Breaking News

అప్రమత్తతే అసలైన రక్షణ..!

Published on Sun, 11/01/2026 - 12:06

ఓ గర్భిణి ఏడో నెలలో సాధారణ పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చారు. ఆమెకు కాళ్ల వాపులతోపాటు ఉదయం లేవగానే ముఖం కూడా కొద్దిగా ఉబ్బినట్లు అనిపించింది. ఈ విషయాన్ని సాధారణంగా భావించి నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం ముంచుకు రావచ్చు. అదే సమయంలో అప్రమత్తమై వైద్యులను సంప్రదిస్తే పెను ప్రమాదం నుంచి బయటపడొచ్చు. అందుకే గర్భిణులకు బీపీ పెరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

బీపీ పెరిగితే ఏం చేయాలి?
గర్భధారణలో కాళ్ల వాపులు, ముఖం ఉబ్బడం సాధారణమే అయినప్పటికీ, అలాగే తేలిగ్గా తీసుకుని వదిలేస్తే ప్రమాదమే! ఎందుకంటే వీటితోపాటు రక్తపోటు కూడా పెరిగితే తల్లీబిడ్డల ఆరోగ్యంపై ప్రభావం పడవచ్చు. ముఖ్యంగా ఏడో నెలలో బీపీ పెరిగినప్పుడు రక్తపోటును పదేపదే పరీక్షిస్తూ పరిస్థితిని అంచనా వేయాలి. 

అవసరమైతే ఆసుపత్రిలో చేర్పించి పర్యవేక్షించాలి. బీపీ నియంత్రణలో లేకపోతే వైద్యులు తగిన మందులను సూచిస్తారు. ఇంటి వద్ద పర్యవేక్షించాలని వైద్యులు సూచిస్తే, వారి సలహా మేరకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి బీపీని కొలిచి నమోదు చేసుకోవాలి.

ఈ లక్షణాలుంటే వెంటనే ఆసుపత్రికి!
చూపు మసకబారడం, తీవ్రమైన తలనొప్పి, మూత్రం తగ్గడం, వాపులు పెరగడం, కడుపులో తీవ్రమైన నొప్పి, బిడ్డ కదలికలు తగ్గడం, రక్తస్రావం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. వీటిలో ఏ లక్షణం కనిపించినా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. కొన్ని సందర్భాల్లో తక్షణ చికిత్స అవసరమవుతుంది.

తల్లీబిడ్డలకు ఎలాంటి పరీక్షలు?
బీపీ పెరిగిన గర్భిణులకు ప్రీ ఎక్లాంప్సియా ఉందేమో తెలుసుకోవడానికి వైద్యులు అవసరమైన పరీక్షలు నిర్వహిస్తారు. హిమోగ్లోబిన్, ప్లేట్‌లెట్‌ కౌంట్, కాలేయం, మూత్రపిండాల పనితీరును తెలిపే పరీక్షలతోపాటు మూత్రంలో ఆల్బుమిన్, ఎల్‌డీహెచ్‌ వంటి పరీక్షలు చేస్తారు. 

వీటి ద్వారా ఇతర అవయవాలపై ప్రభావం పడిందా అనేది అంచనా వేస్తారు. బిడ్డకు రక్తప్రసరణ తగ్గితే ఎదుగుదల మందగించడం, ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అందుకే స్కానింగ్, డాప్లర్‌ పరీక్షల ద్వారా బిడ్డ ఎదుగుదల, రక్తప్రవాహాన్ని పర్యవేక్షిస్తారు.

డెలివరీ ఎప్పుడు చేస్తారు?
ప్రసవ సమయం తల్లి, బిడ్డ ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. బీపీ తీవ్రంగా పెరగడం, ఫిట్స్‌ రావడం (ఎక్లాంప్సియా), కాలేయ పనితీరు దెబ్బతినడం, మావి గర్భాశయం నుంచి విడిపోయి రక్తస్రావం జరగడం లేదా బిడ్డకు ప్రమాదం ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తితే అత్యవసరంగా ప్రసవం చేయాల్సి రావచ్చు. 

తల్లీబిడ్డల పరిస్థితి స్థిరంగా ఉండి, బీపీ నియంత్రణలో ఉంటే వైద్యుల పర్యవేక్షణలో గర్భధారణను కొనసాగించవచ్చు. గర్భధారణలో బీపీ పెరిగిన ప్రతి ఒక్కరికీ ఒకే సమయంలో ప్రసవం చేయరు. పరిస్థితి తీవ్రతను బట్టి వైద్యులు సరైన సమయాన్ని నిర్ణయిస్తారు. కొన్ని సందర్భాల్లో 37 వారాలకు ప్రసవాన్ని ప్రణాళిక చేయవచ్చు.

హైరిస్క్‌ ఆసుపత్రి ఎందుకు?
ప్రసవ సమయంలో లేదా ఆ తర్వాత బీపీ అకస్మాత్తుగా పెరగడం, అధిక రక్తస్రావం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అందుకే అత్యవసర చికిత్స, రక్తనిధి, నిపుణుల బృందం అందుబాటులో ఉన్న హైరిస్క్‌ ప్రసూతి విభాగంలో ప్రసవం చేయించుకోవడం మంచిది.

తదుపరి గర్భధారణలో జాగ్రత్తలు
గత గర్భధారణలో బీపీ పెరిగినవారు తదుపరి గర్భధారణలోనే కాకుండా, గర్భం దాల్చే ముందే వైద్యులను సంప్రదించడం మంచిది. గత వైద్య చరిత్ర, ఇతర ప్రమాద కారకాలను బట్టి వైద్యులు తక్కువ మోతాదులో ఆస్పిరిన్‌  తీసుకోవాలని సూచించవచ్చు. 

అయితే వైద్యుల సలహా లేకుండా ఈ మందును వాడకూడదు. చివరగా, బీపీ పెరిగిందని భయపడాల్సిన అవసరం లేదు. కానీ నిర్లక్ష్యం మాత్రం చేయకూడదు. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం, వైద్యుల సూచనలు పాటించడం, ప్రమాద సంకేతాలను గుర్తించడం తల్లీబిడ్డల ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. 
డా. కప్పగంతుల అపర్ణ 
సీనియర్‌ గైనకాలజిస్ట్, అబ్‌స్టెట్రీషియన్, ల్యాపరోస్కోపిక్‌ సర్జన్, సికింద్రాబాద్‌

ఇదీ చదవండి: పెట్రోల్‌తో హెయిర్‌ వాష్‌!

 

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)