గొడ్డలి పార్టీ మాదే... ఒప్పుకున్నా టీడీపీ లీడర్
Breaking News
‘పాంచ్ సాహెబ్’ గా హార్మోజ్‌ను గెలిచింది
Published on Thu, 07/09/2026 - 05:49
తల పైనుంచి దూసుకెళ్తున్న క్షిపణులు.. కింద మందుపాతర్ల సముద్రం.. నౌకలోని 24 మంది సిబ్బందిలో ఆమె ఒక్కతే స్త్రీ. అయినా భయపడలేదు. షిప్‌లో అందరూ ఆమెను ‘పాంచ్ సాహెబ్‘ (ఫిఫ్త్ ఇంజనీర్) అని పిలుస్తారు. ఆమే కేరళకు చెందిన ధీర వనిత హిఫా సలీమ్. స్ట్రయిట్ ఆఫ్ హార్మోజ్‌లో యుద్ధం మధ్య 100 రోజుల పాటు చిక్కుకుపోయినా భయానికి ఆస్కారం ఇవ్వని ధైర్యశాలి.
‘ఆ రోజు మర్చిపోలేను. మా షిప్ మీద నుంచి పెద్ద శబ్దంతో క్షిపణి ఒకటి దూసుకు వెళ్లింది. నేను ఇంజన్ రూమ్‌లో ఉన్నాను. అది నౌకకు గుండెకాయ. నా డ్యూటీ అక్కడే. అయినా కదల్లేదు. నా స్టాఫ్ వచ్చి పాంచ్ సాహెబ్... మనం ఈ పరిస్థితిని ఎదుర్కొందాం అన్నారు. అందరం ఒక టీమ్‌గా నిలబడ్డాం’ అంది హిఫా సలీమ్.
మొన్నటి అక్టోబర్ చివర్లో ఆమె పని చేస్తున్న కార్గో షిప్ హార్మోజ్ జల«సంధిలో ఇరుక్కున్నప్పుడు కేవలం 200 మీటర్ల దూరంలో క్షిపణులు, డ్రోన్లు పడ్డాయి. ఒక క్షిపణి తలపై నుంచే పోయింది. ‘భయం వేసింది... కానీ ΄్యానిక్ అవలేదు. డ్యూటీనే ముఖ్యం అనుకున్నాను’ అంది హిఫా. ‘క్షిపణి సమస్యలే కాదు... రాత్రిళ్లు ‘దాడులు ఎక్కువ కావడంతో జీపీఎస్ జామ్ అయిపోయింది. శాటిలైట్ కమ్యూనికేషన్, మాన్యువల్ కో ఆర్డినేట్స్‌తో మందుపాతర్లు తప్పించుకుంటూ నౌకను నడిపించాం’ అంది.
మధ్యతరగతి అమ్మాయి..
కేరళలోని సాధారణ కుటుంబం నుండి వచ్చిన హిఫా సలీమ్, చెన్నైలోని ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ నుంచి మెరైన్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. అక్టోబర్ 15న హ్యూస్టన్ లో ‘బిడబ్ల్యూ కిజోకు’ నౌకలో తన మొదటి సీ అసైన్ మెంట్‌ను ప్రారంభించింది. ఆ రోజు ఎంతో సంతోషంగా తన డైరీలో ‘ఎక్సైట్‌మెంట్ ప్లస్ ఆందోళన.. నా మొదటి షిప్’ అని రాసుకుంది. కానీ చేరిన మూడు వారాల్లోనే అంతర్జాతీయ పరిస్థితులు మారిపోయాయి. ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల హార్మోజ్ జలసంధిలో 13 భారతీయ నౌకలు, 550 మందికి పైగా భారతీయ నావికులు చిక్కుకుపోయారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 1% మాత్రమే మహిళా నావికులు ఉన్న ఈ రంగంలో, ఆ క్లిష్ట పరిస్థితుల్లో హిఫా ఒంటరిగా పోరాడింది.
ఇంట్లో చెప్పని ’100 రోజులు’..
యుద్ధక్షేత్రం లాంటి అంతర్జాతీయ జలాల్లో వంద రోజులు గడిచినా హిఫా తన ఇంట్లో ఒక్క మాట కూడా చెప్పలేదు. ‘అమ్మకు బీపీ ఉంది, నాన్న టెన్షన్ పడతారు‘ అని ప్రతి విషయాన్నీ దాచేసింది. రోజూ నవ్వుతూ వీడియో కాల్స్ చేస్తూ ‘ఇక్కడ అంతా బాగుంది’ అని అబద్ధం చెప్పేది. కానీ, లోపల మాత్రం ఆమెకు ప్రతి రాత్రి ‘ఈ రోజు బతికి బయటపడతామా?’ అనే భయం వెంటాడేది. నౌకకు గుండెకాయ లాంటి ఇంజిన్ ఒక్క నిమిషం ఆగినా అందరి ప్రాణాలూ గాల్లో కలవడం ఖాయం. ఆ క్లిష్ట సమయంలో హిఫా చేతులే, ఆమె నైపుణ్యమే మిగిలిన 23 మంది నావికుల ప్రాణాలకు బలమైన ఆధారం అయ్యాయి.
జపాన్ లో సైన్ ఆఫ్..
ఎట్టకేలకు 2026 జనవరి చివర్లో ఉద్రిక్తతలు కాస్త తగ్గాక ఆమె జపాన్ తీరంలో సురక్షితంగా ‘సైన్ ఆఫ్’ (విధుల నుంచి విరామం) చేసింది. హార్మోజ్ నరకంలో 3 నెలల పాటు మృత్యువుతో పోరాడి, క్షేమంగా స్వదేశానికి తిరిగి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత మీడియా ప్రతినిధులు ‘మీకు ఇప్పుడు మొదట ఏం కావాలి?’ అని అడిగారు. దానికి ఆమె నవ్వుతూ ‘నాకు రెస్ట్ వద్దు, సెలబ్రేషన్స్ వద్దు.. కేవలం అమ్మ చేతి వంట చాలు’ అని బదులిచ్చింది.
సాగర విజేత
ప్రస్తుతం హిఫా సలీమ్ తన తదుపరి ఉన్నత ర్యాంక్ (ఫోర్త్ ఇంజనీర్) పరీక్షల కోసం సన్నద్ధమవుతోంది. నాడు హార్మోజ్ జలసంధిలో ఇరుక్కుపోయిన 550 మంది భారతీయులలో హిఫా కథ అత్యంత ప్రత్యేకం. హార్మోజ్ జలసంధిలో చిన్న పొరపాటు జరిగినా అది పెద్ద యుద్ధానికే దారితీస్తుంది. అలాంటి అత్యంత ప్రమాదకరమైన చోట, కేవలం 20 ఏళ్ల ప్రాయంలోనే ‘పాంచ్ సాహెబ్’గా క్షిపణుల మధ్య నిలబడి 23 మంది మగవాళ్లకు భరోసానిచ్చింది. ‘ఆడపిల్లలు సముద్ర ప్రయాణాలకు, మెరైన్ రంగానికి పనికిరారు‘ అనే పాతకాలపు అపనమ్మకాలను హిఫా సలీమ్ తన నమ్మకంతో, ధైర్యంతో సముద్రపు లోతుల్లో ముంచేసింది!
Tags : 1