Breaking News

నెడుమారన్‌ దుమారం

Published on Wed, 02/15/2023 - 01:06

శ్రీలంకలో స్వతంత్ర తమిళ రాజ్యస్థాపన లక్ష్యంగా పోరాడి మరణించిన లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ ఈలం(ఎల్టీటీఈ) చీఫ్‌ ప్రభాకరన్‌ చాన్నాళ్ల తర్వాత వార్తల్లోకెక్కారు. ఆయన బతికేవున్నాడని, త్వరలో జనం ముందుకొస్తాడని తమిళ జాతీయోద్యమ నేత నెడుమారన్‌ సోమవారం చేసిన ప్రకటన సహజంగానే సంచలనంగా మారింది. ఆయన ప్రకటనలోని నిజానిజాల గురించి కన్నా, ఆ ప్రకటన చేయటం వెనకున్న ఉద్దేశాలపైనే తమిళనాడులో ప్రధానంగా చర్చ జరుగుతోంది. శ్రీలంక తమిళుల కడగండ్లపై ఇప్పటికీ  తమిళనాట సానుభూతి ఉంది. అక్కడ తమిళులకు ఏం జరిగినా తమిళనాడులో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతాయి.

శ్రీలంకలో ఎల్టీటీఈని నామరూపాల్లేకుండా చేసి పద్నాలుగేళ్లవుతోంది. అంతర్యుద్ధం ముగిశాక తమిళుల అభ్యున్నతికి అన్ని చర్యలూ తీసుకుంటామని, తమిళులు అధికంగా ఉండే ఉత్తర, తూర్పు ప్రావిన్సులకు స్వతంత్ర ప్రతిపత్తి ఇస్తామని అప్పట్లో చేసిన వాగ్దానాలను లంక సర్కారు ఈనాటికీ నెరవేర్చలేదు. తమ సమస్యలపై శాంతి యుతంగా నిరసన వ్యక్తం చేసినా లంక సైన్యం విరుచుకుపడుతోంది. ఈ పరిస్థితుల్లో నెడుమారన్‌ చేసిన ప్రకటన అక్కడి సాధారణ తమిళులకు ఎంతో కొంత ఊరటనిస్తుంది. సౌకర్యవంతమైన జీవితాలను వదులుకుని తమ కోసం, తమ విముక్తి కోసం పోరాడటానికి అంకితమై ఆ క్రమంలో ప్రాణాలు కోల్పోయినవారిని వీరులుగా ఆరాధించటం, వారి జ్ఞాపకాలను పదిలపరుచుకోవటం, స్మరించుకోవటం అన్నిచోట్లా కనబడుతుంది. పాలక వ్యవస్థకు తిరుగుబాటు నేతలపై ఎలాంటి అభిప్రాయాలున్నా సాధారణ ప్రజానీకం దృష్టిలో వారు ఎప్పటికీ వీరులే. అలాగే దీనికి సమాంతరంగా వారి మరణాన్ని విశ్వసించని ధోరణి కూడా కనబడుతుంది.

తిరుగుబాటుదార్లపై ఉండే గాఢమైన ప్రేమాభిమానాలే ఇందుకు కారణం కావొచ్చు. చరిత్రలోకి తరచి చూస్తే ఇలాంటి ఉదాహరణలెన్నో కనబడతాయి. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ 1945 ఆగస్టు 18న ఫార్మోజా(ఇప్పటి తైవాన్‌)లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించినట్లు చెప్పినా అందుకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు దొరకలేదు. అందుకే కావొచ్చు... ఆయన పేరు మార్చుకుని అజ్ఞాతవాసం గడుపుతున్నారంటూ చాన్నాళ్లు వదంతులు ప్రచారంలో ఉండేవి.  శ్రీలంక తమిళుల్లో ప్రభాకరన్‌పై ఇప్పటికీ ఆరాధనాభావం బలంగా ఉందన్నది కాదనలేని సత్యం. ఇప్పటికీ లంక తమిళులను ద్వితీయ శ్రేణి పౌరులుగానే పరిగణిస్తున్న అక్కడి ప్రభుత్వ విధానాలు ఇందుకు దోహదపడుతున్నాయి. ఎల్టీటీఈ దూకుడు, దాని సిద్ధాంతాలూ, విధానాలనూ ఇతర సంస్థలు తీవ్రంగా విమర్శించేవి. అవి అంతిమంగా తమిళ జాతికి కీడు కలిగిస్తాయన్నది వారి ప్రధాన విమర్శ. తమిళ ఈలం కోసమే పోరాడే ఇతర సంస్థల నేతల్ని ఎల్టీటీఈ మట్టుబెట్టిన తీరు అత్యంత దారుణమైనది. 1991లో మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీని, 1993లో అప్పటి శ్రీలంక అధ్యక్షుడు ప్రేమదాసనూ, అనేకమంది ఇతర నేతలనూ, సైనికాధికారులనూ మానవబాంబులతో దాడిచేసి హతమార్చిన చరిత్ర ఎల్టీటీఈది.

ఉత్తర శ్రీలంకలోని ముల్లైతీవు ప్రాంతంలోని ఒక రహస్య స్థావరంలో తలదాచుకున్న ప్రభాకరన్‌నూ, ఆయన అనుచరులనూ సుదీర్ఘంగా సాగిన పోరాటంలో అంతమొందించామని 2009 మే 18న లంక సైన్యం ప్రకటించింది. అదే నెల 24న ఎల్టీటీఈ అంత ర్జాతీయ వ్యవహారాల చీఫ్‌ సెల్వరాస పద్మనాథన్‌ కూడా దీన్ని ధ్రువీకరించారు. నిజానికి ప్రభాకరన్‌ సజీవంగా ఉన్నారంటూ నెడుమారన్‌ ప్రకటించటం ఇది మొదటిసారేమీ కాదు. 2018లో ఆయన ఈ తరహా ప్రకటనే చేశారు. సైనిక వలయాన్ని ఛేదించి ఆయన తప్పించుకున్నట్టు తన దగ్గర విశ్వస నీయ సమాచారం ఉన్నదని నెడుమారన్‌ అప్పట్లో చెప్పారు. మళ్లీ అయిదేళ్ల తర్వాత ఎలాంటి ఆధా రాలూ చూపకుండా మరోసారి ఆమాటే చెప్పటం సందేహాలకు తావిస్తోంది. తమిళనాడులో కాంగ్రెస్‌ హవా నడుస్తున్నప్పుడు కామరాజ్‌ అనుచరుడిగా ఓ వెలుగు వెలిగిన నెడుమారన్‌ ఆ తర్వాత రాజకీ యాలకు దూరమై శ్రీలంక తమిళుల హక్కుల కోసం పోరాడే నేతగా గుర్తింపు పొందారు. కన్నడ నటుడు రాజ్‌కుమార్‌ను వీరప్పన్‌ అపహరించినప్పుడు ఆయన విడుదలకు సంప్రదింపులు జరిపిన కీలక వ్యక్తుల్లో నెడుమారన్‌ ఒకరు. వర్తమాన తమిళ రాజకీయాల్లో శ్రీలంక తమిళుల అవస్థలు ప్రస్తా వనకు రాకపోవటం, కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన రాజకీయ పక్షాలు నిర్లిప్తంగా ఉండటం జీర్ణించు కోలేకే నెడుమారన్‌ ఈ సంచలన ప్రకటన చేశారన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. 

ఒకప్పుడు ఎల్టీటీఈ బూచి చూపి సింహళ జాతిని ఏకం చేసిన రాజపక్సే సోదరులు నిరుడు ఉవ్వెత్తున ఎగిసిన ప్రజోద్యమంలో అధికారాన్ని కోల్పోయినప్పటి నుంచీ మళ్లీ సింహళీయుల్లో మద్దతు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు.  ప్రభాకరన్‌ గురించిన వదంతిని ప్రచారంలో పెడితే భయభ్రాంతులైన జనం మళ్లీ తమవైపు చూస్తారన్నదే వారి ఆశ అంటున్నారు. అందులో  నెడుమారన్‌ అమాయకంగా చిక్కుకున్నారా, లేక రాష్ట్ర రాజకీయాల్లో తనకు ప్రాసంగిత పెరగటానికి తోడ్పడుతుందన్న భావనతో ఉద్దేశపూర్వకంగా ఈ మాటన్నారా అన్న సందేహమూ ఉంది. ఏదేమైనా లంక యుద్ధ నేరాలపై విచారణ జరిపి నేరగాళ్లను శిక్షించటం, దుర్భర జీవితం గడుపుతున్న తమిళుల సమస్యల పరిష్కారానికి కృషి చేయటం తక్షణావసరమని శ్రీలంక ప్రభుత్వం గుర్తించాలి. ఆ విషయంలో మన దేశంతో సహా ప్రపంచ దేశాలన్నీ ఒత్తిడి తీసుకురావాలి. నెడుమారన్‌ ప్రకటన ఇందుకు దోహదపడితే మంచిదే.

Videos

అనంతపురం జిల్లాలో భారీ వర్షం

నందిగం సురేష్ అరెస్ట్

లిక్కర్ కేసు వెనక కుట్ర.. అడ్డంగా దొరికిన చంద్రబాబు

ఫ్యామిలీతో తిరుమలలో ఎంపీ గురుమూర్తి

పాతబస్తీ అగ్నిప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

ఎంటర్ ది డ్రాగన్.. కరోనా వచ్చేసింది

స్పిరిట్ లో కల్కి జోడి..

ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న రవితేజ..!

కోపముంటే నాపై తీర్చుకో.. ప్రజల్ని ఎందుకు హింసిస్తావ్.. ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై ఫైర్

కూటమి సర్కార్ నిర్లక్ష్యంతో మైనింగ్ లో పని చేసే కార్మికులు రోడ్డున పడ్డారు

Photos

+5

తెలంగాణ సచివాలయంలో అందగత్తెలు

+5

అనసూయ నూతన గృహప్రవేశం.. పూజా కార్యక్రమం (ఫోటోలు)

+5

పాతబస్తీలో పెను విషాదం.. అగ్నిప్రమాద దృశ్యాలు

+5

చెల్లి పెళ్లిలో నటి హరితేజ (ఫోటోలు)

+5

ఎంగేజ్ మెంట్ పార్టీలో 'కొత్త బంగారు లోకం' హీరోయిన్ (ఫొటోలు)

+5

బిగ్ బాస్ అశ్విని బర్త్ డే పార్టీలో పల్లవి ప్రశాంత్ (ఫొటోలు)

+5

చిరుకు జోడీగా నయన్.. ఫస్ట్ టైమ్ ఇలా (ఫొటోలు)

+5

Miss World 2025 : రామోజీఫిల్మ్‌ సిటీలో అందాల కాంతలు..! (ఫొటోలు)

+5

తల్లి కోరిక.. టక్కున తీర్చేసిన విజయ్ దేవరకొండ (ఫొటోలు)

+5

కేన్స్ లో సోనమ్ కపూర్.. అప్పట్లో ఇలా (ఫొటోలు)