సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా
Breaking News
సామాన్యుడిపై ధరల భారం తప్పదా?
Published on Tue, 04/14/2026 - 18:02
పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ముఖ్యంగా ఇంధన సరఫరా వ్యవస్థలో తలెత్తిన ఆటంకాలు ముడి చమురు ధరలను ఆకాశానికి చేర్చుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ చమురు ధర ఇటీవలే 110 డాలర్ల మార్కును తాకడం భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఆందోళన కలిగిస్తోంది.
దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు లేకపోయినప్పటికీ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు(ఓఎంసీ) భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తుంటే రాష్ట్ర ఎన్నికల అనంతరం సామాన్యుడిపై ఇంధన ధరల భారం పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కంపెనీల నెత్తిన నష్టాల భారం
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్) సంస్థలు ఏప్రిల్ 2022 నుంచి రిటైల్ ధరలను సవరించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం, విక్రయ ధరలు స్థిరంగా ఉండటంతో ఈ సంస్థలు భారీగా నష్టపోతున్నాయి. పెట్రోల్‌పై నష్టం లీటరుకు సుమారు రూ.18, డీజిల్‌పై నష్టం లీటరుకు సుమారు రూ.35గా ఉందని అంచనా. ఓఎంసీలకు ఒక దశలో రోజుకు రూ.2,400 కోట్లుగా ఉన్న ఈ నష్టం ఎక్సైజ్ సుంకం తగ్గింపు తర్వాత ప్రస్తుతం రూ.1,600 కోట్లకు చేరింది.
మాక్వారీ నివేదిక విశ్లేషణ
ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ మాక్వారీ (Macquarie) తాజా నివేదిక ప్రకారం, చమురు కంపెనీల ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో వచ్చిన స్వల్ప లాభాలను మార్చి నెల నష్టాలు తుడిచిపెట్టేశాయి. ‘అంతర్జాతీయంగా స్పాట్ ధరలు బ్యారెల్‌కు 135 - 165 డాలర్ల మధ్య ఉన్న తరుణంలో భారత్‌లో విక్రయ ధరలు పెంచకపోవడం వల్ల జనవరి-మార్చి త్రైమాసికంలో కంపెనీలు భారీ నష్టాలను ప్రకటించే అవకాశం ఉంది’ అని తెలిపింది. అంతేకాకుండా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే అంటే ఏప్రిల్ నెలాఖరులోగా ఇంధన ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఈ నివేదిక హెచ్చరించింది.
దిగుమతులపై ఆధారపడటం ఒక సవాల్
భారతదేశం తన ముడి చమురు అవసరాలలో 88% దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది (2025 గణాంకాల ప్రకారం). మధ్యప్రాచ్యం, రష్యా, అమెరికాల నుంచి మనం చమురును సేకరిస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ధర 10 డాలర్లు పెరిగితే, దేశీయంగా లీటరుపై రూ.6 నష్టం అదనంగా పెరుగుతుంది. ప్రస్తుత ధరల ప్రకారం చమురు కంపెనీలు మనుగడ సాగించాలంటే బ్యారెల్ ధర 80-85 డాలర్ల మధ్య ఉండాలి, కానీ ఇప్పుడు అది 120 డాలర్ల వద్ద ఉండటం ఆందోళనకరం.
అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గని పక్షంలో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత చమురు ధరల పెంపు అనేది అనివార్యంగా కనిపిస్తోంది. ఇది రవాణా రంగంపై ప్రభావం చూపి, తద్వారా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగేలా చేసే ప్రమాదం ఉంది.
ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా?
Tags : 1