అమెరికా నష్టపరిహారం చెల్లించాల్సిందే.. మీ ఇష్టం మళ్లీ యుద్ధమే!
Breaking News
సైకిల్... స్పీడ్‌గన్
Published on Sat, 04/11/2026 - 06:02
హైదరాబాద్‌లోని ఓల్డ్ బోయినపల్లి వాసి జి.వి.శ్రీనివాస్‌రెడ్డి ఐదేళ్లలో 52 వేల కిలోమీటర్లు సైకిల్ రైడ్ చేసి, 3 సూపర్ రాండోన్నూర్ టైటిల్స్ సాధించారు. 200 కిలోమీటర్లను కేవలం ఆరున్నర గంటలలో పూర్తి చేసి, ‘స్పీడ్‌గన్’ అని అభినందనలు అందుకున్నారు. సైకిల్ రైడింగ్ ద్వారా జీవనశైలిలో వచ్చిన మార్పులు, క్రమశిక్షణతో చేసిన సాధన, మెరుగైన జీవనవిధానానికి ఎలా చేరువ చేస్తుందో తన అనుభవాల ద్వారా పంచుకున్నారు..
‘‘2021 నుండి 2025 వరకు సైక్లింగ్ ప్రయాణం నాలో ఒక గొప్ప మార్పును తీసుకువచ్చింది. కోవిడ్ సమయంలో హాబీగా ప్రారంభమై, నెమ్మదిగా నా జీవనశైలిని మార్చింది. ప్రతిరోజూ మరికొన్ని అదనపు కిలోమీటర్లు రైడ్ చేయాలనే దృఢ సంకల్పాన్ని నాలో పెంచింది. వేళకు పని, నిద్ర, పోషకాహార విషయంలో క్రమశిక్షణను అలవాటు చేసింది. లక్ష్య సాధన పట్ల నిబద్ధతతో ఉండేలా చేయడమేకాదు బాడీని, మైండ్‌ను ఫిట్‌గా మార్చింది.
స్పీడ్‌గన్‌గా పిలుపు...
యూరోప్‌లో ఉండగా ఈ సైకిల్ రైడ్ నాకు పరిచయం అయ్యింది. నేనున్న సిటీలో అక్కడ ఎవరిని చూసినా సైకిల్‌మీదే ప్రయాణిస్తుంటారు. అక్కడ ఉన్నన్ని రోజులు మార్కెట్‌కి అయినా, ఆఫీస్‌కి అయినా సైకిల్‌పైనే వెళ్లేవాడిని. కోవిడ్‌కు ముందు హైదరాబాద్‌కి వచ్చేశాను. ఇక్కడి ట్రాఫిక్ చూశాక సైక్లింగ్ రూట్స్ సపరేట్‌గా లేకపోవడంతో ఇబ్బందిగా అనిపించింది. దీంతో జిమ్‌కి వెళ్లేవాడిని.
కోవిడ్ సమయంలో జిమ్‌లు మూతపడ్డాయి. అప్పుడు వాహనాలేవీ రోడ్లమీదకు వచ్చే వీలు లేదు. కానీ, సైక్లింగ్ చేస్తున్నవారిని పోలీసులు ఆపడం లేదు. దీంతో మళ్లీ నా సైకిల్ రైడ్ వైపు వచ్చేశాను. ప్రతిరోజూ 50–60 కిలోమీటర్లు సైకిల్‌పై జర్నీ చేసేవాడిని. ఆ సమయంలోనే సైక్లింగ్ క్లబ్‌లలో చేరాను. అలా, ముందు కాలనీల్లో మొదలైన ఈ రైడ్ తర్వాత రైడర్స్ క్లబ్‌లో చేరే వరకు వెళ్లింది.
ఫ్రెంచ్ ఆర్గనైజేషన్ కండక్ట్ చేసే సూపర్ రాండోన్నూర్ టైటిల్ వరుసగా మూడుసార్లు గెలుచుకున్నాను. దీంతో మరింత ఉత్సాహం పెరిగింది. ఈ రైడ్ నా శారీరక సామర్థ్యాన్ని మాత్రమే కాకుండా, మానసిక దృఢత్వాన్ని కూడా మెరుగుపరచింది. 200 కి.మీ దూరాన్ని కేవలం 6 గంటల 24 నిమిషాల్లో పూర్తి చేశాను. అంటే సగటున 31.2 కిలోమీటర్ల వేగంతో రైడ్ పూర్తి చేశాను. రైడ్‌లో నా వేగం చూసి స్నేహితులు, సహచరులు నన్ను ‘స్పీడ్ గన్’ అని పిలిచేవారు.
రైడ్‌లో ఎక్కువ శాతం ప్రకృతికి దగ్గరగా ఉండే ప్రాంతాలను ఎంచుకునేవాడిని. వాటిలో తెలంగాణలోని ఆదిలాబాద్ ఒకటి. ఆదిలాబాద్ చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో రాత్రుల్లోనూ రైడ్ కొనసాగించాను. ఇందుకు నాతోటి రైడ్ మిత్రులు కూడా తమ సహకారాన్ని అందించారు. ప్రకృతికి దగ్గరగా ఉన్న భావన ఆ సమయంలోనే ఎక్కువ పొందాను. అందమైన జలపాతాలు, లోయలు, శిఖరాలు, సన్నని రోడ్డు మార్గాలు, హైవేలు.. అన్నీ సైకిల్ రైడ్ ద్వారానే వీక్షించాను.
విదేశాలలో పొల్యూషన్ ఫ్రీ, పర్యావరణ పరిరక్షణకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మన దేశంలో పర్యావరణ పరిరక్షణకు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. కాలుష్య నివారణకు సైకిల్ రైడ్స్ చాలా హెల్ప్ అవుతాయి. శరీరం ఫిట్‌గా ఉండటానికీ ఇది మంచి అలవాటు. ఈ విషయాన్ని నలుగురికి తెలియజెప్పాలనే ఈ రైడ్‌లో పాల్గొంటుంటాను. ఇప్పటికి 52 వేల కిలోమీటర్లకు పైగా రీచ్ అయ్యాను. మరిన్ని థీమ్ బేస్డ్ రైడ్స్ హెల్త్ అండ్ ఎన్విరాన్‌మెంట్ అవేర్‌నెస్ క్యాంపెయిన్స్ చేయాలనుకుంటున్నాను.
సహ జీవిత భాగస్వామ్యం...
ఈ సైకిల్ రైడ్ అభిరుచిలో నన్ను నేను మలుచుకోవడానికి నా భార్య ప్రతిమ చాలా సహకరించింది. ‘రైడ్‌కు వెళుతున్నాను’ అని చెప్పగానే నాకు ఏమేం అవసరమో అన్నీ సరమకూర్చేది. తెల్లవారుజామున లేచి, నేను తీసుకోవాల్సిన ఫుడ్‌తో పాటు, అన్ని ఏర్పాట్లు చూసుకునేది. తిరిగి నేను సురక్షితంగా వచ్చేవరకు ఎదురు చూసేది. ముఖ్యంగా రాత్రి రైడ్స్ సమయంలో హైవేలు, అడవులు, తెలియని మార్గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఫోన్ నెట్‌వర్క్ కూడా అందుబాటులో ఉండేది కాదు. నా అభిరుచికి ఆమెను టెన్షన్ పెట్టక తప్పేది కాదు. ఆమె అండ లేకపోతే నా ఈ ప్రయాణం విజయవంతం అయ్యేది కాదు. నా ఈ విజయంలో నా స్నేహితులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతో ఉంది. ఇది కేవలం రోడ్డు మార్గంలో చేసే సైకిల్ ప్రయాణం కాదు, నా ఆరోగ్యాన్ని, సమర్థతను, పట్టుదలను పెంచిన జర్నీ కూడా’’ అని వివరించారు ఈ రైడర్.
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Tags : 1