Weather: ఏపీకి భారీ వర్ష సూచన
Breaking News
ఆక్వాలో కొత్త అధ్యాయం : చందువా పార
Published on Wed, 07/16/2025 - 12:05
తీర ప్రాంతంలోని ఆక్వా రైతులు ఉప్పునీటిలో పెంచదగిన జలపుష్పాల జాబితా చాలా తక్కువ. ఒకటి, రెండు రకాల ఉప్పునీటి రొయ్యలే అధికంగా సాగు చేస్తారు. వీటికి జబ్బులు సోకినప్పుడు ప్రత్యామ్నాయంగా ఉప్పునీటిలో సాగు చేయటానికి పండుగప్ప తర్వాత అంతకన్నా ఖరీదైన Indian Pompano ఇండియన్ పాంపనొ (చందువా పార) చేప ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఇది వేగంగా పెరుగుతుంది. రుచిగా ఉంటుంది. సాగులో రొయ్యలు, పంచుగప్ప చేపతో పోల్చితే రైతులకు రిస్క్ చాలా తక్కువ. మరణాల శాతం తక్కువ. అయితే, దీని హేచరీ అందుబాటులో లేక΄ోవటం పెద్ద సమస్యగా ఉండేది. ఇప్పుడు ఆ కొరత తీరింది. విశాఖపట్నంలోని భారతీయ సముద్ర చేపల పరిశోధనా సంస్థ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ) ప్రాంతీయ కార్యాలయ శాస్త్రవేత్తల సుదీర్ఘ పరిశోధనలు సత్ఫలితాలనిస్తున్నాయి.
సముద్రంలో పెరిగే చందువా జాతి చేపలను కోస్తాప్రాంతంలో ఉప్పునీటి చెరువుల్లో పెంచడానికి అవసరమైన కాప్టివ్ బ్రీడింగ్, సీడ్ ప్రొడక్షన్ వంటి సాంకేతికతలన్నీటినీ సిఎంఎఫ్‌ఆర్‌ఐ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. చెరువుల్లోనే కాదు సముద్రతీరంలోని తక్కువ లోతులో నీటిపై తేలాడే పంజరాలను ఏర్పాటు చేసి చందువా పార చేపలను సాగు చేసే మారికల్చర్ టెక్నాలజీని కూడా సీఎంఎఫ్‌ఆర్‌ఐ రూపొందించింది. విశాఖ కార్యాలయంలో ఏర్పాటైన మారికల్చర్ ప్రయోగశాలలో చందువా పారతో పాటు బొంతలు (గ్రూపర్స్), అప్పాలు చేప (జాన్స్ స్నాపర్) వంటి జాతులపై కూడా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. కోస్తా ప్రాంత ఆక్వా రైతులు వైరస్ తదితర జబ్బులు, తుపాన్లు, ఎగుమతి మార్కెట్లలో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటారు. ఎగుమతి మార్కెట్ కోసం పెంచే రొయ్యలతోపాటు.. స్థానిక ప్రీమియం మార్కెట్ల కోసం పంట మార్పిడిగా పెంచే అధిక ధర గల చందువాపార వంటి చేపల సాగు సాంకేతికతలు అందుబాటులోకి రావటం ఆక్వా రైతులకు నిజంగా శుభవార్త. సీఎంఎఫ్‌ఆర్‌ఐ రూపొందించిన ‘చందువా పార’ చేపల సాగు పద్ధతులను సవివరంగా ఇప్పుడు తెలుసుకుందాం....
చందువాపార ఆక్వాకల్చర్ రంగంలో వచ్చే కొద్ది ఏళ్లలో కొత్త అధ్యాయాన్ని సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్.ఎఫ్.డి.బి.) ఆర్థిక తోడ్పాటుతో బ్లూరెవెల్యూషన్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్‌లోని అనేక కోస్తా ప్రాంత చెరువుల్లో చందువాపార చేపలను సీఎంఎఫ్‌ఆర్‌ఐ ప్రోత్సహించి సాగు చేయించింది. సీఎంఎఫ్‌ఆర్‌ఐ విశాఖపట్నం ప్రాంతీయ కార్యాలయంలో సీనియర్ శాస్త్రవేత్తలు శేఖర్ మేగరాజన్, రితేష్ రంజన్, బిజి జేవియర్, శుభదీప్ ఘోష్, పొన్నగంటి శివ, నరసింహులు సిద్ధు, ఆర్.పి. వెంకటేష్, ఇమెల్డా జోసెఫ్‌లు సంయుక్తంగా అందించిన వివరాల ప్రకారం చందువాపార సాగులో అనేక దశల్లో చేపట్టాల్సిన ఉత్తమ యాజమాన్య పద్ధతుల విశేషాలు ఇలా ఉన్నాయి.
చెరువును సిద్ధం చేయటం...
చెరువు అంతటినీ 1.5 మీటర్ల లోతున సమతలంగా ఉండేలా రూపొందించాలి.పాత చెరువుల్లో ఈ చేపలను పెంచుతూ ఉంటే, చెరువు అడుగున పేరుకున్న వ్యర్థాలను తొలగించి, దుక్కి చెయ్యాలి. చందువాపార చేపల సాగుకు నీటి ఉదజని సూచిక (పిహెచ్) సగటున 7.5–8.5 మధ్యన ఉండాలి. మట్టి పిహెచ్ ఎంత ఉందన్న దాన్ని బట్టి చెరువును సిద్ధం చేసేటప్పుడు ఎంత సున్నం చల్లాలో ఆధారపడి ఉంటుంది.
నీటి యాజమాన్యం...
చెరువును సిద్ధం చేసిన తరువాత కాలువ నీటిని లేదా రిజర్వాయర్ నీటిని నేరుగా చెరువులోకి నింపవచ్చు. నీటిని నింపేముందు 100 మైక్రోమీటర్ల కన్నా తక్కువగా ఉండే ఫిల్టర్ బ్యాగ్‌లను విధిగా ఉపయోగించాలి. చెరువు నీటిలోకి అవాంఛనీయ చేపల పిల్లలు రాకుండా ఉండేందుకు ఈ ఫిల్టర్లు అవసరం. 10 పిపిఎం క్లోరినేషన్ ద్వారా చెరువును శుద్ధి చెయ్యాలి. నాలుగురోజుల తర్వాత క్లోరినేషన్ నీటిలో యూరియా (2.5 పిపిఎం), ట్రిపుల్ సూపర్ ఫాస్ఫేట్ (టిఎస్‌పి) (3పిపిఎం) వాడి చెరువు నీటి నాణ్యతను సరిచేయాలి. చెరువులో సేంద్రియ లేదా రసాయనిక ఎరువులు వేసుకోవటం ద్వారా ప్లవకాల (ప్లాంక్టన్)ను వృద్ధి చెయ్యాలి. ప్లాంక్టన్ చెరువు నీటిలో పెరిగితేనే నీటి నాణ్యత సరిగ్గా ఉంటుంది. చందువా పార చేలు 5 నుంచి 40 పిపిటి వరకు ఉప్పు నీటిని తట్టుకోగలవు. అయితే, 15–35 పిపిటి మధ్యలో నీటి ఉప్పదనం ఉంటే మంచి అనుకూల వాతావరణం ఉంటుంది.
చేపపిల్లల రవాణా...
అత్యంత శ్రద్ధతో చేపపిల్లల రవాణా చెయ్యాలి. ఈ క్రమంలో ఒత్తిడి కలిగితే చేప పిల్లలకు సూక్ష్మ క్రిములు సోకడమే కాకుండా అవి చని΄ోయే పరిస్థితి కూడా వస్తుంది. ఆక్సిజన్ సరఫరా ఉండేలా సెంటెక్స్ ట్యాంకుల్లో గానీ పాలిథిన్ బ్యాగుల్లో గానీ తీసుకెళ్లాలి. చేపపిల్లల సైజు, ప్రయాణ వ్యవధి, చేపపిల్లల సంఖ్య, రవాణా పద్ధతిని బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి.
నర్సరీ పెంపకం : నర్సరీ పెంపకంలో ఒక మీటరుకి 200 నుండి 280 పిల్ల చేపలు తగినంత స్టాకింగ్ డెన్సిటీగా చెప్పవచ్చు. చేపలు కృత్రిమ మేతకు అలవాటుపడతాయి. అయితే మేతలో మంచి పోషక విలువలు ఉండాలి. మొదటి దశలో ప్రోటీన్ 45%, కొవ్వు శాతం 111% చొప్పున శరీర బరువులో 10%, రోజుకు 4 – 5 సార్లు మేత ఇవ్వాలి. 2–3 గ్రాములు పెరిగిన పిల్లచేపలను 30–40 గ్రాములు వచ్చే వరకు 60 నుంచి 75 రోజుల పాటు పెంచాలి. ఆ తర్వాత పెంపకపు చెరువు (గ్రో–అవుట్ చెరువు) ల్లోకి మార్చాలి. ఆక్సిజన్ స్థాయిలు 4 పిపిఎం కన్నా ఎక్కువ ఉండేలా నిర్వహిస్తే∙90–95% చేపలు పెరిగి పెద్దవుతాయి.
ఎకరానికి 5 వేలు : నర్సరీలో పెంచిన చేప పిల్లలను ఎకరాకు 5000 చొప్పున పెద్ద చెరువుల్లోకి వదలాలి. ఎయిరేటర్లను చెరువు నాలుగు దిక్కులా అమర్చాలి. క్రమం తప్పకుండా ఎరువులు చల్లుతూ నీటి నాణ్యత చూసుకుంటూ ఉండాలి. అధిక ప్రోటీన్‌తో కూడిన నీటిపై తేలాడే (40% ప్రోటీన్ – 10% కొవ్వు పదార్ధాలు) ఆహార గుళికలను చేప పిల్లలకు ఆహారంగా ఇవ్వాలి. మేత ఇస్తున్నప్పుడు గాలివాటానికి అనుగుణంగా, మేత వృథా కాకుండా పంజరపు లోపలి వలలో ఫీడ్ మెష్ ను (1 మీటర్లు లోతు) ఏర్పాటు చెయ్యాలి. తొందరగా జీర్ణం కావడం కోసం, ప్రతి 3 గంటలకొకసారి దాణా ఇవ్వాలి. ప్రతి పదిహేను రోజులకొకసారి చేపల బరువు తూచి, వాటి ఎదుగుదల ఆధారంగా దాణాను లెక్కవేసుకోవాలి. 10 నుంచి 20 గ్రాములు ఉన్న చేప పిల్లలని క్యూబిక్ మీటరుకు 1 నుంచి∙1.25 చొప్పున చెరువులో వదిలినప్పుడు.. 5–6 నెలల్లో 500–600 గ్రాములకు, 12 నెలల వ్యవధిలో కిలో బరువుకు పెరుగుతాయని గత అనుభవాలు చెబుతున్నాయి. అయితే, 100 గ్రాము సైజులో ఉన్నప్పుడు చెరువులో వేస్తే కేవలం 7 నెలల్లోనే కిలో సైజుకు పెరుగుతాయి. చెరువు అడుగు భాగంలో ఉండే చెత్తని, బురదని ఎప్పటికప్పుడు తీసివేసి, శుభ్రపరుస్తుంటే విష వాయువుల ప్రభావం తక్కువగా ఉండి నీటి నాణ్యత మెరుగ్గా ఉంటుంది.
6 రాష్ట్రాల్లో మార్కెట్లు అనువైనవి : మార్కెట్ సైజుకు పెరిగిన చందువ పార చేపలను డ్రాగ్ నెట్ వల సహాయంతో అత్యంత సులువుగా పట్టుకుని వెలికితీయవచ్చు. బయటికి తీసిన చేపలను మొత్తాన్ని వెంటనే పరిశుభ్రమైన నీటిలో కడిగి, ఐస్ ముక్కల్లో పెట్టి, తాజాగా, నాణ్యత ΄ోకుండా చూడాలి. ప్లాస్టిక్ ట్రేలలో గానీ లేదా థర్మోకోల్ పెట్టెల్లో గాని పెట్టి, ఐస్ ముక్కలు చల్లి ప్యాక్ చేస్తారు. పెద్దమొత్తంలో సాగు చేయడమే కాకుండా, స్థానిక మార్కెట్‌లో గిరాకీని బట్టి బ్యాచ్ పధ్ధతిలో కూడా హార్వెస్ట్ చేయవచ్చు. కేరళ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలలో ఎంపిక చేసిన కొన్ని మార్కెట్లు చందువా పార చేపలను విక్రయించడానికి అత్యంత అనువైనవి. ఒక ఎకరాకు 5000 పిల్లలు వేస్తే కేజీకి రూ. 325 చొప్పున (ఇది పాత ధర) రైతుకు సుమారు రూ. 2.25 లక్షలు నికర లాభం వస్తుందని అంచనా.
silver pompano fingerlings
చందువా పార చేపల విశేషాలు...
శాస్త్రీయ నామం: ట్రాచినోటస్ మూకలీ.
కుటుంబం: కారంగిడే (జాక్స్, పాంపానోస్).
పరిమాణం: 10 గ్రాములు లేదా 2 అంగుళాల పిల్లలను చెరువుల్లో వేసుకుంటే 5–6 నెలల్లో అర కిలోకి పైగా సైజుకు పెరుగుతుంది.
స్వరూపం: బాగా ఎదిగిన చేపలు బంగారు నారింజ రంగులో మెరిసి΄ోతూ ఆకర్షణీయంగా ఉంటాయి. ముఖ్యంగా పొట్ట దగ్గర.
ఆవాసం: తీర్ర ప్రాంత సముద్ర జలాలు, నదీ ముఖ ద్వారాలలో కనిపిస్తాయి.
ఆహారం: తిండిపోతు. మాంసాహారి. అయితే, పండుగప్ప చేపల మాదిరిగా తమ జాతి చిన్న చేపలను పెద్ద చేపలు తినవు.
ఆక్వాకల్చర్‌కు అనుకూలతలు: మెరుగైన మాంసం నాణ్యత, అధిక మార్కెట్ డిమాండ్ కారణంగా సముద్ర జలాల్లోని పంజరాల్లో, కోస్తా ప్రాంత ఉప్పునీటి చెరువుల్లో సాగుకు.. ఈ రెండింటికీ అనువైనది.
వ్యాధి నిరోధకత: చాలా రకాల వ్యాధులను తట్టుకోగల నిరోధక శక్తి ఉండటం దీనికి గల మరో ప్రత్యేకత.
కేజ్ కల్చర్: తీరప్రాంత సముద్ర జలాల్లో కేజ్ కల్చర్ ద్వారా విజయవంతంగా సాగవుతోంది, వాణిజ్య స్థాయిలో పెంచటానికి అనువైనది.
సంతానోత్పత్తి: చందువా పార చేపలు ఫిబ్రవరి–ఏప్రిల్ నెలల్లో సంతానోత్పత్తి చేస్తాయి.
విత్తనోత్పత్తి: సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ) శాస్త్రవేత్తలు భారతీయ పాంపనో చేపల సంతానాభిద్ధి, లార్వా పెంపకం, నర్సరీ పెంపకం కోసం సాంకేతికతను అభివృద్ధి చేశారు.
మార్కెట్ డిమాండ్: అధిక మార్కెట్ డిమాండ్ ఉంది. మంచి దేశీయ ధర పలుకుతోంది. రైతు నుంచి కిలో రూ. 35–450 వరకు పలుకుతోంది. వాణిజ్యపరంగా లాభదాయకమైన ఆక్వాకల్చర్ చేపల జాతిగా గుర్తింపు వచ్చింది.
ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు: చందువా పార చేపల్లో ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండెకు చాలా ఆరోగ్యకరమైనవి. అందువల్ల హెల్దీ ఫ్యాట్ వనరుగా నిపుణులు చెబుతున్నారు.
చెరువలో నీటి నాణ్యత, రంగులను మెరుగ్గా ఉంచుకోవాలంటే ప్రతి 15 రోజులకోసారి ఎరువులు వేసుకోవాలి. కన్నా పెరిగిన సైజు పిల్లలను పెంపకపు చెరువులో వేసుకుంటే ఎక్కువ శాతం బతుకుతాయి.
30 గ్రాముల కన్నా పెరిగిన సైజు పిల్లలను పెంపకపు చెరువులో వేసుకుంటే ఎక్కువ శాతం బతుకుతాయి.
చెరువులో ఫీడింగ్ జోన్‌ను ఏర్పాటు చేసుకొని మేత వేస్తూ ఉంటే మేత వృథాని అరికట్టవచ్చు.
నీటి నాణ్యత బాగుండాలంటే చెరువులోని నీటి పరిమాణంలో 25% నీటిని ప్రతి నెలా మార్చాలి. ఈ పని చేస్తే ప్రొబయోటిక్స్, వాటర్ కండిషనర్ మందులు వాడకుండా నివారించుకోవచ్చు.
చెరువులో రోజుకు కనీసం 10 గంటల సేపు ఎకరానికి 2–3 పెడల్ వీల్ ఎయిరేటర్లను ఉపయోగించాలి. మంచి ఆదాయం రావాలంటే ఎకరానికి 5 వేల పిల్లలను వేసుకోవటం ఉత్తమం.
Tags : 1