CP Sajjanar: న్యూ ఇయర్‌కు హైదరాబాద్ రెడీ
Breaking News
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ పార్టీలు ఇవిగో..
Published on Tue, 12/30/2025 - 16:53
పాత అనుభవాలకు వీడ్కోలు పలుకుతూ కొత్త ఆకాంక్షలకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న నగరవాసుల కోసం హైదరాబాద్ నగరవ్యాప్తంగా పలు రిసార్ట్స్, క్లబ్స్, కేఫ్స్, ఆడిటోరియమ్స్.. మేము సైతం సిద్ధం అంటున్నాయి. ఈ కార్యక్రమంలో సిటిజనులతో కలిసి ఆడి పాడేందుకు సినీ సెలబ్రిటీలు కొందరు నగరానికి వస్తున్నారు. ఇక టాప్ డీజేలు, బ్యాండ్స్, స్టాండప్ కమెడియన్స్.. పెద్ద సంఖ్యలో నగర బాట పట్టనున్నారు.
ఇప్పటికే పలు వేదికల ఈవెంట్స్‌కు సంబంధించి పాస్‌లు అమ్ముడుపోగా.. అనేక వేదికలు హౌజ్ ఫుల్ అంటున్నాయి. నగర శివారులోని అనంతగిరి కొండలు సైతం ఈవెంట్‌కి ఆహ్వాన వేదికలుగా ముస్తాబయ్యాయి. ఇక రిసార్టులు, క్లబ్స్ పరిస్థితీ అంతే అన్నట్లు చెబుతున్నాయి. మొత్తానికి న్యూ ఇయర్ వేడుకలకు (New Year Celebrations) కౌంట్ డౌన్ స్టార్ట్స్ అన్నట్లు ఉంది పరిస్థితి.
కొత్త సంవత్సరానికి కొంగొత్త ఆశలతో భాగ్యనగరం ముస్తాబవుతోంది. వేడుకలకు సంబంధించిన పలువేదికలు ముస్తాబయ్యాయి. ఆయా వేదికలు, నిర్వహణా సంస్థలు వేడుకలకు సంబంధించి సెలబ్రిటీల ఆహ్వానాల పోస్టర్లు ఈ పాటికే చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఔత్సాహికులు ఎగబడి మరీ ఆయా వేదికల పాసులు కొనుగోలు చేయడంతో హౌజ్ ఫుల్ అన్న పరిస్థితి కనిపిస్తుంది.
సినీ సెలబ్రిటీలు..
సాగర్ రోడ్డులోని జిఎస్‌ఆర్ కన్వెన్షన్స్‌లో ప్రిజ్మ్ ఔట్ డోర్స్, మాయా బజార్ రెస్టారెంట్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సంగీత ఉత్సవంలో భాగంగా నిర్వహించే కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా సినీ నేపథ్య గాయని సునీత, సంగీత దర్శకుడు ఆర్‌పీ పట్నాయక్ హాజరుకానున్నారు.
⇒ ఈ ఏడాది చెప్పుకోదగ్గ ఈవెంట్స్‌లో ముందున్న వేడుక మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణ సన్నీ లియోన్ (Sunny Leone). అలాగే తాజా సంగీత సంచలనం, గాయకుడు రామ్ మిరియాల కూడా పాల్గొంటున్నారు. ఈ ఈవెంట్‌లో భాగంగా మ్యాజిక్ షో, ఫ్యాషన్ షో, బెస్ట్ కపుల్ అవార్డ్స్ వంటివి కూడా ఉంటాయి.
⇒ మాదాపూర్‌లోని క్వేక్ ఎరీనాలో నిర్వహిస్తున్న న్యూ ఇయర్ పార్టీ.. బాలీవుడ్ సెలబ్రిటీని సిటీకి తీసుకొస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ కార్యక్రమంలో హోస్ట్‌గా పాల్గోనున్నారు.

డీజే ఆజా.. బ్యాండ్ బాజా..
⇒ గచ్చిబౌలిలోని ప్రిజ్మ్ క్లబ్ అండ్ కిచెన్‌లో నగరానికి చెందిన అగ్రగామి బ్యాండ్ క్యాప్రిసియో ప్రదర్శన ఉంటుంది. ముంబయి నుంచి టాప్ లేడీ డీజే పరోమా హాజరవుతున్నారు.
⇒ గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న కింగ్ డమ్ క్లబ్‌లో జరిగే ఈవెంట్‌లో ముంబయి డీజే అలీ మర్చంట్ పాల్గొంటున్నారు. ఆయనకు తోడుగా కయీ సంగీతాన్ని జత చేయనున్నారు.
⇒ జూబ్లీహిల్స్‌లోని గ్రీస్ మంకీ రెస్టారెంట్‌లో నిర్వహిస్తున్న నైట్ పార్టీకి డీజే అగ్ని హాజరవుతున్నారు. మహారాష్ట్రలోని గోండియా ప్రాంతానికి చెందిన ఈ లేడీ డీజే నగరంలోని పార్టీ ప్రియులకు చిరపరిచితం.
నార్త్ టు సౌత్..
⇒ గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న బిగ్ బుల్ క్లబ్ ప్రాంగణంలో నూతన సంవత్సర వేడుకకు ముంబయికి చెందిన తాజా మ్యూజికల్ సెన్సేషన్ డీజే ఆ్రఫ్టాల్ హాజరవుతున్నారు..
⇒ అర్జున్ రామ్‌పాల్ (Arjun Rampal) పాల్గొంటున్న కార్యక్రమంలోనే ఆయనతో పాటు ఢిల్లీకి చెందిన సిమర్ అరోరా అలియాస్ ప్రముఖ లేడీ డీజె సిమ్జ్ జోడీ కట్టనుంది.
చదవండి: ప్రపంచంలోనే టాప్ 10 న్యూ ఇయర్ పార్టీస్ ఇవే..
⇒ సిటీలో అతిపెద్ద బహిరంగ ప్రదేశంలో ఏర్పాటైన పార్టీగా.. మాదాపూర్‌లోని హైటెక్స్ ఎరీనాలో వేడుక నిలవనుంది. ఇందులో దేశపు తొలి ఆల్ ఫిమేల్ లైవ్ బ్యాండ్ సందడి సృష్టించనుంది. డీజే జాస్మిన్ ఈ బ్యాండ్‌ను సమర్పిస్తున్నారు. సాగర్ రోడ్డులోని జిఎస్‌ఆర్ కన్వెన్షన్స్‌లో నగరానికి చెందిన వనమ్ బ్యాండ్ పాల్గొంటోంది.
హిప్ హాప్.. హిట్ స్టార్స్..
⇒ బోడుప్పల్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఇటలీ డీజే థామస్ డెల్, అమెరికా నుంచి మరిజా కొరియాలు హాజరవుతున్నారు.
⇒ కొండాపూర్‌లోని మాయా లగ్జరీ కన్వెన్షన్స్‌లో టాలీవుడ్ నేపథ్య గాయనీ గాయకులు రమ్య బెహ్రా, సాయి చరణ్ పాల్గొంటున్నారు.
⇒ దుర్గంచెరువు సమీపంలోని అకాన్‌లో నిర్వహిస్తున్న పార్టీలో లేడీ డీజే స్పింజ్ మౌరా సందడి చేయనున్నారు.
⇒ గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్‌లో ర్యాప్‌సింగర్ క్రిస్నా, టాలీవుడ్ గాయకుడు కాశ్యప్, నగరానికి చెందిన హిప్ హాప్ స్టార్ థర్కారీలు పాల్గొంటున్నారు.
– సాక్షి, సిటీబ్యూరో
Tags : 1