Breaking News

ముత్యాలూ సజ్జలూ

Published on Mon, 02/23/2026 - 01:01

అమ్మ పాలేరుకు అన్నం పెడుతుంది. కూర పెడుతుంది. అంత పచ్చడి కూడా! తిన్నంత తింటే విసుక్కోకుండా పెడుతుంది. కాని మజ్జిగ మాత్రం పోయదు. అప్పుడే హైస్కూ లుకు వచ్చిన కొడుకు ‘ఎందుకమ్మా మజ్జిగ పోయవు’ అంటే జవాబు చెప్పదు. పాలేరు ఇంట్లోకి రాకూడదు. బయటే కూచోవాలి. తినాలి. వెళ్లిపోవాలి – మజ్జిగ ముఖం చూడకుండా! ఇంట్లో కుండ నిండా మజ్జిగే! అమ్మ ఇరుగూ పొరుగుకు ఇస్తుంది. ఎండనబడి వచ్చిన వాళ్లకు ఇస్తుంది. పాలేరుకు తప్ప. అప్పటికి పాలేరు కులం ఏమిటో మూలం ఏమిటో కొడుకుకు తెలియదు. ‘ఎందుకమ్మా మజ్జిగ పోయవు?’... ‘పోయకూడదు నాయనా... పోస్తే వెన్నలో పురుగులు పడతాయి’. పాలేరుకు మజ్జిగ పోస్తే వెన్నలో పురుగులు పడతాయా? చూద్దాం అని అమ్మ లేనప్పుడు పాలేరు బెదిరిపోతున్నా కొడుకు అతని కంచెంలో మజ్జిగ వొంపేశాడు. మరికొన్ని రోజులకు అమ్మ వెన్న కాచి నెయ్యి చేస్తోంది. కొడుకు తొంగి తొంగి చూస్తున్నాడు. ’ఏమిట్రా?’... ‘పురుగులేమైనా పట్టా యేమోనని’... పకపకా నవ్వాడు.

ఒక పిల్లాడిది అడవి దాపు పల్లె. స్కూలుకు చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తాడు. రెండు చేతులు, రెండు కాళ్లు... పుస్తకాలున్నాయా... లేవు... నోట్‌బుక్కులు... అయ్యబాబోయ్‌. అయ్యవారు దయదలిచి పాతవేవో సంపాదించి ఇస్తారు. నోట్‌ బుక్కులు మాత్రం కొనుక్కోవాల్సిందే! పిల్లాడి దగ్గర అడవి ఉంది తప్ప డబ్బులు లేవు. ప్రతి సంవత్సరం బడి తెరిచాక నోటు బుక్కుల కోసం ఆ పిల్లాడు ఒకటే పని చేస్తాడు. రోజూ అడవికి వెళ్లి రేగుపండ్లు కోసి సంచీ నిండా వేసుకొని వస్తాడు. స్కూల్లో ఆ రేగు పండ్లకు మారుబేరం పెడతాడు. గుప్పెడు రేగుపండ్లు ఇస్తే పిల్లలు తమ నోటు బుక్కులో సెంటర్‌ పిన్ను దగ్గర ఒక టావు తీసి ఇవ్వాలి. రేగుపండ్లు ఖాళీ అయ్యే కొద్దీ టావులు పోగవుతాయి. ఇంకేమిటి? రేగుపండ్ల నోట్‌బుక్‌ తయార్‌!

కానుకలు అందరూ ఇస్తారు. పుచ్చుకుంటారు. కాని కొన్ని కానుకలు జీవితాంతం వెంటాడుతాయి. ఆ టీచరు పాఠాలు చెప్తుంటే ఒక ముసలామె మనవణ్ణి చేత్తో పట్టుకుని వచ్చి బడిలో వదిలింది. ‘ఈ ముసలి ప్రాణం తప్ప వీడికి ఎవరూ లేరు టీచరమ్మా! నాలుగు అక్షరాలు నేర్పించు’... ఆ టీచరు పిల్లాడిని దగ్గరగా పొదువుకుంది. తల నిమిరింది. పాఠాలు ఏం చెప్పిందో కాని తన బాక్స్‌లోని నాలుగు మెతుకులు పెట్టింది. ఆకు కూరలమ్మే ముసలామె తన మనవడికి టీచరమ్మ దొరికినందుకు ఎంతో సంతోషపడింది. మనవడు మాత్రం సిగ్గుతో ఎక్కువ మాట్లాడేవాడు కాదు. అప్పుడు ‘టీచర్స్‌ డే’ వచ్చింది. స్కూల్లో అందరూ టీచరమ్మకు గ్రీటింగ్‌ కార్డులు, ఆపిల్స్, గులాబీ పూలు ఇస్తున్నారు. అందరూ వెళ్లిపోయాక ఆ పిల్లాడు ఒక్కడే మిగిలాడు. ఏదో కానుక తెచ్చినట్టే ఉన్నాడు. ‘ఏంట్రా అది?.. ఇవ్వు’... చాలా బిడియపడుతూ వీపు వెనుక ఉన్న చేతిని ముందుకు సాచాడు. ఆకుకూర! వాడి చిట్టిచేతిలో జీవస్పందన వంటి పచ్చటి ఆకుకూర గుచ్ఛం!

జీవితాల్లో గాలికిపోయే ఊకలాంటి ఘటనలు ఎన్నో జరుగుతాయి. కొన్ని ఇలా స్వాతిచినుకుల్లా రాలి, కుదురును కదిలించి, ముత్యాలుగా మారతాయి. వాటిని సాహిత్యంగా చేసినప్పుడు మిలమిలమని మెరుస్తూ వేల చేతులు మారి అదే అనుభూతితో తాకుతాయి. ‘నేను రాసింది ఏ.ఐ.కి ఫీడ్‌ చేస్తాను. అది వెంటనే అర్థం చేసుకొని విడమ ర్చిందంటే రాసింది సాహిత్యం కాదని చించేస్తాను’ అన్నాడు రచయిత గురుచరణ్‌దాస్‌. సరళరేఖలు, తెలిసిన గీతలు టక్కున తెలిసిపోతాయి. ఏ.ఐ.కి చిటికెలో పని. కాని సాహిత్యం సరళం కాదు... ఉపరితలమూ కాదు. అది స్పందనల పరావర్తనలు పడే పెరడు. భావోద్వేగాలు నర్తించే ఎరీనా. తుది ఘట్టాన సాక్షాత్కారాలను ఒసగే యుద్ధ క్షేత్రం. సాహిత్యం మనిషికొక అర్థం... మనసుకొక తాత్పర్యం. అంతేతప్ప ఏ.ఐ. చెప్పే మూసకట్టు చిలకజోస్యం కాదు.

రాసినదంతా ఏ.ఐ. దగ్గర ఉంది! రాయవలసినదంతా మనిషి వద్ద ఉంది!! మనిషి రాయకపోతే ఏం చేసినాగాని ఏ.ఐ. పైన చెప్పిన మూడు ఘటనలను సృష్టించలేదు. అవి మనిషికే తెలుసు. మనిషి చెయ్యే వాటిని రాయాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ.ఐ. మీద చర్చ జరుగుతోంది. రచన, ప్రచురణల్లో ఏ.ఐ. పాత్ర ఏమిటనేది శోధనగా ఉంది. ఏ సాంకేతికతైనా సృజనకు సాయం మాత్రమే! అదే సృజన కాబోదు. రచయితలు  జీవన పేటికల మీటలు నొక్కినంత కాలం ముత్యాలకు కొదవలేదు. సజ్జలతో సరిపెడదామను కుంటే ఏ.ఐ. ఉంది పదండి!! 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)