నేను జగన్ చెంచాను అయితే.. నువ్వు చంద్రబాబు కు చెంచావా..?
Breaking News
ఆమె రచనల వెనుక దాగిన ఆ విషాద చరిత్ర ఏంటి?
Published on Sun, 09/06/2026 - 11:48
కవితాత్మక వచన రచయిత్రిగా రాణించి, వచన కవనాల మధ్య సరిహద్దులు చెరిపేసిన సాహసి హాన్ కాంగ్. ఆమె 2024లో నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకున్నారు. హాన్ కాంగ్ విజయానికి బలమైన నేపథ్యమే వుంది. అది ఆమె ఇంట్లో నెలకొన్న సాహిత్య వాతావరణం. హాన్ కాంగ్ తండ్రి, హాన్ స్యూంగ్ వాన్ ప్రముఖ కొరియన్ రచయిత– ఆమె అన్న హాన్ డాంగ్ రిమ్, తమ్ముడు హాన్ కాంగ్ యిన్ కూడా రచయితలే.
కొరియా ద్వీపకల్పంలో ప్రవహించే హాన్ నది పేరే ఆమె వంశ నామం. ఆమె తొమ్మిదో యేట, హాన్ కుటుంబం సియోల్ సమీపంలోని సుయూ–రీ పట్టణప్రాంతానికి తరలిపోయింది. ఆమె తండ్రి ఉపాధ్యాయ వృత్తికి ఉద్వాసన చెప్పి పూర్తికాలం రచయితగా బతకాలని నిర్ణయించుకోవడమే దానికి కారణం. ఆ నిర్ణయం కాబోయే రచయిత్రి హాన్ కాంగ్ జీవితాన్ని చిన్న మలుపు తిప్పింది. 1982లో, ఆమె జీవితాన్ని మరో మలుపు తిప్పిన సంఘటన మరొకటి జరిగింది. తమ యింట్లో పడివున్న ఓ ఆల్బం హాన్ కాంగ్ కంటపడ్డమే ఆ మలుపు!
1980 మే నెలలో– హాన్ కుటుంబం సియోల్ సమీపంలోని ఓ శివారు పట్టణానికి తరలిపోవడానికి కొద్ది నెలల ముందు– దక్షిణ కొరియాలో గ్వాంగ్ జూ తిరుగుబాటు చెలరేగింది. అక్కడి సైనిక పాలకులు దాన్ని ఎంత నిర్దాక్షిణ్యంగా అణిచేశారో ఆ ఆల్బం ద్వారా హాన్ కాంగ్ తెలుసుకోగలిగింది. సదరు ఆల్బంలోని ఫొటోలు తీసినవాడు యెర్గెన్ హింట్జ్–పియెర్ అనే పాత్రికేయుడు, ఫొటోగ్రాఫర్.
ఇరవై మూడేళ్ళ వయసులో, కొరియన్ భాషాసాహిత్యాల్లో పట్టా పుచ్చుకుని, యోన్సెయ్ విశ్వవిద్యాలయం నుంచి బయటపడిన హాన్, కొంతకాలం పత్రికల్లో పనిచేసింది. అదే సంవత్సరం ఆమె ‘అచ్చులోన తన పేరును ముచ్చటగా’ చూసుకున్నారు! ‘సాహిత్యం–సమాజం’ అనే త్రైమాసిక పత్రికలో ఆమె రాసిన అయిదు కవితలు అచ్చయ్యాయి. మరుసటి సంవత్సరం ‘సియోల్ షిన్మున్’ అనే వార్తాపత్రిక నిర్వహించిన కథానికల పోటీలో హాన్ కథానిక ‘ఎర్ర లంగరు’ బహుమతి పొందింది.
ఆ పై సంవత్సరం, అంటే 1995లో, హాన్ తొలి కథా సంకలనం ‘యోసూ– ఓ ప్రేమకథ’ విడుదలైంది. అందులోని ప్రతి ఒక్క వాక్యం –కాలెరిజ్ చెప్పినట్లు– ‘అత్యుత్తమ క్రమంలో పేర్చిన, ఉత్తమమైన పదాల’తో అలరారి, అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆమె తన జర్నలిస్టు ఉద్యోగాన్ని వదిలిపెట్టి, పూర్తికాలం రచనలకే కేటాయించే నాటికి, హాన్ వయసు అక్షరాలా పాతిక సంవత్సరాలు!
2007లో, హాన్ జీవితం ఇంకో మలుపు తిరిగింది. ‘తీయగా చల్లగా పాడుకునే పాట’ శీర్షికతో ఆమె మరో కథాసంకలనం వెలువరించారు. హాన్ జియోంగ్–రిమ్ అనే సంగీతజ్ఞుడూ, సంగీత దర్శకుడు ఆ కథలన్నీ హాన్ సొంతగొంతులో పాడి వినిపించి తీరాలని పట్టుబట్టారట! ఆయన మాట కొట్టిపారేయలేక రచయిత్రి అలానే చేశారట! ఆ తర్వాత, ఆమె ప్రధానంగా నవలలపై దృష్టి కేంద్రీకరించారు. ఇంతవరకూ ఆమె ఏడు నవలలు వెలువరించారు. వాటిల్లో ‘శాకాహారి’ సుప్రసిద్ధం. ఈ మూడు భాగాల గొలుసుకట్టు రచనకు చిన్న నేపథ్యముంది.
కొరియన్ కవయిత్రి యీ–సాంగ్ కవితలోని ‘మనుషులు మొక్కలైతే ఎంత బాగుంటుంది?’ అనే పాదంలోని అంతరార్థం ఏమిటనే అన్వేషణ హాన్‌లో విద్యార్థి దశలోనే మొదలైంది. యీ–సాంగ్ ఆ కవితను ఎప్పుడు రాశారు? దాని చారిత్రక నేపథ్యమేమిటి? అన్న ప్రశ్నలకు జవాబు వెతికే క్రమంలో కవయిత్రి హృదయం ఈ రచయిత్రికి బోధపడింది. అలా ‘శాకాహారి’ అనే నవలా త్రయానికి ఇతివృత్తం రూపొందింది. ఆ త్రయంలో రెండు–మూడు భాగాలుగా ‘మంగోలియన్ ముద్ర’, ‘అగ్నివృక్షం’ వెలువడ్డాయి.
ఇరవయ్యో శతాబ్ది అంతం కాబోతోందనగా, హాన్–కాంగ్ విజయ ప్రస్థానం మొదలైందని చెప్పొచ్చు. హాన్ నవలిక ‘బుద్ధ శిశువు’ 1995లో కొరియన్ నవలా పురస్కారం గెల్చుకుంది. ఇరవై ఒకటో శతాబ్ది తొలిపాదం ముగియబోతోందనగా నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకోవడంతో ఈ యాత్ర పతాకస్థాయికి చేరినట్లయింది. ‘శాకాహారి’ నవలా త్రయంలో ‘మంగోలియన్ ముద్ర’ 2005లో ‘యీ– సాంగ్ సాహిత్యపురస్కారం’ గెల్చుకుంది.
పదకొండేళ్ళ తర్వాత ‘శాకాహారి’ నవలకు డెబోరా స్మిత్ చేసిన ఆంగ్లానువాదం అంతర్జాతీయ బుకర్ పురస్కారం గెల్చుకుంది. అదే సంవత్సరం– 2016లోనే– ‘ద న్యూ యార్క్ టైమ్స్ బుక్ రెవ్యూ’ ఎంపిక చేసిన పది ఉత్తమ రచనల జాబితాలో ఈ నవలకు స్థానం దక్కడం విశేషమే మరి! అదే సంవత్సరం హాన్ వెలువరించిన ‘మనుషుల చేతలు’ నవలకు అడల్ఫీ ఎడిజియోనీ చేసిన ఇటాలియన్ అనువాదం, ‘ప్రీమియో మలపార్టీ’ పురస్కారం గెల్చుకుంది.
2021లో వెలువడిన హాన్ అయిదో నవల ‘మనం విడిపోం’ రెండేళ్ళ తర్వాత ఫ్రెంచ్ భాషలోకి అనువాదమై ‘ప్రీ మెడిసిస్’ పురస్కారం గెల్చుకుంది. ప్రతిభకు తగినంత పేరు పొందని రచయితలకిచ్చే పురస్కారమిది! హాన్ సాధించిన ఈ విజయంతో పాశ్చాత్య సాహిత్య ప్రపంచం పెద్దలు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఆ ఉలికిపాటుకు పర్యవసానమే, 2024లో హాన్ నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకోవడం!
- మందలపర్తి కిషోర్
ఇవి కూడా చదవండి: నాన్నకు చేయాల్సిన కర్మలు వద్దన్నాడు.. చివరికి ఏం జరిగిందంటే?
Tags : 1