ఇలాంటి ఏలక్షన్ లు నెవ్వర్ బిఫోర్.. నెవ్వర్ ఆఫ్టర్...
Breaking News
రూ.2,100 కోట్ల లగ్జరీ హోటల్.. అందుకే అమ్మేశారట!
Published on Thu, 11/05/2026 - 12:59
ఒక లగ్జరీ హోటల్ నిర్మించాలంటే.. ఎంత ఖర్చవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. ఆ ఖర్చులకు తోడు అప్పులు, వడ్డీలు పెరిగితే ఎంత పెద్ద వ్యాపారమైనా కష్టాల్లో పడుతుంది. భారతదేశంలోని ప్రముఖ లగ్జరీ హోటల్ బ్రాండ్ 'ది లీలా' విషయంలోనూ ఇదే జరిగింది. ఢిల్లీలో ఓ భారీ హోటల్ నిర్మించాలన్న ఆలోచన చివరకు ఆ కుటుంబానికి ఆర్థిక భారంగా మారింది. తాజాగా లీలా గ్రూప్ వ్యవస్థాపకుడు కెప్టెన్ సి.పి. కృష్ణన్ నాయర్ చిన్న కుమారుడు దినేష్ నాయర్ ఈ విషయాలను వెల్లడించారు.
రూ.2,100 కోట్ల ఖర్చు!
ఢిల్లీలో లగ్జరీ హోటల్ నిర్మించాలనే ఉద్దేశంతో ముందుగా అక్కడ భూమిని కొనుగోలు చేసినట్లు.. ఇందుకోసం అప్పట్లోనే సుమారు రూ.600 కోట్లు ఖర్చు చేసినట్లు దినేష్ నాయర్ చెప్పారు. ఆ తర్వాత హోటల్ నిర్మాణం, ఇతర ఖర్చులు కలిపి ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగింది. చివరకు వడ్డీలతో సహా మొత్తం ఖర్చు రూ.2,100 కోట్లకు చేరుకుంది. ఈ ప్రాజెక్టు తమ వ్యాపారాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని దినేష్ నాయర్ అంగీకరించారు.
నిజానికి ఒక లగ్జరీ హోటల్ నిర్మించడం కంటే.. దాన్ని నిర్మించడానికి తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించడమే పెద్ద సమస్యగా మారిందని దినేష్ నాయర్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో కుటుంబానికి ఎదురైన అతిపెద్ద సమస్య.. తీసుకున్న లోన్స్ మీద పెరిగిన వడ్డీ.
రూ.800 కోట్ల వడ్డీ
భారతీయ బ్యాంకులు కేవలం ఐదు నుంచి ఆరు సంవత్సరాల కాలపరిమితితోనే రుణాలు ఇచ్చేవని దినేష్ తెలిపారు. ఇలాంటి భారీ హోటల్ ప్రాజెక్టుకు తక్కువ వ్యవధిలో అప్పులు తీర్చడం అంత సులభం కాదు. సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోవడంతో వడ్డీలు అంతకంతకూ పెరిగిపోయాయి. మొత్తం ప్రాజెక్టు ఖర్చులోనే రూ.700-800 కోట్లు వడ్డీల రూపంలో చెల్లించి ఉండవచ్చని ఆయన చెప్పారు. అంటే హోటల్ నిర్మాణం కోసం చేసిన ఖర్చుతో పాటు అప్పుల వడ్డీలే కుటుంబానికి పెద్ద భారంగా మారాయి.
ది లీలా గ్రూప్ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఈ హోటల్ సామ్రాజ్యాన్ని కెప్టెన్ సి.పి. కృష్ణన్ నాయర్ స్థాపించారు. ఆయన ఏకంగా 65 ఏళ్ల వయసులో హోటల్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ప్రపంచంలోని అత్యుత్తమ లగ్జరీ హోటళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా భారత్‌లోనూ హోటళ్లను నిర్మించాలనేది ఆయన కల. ఆ కలతోనే ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో లీలా హోటళ్లను ఏర్పాటు చేశారు. అలా కొద్ది కాలంలోనే లీలా గ్రూప్ దేశంలోని ప్రముఖ లగ్జరీ హోటల్ బ్రాండ్లలో ఒకటిగా ఎదిగింది. ఆయన కుమారులు దినేష్, వివేక్ నాయర్ కూడా వ్యాపారంలో కీలక బాధ్యతలు నిర్వహించారు.
అప్పులు పెరిగిపోయాయ్
అయితే.. కాలక్రమేణా అప్పులు పెరగడం, వాటిని నిర్వహించడం కష్టంగా మారడంతో లీలా గ్రూప్ ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. చివరకు 2019లో కుటుంబం తన హోటల్ వ్యాపారంలోని ప్రధాన ఆస్తులను, లీలా బ్రాండ్‌తో సహా, బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్‌కు విక్రయించింది.
ఇదీ చదవండి: రూ.4.10 లక్షలు తగ్గిన 7 సీటర్ ఎలక్ట్రిక్ కారు ధర!
అయినప్పటికీ.. నాయర్ కుటుంబం హోటల్స్, ఆతిథ్య రంగంపై కొనసాగుతోంది. దినేష్ నాయర్ కుమార్తె సంయుక్త నాయర్ ప్రస్తుతం లండన్, దోహా, దుబాయ్ నగరాల్లో రెస్టారెంట్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఆమెకు చెందిన జమావర్ రెస్టారెంట్‌కు మిషెలిన్ స్టార్ గుర్తింపు కూడా ఉంది. ఒకప్పుడు ప్రపంచస్థాయి లగ్జరీ హోటల్ బ్రాండ్‌ను నిర్మించిన కుటుంబం, ఢిల్లీలో ఒకే ప్రాజెక్టు కారణంగా భారీ ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొని, చివరకు వ్యాపారాన్ని విక్రయించాల్సి వచ్చింది.
Tags : 1