ప్రకృతి చేస్తున్న హెచ్చరిక

Published on Thu, 07/30/2026 - 03:44

వర్తమానంలో లాభార్జన కోసం భవిష్యత్తును బలిపెట్టే నయా ఉదారవాద విధానాలు ప్రపంచాన్ని ప్రమాదపుటంచులకు తీసుకెళ్తున్నాయి. దశాబ్దాలుగా యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియా, ఆస్ట్రేలియాల్లో చోటుచేసుకుంటున్న కార్చిచ్చుల్ని పట్టించుకుని పర్యావరణ అనుకూల విధానాలు పాటించని ఫలితంగా ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే 37 కోట్ల ఎకరాల్లోని అడవులు, పొదలు తగలబడ్డాయని ఒక అంచనా. ఇలా కార్చిచ్చులో చిక్కుకున్న ప్రాంతం మంగోలియా దేశ విస్తీర్ణానికి సమానమని చెబుతున్నారు.

స్పెయిన్, ఫ్రాన్స్‌ అటవీప్రాంతాల్లో, కెనడా, రష్యాల్లో గత వారం రోజు లుగా వ్యాపిస్తున్న మంటల వల్ల ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఫ్రాన్స్, స్పెయిన్‌ కార్చిచ్చులైతే ఊహించశక్యం కానంత స్థాయిలో ఉన్నాయి. వాటిని అదుపు చేయగలిగా మని ఆ రెండు దేశాలూ చెబుతున్నా జనంలో భయాందోళనలు ఉపశమించలేదు. నైరుతి ఫ్రాన్స్‌లో పారిస్‌కు నాలుగు రెట్లు పెద్దదైన విస్తీర్ణంలోని అడవి తగలబడటంవల్లగిరోండ్‌ ప్రాంతంలోని జనావాసాలనుంచి రెండున్నర లక్షలమంది పౌరుల్ని ఆదరా బాదరాగా తరలించాల్సివచ్చింది.

ముఖ్యంగా బోర్డావ్‌ నగరంవైపు ఆ మంటలు వ్యాపిస్తున్న తీరు జనాన్ని హడలెత్తించింది. అటు స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లోనూ ఇదే పరిస్థితి. అక్కడ లక్షమందిని తరలించారు. దాని శివారు ప్రాంతాల్లో పలు జనావాసాలు తగలబడిపోయాయి. ఆ రెండూ యుద్ధ రంగాన్ని తలపింపజేస్తున్నాయని మీడియా కథనం. జరగాల్సిన నష్టం జరిగాక మంటల్ని ఏదోమేరకు అదుపు చేయటం సాధ్యమే. కానీ వాటివల్ల వ్యాపించే పొగవల్ల గాలి నాణ్యత దెబ్బతింటుంది. కార్బన్‌ మోనాక్సైడ్, నైట్రోజన్‌ ఆక్సైడ్‌లతో కూడిన సూక్ష్మ ధూళి కణాలు పీల్చేగాలిలో వ్యాపించి ఊపిరి తిత్తులు, గుండెసంబంధ వ్యాధులతో ప్రజారోగ్యం క్షీణిస్తుంది. 

అరుదైన వృక్షసంపద, జీవవైవిధ్యం బుగ్గిపాలవుతుంది. దాని కారణంగా వడగాడ్పులు చెలరేగి జనంఅల్లాడిపోతారు. ఈ ఖండాల్లో ఏటా కార్చిచ్చులవల్ల 3,40,000 అకాల మరణాలుసంభ విస్తున్నాయని గణాంకాలు సూచిస్తున్నాయి. 2023లో ప్రపంచ కర్బన ఉద్గారాల్లో కెనడా కార్చిచ్చుల వాటా 23 శాతమని అంచనా వేశారు. యూరప్‌ ఖండం అత్యంత వేగంగా వేడెక్కుతున్నదని యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) పర్యవేక్షణ సంస్థ తాజాగా ప్రకటించింది. ఫ్రాన్స్‌ కార్చిచ్చువల్ల ఆస్ట్రేలియా, అమెరికా, కెనడాల్లోని పలు ప్రాంతాల్లో పొగ, ధూళితో కూడిన నీటియావిరి వ్యాపించి, అది మేఘాలుగా మారి, ప్రమాదకరమైన పెనుగాలులు, పిడుగుపాట్లు సంభవించాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సాధారణంగా ఇలాంటి కార్చిచ్చులు మానవతప్పిదాలతోనే మొదలవుతాయి. కానీ వాతావరణ మార్పుల పర్యవసానంగా అవి వేగంగా విస్తరిస్తాయి. ఈ విషయంలో శాస్త్రవేత్తలు స్థూలంగా అంగీకారానికొచ్చినా, తమ నమూనాలు అందుకోలేనంత స్థాయిలో ఇవి ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ తీవ్రతను పసిగట్టడానికి కొత్త ఉపకరణాలు అవసరం కావొచ్చన్నది వారి అభిప్రాయం. ఇప్పుడు స్పెయిన్, ఫ్రాన్సుల్లో మంటలు వ్యాపించిన అడవుల్లో పిక్నిక్‌లు, క్యాంప్‌ ఫైర్లు ఎక్కువ. అజాగ్రత్తగా ఉండే మనుషులవల్ల నిప్పు రాజుకోవటం, గాలిలో తేమ శాతం తక్కువుండే రాత్రివేళ మోడువారిన చెట్లు, ఎండుటాకులు అంటుకుని మంటలు వేగంగా వ్యాపించడం రివాజు. 

గత కొన్నేళ్లుగా ఈ కార్చిచ్చులవల్ల ఉత్పత్తయ్యే వేడి, పొగ ఆధారంగా పైరోక్యుములో నింబస్‌ మేఘాలు ఏర్పడి వర్షరహిత పెనుగాలులతో కూడిన తుపానులు ఏర్పడుతున్నాయి. తీవ్రమైన ఆ వేడిగాలుల కారణంగా ఎక్కడెక్కడో పడే పిడుగులు మరిన్ని అగ్నిప్రమాదాలకూ, కార్చిచ్చులకూ దారితీస్తున్నాయి. విషపూరిత పొగ, బొగ్గు రేణువులతో ఉండే ఈ మేఘాలు అణు విస్ఫోటంలో వచ్చే పొగ మాదిరే దీర్ఘకాలం వాతావరణంలో అలుముకుని సూర్యరశ్మిని అడ్డుకుంటాయి. 

2019–20లో ఆస్ట్రేలియా ఇలాంటి వాతావరణాన్ని చవిచూసింది. దానికి ‘బ్లాక్‌ సమ్మర్‌’ అని పేరుపెట్టారు. ఇకనైనా వాతావరణంతో ఆటలాడటం ప్రమాదకరమని ప్రభుత్వాలు గుర్తించాలి. గుప్పెడు కార్పొరేట్‌ సంస్థల లాభార్జన కోసం వాతావరణాన్ని బలిపెడితే ఊహకందని ఉత్పాతాలు కాటేస్తాయి. పర్యావరణం ధ్వంసమై మానవాళి మనుగడే పెను ప్రమాదంలో పడుతుంది. తాజా పరిణామాలు చేస్తున్న హెచ్చరిక ఇదే. 

Videos

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)