Breaking News

మారుతీ సుజుకీ నుంచి చిన్న ఈవీ!

Published on Fri, 01/17/2025 - 04:03

న్యూఢిల్లీ: పరిమాణం, మార్కెట్‌ వాటాలో భారత్‌లో అతిపెద్ద కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ (ఈవీ) విభాగంపై దృష్టి సారిస్తోంది. దేశీయ ఈవీ మార్కెట్లో కంపెనీ ఎంట్రీ కాస్త ఆలస్యం అయిన సంగతి తెలిసిందే. ‘ఈవీ మార్కెట్‌ను అధ్యయనం చేస్తున్నాం. మా పోటీదారుల ఉత్పత్తులు ఎలా పనిచేశాయో చూశాం. భారతీయ మార్కెట్‌కు ఏమి అవసరమో మాకు తెలుసు. 

అంతర్జాతీయంగా సుజుకీ కార్పొరేషన్‌కు ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌తోపాటు ఇతర అన్ని మోడళ్లకు ఉత్పత్తి కేంద్రంగా భారత్‌ ఉంటుంది. ఉత్పత్తిలో దాదాపు 50 శాతం జపాన్, యూరప్‌కు ఎగుమతి చేస్తాం’ అని సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ ప్రెసిడెంట్, రిప్రజెంటేటివ్‌ డైరెక్టర్‌ తొషిహిరో సుజుకీ గురువారం వెల్లడించారు. భారత్‌ మొబిలిటీ ఎక్స్‌పో నేటి (జనవరి 17) నుంచి ప్రారంభం అవుతున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.   

చిన్న ఎలక్ట్రిక్‌ కార్లు.. 
ఎస్‌యూవీలపై ప్రధానంగా దృష్టి సారిస్తూ భారత ప్యాసింజర్‌ వాహన మార్కెట్లో 50 శాతం మార్కెట్‌ వాటాను.. అలాగే ఈవీ విపణిలో అగ్రశ్రేణి వాటాను పొందాలని చూస్తున్నట్లు తొషిహిరో సుజుకీ వెల్లడించారు. ఎస్‌యూవీలను కస్టమర్లు డిమాండ్‌ చేస్తున్నందున భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ఈ–విటారాతో ఈవీ ప్రయాణం ప్రారంభం అవుతుందని ఆయన చెప్పారు. వినియోగానికి కాంపాక్ట్‌ ఈవీలు ఉత్తమంగా సరిపోతాయని సుజుకీ అన్నారు. 

ఈవీ విభాగంలో కంపెనీ నుంచి తదుపరి మోడల్‌ చిన్న కారు వచ్చే అవకాశం ఉందని ఆయన మాటలనుబట్టి సుస్పష్టం అవుతోంది. కస్టమర్‌ అవసరాలను అధ్యయనం చేస్తున్నామని, ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజన్‌ కార్లు ట్యాంక్‌ ఇంధనంతో దాదాపు 500 కిలోమీటర్ల పరిధిని ఇస్తాయని సుజుకీ తెలిపారు. ఈ దూరాన్ని ఆచరణ సాధ్యం చేయడానికి ఈ–విటారాను సన్నద్ధం చేస్తున్నట్టు చెప్పారు. భారత్‌ మండపం వేదికగా ఈ–విటారాను కంపెనీ శుక్రవారం (నేడు) ఆవిష్కరిస్తోంది. టాటా నెక్సాన్‌ ఈవీతో పాటు హ్యుండై క్రెటా ఎలక్ట్రిక్, ఎంజీ జడ్‌ఎస్‌ ఈవీలకు ఈ–విటారా పోటీ ఇవ్వనుంది.  

ఇంకా డిమాండ్‌ ఉంది.. 
అమ్మకాలు క్షీణిస్తున్నప్పటికీ భారత్‌లో చిన్న కార్లు నిలిచిపోవని సుజుకీ అన్నారు. ‘సుజుకీ కార్పొరేషన్‌ అనుబంధ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా భారత్‌లో మార్కెట్‌ లీడర్‌గా ఉంది. ద్విచక్ర వాహనాల నుండి నాలుగు చక్రాల వాహనాలకు అప్‌గ్రేడ్‌ అయ్యే అవకాశం ఉన్న 100 కోట్ల మంది ప్రజలకు భవిష్యత్తులో ఇంకా సరసమైన చిన్న కార్లు అవసరం అని విశ్వసిస్తున్నాం. ఈ–విటారా పట్ల కస్టమర్ల నుండి అభిప్రాయాన్ని, ప్రతిస్పందనను అర్థం చేసుకుంటాం. ఆ తర్వాతే చిన్న ఎలక్ట్రిక్‌ కార్ల ప్రణాళికలతో ముందుకు సాగుతాం’ అని వివరించారు. కాగా, మారుతీ సుజుకీ ఇండియా 2024లో 3.24 లక్షల యూనిట్లను ఎగుమతి చేసింది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం.  

ఎలక్ట్రిక్‌ యాక్సెస్‌ సైతం.. 
సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఈ–యాక్సెస్‌ను భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో సందర్భంగా ఆవిష్కరిస్తోంది. సుజుకీ ఇప్పటికే భారత్‌లో పెట్రోల్‌ వర్షన్‌ యాక్సెస్‌–125 విక్రయిస్తోంది.  

భారతీయుడు కూడా సుజుకీ మోటార్‌ ప్రెసిడెంట్‌ కావచ్చు..
మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో ఎవరైనా కావొచ్చని, ఇక్కడ జాతీయత ఒక అంశం కాదని తొషిహిరో సుజుకీ అన్నారు. భారతీయుడు కూడా సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ ప్రెసిడెంట్‌ పదవి చేపట్టవచ్చని స్పష్టం చేశారు. తన తండ్రి దివంగత ఒసాము సుజుకీ 40 సంవత్సరాల క్రితం భారత్‌ వచ్చారని, ఈ మార్కెట్‌ యొక్క అసలైన సామర్థ్యాన్ని ఎవరూ ఊహించలేదని వివరించారు. అయినప్పటికీ భారతదేశం మరియు ఇక్కడి ప్రజలపై ఆయనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. నేడు భారతీయ ఆటోమోటివ్‌ పరిశ్రమ ప్రపంచంలో మూడవ అతిపెద్ద మార్కెట్‌గా అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. 2003లో లిస్టింగ్‌ అయినప్పటి నుండి మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్‌ అలాగే ఎండీ, సీఈవో పదవులను భారతీయ, జపాన్‌ ఎగ్జిక్యూటివ్‌లు అలంకరిస్తున్నారు.  

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)