Breaking News

ఊరే ప్రేరణ

Published on Thu, 04/17/2025 - 04:29

ఒక బొమ్మలో మాతృత్వం 
మరో బొమ్మలో పెళ్లి ఆనందం 
ఇంకో బొమ్మలో రైతు శ్రమ 
ఓ చిత్రంలో అందమైన బాల్యం 
మొత్తంగా ఈ గ్యాలరీ అంతా... 
అచ్చమైన పల్లెసీమకు చిత్రరూపం.

తల్లి ఆవును ముద్దాడుతున్న లేగదూడ, పాలు తాగుతున్న లేగదూడ తోకను మురిపెంగా ముద్దాడుతున్న గోమాత, గిర్రున తిరుగుతున్న చక్రం మీదున్న మట్టికి పాత్ర రూపమిస్తున్న కుమ్మరి, పెళ్లి పందిట్లోకి అరటి గెలను భుజాన మోసుకొస్తున్న రైతు, రెండు జడలు వేసుకుని రిబ్బన్లను పువ్వుల్లా ముడి వేసుకున్న బాలికల ముఖాల్లో విరిసిన ఆనంద విరులు, తోటలో పూలబుట్ట మోస్తున్న శ్రామికురాలి ముఖంలో పరిమళిస్తున్న సంతోషాల తావి... ఇవన్నీ అంబిక ఆర్ట్‌ గ్యాలరీ కొలువుదీరిన అందమైన చిత్రాలు. ఇక... తలమీద నీరు తాగేసిన ఖాళీ కొబ్బరి బోండాలను తట్టలో నింపుకుని తలమీద మోస్తున్న మహిళ ముఖంలో మాతృత్వపు మధురిమకు మరేదీ సాటిరాదు.

 పై చిత్రాలన్నీ ఒక ఎత్తయితే ఇదొక్కటే ఒక ఎత్తు. చంటి బిడ్డను చంకలో కట్టుకుని, పెద్ద బిడ్డను చేయి పట్టి నడిపించుకు వెళ్తున్న మహిళ ముఖంలో తల మీద మోస్తున్న బరువు కంటే కంటిపాపల్లాంటి ఇద్దరు బిడ్డల మాతృత్వపు సంతృప్తి నిండిన దరహాసం ప్రస్ఫుటమవుతోంది. ఇక రైతు కష్టాన్ని కళ్లకు కడుతూ వీక్షకుల మనసును ద్రవింపచేస్తున్న చిత్రం ఒకటుంది. ట్రాక్టర్‌ ట్రక్కులో ఎర్రగా నవనవలాడుతున్న మిరపకాయల మీద పడుకుని సేదదీరుతూ ఠీవిగా కాలు మీద కాలు వేసుకున్న రైతు చిత్రం అది. 

మిరపకాయల ఘాటును లెక్కచేయకుండా తాను పండించిన పంట మీద సాధికారత, ప్రేమ అంతకు మించిన ధీమా రైతు ముఖంలో వ్యక్తమవుతున్నాయి. అంబిక మనసులో అనంతంగా పరిభ్రమిస్తున్న ఆలోచనలకు ఆమె చేతిలో ఉన్న కుంచె ఇచ్చిన రూపాలివన్నీ. స్కూల్‌ రోజుల్లో భయభయంగా పెన్సిల్‌ పట్టుకున్న అంబిక ఇప్పుడు చిత్రకళా ప్రదర్శనల్లో తన మార్కు ప్రదర్శిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఇండియా ఆర్ట్‌ ఫెస్టివల్‌లో అంబిక తన చిత్రాలను ప్రదర్శించారు. ఆ సందర్భంగా ఆమె సాక్షితో పంచుకున్న అనుభవాలివి. 

దార్శనికులు లేరు! 
అంబిక... ఏలూరులో పుట్టి పెరిగారు. స్కూల్లో బయాలజీ రికార్డు బొమ్మలు కజిన్స్‌ని బతిమాలి ఎప్పటికప్పుడు ఎలాగో గట్టెక్కుతూ వచ్చారు. ఒకసారి కజిన్స్‌ ఎవరికీ అంబికకు బొమ్మ వేసిచ్చేటంత ఖాళీ లేదు. ఇక తప్పదని ధైర్యం చేశారు. బొమ్మ బాగా వచ్చింది. తన మీద తనకు నమ్మకం కలిగిన క్షణాలవి. ఆ తర్వాత టెక్ట్స్‌ బుక్స్‌లో బొమ్మలను యథాతథంగా వేయడంతోపాటు గ్రీటింగ్‌ కార్డుల కోసం పువ్వులు, పక్షుల బొమ్మలు వేశారు. లెక్కకు మించిన బొమ్మలు వేశారు, కానీ చిత్రకారిణిగా ఎదగడానికి అవసరమైన శిక్షణ ఎక్కడ దొరుకుతుందో, ఎలా ముందుకెళ్లాలో కూడా తెలియదు. 

బొమ్మలో భావం పలికింది
ఎమ్మెస్సీ తర్వాత పెళ్లి, ముంబయికి వెళ్లడం, ఆ తర్వాత ఏడాదికే బెంగళూరుకు బదిలీ. బెంగళూరు ఆమె చేతిలో కలర్‌ పాలెట్‌ అనే చెప్పాలి. అక్కడి చిత్రకళా పరిషత్‌లో ఏడాది కోర్సు చేసి, ముఖ కవళికలు, ముఖంలో భావాలు పలికించడం నేర్చుకున్నారు. హ్యూమన్‌ అనాటమీ కొలతల వంటి మెళకువలు పట్టుపడ్డాయి. అప్పటి నుంచి ఆ కుంచెకు విరామం లేదు. బొమ్మను అలాగే రిప్లికా వేస్తున్న దశ నుంచి సొంత థీమ్‌తో బొమ్మలు వేయడం 2018లో మొదలు పెట్టారు. హైదరాబాద్, బెంగళూరుల్లో డజను ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆమె అత్తగారి ఊరు గుళ్లపూడిలో సొంత ఆర్ట్‌ స్టూడియో, గ్యాలరీ ఏర్పాటు చేసుకున్నారు. ఆమె చిత్రాలకు విదేశీ చిత్రకారుల నుంచి ప్రశంసలు వచ్చాయి. సింగపూర్, దుబాయ్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌లలో పాల్గొనడానికి ఆహా్వనాలు వస్తున్నాయి. 

పల్లెటూరి చిత్రాలు 
నా చిత్రాల్లో గ్రామీణ జీవనం కనిపించడానికి కారణం మా సొంతూరు రాజమండ్రి దగ్గర వానపల్లి. నేను పెరిగింది పట్టణంలోనే. ఇంటర్‌ సెలవుల్లో ఒకసారి నాన్నగారు నన్ను ఊరికి తీసుకెళ్లారు. రాజమండ్రి ప్రకృతి సౌందర్యం నా మనోఫలకం మీద ముద్రించుకు పోయింది. నా బొమ్మలు కోనసీమ జీవితాలను కళ్లకు కడుతుంటాయి. నన్ను ‘నారీ కళామహోత్సవ్‌ పురస్కారం’ పురస్కారానికి ఎంపిక చేసింది మా ఊరి ప్రకృతి, గ్రామాల్లోని శ్రమ జీవన సౌందర్యమే. ఇప్పుడు హైదరాబాద్‌లో 250 మంది చిత్రకారులు వేసిన మూడు వేల చిత్రాల ప్రదర్శనలో నా చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు దక్కడానికి కారణమూ స్వచ్ఛత నిండిన అచ్చమైన జీవితాలకు చిత్రరూపమివ్వడమే. 
– అంబిక ఊరకరణం, చిత్రకారిణి  

 

– వాకా మంజులారెడ్డి 
సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)