విరోష్ వెడ్డింగ్ సూపర్ హిట్
Breaking News
ఏజీఆర్ బకాయిలు ఎలా రాబట్టాలో ఏమో!
Published on Wed, 03/04/2026 - 11:49
భారత టెలికాం రంగంలో మార్పులు చోటుచేసుకునేలా ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు బ్యాంకులు, టెలికాం సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగంలో తీవ్ర చర్చకు దారితీసింది. టెలికాం స్పెక్ట్రం అనేది ప్రజా ఆస్తి అని, ఇది ప్రభుత్వ సార్వభౌమత్వ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేస్తూ ఫిబ్రవరి 13, 2026న అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దాంతో దివాలా తీసిన సంస్థల బకాయిల వసూలు ప్రక్రియ చిక్కుల్లో పడినట్టయిందని కొందరు భావిస్తున్నారు.
ముఖ్యంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్), ఎయిర్ సెల్ సంస్థల నుంచి వేల కోట్ల రూపాయల ఏజీఆర్ బకాయిలను(స్పెక్ట్రం వినియోగానికి బదులుగా టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు) ఎలా రాబట్టాలనే అంశంపై టెలికమ్యూనికేషన్స్ విభాగం (డాట్) ఇప్పుడు అటార్నీ జనరల్ నుంచి అత్యవసర న్యాయ సలహాను కోరింది.
స్పెక్ట్రం ప్రభుత్వ ఆస్తి.. ఐబీసీ పరిధిలోకి రాదు
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. టెలికాం స్పెక్ట్రం అనేది ఒక పరిమిత సహజ వనరు. దీనిపై పూర్తి హక్కులు భారత ప్రభుత్వానికే ఉంటాయి. టెలికాం ఆపరేటర్లకు కేవలం షరతులతో కూడిన వినియోగ హక్కు మాత్రమే ఉంటుంది తప్ప, అది వారి సొంత ఆస్తి కాదు. దివాలా కోడ్ (ఐబీసీ) కింద స్పెక్ట్రంను విక్రయించడం లేదా బదిలీ చేయడం సాధ్యపడదు. ఈ నేపథ్యంలో ఆర్‌కామ్, ఎయిర్ సెల్ వంటి సంస్థల ఆస్తులను విక్రయించి తమ అప్పులు తీర్చుకోవాలని భావించిన బ్యాంకులు (రుణదాతలు) ఇప్పుడు చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రుణదాతల ఆందోళన
ఈ తీర్పుతో సుమారు రూ.37,588 కోట్ల ఏజీఆర్ బకాయిల వసూలు ప్రశ్నార్థకంగా మారింది. అందులో ఆర్‌కామ్ బకాయిలు సుమారు రూ.25,199.3 కోట్లుగా ఉన్నాయి. ఎయిర్ సెల్ బకాయిలు సుమారు రూ.12,389 కోట్లుగా ఉన్నాయి. సాధారణంగా ఏదైనా కంపెనీ దివాలా తీస్తే దాని ఆస్తులను అమ్మి ‘వాటర్‌ఫాల్ మెకానిజం’(ఒక కంపెనీ దివాలా తీసినప్పుడు దాని ఆస్తులను అమ్మగా వచ్చిన డబ్బును ఎవరికి ముందు ఇవ్వాలి, ఎవరికి తర్వాత ఇవ్వాలి అని నిర్ణయించే క్రమం) ద్వారా రుణదాతలకు పంచుతారు. కానీ, ఇప్పుడు స్పెక్ట్రం ఐబీసీ పరిధిలో లేకపోవడంతో ప్రభుత్వ బకాయిలు అలాగే ఉండిపోవడమే కాకుండా, ఇతర ఆర్థిక సంస్థల అప్పు రికవరీ కూడా నామమాత్రంగానే మిగిలే ప్రమాదం ఉంది.
టెలికాం రంగంపై ఒత్తిడి
భారత టెలికాం రంగం ఇప్పటికే భారీ అప్పులతో సతమతమవుతోంది. ఆర్థిక సంవత్సరం 2024 నాటికి ప్రధాన ఆపరేటర్ల మొత్తం అప్పు రూ.4.09 లక్షల కోట్లుగా ఉంది. వొడాఫోన్ ఐడియా నెట్వర్క్ బలోపేతం కోసం నిధులు సేకరించినప్పటికీ స్పెక్ట్రం ఫీజులు, అప్పుల నిర్వహణ సవాలుగా మారింది. భారతీ ఎయిర్ టెల్ 75.6% డెట్-టు-ఈక్విటీ నిష్పత్తితో బ్యాలెన్స్ షీట్‌ను నెట్టుకొస్తోంది. టెలికాం కంపెనీలు 5జీ సేవలకు మారుతున్న తరుణంలో భారీ పెట్టుబడులు అవసరం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో నియంత్రణ సంస్థల స్పష్టత లేకపోవడం పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తోంది.
బ్యాంకులు టెలికాం రంగానికి రుణాలు ఇచ్చేటప్పుడు ఇకపై చాలా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటార్నీ జనరల్ ఇచ్చే వివరణ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తదుపరి అడుగు వేయనుంది. ఒకవేళ స్పెక్ట్రంను వేలం వేయడానికి వీలు లేకపోతే ప్రభుత్వం ఈ బకాయిలను ఎలా సర్దుబాటు చేస్తుందనేది తేలాల్సి ఉంది.
ఇదీ చదవండి: బిగ్రిలీఫ్.. ఒకేరోజు భారీగా పడిన బంగారం ధర!
Tags : 1