Breaking News

ఆక్రమిత కశ్మీర్‌ కల్లోలం

Published on Sat, 06/13/2026 - 03:52

ఎప్పుడూ జమ్మూ, కశ్మీర్‌ గురించి అంతర్జాతీయ వేదికలపై గంభీరోపన్యాసాలిస్తూ, మానవ హక్కుల చాంపియన్‌గా తనను తాను చిత్రించుకునే పాకిస్తాన్‌ గత కొన్ని రోజులుగా ఆక్రమిత కశ్మీర్‌లో నెత్తురుటేర్లు పారిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం సైన్యం కాల్పుల్లో 30 మంది మరణించారంటున్నా, వాస్తవ సంఖ్య అంతకుమించి ఉంటుందన్నది స్థానికులు చెప్పే మాట. మరో 200 మంది గాయపడ్డారు. వేలాదిమంది అరెస్టయ్యారు. ఈసారి సాగిన నిరసన ప్రదర్శన సాధారణమైంది కాదు. ముజఫరాబాద్‌ ప్రదర్శనలో అన్నివర్గాలకూ చెందిన లక్షన్నరమంది పాల్గొన్నారు. 

మతం పేరు చెప్పి, గతం పేరుచెప్పి ఎల్లకాలమూ జనాన్ని మభ్యపెట్టడం సాధ్యంకాదని పాక్‌ పాలకులకు ఈ నిరసనలు తెలియజెప్పాయి. తమ ప్రాంత నదుల్లో మంగళ డ్యామ్‌వంటి ప్రాజెక్టులు నిర్మించి,ఇక్కడ ఉత్పత్తయ్యే జలవిద్యుత్‌ను పంజాబ్‌ తదితర ప్రాంతాలకు తరలించుకుపోతూ, స్థానికులకు అరకొర సదుపాయాలు కల్పించటం విషయంలో రెండు దశాబ్దాల క్రితమే అసంతృప్తి పెల్లుబికింది. కానీ సంఘటితం కాకపోవటంవల్ల చల్లారిపోయాయి. 2023లో రావల్‌కోట్, ముజఫరాబాద్, మరికొన్ని ఇతర ప్రాంతాల్లో స్థానిక సమస్యలపై కమిటీలు ఏర్పడి ఉద్యమించాయి. ప్రజల మౌలికాహారమైన గోధుమ పిండి ధర పెంచడాన్నిప్రశ్నించాయి. వీటిని ప్రభుత్వం బేఖాతరు చేసిన ఫలితంగా ఆ కమిటీ లు జాయింట్‌ అవామీ యాక్షన్‌ కమిటీ(జాక్‌)గా ఒక్కటయ్యాయి. 

ఆనకట్టల కారణంగా పలువురు నిర్వాసితులవుతున్నా, వలసపోతున్నా పట్టించు కునేవారు లేరు. పోనీ అని స్థానిక ప్రజలకైనా ఒరిగేదేమీ ఉండదు. మిలిటెన్సీ ఉందన్న పేరిట భారీ స్థాయిలో సైన్యాన్ని మోహరించటం ఒక్కటే వారికి కనబడేది. అందుకేశాంతియుత పద్ధతుల్లో పన్నుల నిరాకరణ ఉద్యమం నిర్వహించటం, విద్యుత్‌ బిల్లుల చెల్లింపు నిలిపివేయటం, సంపూర్ణ బంద్, లాంగ్‌మార్చ్‌ వంటివి ఈ మూడేళ్లలో ఎన్నో జరిగాయి. సైన్యం పడగనీడలో కాలక్షేపం చేసే ప్రభుత్వానికుండే అధికారాలు అంతంత మాత్రం. ఏ జవాబుదారీతనమూ లేని సైన్యానిదే పెత్తనం. అందుకే ఆక్రమిత కశ్మీర్‌కు ఎదుగూ బొదుగూ లేదు. 

ఆ ప్రాంత వనరుల్ని కొల్లగొట్టడానికి పాక్‌ పాలకులు ఒక సృజనాత్మక విధానం కనుక్కున్నారు. 53 మందితో దానికొక అసెంబ్లీ ఉంది. ఆక్రమిత కశ్మీర్‌కు ముఖ్యమంత్రి కాదు... ప్రధాని ఉంటాడు. కానీ అధికారాలన్నీ ఇస్లామాబాద్‌లో కొలువుదీరిన సైనికాధికారుల ఆధిపత్యంవుండే కశ్మీర్‌ కౌన్సిల్‌ చేతిలో ఉంటాయి. ఈసారి కేవలం
ఆర్థిక సమస్యలపై మాత్రమే కాదు... అసెంబ్లీ అమరికపై కూడా డిమాండ్లు బయల్దేరాయి. మొత్తం 53 స్థానాలుండగా, ‘శరణార్థుల’కు డజను కేటాయిస్తారు. మరో అయిదు మహిళలకూ... ఉలేమాలు, సాంకేతిక నిపుణులు, విదేశాల్లో స్థిరపడిన కశ్మీరీలకు ఒక్కొక్క  స్థానం ఉంటాయి. ఈ ఖాతాలకింద పోయే 20 స్థానాలకూ ఎన్నికలు జరిగేదెక్కడో, నిర్వహించేదెవరో ఎవరికీ తెలియదు. వారు ఎన్నుకోవాల్సింది మాత్రం 33 మందిని.

మళ్లీ ఇందులో అత్యధికులు పాక్‌ పాలకుల కనుసన్నల్లో నడిచేవారే ఉంటారు. చివరకు కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఉద్యమకారులు అడిగేదల్లా ‘శరణార్థుల’ డజను స్థానాలూ రద్దు చేయాలన్నదే. కానీ అలా చేస్తే స్థానికుల పెత్తనం పెరుగుతుందని ప్రభుత్వం భయపడుతోంది. అందుకే జాక్‌ నాయకుల ఆచూకీ చెబితే 35,000 డాలర్లు బహుమతి ఇస్తామని ప్రకటించింది. 

వచ్చే నెల్లో ఆక్రమిత కశ్మీర్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ప్రాంత వనరుల దోపిడీ తప్ప, వారి ఆకాంక్షల్ని నెరవేర్చడం సాధ్యపడదని ఉద్యమాలను అణిచేయటం ద్వారా పాక్‌ చెబుతోంది. పాలకులు వలసవాద మనస్తత్వంతో ఆప్రాంతాన్ని చెరబట్టారు తప్ప, స్థానికుల డిమాండ్లపై ఖాతరు లేదు. ఉద్యమకారులు38 కోర్కెలు ప్రభుత్వం ముందుంచారు. డజను సీట్ల కోటా రద్దుతోపాటు మంత్రులు, ఉన్నతాధికారులు, రాజకీయనాయకులకిస్తున్న ఖరీదైన కార్లు, ఉచిత విద్యుత్‌ తదితర రాయితీలు రద్దు చేసి, ఆ నిధులు జన సంక్షేమానికి వ్యయం చేయాలని కూడావారు కోరుతున్నారు. ఇలాగే మొండికేస్తూ పోతే ఆ ప్రాంత ప్రజల ఆగ్రహం మరింత పెరుగుతుందే తప్ప చల్లారదని పాకిస్తాన్‌ పాలకులు గ్రహించాలి.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)