మెగా మూవీపైనే గురూజీ గురి..! గాడ్ అఫ్ వార్ ఇప్పట్లో కష్టమే..!
Breaking News
వీసా టెన్షన్‌కు బ్రేక్.. ట్రంప్ నిర్ణయాన్ని కొట్టేసిన కోర్టు!
Published on Tue, 11/17/2026 - 09:09
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి మరోసారి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులు అమెరికాలో ఎంతకాలం ఉండాలనే విషయంలో కఠిన ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వీసా విధానాన్ని అమెరికా ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. ఈ ప్రతిపాదిత నిబంధనలు చట్టవిరుద్ధమని, ప్రభుత్వం తన అధికారాలను దుర్వినియోగం చేస్తూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని న్యాయస్థానం అభిప్రాయపడింది.
కీలక తీర్పు
డిస్ట్రిక్ట్ జడ్జి డెన్నిస్ సేలర్ ఈ కేసులో కీలక తీర్పు ఇస్తూ.. ప్రభుత్వం ఎలాంటి సరైన కారణాలు లేకుండా ఏకపక్షంగా ఈ నిబంధనలను రూపొందించిందని, తన అధికారాలను దుర్వినియోగం చేసిందని వ్యాఖ్యానించారు. చట్టానికి అనుగుణంగా ఈ విధానం లేదని స్పష్టం చేశారు. నిజానికి ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్‌లోనే అమల్లోకి రావాల్సి ఉంది. కానీ.. జడ్జి డెన్నిస్ సేలర్ వాటి అమలును నిలిపివేశారు. ఈ నిర్ణయాన్ని ట్రంప్ ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేసింది.
ఇప్పటివరకు అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యే వరకు అక్కడ ఉండేందుకు అవకాశం ఉంది. కోర్సు ఎన్ని సంవత్సరాలు కొనసాగితే అన్ని సంవత్సరాలు ఉండవచ్చు. అయితే.. ట్రంప్ ప్రభుత్వం తీసుకురావాలనుకున్న కొత్త నిబంధనల ప్రకారం విదేశీ విద్యార్థులు గరిష్ఠంగా నాలుగేళ్లు మాత్రమే అమెరికాలో ఉండాలి. ఆ తర్వాత కూడా అక్కడ కొనసాగాలంటే వీసా గడువు పొడిగింపు కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విద్యార్థులకు ఇబ్బందులు
ఈ నిబంధన వల్ల ముఖ్యంగా పీహెచ్డీ వంటి దీర్ఘకాలిక కోర్సులు చదివే విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్ని రీసర్చ్ కోర్సులు పూర్తి కావడానికి నాలుగేళ్ల కంటే ఎక్కువ సమయం పడుతుంది. అలాంటప్పుడు విద్యార్థులు మధ్యలోనే ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా.. రెండు డిగ్రీలు ఒకేసారి చదవడం, చదువుతున్న సమయంలో తమ స్పెషలైజేషన్ మార్చుకోవడం కూడా కష్టమయ్యేది. ఈ విషయాలనే న్యాయమూర్తి తన తీర్పులో ప్రస్తావించారు.
విదేశీ విద్యార్థులకు అమెరికాలో విద్యను అందించడాన్ని ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం, అందుకు అడ్డంకులు సృష్టించేలా వ్యవహరిస్తోందని అభిప్రాయపడ్డారు. విదేశీ విద్యార్థులతో పాటు అమెరికాలో పనిచేసే జర్నలిస్టుల వీసా నిబంధనలను కూడా కఠినతరం చేయాలని ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది.
240 రోజులు
కొత్త విధానం ప్రకారం.. విదేశీ జర్నలిస్టులు అమెరికాలో గరిష్ఠంగా 240 రోజులు అంటే దాదాపు ఎనిమిది నెలలు మాత్రమే ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మరోసారి గడువు పొడిగించుకోవాల్సి ఉంటుంది. గతంలో జర్నలిస్టులు ఐదేళ్ల వరకు అమెరికాలో ఉండేందుకు అనుమతి ఉండేది.
చైనా జర్నలిస్టుల విషయంలో అయితే.. మరింత కఠినమైన నిబంధనలు ప్రతిపాదించారు. వారికి మొదట 90 రోజులే గడువు ఇవ్వాలని, ఆ తర్వాత పొడిగింపును కూడా మరో 90 రోజులకే పరిమితం చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ ప్రతిపాదనలపై యూనివర్సిటీలు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహించే పలు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. వీరంతా కలిసి అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS)పై కోర్టులో కేసు వేశారు. విదేశీ విద్యార్థుల చదువుకు, పరిశోధనలకు ఈ నిబంధనలు అడ్డంకిగా మారతాయని వారు వాదించారు. ఈ వాదనలను పరిశీలించిన న్యాయస్థానం ప్రభుత్వ ప్రతిపాదనలను చట్టవిరుద్ధంగా పేర్కొంటూ కీలక తీర్పు ఇచ్చింది.
11 లక్షల విదేశీ ఉద్యోగులు
ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులకు.. అమెరికా ప్రధాన గమ్యస్థానంగా ఉంది. అధికారిక గణాంకాల ప్రకారం 2023-24 విద్యా సంవత్సరంలో అమెరికాలో 11 లక్షలకు పైగా విదేశీ విద్యార్థులు చదువుకున్నారు. భారత్, చైనా సహా అనేక దేశాల విద్యార్థులు అక్కడ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ముఖ్యంగా భారతీయ విద్యార్థులు ఉన్నత చదువులు, పరిశోధన, టెక్నాలజీ వంటి రంగాల్లో అవకాశాల కోసం అమెరికాకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో వీసా గడువును నాలుగేళ్లకు పరిమితం చేయాలన్న ప్రతిపాదన వారిపైనా ప్రభావం చూపే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు వారందరికీ ఉపశమనం లభించింది.
ఇదీ చదవండి: ఉబర్‌లో కొత్త సర్వీస్.. డ్రైవర్ లేకుండానే ప్రయాణం!
Tags : 1