Adilabad: పిడిగుద్దులతో రెచ్చిపోయిన కాంగ్రెస్, బీఆర్ఎస్
Breaking News
సాయిల్ హెల్త్‌కు ఓ చట్టం..!
Published on Wed, 11/12/2025 - 11:32
మట్టి అతి వేగంగా అంతరిస్తోంది. మట్టిని బతికించండి.. అని ‘ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్)’ అబుదాబిలో జరిగిన ద్వైవార్షిక అంతర్జాతీయ మహాసభ ఇటీవల పిలుపునిచ్చింది. అంతర్జాతీయంగా ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలన్నీ కట్టుబడి అమలు చేసేలా ‘సాయిల్ సెక్యూరిటీ లా’ చెయ్యాల్సిన అవసరం ఉందని ఐయూసీఎన్ మహాసభ తీర్మానం చేసింది. ‘మిషన్ 007 – సాయిల్ సెక్యూరిటీ లా’ పేరిట చరిత్రలో మొట్టమొదటి సారి ఈ తీర్మానం ఆమోదం పొందింది. నేల ఆరోగ్యమే మన ఆరోగ్యం, ఆహార భద్రతలకు మూలాధారం.
భూగోళంపై జీవం మనుగడకు ముఖ్యమైన 8 అంశాల్లో మట్టి ఆరోగ్యం కూడా ఉంది. సాగు భూములు / నేలలు ప్రపంచవ్యాప్తంగా అతి వేగంగా క్షీణతకు గురవుతున్నాయి. 2050 నాటికి 1.6 కోట్ల చదరపు కిలోమీటర్ల నేల నిస్సారమవుతుందని, ఏటా 87,800 కోట్ల డాలర్ల మేరకు ఆర్థిక నష్టం చేకూరుతుందని ఐరాసకు చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) తాజాగా అంచనా వేసింది. ఈ అత్యవసర పరిస్థితిని ప్రతిఫలించేలా ఐయూసీఎన్ తీర్మానం చేసింది. అన్నీ సజావుగా జరిగితే త్వరలోనే చట్టబద్ధమైన ఒడంబడిక రూపుదిద్దుకునే క్రమంలో ఇది కీలక ముందడుగు. మరికొన్ని దశలు దాటి చట్టం జరిగితే, మరింత ఫోకస్‌తో సాగు భూముల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వాలు నడుము బిగించేందుకు దోహదం చేస్తుంది.
మట్టిని బతికించుకోవటానికి అంతర్జాతీయ సమాజం ఒక అడుగు ముందుకు వేసింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే, అయినా సందేశం స్పష్టంగా ఉంది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ. భూగోళంపై పర్యావరణం, జీవజాతుల పరిరక్షణ స్థితిగతులపై ఐయూసీఎన్ దృష్టిని కేంద్రీకరిస్తుంది. ప్రతి రెండేళ్లకోసారి వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్‌ను నిర్వహిస్తూ జాతీయ, రాష్ట్రీయ ప్రభుత్వాలకు సూచనలు అందిస్తుంటుంది. గత నెలలో అబుదాబిలో జరిగిన ఐయూసీఎన్ వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్‌లో ‘మోషన్ 007: సాయిల్ సెక్యూరిటీ లా’పై అధికారిక తీర్మానాన్ని సభ్యులు ఆమోదించారు.
నేలల భద్రతకు అవసరమైన తక్షణ కార్యాచరణ ప్రణాళికకు చట్టపరమైన గుర్తింపును అందించడమే ఈ తీర్మానం లక్ష్యం. నేలల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా అనుసరించదగిన చట్టాన్ని రూపొందించడానికి భావనలను, విధివిధానాలను అభివృద్ధి చేయాలని ఈ మహాసభ పిలుపునిచ్చింది. నేల భద్రతపై అంతర్జాతీయ చట్ట ప్రకారం సభ్యు దేశాలన్నీ విధిగా కట్టుబడి ఉండేలా లేదా అనుసరించమని సూచించేలా సాయిల్ సెక్యూరిటీ చట్టం చేసే విషయాన్ని ఆలోచించమని వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్విరాన్ మెంటల్ లాకు ఐసీయూన్ ‘మోషన్ 007’ తీర్మానం ద్వారా విజ్ఞప్తి చేసింది.
90 దేశాల్లో నేలల పరిరక్షణకు చుక్కాని
ప్రకృతిలో జీవవైవిధ్యాన్ని పరిరక్షించేందుకు మార్గనిర్దేశనం చేసే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) కృషితో ప్రపంచంలోనే మొట్టమొదటగా నేలల పరిరక్షణకు అంతర్జాతీయ చట్టబద్ధ వ్యవస్థను ఏర్పాటు చెయ్యడానికి తొలి అడుగుపడింది. ‘మోషన్ 007– సాయిల్ సెక్యూరిటీ లా’ తీర్మానం ఈ దిశగా అత్యంత కీలకమైన, శుభప్రదమైన చర్య. ఇది 90 దేశాల్లో, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న, అల్పాదాయ దేశాల్లో, సాగు భూముల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక పథకాల ప్రారంభానికి దోహదం చేసే జాతీయ చట్టాల రూపుకల్పనకు భూమిక కానుంది.
ప్రకృతి, సేంద్రియ పద్ధతుల ప్రోత్సాహానికి, ప్రభుత్వాల జవాబుదారీతనానికి ఇది దన్నుగా నిలుస్తుంది. అబుదబిలో గత నెలలో జరిగిన ఐయూసిఎన్ ద్వైవార్షిక మహాసభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి తెరవెనుక జరిగిన కృషిలో భారతీయ స్వచ్ఛంద సంస్థ సేవ్ సాయిల్ (ఈషా అవుట్‌రీచ్), ఆస్ట్రేలియా సంస్థ ఆరోరా, అమెరికాకు చెందిన పేస్ యూనివర్సిటీలోని గ్లోబల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ లీగల్ స్టడీస్ కీలకపాత్ర పోషించాయి.
సేవ్ సాయిల్ చీఫ్ సైంటిస్ట్, టెక్నికల్ ఆఫీసర్ ప్రవీణ శ్రీధర్ హర్షం వ్యక్తం చేస్తూ.. ‘ఆహారం, నీరు, జీవవైవిధ్యం, క్లైమెట్ రిసైలియన్స్‌లకు నేల ఆరోగ్యమే పునాది అని ఒక అంతర్జాతీయ పరిరక్షణ సంస్థ మొట్టమొదటిగా మోహన్ 007 తీర్మానం ద్వారా గుర్తించటం హర్షదాయకం. ఇది నేలమ్మకు దక్కిన గౌరవం. ఈ విజయం వెనుక ప్రపంచవ్యాప్తంగా ఎందరెందరో చెమటోడ్చి సుదీర్ఘకాలంగా చేస్తున్న కృషి దాగి ఉంది..’ అని వ్యాఖ్యానించారు. తీర్మానం నేపథ్యంలో ఐయూసీఎన్ ఒక వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేయనుంది. నేలల పరిరక్షణకు కుదరబోయే అంతర్జాతీయ ఒడంబడిక లేదా ఏర్పాటు కాబోయే ప్రపంచ చట్టబద్ధ సంస్థకు సంబంధించిన భావనలను, విధివిధానాలను ఈ వర్కింగ్ గ్రూప్ రూపొంస్తుంది.
8 అస్తిత్వ సమస్యల్లో ఇదొకటి..
భూగోళంపై పర్యావరణ సమతుల్యత కొనసాగింపునకు కీలకమైన విధులను నిర్వచిస్తూ, అవసరమైన పర్యావరణ సేవలను, జీవభౌతిక సేవలను అందించడంతోపాటు.. భూమిపై జీవులను ముప్పుల నుంచి రక్షించటానికి మానవాళి నేలలను బాధ్యతాయుతమైన రీతిలో సంరక్షించుకోవటం అవసరమని ఐసీయూఎన్ మహాసభ పిలుపునిచ్చింది.
విధానాల రూపుకల్పన, కార్యాచరణ ప్రణాళికల్లో నేలల భద్రత అంశాన్ని ప్రాధాన్యంతో అంతర్భాగం చేయడానికి అంతర్జాతీయ ఒడంబడికను రూపొందించే దిశగా ముందడుగు పడింది. భూగోళంపై మానవ మనుగడ ప్రమాదంలో ఉంది. భూగోళం ఎదుర్కొంటున్న 8 అస్తిత్వ సమస్యలలో నేలల క్షీణత సమస్య కూడా ఒకటని ఐయూసీఎన్ మహాసభ నొక్కి చెప్పింది. వాతావరణ మార్పు, ఆహారం, నీటి కొరత, జీవవైవిధ్య పరిరక్షణ, విద్యుత్తు సుస్థిరత, పర్యావరణ నిర్వహణ, మానవ శ్రేయస్సు తోపాటు నేల ఎనిమిదో అస్తిత్వ సమస్యగా పేర్కొంది.
చర్చలతో కాలక్షేపం ఇంకెన్నాళ్లు?
వాతావరణం, జీవవైవిధ్యం, నీరు, ఎడారీకరణపై ఇప్పటికే ఉన్న అంతర్జాతీయ ఒడంబడికలు లేదా చట్టబద్ధంగా కట్టుబడి ఉండే ఒప్పందాలు అంతర్జాతీయ మహాసభల్లో ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు ఏకాభిప్రాయానికి రావటానికి సాధారణంగా చాలా సంవత్సరాలు పడుతుంది. ఇంకా చెప్పాలంటే, ఈ సంక్లిష్టమైన చర్చల ప్రక్రియ ఒక కొలిక్కి రావటానికి దశాబ్దాల కాలం పడుతుంటుంది. ఈ అనుభవం దృష్ట్యా.. నేలల క్షీతను ఆపేందుకు అంతర్జాతీయ ఒడంబడక లేదా చట్టపరమైన సంస్థ సృష్టిపై చర్చల ప్రక్రియను వేగవంతం చేయడమే ఐయూసీఎన్ లక్ష్యంగా పెట్టుకుంది.
నేలలకు భద్రత కల్పించే బాధ్యతను ప్రత్యేక ఒడంబడికగా కాకుండా ఇప్పటికే అమల్లో ఉన్న వాతావరణ మార్పు, జీవవైవిధ్యం లేదా ఎడారీకరణపై ఒడంబడికలలో దేనికైనా అనుబంధంగా మార్చితే చర్చలతో కాలం వెల్లబుచ్చకుండా వెంటనే పని ప్రారంభం కావటానికి ఉపయోగపడుతుందని చాలామంది నిపుణులు సూచిస్తున్నారు. అయితే, నేలల భద్రతపై ఇప్పుడు ఐయూసీఎన్ ద్వైవార్షిక మహాసభలో ఆమోదం మోషన్ 007 అధికారిక తీర్మానం చెయ్యటం కూడా అంత చిన్న విషయమేమీ కాదు.
ఇది నిస్సందేహంగా ఒక ముఖ్యమైన మైలురాయి. మృత్తికా శాస్త్రవేత్త డా. క్వెంటిన్ స్టైక్ అభివర్ణించినట్లుగా ‘ఇది మానవత్వం చేపట్టగల ఒక శక్తివంతమైన ఐక్యతా చర్య‘గా గుర్తించటం అవసరమని డౌన్‌టుఎర్త్‌కు చెందిన ప్రసిద్ధ పర్యావరణ పాత్రికేయుడు రిచర్డ్ మహాపాత్ర చక్కగా వ్యాఖ్యానించారు.
వార్షిక నష్టం 87,800 కోట్ల డాలర్లు
నేలలకు జరుగుతున్న నష్టాన్ని నిలువరించడానికి దేశాలు తక్షణ ఉపశమన చర్యలు తీసుకోకపోతే 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 1.6 కోట్ల చదరపు కిలోమీటర్ల భూమి జీవాన్ని కోల్పోయి సాగుయోగ్యం కాకుండా పోతుందని ఎడారీకరణపై పోరుకు సంబంధించిన అంతర్జాతీయ ఒడంబడిక హెచ్చరిస్తోంది. దీని ఆర్థిక నష్టం అపారమైనది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వార్షికంగా 87,800 కోట్ల డాలర్ల నష్టం. నేలల వినియోగానికి సంబంధించి పర్యావరణపరమైన పరిమితులను ఇప్పటికే దాటేశాం.
నేలల క్షీణత ఎంత ఎక్కువైందంటే.. అది భూగ్రహానికి ఉండే మానవాళిని నిలబెట్టే సామర్థ్యాన్ని దెబ్బతీయడం ప్రారంభించిందని ఐయూసీఎన్ మహాసభ పేర్కొంది. అడవులు, నీరు, వాతావరణ పరిరక్షణ వంటి అంశాలపై ఐయూసీఎన్ మహాసభలు గతంలో చర్చింది అంతర్జాతీయ ఒడంబడికలను కుదిర్చింది. కానీ నేలల పరిరక్షణపై గతంలో ఎప్పుడూ ఇలాంటి శ్రద్ధ చూపలేదు.
జీవితానికి పునాది
‘నేల.. జీవితానికి నిశ్శబ్ద పునాది. ఆహార ఉత్పత్తికి కీలకం. నీటిని నియంత్రిస్తుంది. కార్బన్‌ను నిల్వ చేస్తుంది. జీవవైవిధ్యాన్ని నిలబెట్టుకుంటుంది. అయినప్పటికీ ప్రకృతిలో దీనికి రక్షణ తక్కువగా ఉంద’ని ఆస్ట్రేలియాకు చెందిన అరౌరా అనే సంస్థకు చెందిన డా. జూలియో పచాన్ మాల్డోనాడో చె΄్పారు. నేలల పరిరక్షణను ప్రపంచ ధాన్యతగా మార్చడానికి ఈ సంస్థ ప్రచారోద్యమం నిర్వహిస్తుంటుంది. ‘ప్రతి భూసంబంధమైన ప్రతి పర్యావరణ వ్యవస్థకు నేల పునాది.
నేలలు సురక్షితంగా లేకపోతే.. ఆహారం లేదు, నీటి భద్రత లేదు, భవిష్యత్తు లేదు’ అని సిడ్నీ(ఆస్ట్రేలియా) విశ్వవిద్యాలయంలోని నేల శాస్త్రవేత్త డా. జూలియా ఫీత్ అంటున్నారు. నేల సంక్షోభాన్ని పరిష్కరించకుండా మనం వాతావరణం లేదా జీవవైవిధ్య సంక్షోభాలను పరిష్కరించలేం అని ఆమె స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితి నిర్దేశిత 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో కనీసం 12 లక్ష్యాలు నెరవేరడానికి నేల ఆరోగ్యం కూడా అవసరం. ఈ లక్ష్యాలను 2030 నాటికి సాధించాలి. ముఖ్యంగా, ఆకలిని నిర్మూలించడం అనే లక్ష్య సాధనకు నేల ఆరోగ్యం కీలకం.
పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్
(చదవండి: 4 వేల లీటర్ల పాల దిగుబడినిచ్చే ఆవుల గురించి తెలుసా?)
Tags : 1