ఎన్ని కేసులు పెట్టినా జగనన్న వెంటే నడుస్తాం..
Breaking News
ఈ చేప భూకంపాలను అంచనా వేయగలదట..!
Published on Fri, 08/22/2025 - 16:43
ప్రకృతి విపత్తులను ఉపగ్రహాల సాయంతో ముందుగానే తెలుసుకుని ప్రజలను అలర్ట్ చేస్తుంటారు అధికారులు. వాతావరణ శాఖ కూడా ఎక్కడెక్కడ ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉందో తెలిపి అలర్ట్‌లు జారీ చేస్తుంది. అయితే దీన్ని ఓ సాధారణ చేప ముందుగానే గుర్తిస్తోందట. అందుకే దాన్ని ప్రళయానికి సంకేతంగా పిలుస్తుంటారట కూడా. ఇంతకీ అది ఏ చేప..?. దాని కథా దకమామీషు ఏంటో చూద్దామా..!.
ఆ చేప పేరే ఓర్‌ఫిష్(oarfish). దీన్ని "డూమ్స్‌డే ఫిష్" అని పిలుస్తుంటారు. ఎందుకంటే ప్రళయానికి సంకేతం అన్న భావనలో ఈ చేపకు ఆ పేరు వచ్చిందట. ఇది సిల్వర్ రంగులో మెరిసిపోతూ ఉంటుంది. సముద్రంలో 200 నుంచి దగ్గర దగ్గర వెయ్యి అడుగుల లోతుల్లో నివశిస్తుందట. చాలా నెమ్మదిగా కదులుతుంది. ప్రపంచంలోనే అతి పొడవైన ఎముకలతో కూడిన చేప కావడంతో అస్థి చేప అని కూడా పిలుస్తారు.
ఇది నీటిలో ఒక క్రమబద్ధతిలో వెళ్తుందట. అందుకే దీనికి ఓర్ అనే పేరొచ్చిందట. జపాన్ వాళ్లు దీన్ని సముద్ర దేవుడి దూతగా పేర్కొంటారట. ఈ ఓర్‌ఫిష్ గనుక సముద్ర ఉపరితలం వద్దకు వచ్చిందంటే రాబోయే భూకంపం, సునామీకి సంకేతం అట. అది నిజం అని చెప్పేలా 2010లో, 2011 భూకంప, సునామీ రావడానికి కొన్ని నెలల ముందు ఈ ఓర్‌ఫిష్‌లు సముద్రం ఒడ్డుకి కొట్టుకొచ్చాయట.
అంతేగాదు 2017లో ఫిలిప్పీన్స్‌లో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించే ముందు సముద్రంలో అనేక ఓర్‌ఫిష్‌లు కనిపించాయట. అయితే శాస్త్రవేత్తలు ఈ చేపను విపత్తులను ముందుగా గుర్తించగలదని కచ్చితంగా చెప్పలేమని చెబుతున్నారు. సముద్ర ఉష్ణోగ్రతల్లోని మార్పుల వల్లో లేక అనారోగ్యం కారణంగానో చనిపోయి ఇలా సముద్రం ఒడ్డున కనిపించి ఉండొచ్చని చెబుతున్నారు.
ఎందుకంటే ఇవి సాధారణంగా సముద్ర ఉపరితలంపై కనిపించనే కనిపించవు. సముద్రంలో అత్యంత లోతుల్లోనే ఇది నివశిస్తుందట. ఒక్కొసారి సంతానోత్పత్తికై కూడా ఉపరితలం వద్దకు వస్తుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మే 2025 నుంచి, భారతదేశం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కాలిఫోర్నియాలో ఈ ఓర్ ఫిష్ కనిపించాయట కూడా. ఇవి మానవులకు హానికరం కాదని చెబుతున్నారు.
ఈ చేపలు ప్లాంక్టన్, క్రిల్, చిన్న చేపలు, స్క్విడ్, జెల్లీ ఫిష్ వంటి వాటిని తిని జీవిస్తుందట. విచిత్రం ఏంటంటే దీన్ని ప్రళయానికి సంకేతం కాదని శాస్త్రవేత్తలు నొక్కి చెబుతున్నా..ఇంకా పలుచోట్ల ఈ చేప కనిపించగానే హడలిపోతారట. అది రుజువు చేసేలా విపత్తులు రావడం కూడా ఈ నమ్మకాలకు మరింత బలం చేకూరినట్లు అయ్యిందని నిపుణలు వాపోతున్నారు.
(చదవండి: అనాథశ్రమంలో పెరిగి ఐఏఎస్ అయ్యాడు..! ట్విస్ట్ ఏంటంటే..)
Tags : 1