Breaking News

ఒడిశా మేల్కొనాలి!

Published on Tue, 12/02/2025 - 00:21

వలస జీవులపై విషం కక్కే సంస్కృతి ఒడిశాలో ఇంకా పోలేదని అక్కడ జరుగుతున్న దాడులు తెలియజేస్తున్నాయి. ఒకప్పుడు పిల్లల్ని అపహరించడానికొచ్చారనో, మహిళలపై అఘాయిత్యానికి పాల్పడబోయారనో బెంగాల్‌ నుంచి వలసవచ్చి చిన్నా చితకా పనులు చేసుకుంటున్నవారిపై దాడులు జరిగాయి. ఇప్పుడు ‘విదేశీయుల’ పేరిట ఆ వేలంవెర్రి కొనసాగుతోంది. ఒడిశాలోని గంజాం జిల్లాలో బెంగాల్‌ నుంచి ఉన్ని దుస్తులు అమ్ముకోవటానికి వచ్చిన యువకులపై అయిదారు నెలలుగా మూకలు దాష్టీకం చేస్తున్నాయి. ఎవరూ అకారణంగా ఉన్న ఊరునూ, అయినవారినీ వదిలి వలసలకు సిద్ధపడరు. సరైన జీవిక దొరక్క తప్పనిసరై వేరే ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధపడతారు. కొన్ని వలసలు సీజనల్‌గా ఉంటాయి. తొలకరి సమయంలో పంట పొలాల్లో పనులు దొరుకుతాయని వచ్చేవారుంటారు. శీతకాలం సమీపించే సమయానికి ఉన్ని దుస్తులు, దోమతెరలు వగైరాలు అమ్ముకోవడానికి పోతారు. అదేమీ భద్రమైన జీవితం కాదు.

సంపాదనపై అనిశ్చితి. వచ్చిన తృణమో, పణమో రక్షించుకోవటం కూడా సమస్య. స్థానికుడు కాదని తెలిశాక రౌడీ మూకల ఆగడాలుంటాయి. పోలీసులు సరేసరి. వలస పోయేవారికి శాశ్వత చిరునామా ఉండదు గనుక స్వరాష్ట్రంలోనూ, వలసపోయే రాష్ట్రంలోనూ కూడా తిప్పలే. వారు ఎక్కడా ఓటు బ్యాంకు కాదు. కనుక సంక్షేమం ఎప్పుడూ ఆమడ దూరంలో ఉంటుంది. ఇప్పుడు వలస జీవులను అకారణంగా వేధించటానికి ‘విదేశీయులు’ అనే ఆయుధం అక్కరకొస్తోంది. పార్టీలు తమకు రాలిపడతాయనుకున్న ఓట్ల కోసం ఈ ఆయుధాన్ని నిర్విచక్షణగా ఉపయోగిస్తుంటే రౌడీ మూకలకూ అదే ఆదర్శం! నాలుగు రోజుల క్రితం రాహుల్‌ ఇస్లాం అనే యువకుడిపై గంజాం జిల్లాలోని గ్రామంలో మూక విరుచుకుపడి తీవ్రంగా దాడిచేసి, అతని దగ్గరున్న రూ. 6,000 అపహరించింది. ఆధార్‌ కార్డు అడగటం, అది నకిలీదని ఆరోపిస్తూ కొట్టడం సరే.... అతని పేరునుబట్టి వేరే మతం వాడని తెలిశాక ‘జై శ్రీరాం’ అని బలవంతంగా అనిపించి సమస్తం ఊడ్చి పంపారు. 

అంతకు నాలుగు రోజుల ముందు బెంగాల్‌ నుంచి వెళ్లిన మరో ఇద్దరు యువకులకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఈ ఉదంతాలపై పశ్చిమ బెంగాల్‌ వలస కార్మికుల సంక్షేమ సంఘం ఒడిశా డీజీపీకి ఫిర్యాదు చేసింది. ఫలితం ఉంటుందా? ఫిర్యాదు చేయడానికి పోతే ‘బతకాలని ఉంటే ఇటువైపు వచ్చే ప్రయత్నం చేయొద్ద’ని పోలీసులు ఉచిత సలహా ఇచ్చారట. కొన్ని వారాల క్రితం బెంగాల్‌ నుంచి పోయిన ముగ్గురు కూలీలు పోలీసుల నుంచి ఇలాంటి సమస్యే ఎదుర్కొన్నారు. వారిపై బంగ్లాదేశీయులన్న ముద్రవేసి మూడు రోజులపాటు పోలీసు స్టేషన్‌లో నిర్బంధించగా, చివరకు పశ్చిమ
బెంగాల్‌ పోలీసుల జోక్యంతో బయటపడ్డారు. కేంద్రపారా, ఝార్సుగూడ, జగత్‌సింగ్‌ పూర్‌ జిల్లాల్లో బెంగాల్‌ నుంచి వచ్చిన 500 మందికి పైగా వలస కార్మికులను పోలీసులు నిర్బంధించి పలు విధాలుగా వేధించారు.

ఏడేళ్ల క్రితం గుజరాత్‌లో ఒక పసిపాపపై బిహార్‌కు చెందిన యువకుడు లైంగిక నేరానికి పాల్పడ్డాడని ఆరోపణ వచ్చినప్పుడు మూకలు చెలరేగి ‘బయటి వ్యక్తుల’ని అనుమానం వచ్చినవారిని తీవ్రంగా కొట్టి, వారి గుడిసెలకు నిప్పంటించారు. దాంతో బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన వేలాదిమంది ప్రాణభయంతో స్వస్థలాలకు తరలిపోయారు. ఆలస్యంగానైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని భరోసా ఇచ్చాకే పరిస్థితి చక్కబడింది. ఒడిశాలో రౌడీ మూకల ఆగడాలపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండటమే కాదు... తనవంతుగా వేధింపులకు దిగుతోంది. ఇది సరికాదు. 

వలసలు నిజానికి జనాగ్రహం నుంచి పాలకుల్ని కాపాడే రక్షాకవచాలు. కడుపు మండిన వారు ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేయకుండా, తమ దురదృష్టాన్ని నిందించుకుంటూ వేరేచోటకు వలసపోవడంలో అభ్యంతరం ఎందుకుండాలి? దేశభక్తి గురించి లెక్చెర్లిస్తూ పక్క రాష్ట్రం నుంచి వచ్చినవారిని విదేశీయులుగా ముద్రేయటం సిగ్గనిపించటం లేదా? ఒడిశా నుంచి కూడా లక్షల మంది వలసపోతుంటారు. ఈ చీడ విస్తరిస్తే అన్ని రాష్ట్రాల వారికీ పరాయి రాష్ట్రాల్లో ఇదే దుఃస్థితి తలెత్తదా? ఈ పోకడలు సమైక్య భారత్‌ భావనకు ముప్పు కలిగించవా? ఒడిశా పాలకులు ఆలోచించాలి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)