Breaking News

'ఆవిరి..' - ప్రాచీన్‌ కారు కొన్నప్పటి నుంచి..

Published on Sun, 07/19/2026 - 08:33

ప్రాచీన్‌ కారు కొన్నప్పటి నుంచి గమ్యం దృష్టిలో ఉంచుకొని అటు వైపు డ్రైవ్‌ చేస్తూంటాడు. ఆ మధ్యాహ్నం మాత్రం అతను కారుని గమ్యం లేకుండా డ్రైవ్‌ చేస్తున్నాడు. అతను కారెక్కి అరగంట దాటుతోంది. ట్రాఫిక్‌ పల్చగా ఉంది. ఎండ వల్ల హైద్రాబాద్‌ రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయని ప్రాచీన్‌ గుర్తించాడు. ఎన్నడూ లేనంతగా మండుటెండలు కాస్తున్న ఆ వేసవిలో ఆ రోజు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని బయలుదేరేముందు టీవీలో చదివిన స్క్రోల్‌ గుర్తొచ్చింది. కారులో ఏసీ ఆన్‌ లో ఉన్నా, అది సౌకర్యంగా చల్లబరచలేకపోతోంది.

ప్రాచీన్‌ వయసు ముప్ఫై మూడు. అతనికి పెళ్ళై రెండేళ్ళైంది. అతని ఆ ప్రయాణానికి కారణం, అతని భార్య. పెళ్ళయ్యాక మొదటిసారి వారి మధ్య తీవ్రమైన పోట్లాట జరిగింది. అతనికి ఆ తర్వాత ఇంట్లో ఉండటం ఇష్టంలేక బయటికి వచ్చి, రోడ్‌ మీద పార్క్‌ చేసిన కారెక్కి డ్రైవ్‌కి బయలుదేరాడు.

తన తప్పు ఉందా అని అతను జరిగినది ఓసారి నెమరువేసుకున్నాడు.
వేసవి సెలవులకి అతని అక్కయ్య, ముగ్గురు పిల్లలు హైద్రాబాద్‌లోని అతని ఇంటికి వచ్చారు. అందరితో కలిసి ఉండాలని ప్రాచీన్‌ తల్లిదండ్రులు కూడా పల్లెటూరి నుంచి అతని ఇంటికి వచ్చారు. జనగామ దగ్గర ఉన్న వారి చిన్న ఊరు ఇప్పుడు పల్లెటూరు కాదు. జనాభా పెరిగినా దాన్ని వాళ్ళు పల్లెటూరు అనే పిలుస్తారు.
ఇంట్లో పెంపుడు కుక్కతో కలిపి తొమ్మిదిమందిని చూసుకునే బాధ్యత ప్రాచీన్‌ భార్య మీద పడింది. వాళ్ళు వచ్చి రెండు వారాలు దాటుతోంది. ప్రాచీన్‌ భార్య అందరికీ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, సాయంత్రం టిఫిన్, రాత్రి భోజనం వండుతోంది.

ప్రాచీన్‌ అక్కకి కంటికి ఆపరేషన్‌ అవడంతో కొంతకాలం పొయ్యి దగ్గరికి వెళ్ళకూడదన్న కంటి డాక్టర్‌ సలహా వల్ల ఆవిడ అసలు వంటగదిలోకి వెళ్ళదు. ప్రాచీన్‌ తల్లికి అనారోగ్యం. ఆవిడ కూర్చున్న చోటు నుంచి కదలదు. మనవళ్ళతో కాలక్షేపం చేస్తుంది.  
ప్రాచీన్‌ భార్యకి వంటతో పాటు అందరి విడిచిన బట్టలు వాషింగ్‌ మెషిన్‌ లో వేసి ఉతకటం, ఆరేయడం, ఆరాక మడతలు పెట్టడం అదనపు బాధ్యత.

తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చిన పనిమనిషి అదే సమయంలో సొంత ఊరికి వెళ్ళింది. సంతకం చేస్తే కాని ప్రభుత్వ ఉచితాలు రావు కాబట్టి తరచూ ఆమె తన ఊరు వెళ్ళి సంతకం చేసి వస్తూంటుంది. వెళ్ళినప్పుడల్లా రెండు, మూడు రోజుల్లో వచ్చేస్తుంది. కాని ఈసారి హైద్రాబాద్‌ ఎండలకి జడిసో, లేదా అంతమంది చుట్టాల వల్ల పని పెరగటం వల్లో వారమైనా తిరిగి రాలేదు. దాంతో ఇల్లు, పాత్రలు శుభ్రంచేసే పని కూడా ప్రాచీన్‌ భార్య చేయాల్సి వస్తోంది. పైగా కుక్కని వాకింగ్‌కి తీసుకెళ్లాలి. 
ప్రాచీన్‌ దంపతుల మధ్య ఆరోజు పోట్లాట చినుకుల్లా మొదలై తుఫానులా పరిణమించింది. అతిథులంతా సాలార్‌జంగ్‌ మ్యూజియం చూడటానికి వెళ్ళారు.

కూరలు కొని తెచ్చి అతను తన భార్యతో చెప్పాడు.
‘‘మా అక్కయ్యకి పాఠోళీ ఇష్టం. బీన్స్‌ తెచ్చాను. అది చెయ్యి.’’
‘‘బంగాళదుంపల కూర చేస్తాను.’’ అతని భార్య చిరాగ్గా చెప్పింది.
‘‘నేను చెప్పింది చేయొచ్చుగా?’’ భార్య చిరాకుని గమనించని ప్రాచీన్‌ చెప్పాడు.
‘‘బీన్స్‌ని వలవాలి. కిలో బీన్స్‌ వలవటానికి చాలా టైం పడుతుంది. బంగాళదుంపల కూర తేలిగ్గా వండొచ్చు.’’

ప్రాచీన్‌ కి ఆడవారి కష్టం, ముఖ్యంగా ఇంటికి అతిథులు వచ్చాక భార్య పడే కష్టం తెలీదు. దాంతో అడిగాడు.
‘‘వాళ్ళు ఇంకో రెండు రోజుల్లో వెళ్ళిపోతున్నారు. నేను అడిగిన ఈ ఒక్కటి చేయొచ్చుగా?’’
వారి మధ్య మాటల యుద్ధం జరిగింది. తనవాళ్ళు రావడం తన భార్యకి ఇష్టం లేదని ప్రాచీన్‌ కి అనిపించింది.
‘‘అదేం కాదు. నేను అంతమందికి చాకిరీ చేసి డస్సిపోయాను.’’ ప్రాచీన్‌ భార్య చెప్పింది.
మాటా మాటా పెరిగింది. ప్రాచీన్‌ బయటకి వచ్చి కారెక్కి డ్రైవ్‌కి బయలుదేరాడు.
గరగర చప్పుడుకి ఆలోచనల్లోంచి బయటపడ్డాడు. కారు ఆగిపోయింది. అతను మళ్ళీ స్టార్ట్‌ చేసే ప్రయత్నం చేశాడు. కాని అది స్టార్ట్‌ కాలేదు. కొంత మెకానిజం తెలుసు కాబట్టి అతను కారు దిగి వెళ్ళి బానెట్‌ తలుపు ఎత్తి చూశాడు. వెచ్చగా తెల్లటి ఆవిరి బయటికి వచ్చింది. ఇంజిన్‌ వేడెక్కిందని గ్రహించాడు.

కూలెంట్‌ ఉన్నా, బయటి అసాధారణ వేడికి, పైగా ఏసీ కూడా ఫుల్‌ కెపాసిటీలో ఆన్‌ లో ఉండడంతో ఇంజిన్‌ వేడెక్కిందని అర్థమయ్యాక అతను ఇంజిన్‌ వంక కొద్దిసేపు చూశాడు. అతనిలో కొత్త అవగాహన కలిగింది.
ఎన్నడూ తనతో పోట్లాడని తన భార్య అంతగా ఎందుకు పోట్లాడిందో అతనికి ఇంజన్‌ నుంచి వెలువడే ఆవిరిని చూస్తూంటే అర్థమైంది.

గత రెండు వారాలుగా శక్తికి మించి చేస్తున్న పనివల్ల కలిగిన అలసటతో ఆమె నోట్లోంచి ఆ మాటలు వచ్చాయి తప్ప, తనవాళ్ళు రావటం ఇష్టంలేక కాదని అతనికి స్ఫురించింది. అతనిలో ఏదో ఆవిరై పోయిన భావన కలిగింది.
అతను జేబులోంచి మొబైల్‌ ఫోన్‌ తీసి తన భార్యకి ఫోన్‌ చేసి చెప్పసాగాడు.
‘‘సారీ... నిన్ను అపార్థం చేసుకున్నందుకు వెరీ సారీ... వస్తున్నాను.’’
- మల్లాది వెంకట కృష్ణమూర్తి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)