సిగ్గుండాలి.. నీ కార్యకర్తకే న్యాయం చేయలేవా..? లాకప్ డెత్ కేసు పై మంద కృష్ణ మాదిగ
Breaking News
నోటి మాటతో బ్రెయిలీ అక్షరమాల
Published on Thu, 09/17/2026 - 14:34
స్ఫూర్తి పొందడానికి క్షణం చాలు...ఆ క్షణమే చాలు గొప్ప మార్పునకు నాంది పలకడానికి... అని చెప్పేందుకు చక్కని ఉదాహరణ ఈ సంఘటన. పాఠశాలకు వెళ్లిన ఓ యువతికి బ్రెయిలీ లిపి రాసేందుకు ఇబ్బంది పడుతున్న ఓ విద్యార్థిని కనిపించింది. ‘ఇలా కాకుండా సులభంగా రాయలేమా’ అన్న ఆలోచన కలిగింది. ఆ ఆలోచననే సవాలుగా తీసుకుని పరిశోధనల దిశగా ప్రయత్నించింది. ఆ ప్రయత్నమే కొత్త ఆవిష్కరణకు నాంది పలికింది. ఆ ఆవిష్కరణకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన లింగంపల్లి హిమజ శ్రీ విష్ణు ఇంజినీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చదువుతోంది. కాలేజీలో మామూలుగా నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా హిమజ దృష్టిలోపం ఉన్న విద్యార్థుల పాఠశాలకు వెళ్లింది. అక్కడ స్లేట్ పిన్‌తో కాగితాన్ని ఒక్కో చుక్కగా గుచ్చుతూ బ్రెయిలీ రాస్తున్న ఓ బాలిక హిమజ దృష్టిలో పడింది.‘ బ్రెయిలీని ఇంతకంటే సులభంగా రాయలేమా?’ అని హిమజ ఆలోచించింది.
వాయిస్ ప్రింటర్ ‘రుద్ర’ తయారీ
కార్యక్రమం ముగిశాక హిమజ మనసులో మెదిలిన ‘బ్రెయిలీని సులభంగా రాయలేమా’ అన్న ఆలోచనే... ఆమెకు బ్రెయిలీ ప్రింటర్‌ను తయారు చేసేందుకు స్ఫూర్తినిచ్చింది. మొదట ఆరు బటన్లతో బ్రెయిలీ ప్రింటర్‌ను తయారు చేసింది. అయితే టెస్టింగ్ సమయంలో ఓ విద్యార్థిని వేసిన ప్రశ్న హిమజ ఆలోచననే పూర్తిగా మార్చివేసింది.
‘అక్కా మన మెందుకు బటన్స్ ఉపయోగించాలి..? నోటి మాట చాలదా?’ అని విద్యార్థిని వేసిన ప్రశ్న హిమజలో ఆలోచన నింపింది. వాయిస్ కమాండ్ తో పనిచేసే బ్రెయిలీ లిపి ప్రింటర్ ఫోటో టైప్‌ను హిమజ తయారు చేసింది. ఈ పరికరానికి ఆమె ‘రుద్ర’అనే నామకరణం చేసింది.
‘రుద్ర’ పనితీరు ఇలా...
‘రుద్ర’తో మాట్లాడితే ఆ మాటల్ని అలెక్సా టెక్ట్స్‌గా మారుస్తుంది. ఆ సమాచారాన్ని రాస్‌బెర్రీ పై అనే మరో డివైజస్ బ్రెయిలీ నమూనాగా మార్చుతుంది. ఆ తర్వాత యంత్రం కాగితంపై అవసరమైన చుక్కలను ప్రెస్ చేసి అక్షరాలను రూపొందిస్తుంది. అంటే చేతితో ఒక్కో చుక్కని గుర్తించి రాయాల్సిన అవసరం లేకుండానే... మాట్లాడితే చాలు– బ్రెయిలీ ప్రింట్ అవుతుందన్నమాట.
అంతర్జాతీయ గుర్తింపు
హిమజ ఆవిష్కరణకు దేశవ్యాప్తంగా మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు లభించింది. అంతర్జాతీయ డిజైన్ ఇంజినీరింగ్ కాంపిటిషన్ అయిన ‘జేమ్స్ డైసన్ అవార్డుకు భారతదేశం నుంచి హిమజ ఆవిష్కరణ ఎంపికైంది. ఇందుకు గాను రూ.6 లక్షల నగదు బహుమతి లభించింది.
వాస్తవానికి బ్రెయిలీ ప్రింటర్లు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నప్పటికీ వాయిస్ కమాండ్‌తో పని చేసే హిమజ ఆవిష్కరణ అందుకు భిన్నంగా నిలిచింది. రుద్ర పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే బ్రెయిలీ లిపి ప్రింటింగ్ ఇప్పుడు మరింత సులభతరం కానుంది.
ఇదీ చదవండి: సాధారణ ఫుడ్ డెలివరీ కాస్తా..ఫ్లైట్‌లో ఇంటికి వెళ్లేలా..!)
Tags : 1