Breaking News

పిల్లల గుండెల్లో పిచ్చుక గూళ్లు

Published on Tue, 08/18/2026 - 00:34

నిద్ర లేచి పిచుకల కిచకిచలు వింటూ కాఫీ తాగడం ఒకప్పటి ముచ్చట. నేటి హైరైజ్‌ అపార్ట్‌మెంట్లు, గ్లాస్‌ బిల్డింగులు, సెల్‌ టవర్ల రేడియేషన్‌ మధ్య పిచుకలు బెదిరి దూరం జరిగిపోయాయి. 

తమిళనాడు తన తప్పు తెలుసుకొని విద్యాశాఖను, అక్కడి ‘కూడుగల్‌ ట్రస్ట్‌’ను కలిపి ‘ప్రభుత్వ స్కూళ్ల ద్వారా పిచుకల సంరక్షణ’ అనే విప్లవానికి తెరలేపింది. పిచుక గూళ్లు తయారు చేయడం నేర్చుకున్న పిల్లలు చెన్నై, కోయంబత్తూరుల్లో ఉంచిన గూళ్ల వల్ల పిచుకలు తిరిగి వచ్చాయి. మరి మనకు వద్దా పిచుకల సందడి?

పిల్లలు పెద్దలను చాలా విషయాల్లో సరి చేస్తున్నారు. పెద్దలు వదిలిపెట్టిన బాధ్యతలను తీసుకుంటున్నారు. ఇప్పుడు తమిళనాడు స్కూలు పిల్లలు అదే దారిలో ఉన్నారు. పర్యావరణ, సంరక్షణ బరువును కూడా వారి చిన్ని భుజాలకు ఎత్తుకుంటున్నారు.

చెట్టు, పుట్ట, మట్టి, మొలక, పిట్ట, పిచుక... అన్నీ బాగుంటేనే మనం కూడా బాగుంటామని వారికి తెలుసు. అందుకే తమిళనాడు ప్రభుత్వం, ఆ రాష్ట్రానికి చెందిన స్వచ్ఛంద సంస్థ ‘కూడుగళ్‌’ ట్రస్ట్‌ కలిసి ‘పిల్లలూ... పిచుకలు గూళ్లు లేక అవి ఊళ్లు వదిలి వెళుతున్నాయి. బతకలేకపోతున్నాయి. మీరే గూళ్లు తయారు చేసి వేళ్లాడగట్టండి’ అనంటే అలాగే అని రంగంలో దిగారు.

దేశంలోనే మొదటిసారి ఒక రాష్ట్ర ప్రభుత్వం, పర్యావరణ ప్రేమికులు కలిసి పిల్లలను పిచుకుల కేర్‌టేకర్‌లుగా మార్చిన విశేషం ఇది. ఆ ఆలోచన ఫలించింది. కిచకిచలు వినిపిస్తున్నాయి. అవి తుర్రున ఎగురుతున్నాయి. ఇళ్ల కిటికీల్లో వాలి హాయ్‌ చెబుతున్నాయి.

ఇంటికొక గూడు
పిచుకలు బతకాలంటే ఇంటికొక గూడు ఉండాలి. కనీసం స్కూల్లో ఉన్న ప్రతి స్టూడెంట్‌ తన ఇంటి దగ్గర ఒక గూడు వేళ్లాడగడితే? ఇదీ ఆలోచన. అందుకే తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూర్, ఈరోడ్, కృష్ణగిరి, రాణిపేట్‌ వంటి 10 జిల్లాల్లోని 50 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి, ఈ సీజన్‌లో స్కూళ్లు తెరిచాక పిచుకగూళ్ల వర్క్‌షాప్స్‌ నిర్వహిస్తున్నారు. 

పిల్లలకు చెక్కతో పిచుకల గూళ్లు తయారు చేయడం నేర్పిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌ కేవలం పక్షులకు ఇళ్లు ఇవ్వడంతోనే ఆగిపోదు. పిల్లలు ఆ గూళ్లను తమ ఇళ్లవద్ద అమర్చిన తర్వాత వాటికి రోజువారీ ఆహారం, నీరు కూడా ఇవ్వాలి. రోజూ ఉదయం, సాయంత్రం గూటి పక్కన సజ్జలు, రాగులు, వరి గింజలు వంటి ధాన్యాలు వేయడం, చిన్న పాత్రలో మంచినీరు అమర్చడం పిల్లల దినచర్యలో భాగం చేసుకోవాలి. 

ఇలా గూడుతో పాటు కూడు కూడా దొరకడంతో గత ఐదేళ్లలో తమిళనాడులో 15,000 గూళ్లను పంపిణీ చేసిన జిల్లాల్లో పిచుకల జనాభా ఏకంగా 25 శాతం పెరిగింది. వచ్చే నెలలో పిచుకలను గుర్తించేందుకు ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను లాంచ్‌ చేయబోతున్నారు. దీని సాయంతో పిల్లలే స్వయంగా ‘పిచుకల గణన’ (Sparrow Census) చేయనున్నారు.

బడి నుంచి ప్రకృతి
మన విద్యావ్యవస్థలో మార్కులు, ర్యాంకుల గోల ఎక్కువైపోయింది. పిల్లలకు పుస్తకాల్లో పర్యావరణం గురించి పాఠాలు ఉంటాయి కానీ ప్రాక్టికల్‌ అవగాహన సున్నా. తమిళనాడు చేస్తున్న ఈ ప్రయోగం కేవలం పిచుకలను కాపాడటం మాత్రమే కాదు... గూడును తయారు చేయించి, ఒక ప్రాణికి రోజూ అన్నం పెట్టే బాధ్యతను ఇవ్వడం ద్వారా పిల్లల్లో ‘కరుణ’, ‘సృజనాత్మకత’, ‘బాధ్యత’ అనే గుణాలను నాటుతున్నారు. 

ఇలా చేయడం వల్ల ప్రకృతిపై పిల్లవాడికి ఓనర్‌షిప్‌ వస్తుంది. పెద్దయ్యాక వాడు పర్యావరణాన్ని నాశనం చేసే పనులు చేయడు. చెట్లను నరకడానికి ఒప్పుకోడు. కాబట్టి మనం ఎయిర్‌ కండిషన్స్డ్  గదుల్లో కూర్చుని పర్యావరణ ఉపన్యాసాలు ఇవ్వడం కంటే స్కూల్‌ లెవెల్‌లోనే ఇలాంటి ‘డు ఇట్‌ యువర్‌ సెల్ఫ్‌’  ప్రాజెక్టులు పెట్టడం వల్ల సమాజంలో శాశ్వత మార్పు వస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో ?
హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, వరంగల్‌ లాంటి నగరాల్లో ఈ రోజు పరిస్థితి ఏంటి? ఇక్కడ కూడా పిచుకలు కనుమరుగైపోతున్నాయి. ప్రతి ఇల్లూ కాంక్రీట్‌ డబ్బాగా మారిపోవడంతో పిచుకలకు ఆశ్రయం లేకుండా పోయింది. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో పిచుకలు కీలకపాత్ర పోషిస్తాయి. అవి పంటలను నాశనం చేసే చిన్న చిన్న పురుగులను, దోమల లార్వాలను తిని రైతులకు, ప్రజలకు స్నేహితుడిగా మారతాయి. 

పిచుకలు లేకపోతే పురుగులు పెరుగుతాయి. మన హైదరాబాద్‌లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి హ్యాబిటాట్‌ బాక్సులను పంపిణీ చేస్తూ నగరంలో పిచుకలను రప్పించే ప్రయత్నం చేస్తున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఇలాంటి ప్రాజెక్టులను అధికారికంగా పాఠశాలల్లో ఎందుకు ప్రవేశపెట్టకూడదు? మన విద్యాశాఖలు ఇలాంటి ఎన్విరాన్ మెంట్‌ ప్రాజెక్టులను సిలబస్‌లో భాగంగా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మనకూ కావాలి పిచుకలు.. .
గృహిణులు, విద్యార్థులు ఏం చేయాలి? పెద్ద పెద్ద బడ్జెట్‌లు, ప్రభుత్వ నిధుల కోసమే ఎదురు చూడనక్కర్లేదు. చిన్న అడుగు వేయవచ్చు. మీ ఇంటి బాల్కనీల్లో, కిటికీల పక్కన అట్టపెట్టెలు లేదా పాత కొబ్బరి చిప్పలతో గూళ్లను ఏర్పాటు చేయవచ్చు. వాటిల్లో కొద్దిగా బియ్యం గింజలు, సజ్జలు వేసి, ఒక చిన్న గిన్నెలో నీళ్లు పెడితే చాలు.. పిచుకలు మళ్లీ మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తాయి.

 ఇక విద్యార్థులు తమ స్మార్ట్‌ఫోన్లలో గేమ్స్‌ ఆడటం పక్కన పెట్టి ఇళ్ల చుట్టుపక్కల ఉన్న పక్షులను గమనించడం, వాటికి దాణా వేయడం అలవాటు చేసుకోవాలి. రేపటి తరానికి కేవలం డిజిటల్‌ స్క్రీన్‌లపై పిచుక బొమ్మలను చూపించడం కాకుండా వాటి నిజమైన కిచకిచలను బహుమతిగా ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మన ఇళ్లలో, మన మనసుల్లో పిచుకల కోసం కొంచెం స్థలాన్ని కేటాయిద్దాం!

Videos

ప్రియాంక కేసులో కీలక మలుపు నిందితులకు పోలీస్ కస్టడీ

BJPకి షాక్ ఇస్తూ.. విజయ్ ని మెచ్చుకున్న అన్నామలై..

అర్ధరాత్రి ఆపరేషన్..! పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు

దారి తప్పిన మమ్ముట్టి చివరికి ఏమైందంటే..?

మహిళతో TDP నేత సంచలన ఆడియో లీక్

రేవంత్ సర్కార్ నిర్ణయంపై ఆటో డ్రైవర్ల రియాక్షన్

సీఎం విజయ్ ని చూసి నేర్చుకోండి.. చంద్రబాబు.. పవన్ కు చురకలు

కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డి దూరం..?

పోలీసుల వాహనంలో గంజాయి, మద్యం దొరకడంపై YS జగన్ ఫైర్

చింతాడ రవికుమార్ కు బెయిల్

Photos

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ (ఫొటోలు)

+5

18 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లి (ఫొటోలు)

+5

న్యూయార్క్‌ : 'ఇండియా డే పరేడ్ 2026'లో పూజా హెగ్డే సందడి (ఫొటోలు)

+5

కందుకూరులో వైభవంగా తేళ్ల పంచమి... పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)

+5

హైదరాబాద్ : కన్నుల పండువగా ఇస్కాన్‌ దేవాలయ స్వర్ణోత్సవాలు (ఫొటోలు)

+5

ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా సందడి (ఫొటోలు)

+5

చిరునవ్వులు చిందిస్తూ శ్రియా సోయగాలు (ఫొటోలు)

+5

వయ్యారాలు ఒలకబోస్తున్న రకుల్‌ (ఫొటోలు)

+5

‘ఇరుముడి’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

బండ్ల గణేశ్‌ కూతురు పెళ్లిలో టాలీవుడ్ తారల సందడి (ఫోటోలు)