Breaking News

సత్వర స్పందనతోనే.. స్కామ్‌ బట్టబయలు

Published on Sun, 04/06/2025 - 08:44

తమిళనాడు కడలూరు జిల్లాలో ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో బ్రాంచ్‌ మేనేజర్‌గా పని చేసిన ఓ మహిళ కుమారుడు తరచు ఆ బ్యాంక్‌కు వచ్చి వెళ్తుండే వాడు. ఇలా ఆ కార్యకలాపాలన్నీ తెలుసుకున్న ఈ బాబు– తనకు పరిచయస్థులైన మరో ఇద్దరితో కలిసి అక్కడి పన్రుటిలో ఏకంగా నకిలీ ఎస్బీఐ బ్రాంచ్‌ తెరిచాడు. ఈ బ్రాంచ్‌ మూడు నెలలు బాగానే నడిచినా, 2020 జూలైలో పోలీసులకు ఫిర్యాదు అందటంతో, ముగ్గురు నిందితులను జైలుకు పంపారు. దాంతో బ్రాంచ్‌ మూతపడింది. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడానికి కారణమేమిటంటే, అక్కడకు వచ్చే కస్టమర్లతో ముగ్గురు నకిలీ ఉద్యోగులూ అత్యంత మర్యాదగా ప్రవర్తిస్తూ, వారి సమస్యలపై సత్వరం స్పందిస్తుండటమే!

ఇలాంటి స్పందన కారణంగానే హైదరాబాద్‌లోనూ నకిలీ బ్యాంక్‌ గ్యారంటీల స్కామ్‌ బయట పడింది. దీనిపై 2023 జనవరి 15న కేసు నమోదు చేసుకున్న సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ పోలీసులు అదే నెల 28న నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ప్రభుత్వ రంగంతో పాటు బ్యాంకింగ్‌ సెక్టార్‌లోనూ కొన్ని అంశాల్లో తీవ్ర జాప్యం ఉంటుంది. ప్రధానంగా ఉత్తర ప్రత్యుత్తరాలకు రోజులు, వారాలే కాదు అవసరమైతే నెలలు కూడా వేచి చూడాలి. అయితే ఓ బ్యాంక్‌ గ్యారంటీ అంశానికి సంబంధించి ఈ–మెయిల్‌ పంపిన ఐదు నిమిషాల్లోనే జవాబు వచ్చేస్తే? అలాంటి స్పందనపై రాష్ట్ర ప్రభుత్వ అధికారికి వచ్చిన సందేహమే ఈ నకిలీ బ్యాంక్‌ గ్యారంటీల స్కామ్‌ను వెలుగులోకి తెచ్చింది.

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో నకిలీ బ్యాంక్‌ గ్యారంటీ పత్రాల తయారీ అడ్డాలు ఉన్నాయి. సరైన అర్హతలు లేని కంపెనీలు కాంట్రాక్టులు దక్కించుకోవడానికి, బ్యాంకు రుణాలు పొందడానికి నకిలీ బ్యాంక్‌ గ్యారంటీలు ఉపకరిస్తూ ఉంటాయి. కోల్‌కతా ముఠాలకు దేశవ్యాప్తంగా ఏజెంట్లు ఉంటారు. వరంగల్‌కు చెందిన లోన్‌  ఏజెంట్‌ నాగరాజు వారిలో ఒకడు. చెన్నైకి చెందిన హర్షిత ఇన్స్‌ ఫ్రా ఇంజనీరింగ్‌ కంపెనీ అప్పట్లో రాష్ట్రంలో కొన్ని కాంట్రాక్టులు దక్కించుకుంది. వీటి కోసం హర్షిత సంస్థ మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖకు బ్యాంకు గ్యారంటీలు సమర్పించాల్సి వచ్చింది. సాంకేతిక, అనివార్య కారణాల నేపథ్యంలో కొన్ని వ్యాపార సంస్థలు, కొందరు కాంట్రాక్టర్లు ఈ బ్యాంక్‌ గ్యారంటీల కోసం ఏజెంట్ల సహాయం తీసుకుంటూ ఉంటారు. దీనికోసం కొందరు ఏజెంట్ల వద్దకు వెళ్తే, మరికొందరు ఏజెంట్లు కమీషన్ల కోసం వీళ్లను వెతుక్కుంటూ వస్తుంటారు. 

అప్పట్లో నాగరాజు స్వయంగా హర్షిత ఇన్‌ఫ్రా ఎండీని కలిశాడు. ఆయనకు అవసరమైన బ్యాంకు గ్యారంటీలు అందిస్తానని, అందుకు కొంత కమీషన్‌ చెల్లించాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. వ్యాపార రంగంలో బ్యాంక్‌ గ్యారంటీలు సాధారణమే కావడంతో హర్షిత ఇన్‌ఫ్రా ఎండీ అంగీకరించారు. నాగరాజుకు కొన్నేళ్ళ క్రితం రాజస్థాన్‌కు చెందిన నరేష్‌ వర్మ ద్వారా కోల్‌కతా వాసులు నీలోత్పల్‌ దాస్, శుభ్రజిత్‌ ఘోషాల్‌లతో పరిచయమైంది. ఈ నలుగురూ కలసి గతంలో అనేక బ్యాంకులకు సంబంధించిన బ్యాంక్‌ గ్యారంటీ పత్రాలను వివిధ కంపెనీలకు అందించారు. ఈ వ్యాపారం చేసే వారికి అనేక బ్యాంకులతో ఒప్పందాలు ఉంటాయి. నిర్ణీత సమయానికి గ్యారంటీ పత్రం తీసుకోవడానికి కొన్ని నిబంధనలు పాటించడంతో పాటు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. 

ఈ డబ్బు మిగుల్చుకోవాలని భావించిన ఆ నలుగురూ హర్షిత సంస్థకు మాత్రం ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ పేరుతో నకిలీ పత్రాలు తయారు చేసి అందించారు. ఇవి నకిలీవని తెలియని హర్షిత సంస్థ వాటిని అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖకు దాఖలు చేసి కాంట్రాక్టు పనులు కూడా పొందింది. కాంట్రాక్టర్లు, కాంట్రాక్టులు పొందిన సంస్థల నుంచి ఈ బ్యాంకు గ్యారంటీ పత్రాలు పొందే ప్రభుత్వ విభాగాలు సాధారణంగా క్రాస్‌ చెక్‌ చేయవు. కొన్ని సందర్భాల్లో మాత్రం ఆ బ్యాంక్‌ను సంప్రదించి సందేహ నివృత్తి చేసుకుంటాయి. ఈ ఉత్తరప్రత్యుత్తరాలు ఈ–మెయిల్‌ ద్వారా జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ విభాగాలు, బ్యాంక్‌ గ్యారంటీ తీసుకున్న సంస్థలు క్రాస్‌ చెక్‌ చేస్తాయని తెలిసిన కోల్‌కతా ద్వయం– ఇలా వచ్చే ఈ–మెయిల్స్‌ కోసం ప్రత్యేకంగా కొన్ని మెయిల్‌ ఐడీలు రూపొందించింది. 

హర్షిత ఇన్‌ఫ్రా సంస్థ ద్వారా అందుకున్న బ్యాంక్‌ గ్యారంటీలను సరిచూడాలని భావించిన అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అధికారి అందులో ఉన్న ఈ–మెయిల్‌కు సంప్రదించారు. ఫలానా బ్యాంక్‌ గ్యారంటీ లేఖ మీరు జారీ చేసిందేనా? అని ప్రశ్నించారు. ఈ–మెయిల్‌ను అందుకున్న శుభ్రజిత్‌ బ్యాంకు అధికారి మాదిరిగానే స్పందిస్తూ, అవి నిజమైనవేనంటూ బదులిచ్చాడు. కేవలం ఐదు నిమిషాల్లోనే సమాధానం రావడంతో అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అధికారి సందేహించారు. దీంతో కోల్‌కతాలోని బ్రాంచ్‌ నుంచి వచ్చిన జవాబును, ఆ బ్యాంకు గ్యారంటీలను పత్రాలను మరోసారి సరిచూడాలని భావించారు. వీటిని ముంబైలోని ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ప్రధాన కార్యాలయానికి ఈ–మెయిల్‌ ద్వారా పంపి తమ సందేహాలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. వాటిని చూసిన అక్కడి అధికారులు అవాక్కయ్యారు.

 గ్యారంటీ పత్రాల్లో పేర్కొన్న ప్రాంతంలో తమకు అసలు బ్రాంచ్‌ లేదని స్పష్టం చేశారు. తమ ఈ–మెయిల్‌ ఐడీలు కూడా అలా ఉండవని తెలిపారు. దీంతో ఈ శాఖ అధికారులు సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఉన్నతాధికారులు దీని దర్యాప్తును సీసీఎస్‌కు బదిలీ చేశారు. మరోపక్క అసలు విషయం తెలుసుకున్న హర్షిత సంస్థ కూడా నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నమోదైన కేసు కూడా సీసీఎస్‌కు బదిలీ అయింది. వీటిని దర్యాప్తు చేసిన అధికారులు మొత్తం నలుగురు నిందితులనూ అరెస్టు చేశారు. వీరిపై అభియోగపత్రాలు సైతం దాఖలు కావడంతో ప్రస్తుతం నాంపల్లి కోర్టులో విచారణ సాగుతోంది. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)