మంగ్లీ సాంగ్ పై కేంద్రం సీరియస్
Breaking News
సిరామిక్ టైల్స్‌పై యుద్ధం ఎఫెక్ట్
Published on Thu, 03/19/2026 - 08:50
దేశీ సిరామిక్ టైల్స్ పరిశ్రమపై పశ్చిమాసియా యుద్ధం ప్రతికూల ప్రభావం చూపనున్నట్లు రేటింగ్స్ దిగ్గజం క్రిసిల్ తాజా నివేదికలో పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం(2025–26)లో పరిశ్రమ ఆదాయం 1–2 శాతంస్థాయిలో నీరసించనున్నట్లు అంచనా వేసింది. వెరసి వరుసగా రెండో ఏడాది ఆదాయంలో క్షీణత నమోదుకానున్నట్లు తెలియజేసింది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా సిరామిక్ టైల్స్ ఉత్పత్తి, ఎగుమతులు, సరఫరాలకు విఘాతం కలగనున్నట్లు తెలియజేసింది. వెరసి రూ. 53,000 కోట్ల విలువైన దేశీ సిరామిక్ టైల్స్ పరిశ్రమపై యుద్ధం రెండు విధాల ప్రభావం చూపనున్నట్లు వివరించింది.
మధ్యప్రాచ్య దేశాలకు లాజిస్టిక్స్‌పరంగా సవాళ్లు ఎదురవుతుండటంతో సరఫరా వ్యవస్థ అస్తవ్యస్థంకావడంతోపాటు ఎగుమతులు దెబ్బతినే వీలున్నట్లు క్రిసిల్ పేర్కొంది. సిరామిక్ టైల్స్ ఆదాయంలో ప్రధానంగా ఎగుమతులు 40 శాతం వాటా ఆక్రమిస్తుండటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఎగుమతుల్లో మధ్యప్రాచ్య దేశాల వాటా 15 శాతంగా తెలియజేసింది. హార్ముజ్ ద్వారా జల రవాణాకు అవాంతరాలు ఎదురవుతుండటంతో ఎగుమతుల ఆదాయం 6–7 శాతం క్షీణించనున్నట్లు అంచనా వేసింది. డెలివరీలు నిలిచిపోవడంతోపాటు.. బీమా వ్యయాలు పెరిగిపోనున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా ఇతర ప్రాంతాలకు చేపట్టే ఎగుమతి వ్యయాలు సైతం పెరగనున్నట్లు వెల్లడించింది.
ఎల్‌ఎన్‌జీ సెగ
తయారీ వ్యయాల్లో 35 శాతం వాటా ఆక్రమించే కీలక ముడిసరుకులు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(ఎల్‌ఎన్‌జీ), ప్రొపేన్ సరఫరాలు తగ్గడంతో దేశీయంగా పలు సిరామిక్ టైల్స్ తయారీ కంపెనీల కార్యకలాపాలు మూతపడటం లేదా ఉత్పత్తి నిలిచిపోవడం లేదా ఉత్పత్తిలో భారీ క్షీణతకు అవకాశమున్నట్లు క్రిసిల్ నివేదికలో వివరించింది. ఈ నెల(మార్చి)లో టైల్స్ ఉత్పత్తి దాదాపు నిలిచిపోగా.. దేశీ వినియోగ వ్యయాలు సైతం మందగించనున్నట్లు తెలియజేసింది. ఫలితంగా దేశీ టైల్స్ మార్కెట్ వృద్ధి గతంలో వేసిన 7–8% అంచనాలస్థానే 4–5 శాతానికి పరిమితంకానున్నట్లు పేర్కొంది.
ప్రస్తుత యుద్ధ పరిస్థితులు మరో రెండు, మూడు వారాలు కొనసాగితే కంపెనీల దీర్ఘకాలిక మూసివేతలు, భారీ నష్టాలకు కారణంకావచ్చని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ నితిన్ కన్సల్ తెలియజేశారు. దీంతో నెలవారీ ఆదాయంలో 7–8 శాతం క్షీణత నమోదుకావచ్చని అంచనా వేశారు. ఈ అంశాలన్నీ కంపెనీల నిర్వహణ లాభదాయకతను 1.3–1.5%మేర దెబ్బతీయవచ్చని నివే దిక పేర్కొంది. వెరసి ఐదేళ్ల కనిష్టం 9.3–9.5%నికి మార్జిన్లు బలహీనపడవచ్చని అభిప్రాయపడింది.
ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి!
Tags : 1