Breaking News

అడవే ఆధారం.. బతుకు భారం..

Published on Thu, 06/12/2025 - 20:06

సంక్షేమ ఫలాలు దరి చేరవు. వ్యవసాయ భూమి లేదు. అటవీ ఉత్పత్తుల సేకరణే జీవనాధారం. ఇదీ నల్లమల అటవీ ప్రాంతంలోని వందలాది చెంచుల జీవనం. అటవీ ప్రాంతంలోని చెంచుల జీవనాన్ని మెరుగుపరిచేందుకు ఎన్‌ఆర్‌ఈ జీఎస్, వ్యవసాయ, గిరిజన సహకార సంస్థతో పాటు ఐకేపీ, టీపీఎంయూ ఐటీడీఏలో అంతర్భాగంగా ఉన్నప్పటికీ.. సంక్షేమ ఫలాలు వారి దరి చేరడం లేదు. ఫలితంగా అటవీ ఉత్పత్తుల సేకరణతోనే కాలం వెళ్లదీస్తున్నారు.

నల్లమల లోతట్టు ప్రాంతంలో..
ఉమ్మడి రాష్ట్రంలోని సున్నిపెంట (శ్రీశైలం)లో మహబూబ్‌నగర్, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలోని చెంచుల సంక్షేమం కోసం ఏర్పాటైన సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) ప్రభావితంగానే కొనసాగింది. 2014 రాష్ట్ర విభజన అనంతరం 2015 మార్చి నుంచి అమ్రాబాద్‌ మండలం మన్ననూర్‌లో ఐటీడీఏ ఏర్పాటు చేశారు. దీని పరిధిలో నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నల్లగొండ, వికారా బాద్, రంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. ఐదు జిల్లాలోని 25 మండలాల్లో 172 గిరిజన గ్రామాలు, పెంటలున్నాయి. మొత్తం 4,041 చెంచు కుటుంబాల్లో 14,194 మంది జనాభా ఉంది. నల్లమల అటవీ ప్రాంతంలో 88 చెంచు పెంటలు ఉండగా.. 2,595 కుటుంబాల్లో 8,784 మంది చెంచులు నివసిస్తున్నారు. వీరిలో 4,341 మంది పురుషులు, 4,449 మంది మహిళలు ఉన్నారు.

అభయారణ్యంలో లింగాల, అమ్రాబాద్, పదర మండలాలు ఉండగా.. 18 చెంచు పెంటలు ఉన్నాయి. 12 పెంటల్లో పూర్తిగా చెంచులే నివసిస్తుండగా.. మిగతా పెంటల్లో చెంచులతో పాటు ఎస్సీ, ఎస్టీలు ఉంటారు. అచ్చంపేట, కొల్లాపూర్‌ నియోజక వర్గాల పరిధిలోని లోతట్టు అటవీ ప్రాంతంలోని ఫర్హాబాద్, మల్లాపూర్, పుల్లాయిపల్లి, రాంపూర్, అప్పాపూర్, భౌరాపూర్, ఈర్లపెంట, మేడిమెల్కల, సంగడిగుండాలు, ధారవాగు, తాటిగుండాలు, పెద్దూటి, బట్టిచింతల, ఎంకలపెంట, ఎర్రపెంట, పాత ధారారం, కుండిచింతలబైలు తదితర చెంచు పెంటల్లో నివసించే వారి పరిస్థితి దుర్భరంగా తయారైంది.

ఫలాల సేకరణలో హద్దులు..
చెంచులు ప్రధానంగా దుంపలు, అటవీ ఉత్పత్తుల సేకరణ, వేటపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. నల్లమలలోని పలు చెంచు పెంటలకు నేటికీ సరైన రహదారులు లేవు. సరైన జీవనశైలి లేకపోవడంతో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. అటవీ ప్రాంతంలో లభించే ఫలాల సేకరణకు హద్దులు ఏర్పాటు చేసుకుంటారు. వారు ఏర్పాటు చేసుకున్న సరిహద్దు ప్రాంతంలోనే అటవీ ఉత్పత్తులు సేకరిస్తుంటారు. ఇది వంశపారంపర్యంగా వస్తున్న హక్కుగా చెబుతున్నారు. చెంచుల ఆచారాలు, ఇంటి పేర్లు చెట్లు, వన్యప్రాణుల పేర్లతో కూడి ఉంటాయి.

చెట్ల పెంపకమేదీ?
అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగించే చెంచుల బతుకులు ప్రశ్నార్థకంగా మారనున్నాయి. క్రమంగా అటవీ ఉత్పత్తులు అంతరించడం, చెంచుల జీవన ప్రమాణాలు పెంచాల్సిన అధికారులు నిద్రావస్థలో ఉండటంతో... ఆహార కొరత ఏర్పడింది. నాగరికత ఎరుగని చెంచులు నేటికీ ఆహార సేకరణ దశలోనే ఉన్నారు. వీరి అభ్యున్నతికి బాటలు వేయాల్సిన ఐటీడీఏ.. ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదన్నది వాస్తవం. కనుమరుగవుతున్న పండ్ల చెట్ల పెంపకంపై అధికారులు దృష్టి సారించడం లేదు. వేసవిలో కనీసం ఉపాధి పనులు కూడా చేపట్టకపోవడంతో.. చెంచులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు.

క్రూరమృగాలతో ముప్పు..
నల్లమల అటవీ ప్రాంతంలో తేనె, మారెడు గడ్డలు, జిగురు, చింతపండు, కుంకుడుకాయలు, ముష్టి గింజలు, ఎండు ఉసిరి, చిల్లగింజలు, నరమామిడి చెక్క, కరక్కాయలు, విప్పపువ్వు, విప్ప గింజలు, కానుగ గింజలు, తునికాకు, బుడ్డపార్ల వేర్లు, వెదురు వంటి వాటితో పాటు మరో పది రకాల అటవీ ఉత్పత్తులు లభిస్తాయి. వాతావరణ పరిస్థితులు, రేడియేషన్‌ ప్రభావం వల్ల సహజ సిద్ధంగా లభించే అటవీ ఫలాలు క్రమంగా అంతరిస్తున్నాయి. పెద్దపులులు, క్రూరమృగాలతో ముప్పును సైతం లెక్కచేయకుండా ఫలాల సేకరణ చేయక తప్పడం లేదు.

అటవీ ఉత్పత్తులు సేకరించి.. గిరిజన కార్పొరేషన్‌ సంస్థ (జీసీసీ) కేంద్రాల్లో విక్రయిస్తారు. వారికి కావాల్సిన సరుకులను అక్కడి నుంచి తీసుకెళ్తారు. రాష్ట్ర ప్రభుత్వం మొక్కల పెంపకంపై దృష్టి సారిస్తున్నప్పటికీ.. చెంచులకు ఫలాలు ఇచ్చే మొక్కల పెంపకంపై మాత్రం ఆసక్తి చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే అడవిలో లభించే తునికాకు సేకరణను అటవీశాఖ అధికారులు పదేళ్లుగా నిలిపివేశారు. రేడియేషన్‌ కారణంగా తేనెటీగలు అంతరించిపోవడంతో తేనెతుట్టెలు కనిపించడం లేదు. ఏడాది పొడవునా జిగురు, చింతపండు, తేనెపైనే చెంచులు ఆధారపడి జీవిస్తున్నారు.

ప్రత్యేక కార్యాచరణ
చెంచుల సంక్షేమం, అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించింది. చెంచుల కోసం కేంద్ర ప్రభు త్వం ప్రధానమంత్రి జనజా తి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌ (పీఎం జన్‌మన్‌ యోజన) పథకం కింద 88 చెంచుపెంటల్లో 11 రకాల కార్యక్రమాలు విడతల వారీగా చేపడుతోంది. చెంచు పెంటల్లో 1,030 ఇళ్ల నిర్మాణం ప్రతిపాదించి, పనులు ప్రారంభించాం. కొంతమంది చెంచులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు, ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులు, ఆధార్‌ కార్డులు అందజేశాం. ప్రత్యేకంగా మెడికల్‌ వాహనం ఏర్పాటు చేశాం. మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.
– రోహిత్‌రెడ్డి, ఇన్‌చార్జి పీవో, ఐటీడీఏ

బీమా సౌకర్యం కల్పించాలి
కొన్నేళ్లుగా స్వచ్ఛంద సంస్థలు మాత్రమే తేనె సేకరణలో మాకు ఉపయో గపడుతున్నాయి. వారు ఇచ్చిన కిట్లు కూడా పాడయ్యాయి. కొత్త వాటిని ఇవ్వ లేదు. గతంలో పెంటలకు అందుబాటులో తేనె లభించేది. తేనె సేకరణకు ఆడవిలో చాలా దూరం వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వం తేనెకు మద్దతు ధర కల్పించడంతో పాటు.. తేనె సేకరణకు వెళ్లే ప్రతి ఒక్కరికీ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి.
– బయ్యన్న, మల్లాపూర్‌ చెంచుపెంట

చ‌ద‌వండి: కట్నంగా కిడ్నీ కూడా ఇవ్వాల్సిందే!

గుడిసెల్లోనే కాపురం..
లోతట్టు అటవీ ప్రాంతంలోని చెంచులు నేటికీ అనాగరిక జీవితం కొనసాగిస్తున్నారు. అటవీ ఉత్పత్తులు తగ్గాయి. జీవనం కొనసాగడం కష్టంగా ఉంది. పక్కా ఇళ్లు లేక నేటికీ బొడ్డు గుడిసెల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. ప్రత్యేక ఉపాధి తీసివేసిన తర్వాత పనులు లేకుండా పోయాయి. వైద్యం అందక రోగాల బారిన పడుతున్నారు.
– నిమ్మల శ్రీనివాసులు, అధ్యక్షుడు, రాష్ట్ర ఆదివాసీ చెంచు ఐక్యవేదిక

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)