Vizianagaram: పలుచోట్ల బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు సిరాజ్ అంగీకారం
Breaking News
మిస్ వరల్డ్‌తో మోక్షం.!
Published on Mon, 05/05/2025 - 11:16
బంజారాహిల్స్: ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్ సిటీ ముస్తాబవుతోంది. మే 7 నుంచి 31 వరకు హైటెక్స్‌లో జరిగే పోటీల కోసం సుందరాంగులు నగరానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నగరాన్ని సుందరీకరించే దిశలో వివిధ శాఖలు సమన్వయంతో ముందుకుసాగుతున్నాయి. ముఖ్యంగా అందగత్తెలు రాకపోకలు సాగించే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరిన ట్రాన్స్‌ఫార్మర్లు, వేలాడుతున్న వైర్లు, తుప్పుబట్టిన కరెంటు స్తంభాల తొలగింపు, మరమ్మతులు చేస్తోంది. ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సబ్‌స్టేషన్ల పరిధిలో టీజీఎస్‌పీడీసీఎల్ అధికారులు, లైన్‌మెన్లు, సిబ్బంది ఆదివారం మరమ్మతులకు శ్రీకారం చుట్టారు.
బంజారాహిల్స్ రోడ్డు నం.12లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు ఈనెల 18న సుందరాంగులు రానున్న నేపథ్యంలో ఈ రోడ్డులో శిథిలావస్థకు చేరిన 12 ట్రాన్స్‌ఫార్మర్లను మార్చారు. తుప్పుబట్టిన కరెంటు స్తంభాల స్థానంలో కొత్తవి వేశారు. వేలాడుతున్న కేబుల్ వైర్లను సరిజేశారు. ప్రపంచ నలుమూలల నుంచి విచ్చేస్తున్న సుందరాంగులు తమ షెడ్యూల్‌లో భాగంగా వివిధ ప్రాంతాలను సందర్శించనున్నారు. అలాగే పోటీలు జరిగే హైటెక్స్‌కు కూడా ఈ ప్రాంతాల నుంచే వెళ్తారు.
ఇక్కడ ఉన్న స్టార్ హోటళ్లలోనే వారంతా బస చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దీంతో టీజీఎస్‌పీడీసీఎల్ అధికారులు గత వారం రోజులుగా సుందరాంగులు రాకపోకలు సాగించే, పర్యటించే ప్రాంతాలను సర్వే చేశారు. రోడ్డు మార్గంలో వెళ్లే క్రమంలో ఎక్కడెక్కడ ట్రాన్స్‌ఫార్మర్లు శిథిలావస్థకు చేరాయో వాటిని గుర్తించారు.
ఓవైపు ఒరిగిన ట్రాన్స్‌ఫార్మర్ల జాబితాను తయారు చేశారు. దీని ఆధారంగానే ఆదివారం నుంచి మరమ్మతులు చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు ఈ పనులు కొనసాగనున్నాయి. టీజీఎస్‌పీడీసీఎల్ ఫిలింనగర్ సబ్‌స్టేషన్ ఏఈ పవిత్ర పర్యవేక్షణలో 30 మంది సిబ్బంది ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. దాదాపు అన్ని సబ్‌స్టేషన్ల పరిధిలోనూ పనులు చేస్తున్నారు.
ఇదీ చదవండి: దిల్ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలు
Tags : 1