Breaking News

మండుటెండల్లో... అనారోగ్య సమస్యల బారిన పడకూడదంటే..!

Published on Sun, 04/12/2026 - 02:31

వేసవి వచ్చేసింది. ఎండలు చండప్రచండంగా నిప్పులు చెరుగుతున్నాయి. భూతాపం పెరుగుతుండటం వల్ల ఇటీవలి ఏడాదుల్లో వేసవులు మరింత దుర్భరంగా మారుతున్నాయి. భూతాపం పెరుగుదల ఫలితంగా సముద్రాలు వేడెక్కుతున్నాయి. ఆ ప్రభావం భూమ్మీద ప్రతిచోటా పడుతోంది. నడి వేసవిలో దేశవ్యాప్తంగా పలుచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తాకిడి పెరుగుతున్నాయి. వేసవిలో ఎండల బాధ ఒకవైపు అయితే, మరోవైపు ఎండలతో పాటు ఇబ్బంది పెట్టే రకరకాల ఆరోగ్య సమస్యలు జనాలను సతమతం చేస్తాయి. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే, వేసవి తాపం నుంచి, ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఎండల తీవ్రత పెరుగుతుండటంతో పగటి వేళల్లో ఆరుబయటకు వెళ్లడం క్షేమంకాని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎండల ధాటి ఎలా ఉన్నా, అనివార్య పరిస్థితుల్లో ఉద్యోగులు, కార్మికులు సహా రకరకాల వృత్తుల్లోని వారు నడివేసవి మధ్యాహ్న వేళల్లో కూడా ఆరుబయటకు వెళ్లక తప్పని పరిస్థితులు ఉంటున్నాయి. వేసవి తీవ్రత నేరుగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. వేసవిలో వడదెబ్బ బారినపడటం; దాహార్తి తట్టుకోలేక వీథుల్లో అపరిశుభ్ర పరిసరాల్లో దొరికే చెరకు రసం, పండ్లరసాలు వంటివి తాగడం వల్ల జీర్ణకోశ సమస్యల బారినపడటం; ఎండ ధాటికి చర్మం కమిలిపోవడం వంటి సమస్యలు సర్వసాధారణం. వేసవిలో ఎండల ధాటికి తోడు రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా జనాలను బాధిస్తాయి.

వేసవిలో ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బ సోకడం; శరీరమంతా చెమటకాయలు పుట్టుకొచ్చి చర్మం మంటపెట్టడం; విపరీతమైన చెమటల వల్ల ఒంట్లోని నీరంతా బయటకు పోయి డీహైడ్రేషన్‌ ఏర్పడటం; వేడి వాతావరణంగా అలసట, నీరసం; చర్మంపై ర్యాష్, దురదలు, ఇన్ఫెక్షన్లు పెరగడం; కళ్లు పొడిబారి ఎర్రబడటం, కళ్లకు ఇన్ఫెక్షన్లు ఏర్పడటం; ఎండ వేడి నుంచి సేదదీరడానికి ఈతకొలనుల్లోకి దిగితే, వాటిలోని నీటి కాలుష్యం వల్ల చెవులకు, ఇన్ఫెక్షన్లు సోకడం; ఉబ్బసం రోగులకు సమస్య తీవ్రం కావడం; రకరకాల శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు రావడం; నీటి కాలుష్యం, ఆహార కాలుష్యం వల్ల రకరకాల జీర్ణకోశ సమస్యలు కలగడం వంటి సమస్యలు బాధిస్తాయి. తగిన ముందు జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ సమస్యలను చాలా వరకు నివారించుకోవచ్చు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఒకవేళ ఈ సమస్యలు తలెత్తినట్లయితే, వెంటనే ప్రాథమిక చికిత్స చేయడం, అవసరమైతే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.

వడదెబ్బ బారిన పడొద్దు...
వేసవిలో ఎండ వేడి వల్ల తలెత్తే సమస్యల్లో తీవ్రమైనది వడదెబ్బ. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ దాటిన ప్రాంతాల్లో వడదెబ్బ సోకే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే, ఒక్కోసారి వడదెబ్బ ప్రాణాంతకంగా మారే పరిస్థితులు కూడా ఉంటాయి. తీవ్రమైన ఎండలో ఎక్కువసేపు ఉండటం, తగినంత నీరు తాగకపోవడం, ధారాళంగా గాలి సోకని ప్రదేశాల్లో ఉండటం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మితిమీరిన శారీరక శ్రమ చేయడం వల్ల వడదెబ్బ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 

వడదెబ్బ సోకినప్పుడు తీవ్రమైన జ్వరం రావచ్చు. తలనొప్పి, తలతిరగడం, విపరీతమైన నిస్సత్తువ, అలసట, చర్మం పొడిబారిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, వాంతులు కావడం లేదా మలబద్ధకం ఏర్పడటం, గందరగోళానికి లోనవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితి తీవ్రమైతే స్పృహ కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది.

వడదెబ్బ నుంచి రక్షణ పొందడానికి రోజూ తగినంత నీరు తాగడం, కొబ్బరినీరు, మజ్జిగ, తాజా పండ్లరసాలు తాగడం మంచిది. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా గొడుగు లేదా టోపీ ధరించడం, చలవ కళ్లద్దాలు పెట్టుకోవడం, వదులైన కాటన్‌ దుస్తులు ధరించడం వల్ల కొంత ఉపశమనంగా ఉంటుంది. వడదెబ్బ ముప్పు తగ్గాలంటే, కెఫీన్‌ పానీయాలు, మద్యపానం బాగా తగ్గించుకోవాలి.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఒక్కోసారి వడదెబ్బ సోకవచ్చు. అలాంటప్పుడు వడదెబ్బ సోకిన బాధితులను వెంటనే చల్లని ప్రదేశానికి తీసుకువెళ్లాలి. ఫ్యాన్‌ లేదా ఏసీ కింద ఉంచాలి. శరీరాన్ని తడిగుడ్డతో తుడవాలి. చల్లని నీళ్లు లేదా ఓఆర్‌ఎస్‌ ఇవ్వాలి. పరిస్థితి తీవ్రమై, స్పృహకోల్పోయే పరిస్థితులు ఉంటే, వెంటనే వైద్యుల వద్దకు తీసుకువెళ్లాలి.

జీర్ణకోశ సమస్యలు...
వేసవిలోని వేడి వాతావరణంలో వండిన ఆహారం ఎక్కువసేపు నిల్వ ఉండదు. పగలు వండిన ఆహారం సాయంత్రానికే పాడైపోతుంది. అపరిశుభ్ర పరిసరాల్లో ఆహారం వండే టిఫిన్‌ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, హోటళ్లలో ఆహార పదార్థాలు తినకపోవడమే మంచిది. అలాగే, అపరిశుభ్ర పరిసరాల్లోని పండ్లరసాలు, చెరకురసం బండ్ల వద్ద పానీయాలు తాగకుండా ఉండటం మంచిది. అపరిశుభ్ర పరిసరాల్లో పాడైన ఆహారం తీసుకున్నా, పానీయాలు తీసుకున్నా వేసవిలో జీర్ణకోశ సమస్యల ముప్పు ఎక్కువవుతుంది. కలుషిత ఆహార పానీయాల కారణంగా వేసవిలో టైఫాయిడ్, అతిసార వ్యాధులు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 

వేసవిలో జీర్ణకోశ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే, ఇంట్లో తాజాగా వండిన ఆహారం తీసుకోవాలి. ఇంట్లో వండిన ఆహారమైనా ఎక్కువసేపు నిల్వ ఉన్నది తినకపోవడమే మంచిది. తాగే నీరు, తినే ఆహారం స్వచ్ఛంగా, శుభ్రంగా ఉండేటట్లు చూసుకుంటే వేసవిలో జీర్ణకోశ సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఒకవేళ వాంతులు, విరోచనాలు, జ్వరం, తలతిరగడం, నిస్సత్తువ వంటి సమస్యలు తలెత్తితే, డీహైడ్రేషన్‌ వల్ల నీరసించిపోకుండా ఉండటానికి ఓఆర్‌ఎస్‌ తీసుకోవాలి. వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించి, వారి సూచనల మేరకు మందులు వాడుకోవడం తప్పనిసరి.

వేసవిలో దోమల బెడద
వేసవిలో కూడా కొన్నిచోట్ల దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. గాలిలో తేమ ఎక్కువగా ఉండే చోట్ల, పరిసరాల్లో మురుగునీటి గుంతలు ఉండే పరిసరాల్లో దోమలు విజృంభిస్తాయి. వేసవి రాత్రుళ్లలో గాలి సోకడం కోసం చాలామంది ఇళ్ల కిటికీలను తెరిచి ఉంచుతారు. ఇవి దోమలకు రాచమార్గంగా ఉంటాయి. కిటికీలు తెరిచినా, దోమల బెడద లేకుండా ఉండాలంటే, కిటికీలకు దోమలు చొరబడని రీతిలో తెరలను అమర్చుకోవాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమ తెరలు వాడాలి. దోమలు కుట్టకుండా ఉండటానికి శరీరానికి క్రీమ్స్‌ రాసుకోవాలి. దోమల బారిన పడితే డెంగీ, మలేరియా, చికున్‌ గున్యాలాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది. ఈ వ్యా«ధులు సోకితే జ్వరం, ఒంటినొప్పులు, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవాలి.

వేసవిలో కంటి సమస్యలు
వేసవిలో ఎండ తీవ్రతకు రకరకాల కంటి సమస్యలు తలెత్తుతాయి. ఎండలోని అతినీలలోహిత కిరణాల ప్రభావంతో పాటు దుమ్ము« దూళి కాలుష్యం వల్ల కళ్లు పొడిబారడం, ఎర్రబడటం, కళ్ల నుంచి నీరు కారడం, తరచుగా పుసులు రావడం, కళ్లు మంటపెట్టడం, కళ్ల వాపు, వెలుతురు చూసినప్పుడు ఇబ్బంది కలగడం, కనుపాపపై పుండుç ఏర్పడం వంటి సమస్యలు కలుగుతాయి. వీటిలో కొన్ని అలెర్జీల వల్ల, ఇంకొన్ని ఇన్ఫెక్షన్ల కారణంగా ఏర్పడతాయి. ఇలాంటి సమస్యలు ఏర్పడినప్పుడు పదేపదే చేతితో కళ్లు రుద్దకుండా ఉండాలి.

కళ్లు తుడుచుకోవడానికి శుభ్రమైన పొడి రుమాలు లేదా న్యాప్‌కిన్‌ వాడుకోవాలి. కళ్లు బాగా ఎర్రబడటం, పుసులు రావడం, చూపు మసకబారడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే కంటివైద్యులను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవడం మంచిది. వేసవిలో కంటి సమస్యలు రాకుండా ఉండాలంటే, ఎండలో బయటకు వెళ్లేటప్పుడు అతినీలలోహిత కిరణాలను వడగట్టగలిగే చలవ కళ్లద్దాలను ధరించడం మంచిది. అలాగే, నేరుగా ఎండ కళ్ల మీద పడకుండా ఉండటానికి గొడుగు లేదా టోపీ వాడుకోవడం మంచిది.

ఎండల ధాటిని మనం ఎలాగూ తగ్గించలేం. కాబట్టి, ఎండలు ఎక్కువగా ఉండేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే చేయగలం. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరికి తగినట్లుగా వారికి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఒక్కోసారి ఇంట్లో ఎవరో ఒకరు వడదెబ్బ బారినపడి, తీవ్ర అనారోగ్యానికి లోను కావచ్చు. అలాంటప్పుడు ఆలస్యం చేయకుండా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఎండల తీవ్రత పెరిగే కొద్ది ఎవరికి వారు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉంటే, ఎండల వేడి వల్ల వచ్చే ఇబ్బందులను పూర్తిగా అధిగమించి, సురక్షితంగా ఉండవచ్చు.
 
చర్మ సమస్యలు
వేసవిలో ఎండలోని అతినీలలోహిత కిరణాలు ఎక్కువగా ఉండటం వల్ల చర్మం కందిపోవడం, చెమటలు ఎక్కువై చెమటకాయలు రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. చెమటకాయలను నివారించుకోవాలంటే రోజుకు రెండు మూడుసార్లు శుభ్రంగా స్నానం చేయాలి. శరీరాన్ని పూర్తిగా పొడిగా తుడుచుకున్న తర్వాత వదులుగా ఉండేలా చెమటను తేలికగా పీల్చుకునే కాటన్‌ దుస్తులు ధరించాలి. ఉక్కపోత ఉన్న ప్రదేశాల్లో ఎక్కువసేపు ఉండకుండా చూసుకోవాలి. ఫ్యాన్, కూలర్‌ లేదా ఏసీ ఉన్న చోట ఉండటం మంచిది. అప్పటికీ చెమటకాయలు ఉంటే, ఉపశమనానికి ప్రిక్లీహీట్‌ పౌడర్‌ లేదా కేలమైన్‌ లోషన్‌ వాడటం మంచిది. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే, తప్పనిసరిగా సన్‌స్క్రీన్‌ వాడాలి. సన్‌స్క్రీన్‌ వల్ల చర్మం కందిపోకుండా ఉంటుంది.

రోజూ తగినంత మంచినీరు, కొబ్బరినీరు, పానకం, తాజా పండ్ల రసాలు వంటివి తీసుకోవడం, తేలికగా జీర్ణమయ్యేలా తాజాగా వండిన ఆహారం తీసుకోవడం మంచిది. వేసవిలో చెమట ఎక్కువగా ఉండటం వల్ల చెమటకాయలే కాకుండా, చర్మానికి రకరకాల ఫంగల్, బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం కూడా ఉంటుంది. రోజూ శుభ్రంగా స్నానం చేయడం, చర్మం పొడిగా ఉండేట్లు చూసుకోవడం, గాలిసోకి చెమటను పీల్చుకునేలా ఉండే కాటన్‌ దుస్తులు ధరించడం మంచిది. ఒకవేళ ఇంట్లో ఎవరికైనా చర్మానికి ఇన్ఫెక్షన్లు సోకినట్లయితే, వారు వాడే తువ్వాళ్లు, దుస్తులు వేరుగా ఉంచి, ఉతకడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి, వారి సూచనలపై తగిన చికిత్స తీసుకోవాలి.

వృద్ధులకు జాగ్రత్తలు
వేసవిలో వృద్ధులు మరింతగా ఇబ్బంది పడతారు. ఎండల ధాటికి వృద్ధులు త్వరగా అలసట చెంది, నీరసించిపోతారు. ఇక డయాబెటిస్, బీపీ వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారి పరిస్థితి మరింత కష్టంగా ఉంటుంది. వేసవిలో వృద్ధులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇబ్బందుల నుంచి గట్టెక్కగలుగుతారు.

వేసవిలో వృద్ధులు త్వరగా డీహైడ్రేషన్‌కు లోనయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల తరచు మంచినీళ్లు, గ్లూకోజ్, మజ్జిగ, కొబ్బరినీరు, పండ్లరసాలు వంటివి తాగడం మంచిది.

⇒  చక్కగా గాలి వచ్చే గదుల్లో ఉండాలి. ఫ్యాన్, కూలర్, ఏసీ ఉన్న చోట ఉండటం మంచిది.
⇒  ఎండ తీవ్రత ఉన్న సమయంలో బయటకు వెళ్లడం తగ్గించుకోవాలి.
⇒ బీపీ, సుగర్‌ సమస్యలతో బాధపడేవారు వైద్యుల సూచనపై వేళకు మందులు వేసుకోవాలి.

⇒ ఉప్పు, నూనెలు తక్కువగా ఉండే తేలికపాటి ఆహారం తీసుకోవాలి.
⇒  తేలికపాటి కాటన్‌ దుస్తులు ధరించాలి.
⇒  విపరీతంగా చెమటలు పోయడం, తలతిరగడం, గుండె వేగం పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుల వద్దకు వెళ్లాలి.

పిల్లలకు జాగ్రత్తలు
వేసవి తీవ్రత ఆరోగ్యవంతులైన పెద్దలకే దుర్భరంగా ఉంటుంది. అలాంటప్పుడు వేసవిలో పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కొద్దిపాటి జాగ్రత్తలు పాటించినట్లయితే, వేసవి తాపం నుంచి పిల్లలకు రక్షణ కల్పించవచ్చు.

⇒  పిల్లలు ఆటల్లో పడితే ఆకలి దప్పులను మరచిపోతారు. వేసవిలో దాహంగా ఉన్నా, లేకపోయినా పిల్లల చేత మంచినీళ్లు, కొబ్బరినీరు, పండ్లరసాలు వంటివి తాగిస్తూ ఉండాలి.
⇒  పగటి పూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయట ఆటలు ఆడనివ్వకండి.

⇒  ఎండ ఉన్నప్పుడు బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా టోపీ లేదా గొడుగు వాడాలి.
⇒  పిల్లలకు తేలికగా జీర్ణమయ్యే ఆహారం పెట్టాలి. ఇంట్లో తాజాగా వండిన ఆహారంతో పాటు పుచ్చకాయలు, కీరదోసకాయలు, పెరుగు వంటివి ఇవ్వడం మంచిది.
⇒  పిల్లలకు వేసవిలో తేలికపాటి వదులైన కాటన్‌ దుస్తులు వేయడం మంచిది.

⇒ చెమటకాయల నివారణ కోసం తరచు స్నానం చేయించాలి. స్నానం తర్వాత శరీరం పూర్తిగా పొడిగా ఉండేలా తుడిచాక దుస్తులు తొడగాలి.
⇒  పిల్లల్లో అలసట, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఎండ తీవ్రత ఎప్పుడు ప్రమాదకరం?
వేసవిలో ఎండ తీవ్రత 35 డిగ్రీల సెల్సియస్‌ దాటినప్పటి నుంచి సమస్యలు పెరుగుతాయి. వేసవి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉన్నప్పుడు బయట ఎక్కువసేపు తిరిగే వారిలో డీహైడ్రేషన్, తలనొప్పి, తలతిరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఎండల ధాటి 40–45 డిగ్రీలకు చేరుకుంటే, ప్రమాద స్థాయి మరింతగా పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు ఈ స్థాయికి చేరినప్పుడు బయట ఎక్కువసేపు ఉంటే త్వరగా అలసట, నీరసం ముంచుకొచ్చి, డీహైడ్రేషన్‌కు లోనవడం, వాంతులు, తలతిరగడం, వడదెబ్బకు లోనవడం వంటి ప్రమాదాలు తలెత్తవచ్చు.

ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటినట్లయితే, వడదెబ్బ సోకే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఈ ఉష్ణోగ్రతలు ఒక్కోసారి ప్రాణాపాయానికి కూడా దారితీయవచ్చు. గడచిన పదేళ్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగానే నమోదవుతున్నాయి. భారత వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో వేసవి సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40.5–42.5 డిగ్రీల వరకు; తెలంగాణలో 41.5 నుంచి 43.5 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. విజయవాడ, కర్నూలు, రామగుండం, భద్రాచలం వంటి కొన్ని ప్రాంతాల్లో వేసవి సగటు గరిష్ఠ ఉస్ణోగ్రతలు 45–47 డిగ్రీల వరకు కూడా నమోదవుతున్నాయి. అందువల్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను తాకినప్పటి నుంచి తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించడం మంచిది.

Videos

కీర్తనను చంపింది నిజమే.. శిక్ష వేయండి.. ఎన్ కౌంటర్ చేయొద్దు

శాంతి చర్చలు విఫలం.. పాక్ ఆందోళన..

షూతో తన్నుతూ.. నా భార్య ముందే బూతులు తిడుతూ..

ఆమె సాక్ష్యం చెప్తుందని ఎవరు ఊహించలేదు.. వాళ్ళకి శిక్ష రద్దయితే రేవతి పరిస్థితి ఇదే.

ఆశా భోస్లే మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

చిక్కుల్లో విష్ణు ప్రియ.. అసభ్యకర ఫోటోలు పెట్టి సబ్ స్క్రిప్షన్ పేరుతో డబ్బులు వసూల్

సంగీత ప్రపంచానికి తీరని లోటు..

ABN రాధాకృష్ణ కు సపోర్ట్ చేస్తూ వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు.. అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటర్

ఎక్కడ ఆపాడో అక్కడ్నుంచే మొదలెట్టాడు.. చెన్నైలో చితకొట్టిన చెట్టా...

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా

Photos

+5

‘డెకాయిట్‌’ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

కరీనకపూర్‌ రాజసం ఉట్టిపడేలా కుర్తాసెట్‌ స్టైలిష్‌ లుక్‌..!

+5

ఆశా భోంస్లే కన్నుమూత.. జీవితంలో ఇవన్నీ పదిలం (పోటోలు)

+5

హైదరాబాద్ లో మండుతున్న ఎండలు (ఫొటోలు)

+5

తమిళ హీరోయిన్‌ అతుల్య రవి డీసెంట్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

‘పాపం ప్రతాప్‌’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

ఆర్టెమిస్‌-2 గ్రాండ్‌ సక్సెస్‌...నాసా విడుదల చేసిన (ఫొటోలు)

+5

శర్వానంద్‌ 'బైకర్‌' థాంక్యూ మీట్‌ (ఫోటోలు)

+5

ట్రెండింగ్‌లో తెలుగు హీరోయిన్‌ మానస వారణాసి (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు (ఫొటోలు)