Breaking News

అవాంఛిత రోమాలు ఎందుకు పెరుగుతాయి?

Published on Tue, 02/03/2026 - 14:42

తలపై జుట్టు బాగా పెరగాలని మహిళలు కోరుకోవడం ఎంతో సాధారణమో... దేహంలోని కొన్ని భాగాల్లో అంటే... పైపెదవీ, గదమ మీద జుట్టు పెరగకూడదని కోరుకోవడం కూడా అంతే సహజం. అలా జుట్టు పెదవులపైనా గడ్డంపైనా పెరగడాన్ని వారు ఎంతమాత్రమూ ఇష్టపడరు. అలాంటి అవాంఛిత రోమాలను అనేక విధాల తొలగించుకోడానికి మహిళలు ప్రయత్నిస్తుంటారు. ఇలా వారు కోరుకోని ప్రదేశాల్లో వెంట్రుకలు పెరగడాన్ని అవాంఛిత రోమాలు అనీ... అదే వైద్యపరిభాషలో హిర్సుటిజమ్‌ (Hirsutism) అని చెబుతారు. అవాంఛిత రోమాలు వచ్చేందుకు కారణాలు, వాటికి పరిష్కారాలేమిటన్నది తెలుసుకుందాం...

సాధారణంగా మానవుల శరీరమంతటా రోమాలు ఉండనే ఉంటాయి. మనం క్షీరదాల కోవకు చెందినవాళ్లం కావడం వల్ల... క్షీరదాల్లో ఇలా ఒళ్లంతా వెంట్రుకలు ఉండటం ఒక లక్షణం కావడం వల్ల ఒంటి నిండా రోమాలు ఉండటం సహజం. కాకపోతే దేహంలోని కొన్ని చోట్ల అవి అవి ఉండాల్సినట్టుగా ఉండకుండా పెరగడాన్ని అవాంఛిత రోమాలుగా చెప్పవచ్చు. ఉదాహరణకు పురుషుల్లో గడ్డం, మీసం ఉండటం సహజం. కానీ మహిళల్లో అవి ఉండవు. ఉన్నప్పటికీ ప్రస్ఫుటంగా కనిపించకుండా... నూగుగా... ఉండీ ఉండకుండా కనిపిస్తుంటాయి. అయితే కొందరిలో అవి పురుషుల్లో మాదిరిగా పెరుగుతూ స్పష్టంగా కనిపించే అవకాశముంటుంది.  

అవాంఛిత రోమాలంటే... 
మహిళల్లో చెంపలూ, చుబుకం, పై పెదవుల వంటి చోట్ల కూడా కనీ కనిపించకుండా రోమాలు ఉన్నప్పటికీ వాటిని గుర్తించడం అంత సులభం కాదు. సాధారణంగా మహిళలందరి విషయంలోలా కాకుండా భిన్నంగా కనిపించేవాటిని అసహజమైన వెంట్రుకలుగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు గదమ, చెంపలు, పెదవులపైన వెంట్రుకలు పెరుగుతూ... అవి మరీ గుబురుగా పెరుగుతుంటే వాటిని అవాంఛిత  రోమాలుగా పేర్కొనవచ్చు. ఒక అంచనా ప్రకారం దాదాపు ఎనిమిది శాతం మహిళల్లో... పురుషుల్లో మాదిరిగానే గడ్డంపైనా, పెదవులపైనా వెంట్రుకలు కనిపిస్తాయన్నది వైద్య నిపుణుల మాట.

హిర్సుటిజం, హైపర్‌ట్రైకోసిస్‌ అంటే...?
మహిళల్లో కనిపించే ఈ అవాంఛిత రోమాలను హిర్సుటిజమ్‌ అనీ అలాగే  హైపర్‌ట్రైకోసిస్‌ (Hypertrichosis) అని రెండు రకాలుగా చెప్పవచ్చు. స్త్రీలలోనూ పురుషుల మాదిరిగానే  వెంట్రుకలు పెరగడాన్ని ‘హిర్సుటిజమ్‌’గా చెప్పవచ్చు.

అయితే హైపర్‌ట్రైకోసిస్‌ కండిషన్‌లోనూ వెంట్రుకలు పెరిగినప్పటికీ... అవి పురుషుల్లోలాగా ఉండవు. ఉదాహరణకు మహిళల హార్మోన్లలో ఏవైనా తేడాలు వచ్చి పురుషుల్లోలా వెంట్రుకలు పెరగడాన్ని హిర్సుటిజమ్‌గా చెప్పవచ్చు. కానీ వాళ్ల దేహంపైనా వెంట్రుకలు ఉన్నప్పటికీ అవి ఉండాల్సినంతగా కాకుండా చాలా ఎక్కువగా పెరగడాన్ని ‘హైపర్‌ ట్రైకోసిస్‌’ అంటారు. జన్యుపరమైన కారణాలతో ఇలా జరుగుతుంది. ఇక కొందరిలో అంతకుముందు లేకపోయినా... కొన్ని రకాల మందులు వాడాక దేహంపైన రోమాలు రావచ్చు. అలా మునుపు లేనివీ... అటు తర్వాత ఏదైనా కారణాలతో రోమాలు పెరగడాన్ని కూడా ‘హైపర్‌ ట్రైకోసిస్‌’గా చెప్పవచ్చు.

కారణాలు 
మహిళల్లో అవాంఛిత రోమాలు పెరగడానికి అనేక అంశాలు కారణమవుతాయి. అవి... 
హార్మోన్లలో తేడాలు...
మహిళల్లో స్రవించే హార్మోన్లలో పురుష హార్మోన్‌ అయిన టెస్టోస్టెరాన్‌ అవసరమైన మోతాదు కంటే మించి స్రవించినప్పుడు... ఆ అంశం మహిళల్లో అవాంఛిత రోమాలకు దారితీయవచ్చు.

పాలీసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌... 
మహిళల్లో పురుషుల్లోలా వెంట్రుకలు పెరిగేందుకు పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌’ (పీసీవోడీ) కూడా ఒక కారణం. హిర్సుటిజమ్‌ ఉన్న మహిళలలో వైద్యపరీక్షలు చేసినప్పుడు వాళ్లలో చాలామందికి (దాదాపు 70% మందిలో) పీసీవోఎస్‌ ఉన్నట్లుగా ఫలితాలు రావడం చాలా సహజం. పీసీఓఎస్‌ ఉన్న మహిళల అండాశయాలు (ఓవరీస్‌) పురుష హార్మోన్‌ అయిన టెస్టోస్టెరాన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. దాంతో ఆ హార్మోన్‌ మహిళల్లో సాధారణంగా ఉండాల్సిన మోతాదు కంటే ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా అవాంఛిత రోమాలు పెరగడం కనిపిస్తుంది. ఈ సమస్యతో బాధపడేవాళ్లలో మొటిమలు కూడా ఎక్కువగానే వస్తుంటాయి. యుక్తవయసు దాటి΄ోయాక కూడా మొటిమలు రావడం, అవాంఛితమైన రోమాలు ఉంటే పీసీవోఎస్‌ ఉందేమో అని అనుమానించాలి.

పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ డిసీజ్‌ (పీసీవోడీ) సమస్య ఉన్నప్పుడు నిపుణులైన గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి. వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడటం ద్వారా నెలసరి సమస్యలు సరయ్యేలా చూసుకోవడం, చికిత్సను మధ్యలో ఆపకుండా సమస్య పరిష్కారమయ్యేవరకు / పూర్తిగా తగ్గేవరకు వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్‌మెంట్‌ను కొనసాగించాలి.

కొన్ని రకాల గ్రంథుల సమస్య ఉన్నప్పుడు... 
కొందరు మహిళల్లో థైరాయిడ్‌ గ్రంథి సమస్యగానీ, పిట్యూటరీ గ్రంథి సమస్య ఉన్నప్పుడు కూడా వారిలో పురుషుల్లోలాగానే వెంట్రుకలు పెరగవచ్చు. అందుకే... అవాంఛిత రోమాలు ఉన్నప్పుడు నిపుణులను సంప్రదించి దానికి అసలు కారణాలు తెలుసుకుని చికిత్స తీసుకోవడం అవసరం.

ఇడియోపథిక్‌ హిర్సుటిజమ్‌ అంటే...
కొద్దిమంది మహిళల్లో పురుషహార్మోన్‌ స్రావాలు చాలా తక్కువ మోతాదులో ఉన్నప్పటికీ... వెంట్రుకల పెరుగుదల మాత్రం అసాధారణంగా ఉండవచ్చు. ఇలాంటి కండిషన్‌ను ‘ఇడియోపథిక్‌ హిర్సుటిజమ్‌’గా చెబుతారు. వీళ్లలో రుతుక్రమం మామూలుగానే ఉంటుంది. గర్భం రావడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. కాకపోతే వెంట్రుకల పెరుగుదల మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది.

అవాంఛిత రోమాలున్న మహిళల్లో కనిపించే ఇతర లక్షణాలు 
అవాంఛిత రోమాలున్న మహిళల్లో కనిపించే ఇతర లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి. 
సాధారణంగా వీళ్లు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉంటారు. అంటే స్థూలకాయం / ఊబకాయంతో ఉండవచ్చు. 
పీరియడ్స్‌ సక్రమంగా రాకపోవడం. 
మెడ దగ్గర ప్రధానంగా మెడ వెనక భాగంలోనూ, చర్మం ముడతలు పడే ప్రదేశాల్లో చర్మం మరింతగా నల్లగా, మందంగా కనిపించవచ్చు. ఇలా చర్మం మందంగా, నల్లగా కనిపించే కండిషన్‌ను ‘ఎకాంథోసిస్‌ నైగ్రికాన్స్‌’ అంటారు.

డయాబెటిస్‌ వచ్చే ముప్పు ఎక్కువ... 
అవాంఛిత రోమాల సమస్యతో బాధపడేవాళ్ల రక్తంలో సాధారణంగా చక్కెర మోతాదులను అదుపులో పెట్టేందుకు మరింత ఎక్కువగా ‘ఇన్సులిన్‌’ హార్మోను అవసరమవుతుంది. అందుకే ఇలాంటి వాళ్లు చాలాకాలం పాటు ఎలాంటి చికిత్సా తీసుకోకపోతే ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ వచ్చి, అది క్రమంగా డయాబెటిస్‌ సమస్యకు దారితీసేందుకు అవకాశాలెక్కువ.

ఈ వైద్యనిపుణుల సహాయంతో... 
అవాంఛిత రోమాలు వచ్చే మహిళల్లో రుతుక్రమం సరిగా ఉండదు. అంటే వీళ్లలో నెలసరి (పీరియడ్స్‌) సక్రమంగా రావు. బరువు ఎక్కువగా పెరగడం, చర్మంలో ముడతలు ఉండే మెడ, బాహుమూలాలు వంటి చోట్ల చర్మం దళసరిగా మారడం, మొటిమలు ఎక్కువగా వస్తుండటం వంటి లక్షణాలతో పాటు ఒకవేళ మాడుపై తగినన్ని వెంట్రుకలు లేకపోవడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు ఆ బాధితులు.. ఎండోక్రైనాలజిస్ట్‌ (హార్మోన్ల నిపుణులు)ను, డెర్మటాలజిస్ట్‌ (చర్మవ్యాధుల నిపుణుల)ను సంప్రదించాలి. ఈ లక్షణాలున్నవారు తాము ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసుకున్నప్పుడు గైనకాలజిస్ట్‌ను తప్పనిసరిగా సంప్రదించాలి. కొన్ని సందర్భాల్లో ఎండోక్రైనాలజిస్ట్, డెర్మటాలజిస్ట్, గైనకాలజిస్ట్‌... ఈ ముగ్గురూ ఒక టీమ్‌గా చికిత్స అందిస్తే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. 

ఒకవేళ పాలీసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌ (పీసీఓఎస్‌)తో బాధపడుతున్న మహిళలైతే వారు తమ జీవనశైలిని, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. సమతులాహారం తీసుకుంటూ వ్యాయామం చేయడం వంటి అలవాట్లను కొనసాగించాలి. ఇవి చేస్తూ తమ బరువును తగ్గించుకోవడం లేదా నియంత్రణలో ఉంచుకోవడం చేస్తూ... వాటితో పాటు అవాంఛిత రోమాలను తొలగించుకోడానికి తాత్కాలిక ప్రక్రియలనో లేదా శాశ్వత పద్ధతులనో అవలంబించాలి.

అవాంఛిత రోమాల తొలగింపునకు తాత్కాలిక ప్రక్రియలు

థ్రైడ్డింగ్‌ అండ్‌ వ్యాక్సింగ్‌ ...
సాధారణంగా చాలామంది మహిళలు తమ అవాంఛిత రోమాలను తొలగించుకోడానికి ముఖ్యంగా థ్రెడింగ్, వ్యాక్సింగ్‌ లాంటి తాత్కాలిక ప్రక్రియలను అనుసరిస్తుంటారు. ఇవి తరచూ చేస్తున్న క్రమంలో కొందరిలో వెంట్రుకమూలంలో/ రోమం అంకురంలో ఇన్ఫెక్షన్స్‌ రావడం (ఫాలిక్యులైటిస్‌) వంటి ముప్పులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అప్పుడక్కడ రోమం కుదురు దగ్గర ఒక గడ్డలా మారి అక్కడ చీమూ పట్టే అవకాశాలెక్కువ. అలాంటి సందర్భాల్లో నొప్పి కూడా రావచ్చు. ఈ థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్‌ ప్రక్రియలను అనురించేవారి చర్మం నల్లబడవచ్చు. 

తగినంత పరిశుభ్రత పాటించకపోతే థ్రెడ్డింగ్‌తో ఒక్కోసారి పులిపిరులతో కూడిన వైరల్‌ వార్ట్స్‌ రావచ్చు. కొందరు మహిళలు అవాంఛిత రోమాలను తొలగించుకోడానికి హెయిర్‌ రిమూవల్‌ క్రీమ్స్‌ ఉపయోగిస్తుంటారు. వాటిని ఉపయోగించేప్పుడు అలర్జీలు రాకపోతే వాటిని సురక్షితమైనవిగా భావించి, వాటిని వాడుకోవచ్చు. అయితే హెయిర్‌ రిమూవల్‌ క్రీమ్‌ను ఉపయోగించే ముందు అది సురక్షితమా, కాదా అని తెలుసుకోడానికి  చర్మంపై ఎక్కడైనా కొద్దిగా ఉపయోగించి చూడటం (ప్యాచ్‌ టెస్ట్‌) అవసరం.

షేవింగ్‌... అపోహలు... 
అవాంఛిత రోమాలను తొలగించుకోడానికి సాధారణంగా భారతీయ మహిళలు షేవింగ్‌ను అంతగా ఇష్టపడరు.  షేవింగ్‌ తర్వాత మరింత గుబురుగా వెంట్రుకలు వస్తాయన్న అపోహ ఉండటం, షేవింగ్‌ (Shaving) వల్ల చర్మం మరింత గరుగ్గా, మందంగా మారుతుందనే అభిప్రాయాలు ఉండటంతో తమ లుక్స్‌ను కాపాడుకునే క్రమంలో దాన్ని ఒక సురక్షితమైన, నమ్మదగిన ప్రక్రియ అనుకోరు. అయితే అవి అపోహలే. అయినప్పటికీ షేవ్‌ చేసిన మర్నాడో లేదా వెంటవెంటనో వెంట్రుకలు పెరుగుతుండటం మామూలే కావడం, షేవ్‌ చేసిన మేర చర్మం రంగు ఒకింత మారడం వంటి కారణాల వల్ల ఇలా అపోహ పడటానికి అవకాశముంది.

చ‌ద‌వండి: నిద్ర ప‌ట్ట‌డం లేదా.. ఇదిగో ప‌రిష్కారం

ఇవిగాక... అవాంఛితమైన రోమాలను తొలగించుకునేందుకు ఇప్పుడు ఎన్నో రకాల వైద్యప్రక్రియలూ అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు లేజర్‌ ప్రక్రియలూ, ఎలక్ట్రోలైసిస్‌ (electrolysis) మార్గాల వంటి అధునాతన చికిత్సలూ ఉన్నాయి. అయితే వైద్య సంబంధితమైన ఎలాంటి విద్యార్హతలు లేకుండా తమను తాము బ్యూటీషియన్లు, కాస్మటాలజిస్టులమని చెప్పుకునే వారి దగ్గరకు వెళ్లడం కంటే... వైద్యపరమైన విద్యార్హతలు (క్వాలిఫైడ్‌) వైద్యనిపుణులై డర్మటాలజిస్టులు /ట్రైకాలజిస్టులను సంప్రదించడం చాలా మంచిది. ఇక ఇలాంటివారైతే... మహిళల్లో ఏవైనా ఇతర ఆరోగ్య సమస్యలు (అండర్‌లైయింగ్‌ కాజెస్‌) ఉండటం వల్ల అవాంఛిత రోమాలు వస్తే... తగిన మందులు ఇవ్వడం లేదా  సమస్య మూలాలను తెలుసుకుని  సంబంధిత వైద్యనిపుణులను సంప్రదించమంటూ సలహా ఇవ్వడం వంటివి చేస్తారు.

నిర్వహణ: యాసీన్‌ 

Videos

జైల్లో అంబటిని కలిసిన ముద్రగడ

అంబటి అల్లుడు,కూతురుని పరామర్శించిన అనిల్ కుమార్ యాదవ్

ఎవర్ని వదిలిపెట్టం.. బైరెడ్డి వార్నింగ్

KTR: 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? జాబ్ క్యాలెండర్ కు పాతర

మీకు దమ్ముంటే.. బాధితురాలి సంచలన సెల్ఫీ వీడియో..

Brahmaji : నావల్లే పూరి సినిమా ప్లాప్ అయ్యింది

Thanuja : ప్లీజ్ అలా అనడం మానేయండి.. నరకం అనుభవిస్తున్నా..

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ఎయిర్ పోర్టులు

దేశం నుంచి వెళ్లిపోండి.. వాట్సాప్ కు సుప్రీంకోర్టు వార్నింగ్

Vidadala: మాపై దాడి చేసి తిరిగి మాపైనే కేసులు పెట్టారు

Photos

+5

హీరోయిన్ జెనీలియా పెళ్లి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు (ఫొటోలు)

+5

'హనీ' ఈవెంట్‌లో అందంగా దివి (ఫొటోలు)

+5

'కపుల్ ఫ్రెండ్లీ' ట్రైలర్‌ ఈవెంట్‌ లో మెరిసిన హీరోయిన్‌ మానస వారణాసి (ఫొటోలు)

+5

నిర్మల్‌ : ఘనంగా ముజ్గి మల్లన్న జాతర (ఫొటోలు)

+5

’వెరైటీ ఇండియా పార్టీ‘లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)

+5

'కపుల్ ఫ్రెండ్లీ' మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ధనుష్‌ 55వ సినిమా.. శ్రీలీల, సాయి పల్లవి క్రేజీ ఫోటోలు

+5

ఈషా రెబ్బా 'ఓం శాంతి' జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

దుబాయిలో చిల్ అయిపోతున్న దివ్య భారతి (ఫొటోలు)