Breaking News

నానాకాలం చదువులు

Published on Mon, 06/30/2025 - 00:40

‘వానాకాలం చదువు’లంటారు. ఇప్పటికీ దేశంలో చాలాచోట్ల వానకీ, చదువుకీ చుక్కెదురే. చెట్ల కిందో, అరుగుల మీదో, అంతంతమాత్రపు కప్పు కిందో బడులు నడిపేటప్పుడు; చక్కా నడిచి పోడానికి పక్కారోడ్లు లేనప్పుడు వానాకాలంలో చదువుకు గంట కొట్టి ఇంటికి పరిమితమవక తప్పదు. వెనకటి కాలంలో చదువు చెప్పే రోజులతో సమానంగా నిషేధించే రోజులూ ఉండేవి. 


అష్టమి, నవమి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి మొదలైన తిథుల్లో, గ్రహణం పట్టినప్పుడూ అధ్యయనం కూడదు. వాటిని ‘అనధ్యయన దినా’లనేవారు. వేదాలు, ఇతర రహస్య విద్యల వల్లింపైతే వర్షాకాలంలో పూర్తిగా నిషిద్ధం. నేర్చుకున్నది మాత్రం నెమరు వేసుకోవచ్చు. 

క్రమంగా కేలండర్‌ మారిపోయి వర్షర్తువూ, చదువుల ఋతువూ ఒకేసారి మొదలవడం ప్రారంభించాయి. మినహాయింపులున్నా ఆ రెంటి మధ్యా  వైరుద్ధ్యం పోయి సయోధ్య వెల్లివిరుస్తోంది. వానలతో పచ్చదనాన్ని తెచ్చుకుని కొత్త ఉత్సాహాన్ని నింపుకొనే ప్రకృతితో చదువుల ఋతువు పోటీపడుతూ రహదారులనూ, బడితావులనూ పిల్లల సందడితో వర్ణరంజితమూ, కర్ణరంజితమూ చేస్తోంది. 

మరోపక్క విచిత్రంగా ముల్లు ఈ కొస నుంచి పూర్తిగా దాని వ్యతిరేక దిశకు తిరగడమూ జరుగుతోంది. చదువుల అభావ దినాలు పోయి ఉల్బణ దినాలు వచ్చాయి. ఋతు నిర్బంధాలూ, తిథివార నిషేధాలూ పోయి చదువుల కేలండర్‌ ‘సార్వకాలికత’ను తెచ్చుకుంటోంది. వానా కాలం చదువులు పోయి నానాకాలం చదువులొచ్చాయి. అది మరోరకం వైపరీత్యానికి దారి తీసింది.  

అంతటా కాకపోయినా, అనేక ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలలో వేసవి సెలవులు కుదించుకుపోతున్నాయి. ప్రత్యేకించి పబ్లిక్‌ పరీక్షలు రాయబోయే పిల్లలకు వేసవి తరగతులు నిర్వహిస్తున్నారు. ఆ పైన వేసవి పొడవునా ట్యూషన్‌ తరగతులకు హాజరవడం అనివార్యమవుతోంది. భుజాలను వంచే పుస్తకాల బరువుకు తోడు మస్తకాలను భయాందోళనలతో నింపే చదువు బరువూ పెరిగిపోతోంది. 

‘స్కూలు వర్కు’ను మించి ‘హోము వర్కు’ నివ్వడంతో బడికీ, ఇంటికీ తేడా చెరిగిపోయి, వేరే వృత్తి ఉద్యోగాల్లో తలమునకలయ్యే తల్లితండ్రులే టీచర్లు గానూ మారి, అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది. తల్లుల పరిస్థితి మరీ ఘోరం. ఉద్యోగానికి అదనంగా వంటపనీ, ఇంటిపనీ, పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూనే ఉపాధ్యాయిని పాత్రనూ పోషించవలసి వస్తోంది. 

స్త్రీ, పురుష బాధ్యతల మధ్య అసమానతలు కొనసాగుతున్న పరిస్థితిలో గృహిణికి ఇదెంత భారమో ఊహించగలం. స్కూలు ఫీజులూ, ఇతరత్రా వసూళ్ల రూపంలో వేలు, లక్షలు ధారపోస్తున్నా తల్లితండ్రులకు ‘టీచరీ’ రూపంలో ఈ అదనపు చాకిరీ తప్పడం లేదు. ఆటపాటలతో సహా ఇతరేతర మానసికోల్లాసాలకు ఒకటి, రెండు గంటలైనా ఒత్తిడి లేని స్వేచ్ఛా సమయం చిక్కని పిల్లల పాలిట చదువు అక్షరాలా ‘నిర్బంధ’ విద్యే అవుతోంది. 

విద్యాసంస్థలు చదువు బరువు తగ్గించకుండానే అదనపు వేళల్లో ఆటపాటల బరువునూ మోపడంతో పిల్లలకసలే ఊపిరి సలపడం లేదు. దేశంలో విద్యాబోధన ఎంత శాస్త్రీయంగా జరుగుతోందో పట్టించుకునే వ్యవస్థ అసలేదైనా ఉందా, చదువులు పిల్లల శారీరక మానసిక వికాసానికేమైనా సాయపడు తున్నాయా అన్న ప్రశ్నలు తల్లితండ్రుల నుంచే ఎదురవుతున్నాయి. 

పరీక్షలలో సాధించాల్సిన మార్కుల గరిష్ఠ శాతం కూడా ఇప్పుడు మారిపోయింది. తదుపరి చదువుకు ఏ ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలోనైనా సీటు రావడానికి డెబ్బై, ఎనభై శాతం మార్కులు కూడా సరిపోవడం లేదు, తొంభై శాతం దాటి తీరాల్సిందే. దాంతో పిల్లల్లో పోటీ, అసూయ, అలజడి, ఆందోళన, ఒత్తిడి పెరిగి పోతున్నాయి. తమ చదువూ, భవిష్యత్తుల గురించి తల్లితండ్రులు కనే కలల భారం పిల్లల కను రెప్పల మీద పడి వాళ్ళ నిద్రను హరిస్తోంది.

పిల్లల్లో గ్రహణశక్తి, చురుకుదనం పెరిగిన మాట నిజమే కానీ, మొత్తంగా నేటి ఈ చదువుల తీరు ఆదర్శవంతమేనా అన్న సందేహం మాత్రం వదలకుండా వేధిస్తూనే ఉంది. ఇక చదువుల్లో రకరకాల అసమానతలు పెరగడమే తప్ప తగ్గుతున్న జాడలేదు. ఉజ్జ్వల భవిష్యత్తు వైపు నడిపించే చదువుల నిచ్చెనపై చివరి మెట్ల మీద చతికిల బడుతున్నవారు నేటికీ అసంఖ్యాకమే. 

ఇంకోవైపు నూటికి నూరుశాతం అక్షరాస్యతను సాధించడానికి ప్రభుత్వాలు ఇప్పటికీ ఆపసోపాలు పడుతూనే ఉన్నాయి. నూటయాభయ్యేళ్ళ క్రితం, బ్రిటిష్‌ వలస పాలన ప్రారంభం నాటికి మూడు శాతం పైచిలుకు ఉన్న అక్షరాస్యత ఇప్పుడు ఎనభై శాతానికి చేరడం, విడిగా చూసినప్పుడు ఒకింత ఊరటే కానీ, ఎన్నో దేశాలతో పోల్చితే ఈ పెరుగుదల వేగమూ, శాతమూ ఏమంత విశేషం కావని పెదవి విరిచేవారూ ఉన్నారు. 

ఇందులో మళ్ళీ ప్రాంతీయంగా, జెండర్‌ పరంగా అంతరాలూ యథాతథం. ఎప్పుడో కానీ సోదిలోకి రాని ఈశాన్య రాష్ట్రాలు అక్షరాస్యతలో అగ్రస్థానంలో ఉండటం ఒక విశేష మైతే, ఎంత ప్రామాణికమో తెలియదు కాని, బిహార్‌తో కలసి ఆంధ్రప్రదేశ్‌ ఆ పట్టికలో అడుగు బొడుగు స్థానాలలో కనిపించడం కలవరపరిచే విషయం. ఇక చదువుల నాణ్యత విషయానికొస్తే, పట్టికలో మన దేశం స్థానం ఉసూరుమనిపించే మరో అధ్యాయం. 

చదువుకీ, మంచి రాబడిగల ఉద్యోగాలకూ పీటముడి పడిన దశలో విద్యాభ్యాసం పూర్తిగా పరుగు పందెంగా మారి పిల్లల్ని విపరీత శ్రమకూ, అలసటకూ గురిచేస్తున్న మాట నిజం. చదువుల మరో పరమార్థమైన జ్ఞాన సముపార్జనకు కూడా పెద్ద పీట వేస్తూ ఎప్పటికది నిలకడ తెచ్చుకుంటుందో, పిల్లల్ని పరీక్షల భయతీరాన్ని దాటించి వైజ్ఞానికపు వెలుగుల ఉల్లాస తీరం వైపు నడిపిస్తుందో కాలమే తేల్చాలి. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)