తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా
Breaking News
Health Tips: ఎసిడిటీ బాధలు వేధిస్తున్నాయా? వాము, ధనియాలు, తేనె.. ఇంకా..
Published on Mon, 10/18/2021 - 11:43
ఎసిడిటీ సమస్య ఈ రోజుల్లో సాధారణమైపోయింది. అందుకు ప్రస్తుత జీవనశైలి ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎసిడిటీ వల్ల తరచుగా గుండె, కడుపు, గొంతులో మంట వంటి సమస్యలు సంభవిస్తాయి. ఒక్కోసారి తీవ్ర ఆనారోగ్యానికి కారణమౌతుంది. సమయానికి తినడం, బాగా నమలడం, భోజనం తర్వాత కనీసం అరగంట పాటు నిటారుగా కూర్చోవడం వంటి చిన్నపాటి అలవాట్లు ఆచరించడం ద్వారా దీని నుంచి బయటపడవచ్చు. అలాగే వంటగదిలో దొరికే కొన్ని పధార్ధాల ద్వారా ఎసిడిటీని నియంత్రించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..
వాము గింజలు
వాములో బయోకెమికల్ థైమోల్ అనే క్రియాశీలక పధార్థం గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించి, మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. స్పూన్ వాములో చిటికెడు ఉప్పు కలిపి తింటే తక్షణ ఉపశమనం ఉంటుంది. గ్లాస్ నీళ్లలో టీ స్పూన్ వాము కలిపి, ఒక గంట నినబెట్టి, రాత్రి నిద్రపోయే ముందు తాగినా ఫలితముంటుంది.
సోంపు గింజలు
భోజనం తర్వాత చిటికెడు సోపు గింజలు తీసుకోవడం పూర్వకాలం నుంచే సంప్రదాయంగా ఉంది. ఇది నోటి దుర్వాసన పోగొట్టడమేకాకుండా, మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. పిల్లల్లో తరచూ వచ్చే కడుపునొప్పి ఉపశమనానికి సోంపు, పటిక బెల్లం (రాక్ షుగర్) మిశ్రమం బాగా పనిచేస్తుంది. సోంపు గింజలతో చేసిన టీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
పాలు, పెరుగు
పుల్లని త్రేన్పులకు చక్కటి విరుగుడు పాలు. గోరు వెచ్చని లేదా చల్లని పాలు ఎసిడిటీకి తక్షణ ఉపశమనాన్నిస్తాయి. పాలు సహజ యాంటాసిడ్‌లా పనిచేస్తుంది. పాలల్లో కాల్షియం లవణాలు అధికంగా ఉండటం వల్ల యాసిడ్‌ను వెంటనే తటస్థీకరిస్తుంది. ఎసిడిటీని నియంత్రించడానికి పెరుగు మరొక మార్గం. దీనిలో కాల్షియంతో పాటు, సహజమైన ప్రోబయోటిక్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియను అందిస్తుంది.
తేనె
గ్లాస్ నీళ్లలో టీస్పూన్ తేనె కలిపి తాగినా ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ మిశ్రమానికి కొంచెం నిమ్మరసం కలిపి తాగితే కడుపులో పుల్లని త్రేన్పులకు కారణయ్యే ఆమ్లాలను తలస్థీకరిస్తుంది.
కొత్తమీర లేదా ధనియాలు
కొత్తమీర విత్తనాల (ధనియాలు) పొడి లేదా కొత్తిమీర ఆకులు ఏ విధంగా తీసుకున్నా ఎసిడిటీని తగ్గిస్తుంది. 10 మీ.లీ కొత్తిమీర రసాన్ని, నీళ్లలో కానీ మజ్జిగలోగానీ కలిపి తాగితే వెంటనే ఉపశమనం పొందవచ్చు. కొత్తిమీర ఆకులతో తయారుచేసిన టీ కూడా తాగవచ్చు. కడుపు ఉబ్బరాన్ని నివరించడమేకాకుండా వాంతులు, విరేచనాల నియంత్రణకు చక్కగా పనిచేస్తుంది.
తాజా పండ్లు
సిట్రస్ పండ్లతో సహా అన్ని రకాల తాజా పండ్లు జీర్ణక్రియ మెరుగుపరచడమేకాకుండా, ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఫైబర్‌ను కూడా అందిస్తాయి. రోజూ రెండు తాజా పండ్లను తీసుకోవడం వల్ల ఎసిడిటీని నియంత్రించవచ్చు.
చదవండి: ఎడమచేతివాటం వారు ఈ విషయాల్లో నిష్ణాతులట.. మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు..!
Tags : 1