్డి మనవడిని చూస్తారు..! ఒక్కొక్కడికీ ఊచకోతే..!

జులైలో వానలు! విశాఖ IMD గుడ్ న్యూస్

YS జగన్ ను కలిసిన సింగపూర్ కాన్సులేట్ జనరల్

కేతన్ హత్య కేసులో బయటపడుతున్న కీలక ఆధారాలు.. మరో సంచలన ట్విస్ట్!

మినిమం కామన్ సెన్స్ లేదా... ఏమ్మా హోమ్ మినిస్టర్, ఏం చేస్తున్నావ్..!

High Tension: చంద్రబాబు ఇంటిని ముట్టడి బారు గేట్లు లాగిపడేసిన రైతులు

సాయికృష్ణ కేసులో RMP డాక్టర్ చెప్పిన నమ్మలేని నిజాలు

ఫేస్ యాప్ దుర్వినియోగం? ఉపాధి హామీలో టీడీపీ అక్రమాలు

రికార్డులు బద్దలు కొట్టిన సమంత.. అనుష్కను దాటేసింది!

Photos

+5

అక్కినేని అఖిల్‌ ‘లెనిన్‌’ మూవీ HD స్టిల్స్‌

+5

‘హ్యాంగ్‌మ్యాన్’ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘ఆల్ఫా’ మూవీ ప్రమోషన్‌లో సందడి చేసిన అలియా భట్ (ఫొటోలు)

+5

గ్లామరస్‌గా సింగ్ గీతం బ్యూటీ నివేదా పేతురాజ్.. (ఫోటోలు)

+5

రొట్టెల పండగ : స్వర్ణాల తీరం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

అందాల అదితీ రావు హైదరీ (ఫొటోలు)

+5

రకుల్.. అదిరెన్ నీ సొగసులు! (ఫొటోలు)

+5

లార్డ్స్ మైదానంలో సందడి చేసిన కోహ్లి-ధావన్ ఫ్యామిలీస్! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో హీరోయిన్ మధుబాల స్పెషల్ మూమెంట్స్ (ఫొటోలు)

+5

బాలీవుడ్ భామ ప్రగ్యా కపూర్ బర్త్‌ డే.. తమన్నా సందడి (ఫోటోలు)