తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్
Breaking News
మిడిల్ క్లాస్ సప్తపది
Published on Mon, 12/29/2025 - 06:37
జీతం చాలా ఎక్కువ. ఖర్చులు అంతకన్నా ఎక్కువ. ఏం లాభం? అందుకే... ఎంత సంపాదించామన్నది కాదు..! ఎంత ఖర్చు పెట్టాం, ఎంత పొదుపు చేశాం? అన్నదే ముఖ్యం. అదే మన జీవిత గమనాన్ని నిర్ణయిస్తుంది. మధ్యతరగతి కుటుంబాల్లో ఆర్థిక సమస్యలకు ప్రధాన కారణం ఆదాయం తక్కువగా ఉండడం కాదు.
కాలం చెల్లిన ‘మనీ’ సూత్రాలను పట్టుకుని వేలాడటమే. ఖర్చులు ఆదాయాన్ని మించకుండా చూసుకుంటే మధ్యతరగతి వారయినా మహారాజుల్లా బతికేయొచ్చు. అందుకోసం ఈ 7 సూత్రాలు పాటించడం మాత్రం తప్పనిసరి. కొత్త సంవత్సరంలోనైనా పాటించాల్సిన ఈ ‘సప్త పది’ గురించి వివరించేదే ఈ ‘వెల్త్’ స్టోరీ...
అత్యవసర నిధి..
అవసరం వచ్చినప్పుడు సాయం కోసం ఒకరి దగ్గర చేయి చాచటమనేది చాలా ఇబ్బందికరం. ఒకప్పుడు మనుషుల మధ్య బంధాలను డబ్బుతో కొలవటమనేది తక్కువ. ఇపుడు ఎవరినైనా అడిగినా... వారు ఎంత దగ్గరివారైనా ఇస్తారన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే వాళ్లకూ ఏవో అవసరాలు ఉండి ఉండొచ్చు. పైపెచ్చు మన అవసరాన్ని వాళ్లు గుర్తించకపోవచ్చు. అందుకని ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా ఎదుర్కొనేందుకు వీలుగా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం తెలివైన నిర్ణయం. అత్యవసర నిధి అన్నది ఆప్షనల్ కాదు. తప్పనిసరి. రాజీపడకూడనిది.
→ కరోనా సమయంలో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోండి. ఆస్పత్రిలో వైద్యం కోసం చాలామంది లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. అదే సమయంలో ఉద్యోగం, ఉపాధి కోల్పోయిన వారెందరో. కొన్ని సంస్థలు అయితే వేతనాలకు కోత పెట్టాయి. చేస్తున్న ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియని అనిశ్చితి.
→ వైద్యం కూడా అంతే. ఎప్పుడు ఏ ప్రమాదం, ఏ అనారోగ్యం ముంచుకొస్తుందో ఊహించలేం.
→ అందుకే కనీసం ఆరు నెలల అవసరాలకు సరిపడా అత్యవసర నిధి ప్రతి కుటుంబానికి ఉండాలి. కుదిరితే 9 నెలలు, 12 నెలల అవసరాలకు సరిపడా నిధిని పక్కన పెట్టుకోవాలి.
→ ఇలా చేయడం వల్ల దీర్ఘకాల లక్ష్యాల కోసం చేస్తున్న పెట్టుబడులను కదపకుండా ఉండొచ్చు. అధిక రేటుపై రుణాలు తీసుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా చూసుకోవచ్చు.
ఈఎంఐలు గీత దాటొద్దు..
→ అవసరం వస్తే క్రెడిట్ కార్డు చేతిలో ఉందిలే... వెంటనే రుణం దొరుకుతుందిలే. అనే రీతిలో అన్నింటికీ ‘రుణ’ మంత్రం పనికిరాదు. బ్యాంక్‌లు, ఫిన్‌టెక్‌లు పిలిచి రుణం ఇస్తున్నాయి కదా అని చెప్పి.. ఇల్లు, కారు, ఇంట్లో వస్తువులు ఇలా ప్రతిదానికీ అప్పు చేసుకుంటూ వెళితే, ఆర్థిక పరిస్థితులు క్రమంగా అదుపు తప్పుతాయి. నెల సంపాదనలో 50–60 శాతం వరకు రుణ చెల్లింపులకే వెచ్చించే కుటుంబాలు మన మధ్య ఎన్నో ఉన్నాయి.
→ ఆదాయంలో నెలవారీ రుణ వాయిదాలను (ఈఎంఐలు) 35–40 శాతం మించకుండా చూసుకోవాలన్నది ముఖ్యమైన ఆర్థిక సూత్రం. దీనివల్ల ఇతర ముఖ్యమైన జీవన అవసరాలకు (గ్రోసరీ, యుటిలిటీ, విద్యా వ్యయాలు) ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు.
→ ఆదాయమనేది నేటి అవసరాల కోసమే కాదు. భవిష్యత్ లక్ష్యాలు, విశ్రాంత జీవన అవసరాల కోసం కూడా. దీనికోసం ప్రతినెలా కొంత పక్కన పెట్టుకోవాలి.
→ పిల్లల విద్య, వివాహాలు, సొంతిల్లు, రిటైర్మెంట్ జీవితం కోసం పెట్టుబడులకు కొంత కేటాయించుకోవాలంటే, ఆదాయంలో ఈఎంఐలు లక్ష్మణ రేఖ దాటకుండా చూసుకోవడం ముఖ్యం.
→ ఈఎంఐలు హద్దు మీరి చెల్లింపుల్లో విఫలమైతే, అది క్రెడిట్ హిస్టరీని దెబ్బతీస్తుంది. ఆదాయం అప్పులకే పోతుంటే సంపద సృష్టి ఎప్పటికీ సాధ్యం కాదు.
ఆదాయాన్ని మించి పెట్టుబడి..
→ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ఇపుడు బాగా ప్రాచుర్యం పొందిన పెట్టుబడి సాధనం. ఈ విధానంలో చేస్తున్న పెట్టుబడి, మన వార్షిక ఆదాయ వృద్ధికి మించి పెరిగేలా చూసుకోవాలి. వార్షిక వేతన పెరుగుదల సాధారణంగా 8–10 శాతంగా ఉంటుంది. కానీ, సిప్ పెట్టుబడులపై 12–15 శాతం వరకు రాబడి వచ్చేలా పెట్టుబడి సాధనాలను ఎంపిక చేసుకోవాలి.
→ ద్రవ్యోల్బణం కారణంగా కొంత కాలానికి మన పెట్టుబడి దాని విలువను కోల్పోతుంటుంది. మన దగ్గర వార్షిక సగటు ద్రవ్యోల్బణం 5–6 శాతం స్థాయిలో ఉంటోంది. కనుక ఈ మేరకు మన పెట్టుబడి విలువ ఏటా క్షీణిస్తుంటుంది.
→ ఇపుడు మన జీవన వ్యయాలు నెలవారీ రూ.10,000గా ఉన్నాయనుకుంటే.. 6 శాతం ద్రవ్యోల్బణం రేటు ప్రకారం పదేళ్ల తర్వాత అవే అవసరాల కోసం రూ.17,908 ఖర్చు చేయాల్సి వస్తుంది. అదే 20 ఏళ్ల తర్వాత అయితే రూ.32,071 అవసరం అవుతుంది.
→ ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే పదేళ్లకు మించిన కాలంలో 12–15 శాతం రాబడులు సాధ్యమేనని చరిత్ర చెబుతోంది.
→ ఇక నెలవారీ చేస్తున్న సిప్ పెట్టుబడిని సైతం ఏటా ఆదాయ పెరుగుదలను మించిన స్థాయిలో పెంచుకోవడం ప్రధానం. లేదంటే కనీసం ద్రవ్యోల్బణం రేటు స్థాయిలో అయినా సిప్ పెట్టుబడిని ఏటా పెంచుకుంటూ వెళ్లాలి.
→ ఇలా సిప్ పెట్టుబడిని పెంచుకుంటూ, ఆ పెట్టుబడి ద్రవ్యోల్బణం మించి వృద్ధి చెందేలా చూసుకుంటే, కాంపౌండింగ్ ప్రయోజనంతో పెద్ద మొత్తంలో నిధి సమకూరుతుంది.
ఆరోగ్య బీమా రూ.5 లక్షలు చాలదు..
→ మనలో చాలా మందికి ఆరోగ్య బీమా రక్షణ లేదు. ఉన్న వారిలోనూ చాలా మందికి రూ.5 లక్షలకు మించి కవరేజీ లేదు. కానీ, మారుతున్న పరిస్థితుల కోణంలో చూస్తే ఈ రక్షణ ఎంత మాత్రం చాలదని స్పష్టమవుతోంది.
→ వైద్య రంగంలో ద్రవ్యోల్బణం 12– 14 శాతం స్థాయిలో ఉంటోంది. అంటే చికిత్సలు, ఔషధాలు, ఇతరత్రా చార్జీలు ఈ స్థాయిలో ఏటా పెరుగుతున్నట్టు లెక్క.
→ అత్యాధునిక వైద్య విధానాలు, రోబోటిక్ తరహా టెక్నాలజీలు రావడంతో క్లిష్టమైన సర్జరీలను సైతం సునాయాసయంగా, విజయవంతంగా చేస్తున్నారు. వీటి కోసం పెద్ద మొత్తంలో ఖర్చవుతోంది. అవయవ మార్పిడి కోసం రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చవుతోంది.
→ కనుక రూ.5 లక్షల కవరేజీ ఎంతమాత్రం సరిపోదు. ఒక కుటుంబానికి కనీసం రూ.10– 20 లక్షల వరకు అయినా బేసిక్ హెల్త్ ప్లాన్ ఉండాలి. రూ.10–20 లక్షల డిడక్టబుల్‌తో సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవాలి. వైద్య బిల్లు రూ.10– 20 లక్షల్లోపు ఉంటే బేసిక్‌ప్లాన్ నుంచి, అంతకు మించిన సందర్భాల్లో సూపర్ టాపప్ ప్లాన్ నుంచి చెల్లింపులు జరుగుతాయి.
రెండు చేతులా సంపాదించాల్సిందే..
→ ఒకవైపు కరెన్సీ విలువ క్షీణిస్తుండగా... మరోవైపు జీవన వ్యయాలు భారీగా పెరుగుతున్నాయి. కాబట్టి వీటికి తగ్గట్టు ఆదాయం కూడా వృద్ధి చెందాలి. కానీ మన ఆర్థిక డేటాను పరిశీలిస్తే.. ఆదాయ వృద్ధి కంటే జీవన వ్యయ పెరుగుదలే ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే రెండో ఆదాయ మార్గంపై దృష్టి పెట్టాలి.
→ అద్దె రూపంలో ఆదాయం లేదంటే తమ నైపుణ్యాల ఆధారంగా ఖాళీ సమయంలో ఫ్రీలాన్స్ వర్క్ లేదంటే వడ్డీ ఆదాయం లేదా డివిడెండ్ ఆదాయం ఇలా ఏదో ఒక మార్గం గుర్తించాలి.
ఖర్చులపై కన్ను..
టీవీ ఛానళ్ల కోసం ఒకటి, నెట్‌ఫ్లిక్స్–అమెజాన్ ప్రైమ్, ఆహా ఇలా వేర్వేరు ఓటీటీ చందాలు, క్లౌడ్ స్టోరేజీ, లెరి్నంగ్ యాప్‌లు ఇలా చెప్పుకుంటూ పోతే డిజిటల్ లైఫ్ కోసం ప్రతి కుటుంబంలో నెలతిరిగేసరికి చందా చెల్లింపుల జాబితా పెరిగిపోతోంది. ఒక సర్వే ప్రకారం ఒక కుటుంబం ఈ తరహా రీచార్జ్‌ల కోసం కనీసం రూ.25,000– 40,000 వరకు ఖర్చు చేస్తోంది. కనుక ఏదో ఒక వినోద ఓటీటీ, ఒక లెర్నింగ్ యాప్‌నకు పరిమితమై, అనవసర దుబారాను అదుపు చేసుకోవడం ద్వారా ఆర్థిక స్వేచ్ఛకు మార్గం వేసుకోవచ్చు.
బంగారం కూడా బీమా లాంటిదే..
→ బంగారాన్ని ఒక పెట్టుబడి సాధనంగా కంటే రక్షణ కవచంగానే (హెడ్జింగ్ సాధనం) ఎక్కువ పరిగణిస్తారు. ఆర్థిక అస్థిరతలప్పుడు, కరెన్సీ విలువ క్షీణించినపుడు, ద్రవ్యోల్బణం నుంచి పెట్టుబడి విలువను కాపాడుకోవడంలో బంగారం కీలకంగా పనిచేస్తుంది.
→ ఈ ఏడాది బంగారం ధర దేశీ మార్కెట్లో 78 శాతం పెరిగింది. 2020లో రూ.48,000 స్థాయిలో ఉంది. ఐదేళ్లలో రెండు రెట్లు (200 శాతం వృద్ధి) పెరిగింది. గత రెండు దశాబ్దాల్లో చూస్తే బంగారంపై వార్షిక రాబడి 11–12 శాతంగా ఉంది.
→ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కంపెనీల లాభదాయకత ఆశాజనకంగా లేకపోవడం, వాణిజ్య అనిశి్చతులతో గడిచిన ఏడాది కాలంలో ఈక్విటీలు ఎలాంటి రాబడులు ఇవ్వలేదు. ఈ కాలంలో బంగారం విలువను
సృష్టించి పెట్టింది.
→ కనుక పెట్టుబడుల్లో వైవిధ్యానికి, అనిశి్చతులు, కరెన్సీ విలువల నుంచి పెట్టుబడి విలువకు రక్షణ కోసం, అత్యవసరాల్లో రుణం పొందేందుకు సైతం బంగారం అక్కరకు వస్తుంది.
→ అందుకే ప్రతి ఒక్కరూ తమ పెట్టుబడుల్లో బంగారానికి 10–15 శాతం కేటాయించుకోవాలి.
2026 చెక్ లిస్ట్
అత్యవసర నిధి: 6–9 నెలలు
ఆదాయంలో ఈఎంఐలు: 35 శాతం మించొద్దు
సిప్ పెట్టుబడి: ఏటా పెంచుకుంటూ వెళ్లాలి, ఆదాయాన్ని మించి వృద్ధి చెందాలి
హెల్త్ కవరేజీ: కనీసం రూ.10–20 లక్షలకు బీమా ఉండాలి
పెట్టుబడుల్లో బంగారానికి కేటాయింపులు: 10–15 శాతం రెండో ఆదాయం తప్పనిసరి డిజిటల్ లైఫ్ ఖర్చును నియంత్రించుకోవాలి
Tags : 1