Breaking News

హార్ట్‌ ఫెయిల్యూర్‌ అంటే..? ఈ పరిస్థితి ఎందువల్ల వస్తుందంటే..

Published on Sun, 06/29/2025 - 10:44

చాలామంది హార్ట్‌ ఫెయిల్యూర్‌నూ, హార్ట్‌ ఎటాక్‌నూ ఒకటే అనుకుంటారు. కానీ ఈ రెండూ వేర్వేరు. హార్ట్‌ అటాక్‌ అంటే తన ధమనుల ద్వారా గుండెకు రక్తం అందక గుండె కండరం చచ్చుబడిపోవడం మొదలవుతుంది. ఇదొక తక్షణ మెడికల్‌ ఎమర్జెన్సీ. తక్షణం ఆసుపత్రికి తీసుకెళ్లి ఆ అడ్డంకిని స్టెంట్‌ వేయడం లేదా బైపాస్‌ వంటి సర్జరీ ద్వారా గుండె కండరానికి రక్త సరఫరాను పునరుద్ధరిస్తే ముప్పు తప్పుతుంది. అయితే హార్ట్‌ ఫెయిల్యూర్‌ అంటే గుండె తన కార్యకలాపాలు సమర్థంగా నిర్వహించడంలో వైఫల్యం చెందడం. ఇదొక దీర్ఘకాలిక సమస్య. హార్ట్‌ ఫెయిల్యూర్‌ అంటే ఏమిటి, దానికి కారణమయ్యే అంశాలు, హార్ట్‌ ఫెయిల్యూర్‌లో కనిపించే లక్షణాల వంటి అనేక సమస్యలను తెలిపే కథనమిది.  

హార్ట్‌ ఫెయిల్యూర్‌లో కండిషన్‌లో గుండె కండరం చాలా బలహీనంగా కావడంగానీ లేదా అదే కండరం చాలా బిగుతుగా (స్టిఫ్‌గా) మారిపోవడం గాని జరగవచ్చు. ఈ రెండింటిలో ఏది జరిగినప్పటికీ గుండె తన స్పందనలను కొనసాగించలేకపోవడం, దాంతో ఎప్పటిలాగా అన్ని అవయవాలకూ రక్తాన్ని సమర్థంగా పంప్‌ చేయలేకపోవడం జరగవచ్చు. పంపింగ్‌ పూర్తిగా జరగని ఫలితంగా రక్తం ఊపిరితిత్తులూ లేదా ఇతరత్రా అవయవాల్లోనే వెనకే ఉండిపోవచ్చు. దాంతో గుండె ఫెయిల్యూర్‌ బాధితుల్లో అనేక లక్షణాలు కనిపిస్తాయి.

హార్ట్‌ ఫెయిల్యూర్‌ బాధితుల్లో కనిపించే లక్షణాలు ...
ఊపిరి సరిగా అందకపోవడం, ఆయాసం రావడం (ఉదాహరణకు నడుస్తున్నా లేదా మెట్లు ఎక్కుతున్నా విపరీతంగా ఆయాసం రావడం) 

తీవ్రమైన అలసట / విపరీతమైన నిస్సత్తువ 

కాళ్లలో, చీలమండ (యాంకిల్స్‌), పాదాల్లో వాపురావడం 

బాధితులు అదేపనిగా దగ్గుతూ ఉండటం లేదా ఊపిరి తీసుకుంటున్నప్పుడు పిల్లికూతలు రావడం

దేహంలోని ద్రవాలు బయటకు పోలేకపోవడంతో బరువు పెరగడం 

దేనిపైనా దృష్టినిలపలేకపోవడం / ఏకాగ్రత కొరవడటం / చురుగ్గా ఉండలేకపోవడం 

గుండె స్పందనల్లో / గుండె లయలో మార్పులు రావడం. 

మన దేహంలోని ప్రతి కణానికి అనుక్షణం పోషకాలు అలాగే ఆక్సిజన్‌ సప్లై తప్పనిసరిగా అందుతూ ఉండాలి. రక్తం ద్వారా గుండె అలా పోషకాలనూ, ఆక్సిజన్‌నూ అందించలేకపోతే ఆ ప్రతికూల ప్రభావాన్ని ప్రతి కణమూ అనుభవిస్తుంది. 

సునాయాసంగా పూర్తయే పని కూడా చాలా కష్టమ్మీద చేయాల్సి వస్తుంది. కొందరిలో గుండె ఫెయిల్యూర్‌ దుష్ప్రభావాలు తక్షణం కనిపించవచ్చు. మరికొందరిలో క్రమక్రమంగా జరుగుతుండవచ్చు. లక్షణాలు కనిపించడానికి వారాలూ, నెలలూ పట్టవచ్చు.

హార్ట్‌ ఫెయిల్యూర్‌కు కారణాలు 
ఈ సమస్యకు చాలా కారణాలు ఉండవచ్చు. అనేక కారణాల వల్ల గుండె కండరం బలహీనం (వీక్‌గా) కావడం లేదా స్టిఫ్‌గా మారడం జరగవచ్చు. వాటిలో కొన్ని...

కరొనరీ ఆర్టరీ డిసీజ్‌ (సీఏడీ – అంటే గుండెకు రక్తాన్ని అందించే ధమనుల్లో కొన్ని మూసుకు΄ోవడం లేదా సన్నబారడం) 

అధిక రక్తపోటు (హై–బీపీ) ∙మధుమేహం (డయాబెటిస్‌) 

గుండె కవాటాల్లో సమస్యలు 

గతంలో గుండెపోటు రావడం 

విపరీతమైన మద్యం అలవాటు (క్రానిక్‌ ఆల్కహాలిజమ్‌)

ఏవైనా ఇన్ఫెక్షన్లకు లోనుకావడం 

పోషకాలూ / విటమిన్ల లోపం 

పైన పేర్కొన్న లోపాల్లో ఏ కారణం చేతనైనా ఏదైనా లోపం ఏర్పడినప్పుడు గుండె చాలా వేగంగా స్పందిస్తూ ఆ లోపాన్ని తన వేగంతో భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంటుంది. అయితే అది కేవలం తాత్కాలికంగా మాత్రమే జరిగే ప్రక్రియ. దీర్ఘకాలంలో ఆ లోటు భర్తీ కాకపోవడం వల్ల అది క్రమంగా వైఫల్యానికి దారితీస్తుంది. అలా మొదట్లో కొద్దిపాటిగా ఉన్న  లక్షణాలు కాస్తా దీర్ఘకాలంలో ప్రస్ఫుటంగా కనిపించడం మొదలవుతుంది. ఆ తర్వాత పరిస్థితి చాలా సీరియస్‌గా మారుతుంది.

గుండె వైఫల్యంతో సాధారణ జీవనం సాగించడమెలా...
గుండె వైఫల్యమన్నది ఒక తీవ్రమైన జబ్బు. పైగా ఇది జీవితాంతం కొనసాగే సమస్య. దీనికి నిత్యం డాక్టర్ల పర్యవేక్షణ, వారు సూచించిన మందులతోపాటు వ్యక్తిగత క్రమశిక్షణతో కూడిన జీవనశైలి మార్పులను తప్పక పాటించడం వంటి జాగ్రత్తలు అవసరం. ఈ కింద పేర్కొన్న సూచనలు పాటించడం ద్వారా హార్ట్‌ ఫెయిల్యూర్‌ బాధితులు చాలావరకు సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చు. అవి... 

గుండె తన సాధారణ కార్యకలాపాలు నిర్వహించడంతోపాటు లక్షణాలను సాధ్యమైనంతగా తగ్గించడానికి డాక్టర్లు సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడటం 

ఆహారంలో ఉప్పు తక్కువగా తీసుకోవడం 

వీలైనంతగా ద్రవాహారాలను తగ్గించడం 

ఒత్తిడిని (స్ట్రెస్‌ను) తగ్గించుకోవడం 

బరువు పెరగకుండా చూసుకోవడం. ఎప్పటికప్పుడు బరువును పరీక్షించుకుంటూ ఉండటం 

పరిస్థితి తీవ్రమైన కండిషన్లలో వారికి అవసరమైన ఉపకరణాలను (ఇంప్లాంటబుల్‌ డివైసెస్‌) అమర్చుకోవడం. ఈ తరహా బాధితుల్లో ఇక గుండె మార్పిడి చికిత్స (హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌) చివరి ప్రత్యామ్నాయం. అది చాలా సంక్లిష్టమైన, ఖరీదైన వ్యవహారం. పైగా మార్పిడికి అవసరమైన గుండె అందుబాటులోకి రావడం చాలా అరుదు. అందుకే వీలైనంతగా మంచి జీవనశైలిని అనుసరిస్తూ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అందరూ విధిగా చేయాల్సిన పని. 

గత పదేళ్లలో హార్ట్‌ ఫెయిల్యూర్‌ సమస్యకు చాలా ప్రభావవంతమైన మంచి మందులు అందుబాటులోకి వచ్చాయి. గుండె డాక్టర్‌ పర్యవేక్షణలో వాటిని వాడటం వల్ల మంచి ఫలితాల తోపాటు సాధారణ జీవితం గడిపేలాంటి అవకాశాలున్నాయి.  ఇక కొందరు బాధితుల్లో గుండె స్పందనలు సరిగా జరిగేలా చేసేందుకు పేస్‌ మేకర్‌ వంటివి అమర్చాల్సిన ‘సీఆర్‌టీ’ వంటి మరికొన్ని చికిత్సలూ అవసరం పడవచ్చు.
డాక్టర్‌ అమర్‌ నారాయణ్‌ పట్నాయక్‌, సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ 

(చదవండి: Anemia: రక్తం పంచే అమ్మకు బ్లడ్‌ తక్కువ..! ఎలా అధిగమించాలంటే..)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)