అవమానించారు.. జోకర్ లా చూశారు! మీరు డాక్టర్ కాదు.. కనిపించే దేవుడు
Breaking News
కొండచిలువ రక్తంతో ఊబకాయానికి చెక్..!
Published on Sun, 03/22/2026 - 13:36
ఇటీవలకాలంలో అందర్నీ వేధిస్తున్న సమస్య అధిక బరువు. దీని కోసం మార్కెట్లో ఇప్పటికే పలు రకాల డయాబెటిస్ మందులు కూడా సరసమైన ధరలో అందుబాటులో ఉన్నాయి. అయితే వాటితో ఎంతో కొంత దుష్ప్రభావాలు తప్పవనేది నమ్మకతప్పని నిజం. ఆ నేపథ్యంలోనే సహజసిద్ధంగానే సులభంగా అధిక బరువుకి చెక్‌పెట్టే మార్గాలపై పలు పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. తాజాగా సైంటిస్టులు ఈ సమస్యకు కొండచిలువ రక్తంతో పరిష్కార మార్గం చూపి సరికొత్త ఆశను రేకెత్తించారు. వాట్ కొండచిలువ రక్తం అని వెన్నులో వణుకు పుట్టుకొస్తున్నా..అలా ఎందుకు చెప్పారో తెలిస్తే విస్తుపోతారు. అంతేగాదు శాస్త్రవేత్తలు దీని గురించి అధ్యయనంలో చాలా ఆసక్తికర విషయాలను సవివరంగా వెల్లడించారు కూడా.
బరువు తగ్గించే ఒక అణువుని బర్మీస్ కొండచిలువ రక్తంలో గుర్తించారు. ఆకలిని భిన్నమైన రీతీలో లక్ష్యం చేసుకోవడం అనే పరిశోధనలో భాగంగా ఈ విషయాన్ని కనుగొన్నారు. ఊబకాయానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఇది సరికొత్త ఆశను రేకెత్తించింది. సాధారణంగా కొండచిలువలు విపరీతమైన ఆహారపు అలవాట్లకు ప్రసిద్ధి చెందినవి. అవి తమ శరీర బరువుకి సమానమైన పరిమాణంలో ఉన్న ఆహారాన్ని స్వాహా చేస్తాయి. ఆ తర్వాత నెలల తరబడి ఆహారం లేకుండా జీవిస్తాయి.
అలా.. ఎలా అన్నేళ్లు ఆహారం లేకుండా ఉంటాయని పరిశోధించగా..ఆ సమయంలో వాటి రక్తప్రవాహంలో కొన్ని అణువులు వేగంగా పెరుగుతాయిని గుర్తించారు వైద్యులు. ఇవి అసాధారణ జీవక్రియను నిర్వహించడానికి సహాపడతాయిని గుర్తించారు శాస్త్రవేత్తలు. ఈ మేరకు స్థాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని జోనాథన్ లాంగ్ నేతృత్వంలో జరిగిన పరిశోధనలో కొండచిలువలు ఆహారం తినడానికి, తర్వాత వాటి రక్తనమునాలను విశ్లేషించారు.
వాటిలో గణనీయంగా పెరిగిన 200కు పైనే ఎక్కువ అణువులను గుర్తించారు. ఆ అణువుల్లో పీటీఓఎస్(pTOS)గా పిలిచే ఒక అణువు వెయిరెట్లకు పైగా పెరిగింది. పేగులలో బ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తి అయ్యే ఈ అణువు మానవులలో కూడా తక్కువ పరిమాణంలో కనిపిస్తుంది. దాని సామర్థాన్ని పరీక్షించడానికి పరిశోధకులు ఊబకాయం ఉన్న ఎలుకలకు ఈ పీటీఓఎస్ ఇచ్చారు.
ఆ ఫలితాల్లో ఆ ఎలుకలు తక్కువ ఆహారం తిని, 28 రోజుల వ్యవధిలో తమ శరీర బరువులో సుమారు 9% కోల్పోయాయని గుర్తించారు. కడుపు ఖాళీ అయ్యి..జీర్ణక్రియ నెమ్మదించే ప్రక్రియను తరుచుగా వికారం వంటి దుష్ప్రభావాలను కలిగించే వెగోవీ వంటి బరువు తగ్గించే మందుల్లా కాకుండా ఈ పీటీఓఎస్(pTOS) నేరుగా బ్రెయిన్‌పై పనిచేస్తోందట. ఇది ఆకలిని నియంత్రించే ప్రాంతమైన హైపోథాలమస్‌ను లక్ష్యంగా చేసుకుంటుందట.
ఇది ఒకరకంగా ప్రస్తుత చికిత్సలలో ఉన్న సాధార దుష్ప్రభావాలు లేకుండా ఆకలిని నియంత్రించే కొత్త మార్గాన్ని అందించిందని చెబుతున్నారు పరిశోధకులు. ఈ పరిశోధన నేచరల్ మెటబాలిజంలో ప్రచురితమైంది. ఇది మానవులుకు ఎంతవరకు సురక్షితమైనది అనేది నిర్థారించడానికి ఇంకా పలు అధ్యయనాలు చేయాల్సి ఉంది. కానీ శాస్త్రవేత్తలు మాత్రం భవిష్యత్తులో ఊబకాయ భయానికి ఇదో గొప్ప ఆశకిరణంగా మారుతుందని ప్రగాఢం నమ్ముతుండటం విశేషం.
(చదవండి: జస్ట్ 12 వారాల్లో 73 కిలోల నుంచి 66 కిలోల బరువు..!)
Tags : 1