శభాష్ జగన్ అంటున్న కూటమి నేతలు..
Breaking News
ప్రకృతి వ్యవసాయంపై నీతి ఆయోగ్ కరదీపిక
Published on Tue, 04/07/2026 - 06:17
ప్రకృతి వ్యవసాయాన్ని దేశవ్యాప్తంగా విస్తృతంగా వ్యాప్తిలోకి తేవాలన్న లక్ష్యంతో సమగ్రమైన ట్రైనింగ్ మాన్యువజీల్‌ను కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ ఇటీవలే వెలువరించింది. ‘రైతులకు సాధికారత కల్పించటం: ప్రకృతి వ్యవసాయ శిక్షణా కిట్ – ఉత్తమ పద్ధతుల మార్గదర్శిని’ పేరుతో రూపొందించారు. ప్రకృతి సేద్య మూల సూత్రాలతో పాటు.. ముఖ్యమైన 22 రకాల పంటల సాగులో క్షేత్రస్థాయిలో ఆచరించదగిన ప్రామాణిక ప్రకృతి సేద్య పద్ధతులను పొందుపరిచారు. నీతి ఆయోగ్ వ్యవసాయం–సాంకేతిక విజ్ఞాన విభాగం ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ నీలం పటేల్, కన్సల్టెంట్ పరెమల్ బనఫర్ ఆధ్వర్యంలో నిపుణుల బృందం దీన్ని రూపొందించింది.
రైతులు, విస్తరణ సిబ్బంది, విధాన నిర్ణేతలకు సుస్థిర వ్యవసాయ విస్తరణ దిశా నిర్దేశం చేయటానికి ఈ శిక్షణా మాన్యువల్, ఉత్తమ ప్రకృతి సేద్య పద్ధతులకు అక్షర రూపం ఇచ్చినట్లు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరీ పేర్కొన్నారు. డాక్టర్ నీలం పటేల్ ఇలా అన్నారు: ‘దేశవ్యాప్తంగా రైతులు అనుసరిస్తున్న ప్రకృతి సేద్య పద్ధతులు, ఆవిష్కరణలు, సంప్రదాయ విజ్ఞానంతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ప్రకృతి సేద్య అనుభవాల ఆధారంగా ఈ శిక్షణా మాన్యువల్‌ను రూపొందించాం.
దేశంలో సుస్థిర వ్యవసాయాన్ని విస్తరింపజేయటంలో ఇదొక కీలక ముందడుగు’. ప్రకృతి వ్యవసాయ వారసత్వాన్ని సుసంపన్నం చేసిన సుభాష్ పాలేకర్ (మహారాష్ట్ర), ఎల్. నారాయణరెడ్డి (కర్ణాటక), శ్రీపాద దబోల్కర్, జి. నమ్మాళ్వార్ (తమిళనాడు), దీపక్ సచ్‌దే (మధ్యప్రదేశ్), భాస్కర్ సావే (గుజరాత్)ల సేవలను ఇందులో ప్రస్తుతించారు. దేశవ్యాప్తంగా ప్రకృతి సేద్య పథకాలు అమలవుతున్నాయని, 9.4 లక్షల హెక్టార్లలో సుమారు 10 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని ఇందులో పేర్కొన్నారు.
అధిక దిగుబడి.. అధిక నికరాదాయం!
వరిని వరుసగా 4 ఏళ్లు ప్రకృతి వ్యవసాయం (ప్ర.వ్య.)లో పండిస్తే 2023 ఖరీఫ్‌లో ఎకరానికి 33.75 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది. రసాయన వ్యవసాయం (ర.వ్య.)లో 31.5 క్వింటాళ్లు వచ్చింది. ఈ రెండు ధాన్యాలను క్వింటా రూ.2,040కే విక్రయించారు. ప్ర.వ్య.లో నికరాదాయం రూ.48 వేలు రాగా, రూపాయి ఖర్చుకు 2.3 రూపాయల ఆదాయం వచ్చింది. ర.వ్య.లో నికరాదాయం రూ.35,140 రాగా, రూపాయి ఖర్చుకు 1.2 రూపాయలు మాత్రమే ఆదాయం వచ్చింది.
→ ప్రధాన పంటలన్నింటిలో సాగు ఖర్చును కనీసం 5–10% తగ్గిస్తుంది. మరికొన్ని పంటల్లో, కొన్ని రాష్ట్రాల్లో 20–55% వరకు తగ్గింది. ∙ప్రకృతి వ్యవసాయం రైతులు, వినియోగదారుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
→ నేలల్లో సేంద్రియ కర్బనం 1947లో 2.5% ఉండేది. ఇప్పటికి 0.4%కి తగ్గింది. ప్రకృతి వ్యవసాయం దీన్ని 45% వరకు పెంచుతుంది. ∙నీరు, విద్యుత్‌లో 50–60% ఆదా అవుతుంది. ∙కర్బన ఉద్గారాలను 55–85% తగ్గిస్తుంది. ∙పశువులను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పెంచటం రైతులకు లాభదాయకంగా ఉంటుంది.
→ పంటల వైవిధ్యం, అంతరపంటలు, బహుళ అంచెల పంటలతో వ్యవసాయా దాయ భద్రత, పోషకాహార భద్రత పెరుగు తాయి. రసాయనిక సేద్యం ఏకపంట సాగుతో పోలిస్తే 20–40% అధిక నికర ఆదాయం వస్తుంది.
జీవామృతం.. 48 గంటలు పులిస్తే చాలు!
జీవామృతం కోసం పేడ, మూత్రం, పప్పుల పిండి, బెల్లం, మట్టిని డ్రమ్ము నీటిలో కలిపిన తర్వాత 2–3 రోజులు పులియబెట్టి పంటలకు వాడుకోడానికి సిద్ధమైనట్లే. కలిపిన 48 గంటల్లో బ్యాక్టీరియా పూర్తిస్థాయిలో వృద్ధి చెందుతుంది. సిద్ధమైన జీవామృతాన్ని వేసవిలో 7 రోజుల వరకు, శీతాకాలంలో 8–10 రోజుల్లో వాడుకోవచ్చని నీతి ఆయోగ్ ప్రకృతి వ్యవసాయ శిక్షణ మాన్యువల్ చెబుతోంది.
ప్రకృతి సేద్యానికి మార్గదర్శకం
రసాయనిక వ్యవసాయానికి ఒక సుస్థిరమైన ప్రత్యామ్నాయం ప్రకృతి వ్యవసాయం. ఇటు సంప్రదాయ విజ్ఞానాన్ని అటు ఆధునిక పర్యావరణ విజ్ఞానాన్ని ఇముడ్చుకొని ప్రకృతి వ్యవసాయ పద్ధతులు రూపొందాయి. ప్రస్తుతం ఆధునిక వ్యవసాయంలో ఎదురవుతున్న సవాళ్లకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు దీటైన సమాధానాలు ఇవ్వగలవు. తక్కువ వనరులతో, తక్కువ ఖర్చుతోనే వ్యవసాయానికి సుస్థిరత చేకూర్చటం సాధ్యమని ఈ పద్ధతులు చాటి చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా రైతులకు, విస్తరణ సిబ్బందికి ప్రకృతి సేద్య పద్ధతులపై శిక్షణ ఇవ్వటానికి ఈ మాన్యువల్ మార్గదర్శకంగా నిలుస్తుంది.
– ప్రొఫెసర్ రమేశ్ చంద్, వ్యవసాయ ఆర్థికవేత్త, నీతి ఆయోగ్ సీనియర్ సభ్యులు
Tags : 1