Breaking News

సామాజిక, ఆర్థిక అవగాహనతోనే వృద్ధికి బూస్ట్‌!

Published on Fri, 01/30/2026 - 14:37

ప్రపంచం మొత్తమ్మీద అతివేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ఒకటి. అయితే దేశీ వార్షిక వృద్ధి రేటు ఏడు శాతం కంటే ఎక్కువగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో భారత్‌ ద్రవ్యలోటును తగ్గించుకోవడంతోపాటు రుణ భారాన్ని కూడా తగ్గించుకోవాలి. దీని ద్వారా ద్రవ్యపరమైన స్థిరీకరణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.

మరోవైపు రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవలి కాలంలో చేపట్టిన చర్యలను పరిశీలిస్తే.. విధానపరమైన రేట్లను తగ్గించే దిశగా అడుగులేస్తున్నట్లు స్పష్టమవుతుంది. తద్వారా వృద్ధికి తోడ్పాటు అందించాలని వ్యాపారాలు, కుటుంబాలపై ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేస్తోంది. ఇదే సమయంలో రాజకీయ, ఆర్థికవేత్తల అభిప్రాయం కొంచెం భిన్నంగా కనిపిస్తోంది. కార్మిక, వ్యవసాయ చట్టాల సవరణ, రైల్వే, రహదారులపై భారీ పెట్టుబడులు, ఆర్థిక ప్రోత్సాహకాలు, తక్కువ పన్నుల రూపంలో ప్రభుత్వం ఇప్పటికే వృద్ధికి అవసరమైన వాతావరణం కల్పించిందని, ఇప్పుడు ప్రైవేట్‌ రంగం దేశీ అభివృద్ధిపై పెట్టుబడులు పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తోంది.

అంతేకాదు.. యూరోపియన్‌ యూనియన్‌తో ఇటీవల కుదుర్చుకున్న ఫ్రీ ట్రేడ్‌ ఒప్పందం కూడా అమెరికా వాణిజ్య విధానాలు, అంతర్జాతీయ జియోపాలిటిక్స్‌ ద్వారా ఏర్పడుతున్న అనిశ్చితులను అధిగమించేందుకు ఉపయోగపడుతుందని అంచనా వేస్తోంది. ఇవన్నీ నాణేనికి ఒక వైపు అయితే.. వాస్తవం మరింత సంక్లిష్టంగా ఉంది.

సామాజిక ఆర్థిక పరిస్థితులు

  • భారత్‌ కచ్చితంగా చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థ కానీ.. తలసరి ఆదాయం మూడు వేల డాలర్ల కంటే తక్కువ. చైనాసహా ఇతర ధనిక దేశాల తలసరి ఆదాయాలు మనకు నాలుగు రెట్లు ఎక్కువ.

  • దేశంలో యాభై శాతం జనాభాకు రేషన్‌ బియ్యం కావాలని ప్రభుత్వం విశ్వసిస్తోంది. అలాగే దిగువ, మధ్య తరగతి వర్గాల వారు మరిన్ని కొనుగోళ్లు చేసేలా చేసే లక్ష్యంతో ప్రభుత్వం జీఎస్టీ రేట్లను తగ్గించింది కూడా.

  • నిరుద్యోగం, తగినన్ని అవకాశాలు లేకపోవడం ఇప్పటికీ దేశంలో అధికంగా ఉంది. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం చాలా తక్కువగా ఉంది.

  • పోషకాహార లోపం సమస్యను ఇప్పటివరకూ పరిష్కరించలేకపోయారు. అలాగే ఆరోగ్య సంరక్షణకు తగిన మౌలిక సదుపాయాలు లేవు.

  • మూలధన, శ్రామిక ఉత్పాదకత కూడా ఇతర దేశాలతో పోలిస్తే తక్కువగానే ఉంది. ఇది ఇటీవలి కాలంలో వేగంగా తగ్గిపోతోంది.

  • రూపాయి బలహీనపడిపోవడం, విదేశీ పెట్టుబడిదారులు భారతీయ మార్కెట్ల నుంచి వేగంగా వైదొలగుతూండటం కూడా ఏమంత మంచి పరిణామాలు కావు. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు భారీగా ఉన్నప్పటికీ విదేశీ రుణభారం తగ్గకపోవడాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి.

  • చాలాకాలంగా దేశీ ఎగుమతుల్లో పెరుగుదల లేకుండాపోయింది. పైగా చైనా ఉత్పత్తులపై ఆధారపడటం ఏటికేటా పెరిగిపోతోంది.

  • బ్యాంకింగ్‌ వ్యవస్థలో రిస్క్‌ క్యాపిటల్‌ తగినంత ఉన్నప్పటికీ అందుకు తగ్గట్టుగా రుణాల కోసం డిమాండ్‌ పెరగడం లేదు. అయితే డిపాజిట్ల క్రెడిట్ల నిష్పత్తి మాత్రం గత కొన్ని నెలల్లో గణనీయంగా పెరిగిపోయింది. పొదుపు తగ్గడం లేదా పెట్టుబడి విషయంలో ప్రాథమ్యాలు మారిపోవడం దీనికి కారణం కావచ్చు. బంగారం, రియల్‌ ఎస్టేట్‌, క్రిప్టో తదితర ఇతర పెట్టుబడి మార్గాలను ఎంచుకుంటూ ఉండవచ్చు.

  • పెద్ద పెద్ద వ్యాపారాలు, అధికాదాయ, ధనిక కుటుంబాలకు మినహా చిన్న, ప్రైవేట్‌ రంగ వ్యాపార వర్గాలు పెట్టుబడులు పెట్టేందుకు జంకుతున్నారు.

  • ఎగుమతులు పెరగకపోవడం, అంతర్జాతీయ వాణిజ్య విపణిలో చైనా ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దిగుమతులపై ఉన్న నిబంధనలను కొన్నింటిని తొలగించింది.

  • భారతీయ నగరాలు కొన్ని ప్రపంచంలోనే అత్యంత కాలుష్యభరిత నగరాల జాబితాలోకి చేరాయి. మహా నగరాల్లో ట్రాఫిక్‌ నిర్వహణ నత్తనడకన సాగుతోంది.

  • రైతులకు గిట్టుబాటు ధర లభించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలపై రుణభారం పెరిగిపోతోంది.

క్లుప్తంగా చెప్పాలంటే.. మనం భారీ ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు, తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న సమాజంగా పరిణమించేందుకు ఇంకా చాలా సమయం పడుతుందన్నమాట. కాబట్టి.. అభివృద్ధిని మరింత పెంచేందుకు ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు పెరగాలి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలతోపాటు చాలా కుటుంబాలు రిస్క్‌ తీసుకునేందుకు సిద్ధంగా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే భారీ పెట్టుబడులతో సామాజిక, ఆర్థిక పురోగతికి పునాదులు వేయాలి.

ప్రజలందరికీ అవసరమైన మౌలిక సదుపాయాలను అందరికీ సమానంగా అందుబాటులోకి తేలేకపోతే మన ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది. ఇది కాస్తా దీర్ఘకాలంలో మధ్యాదాయ దేశంగానే మిగిలిపోయేలా చేస్తుంది. ఈ ట్రాప్‌ నుంచి తప్పించుకోవాలంటే...

  • ద్రవ్య స్థిరీకరణను వాయిదా వేయాలి. ఎందుకంటే.. వడ్డీరేట్లు స్థిరంగా ఉన్నాయి.. తగినంత లిక్విడిటీ అందుబాటులో ఉంది.

  • స్పెక్యులేషన్‌కు అవకాశమున్న రంగాల్లో పెట్టుబడులను నియంత్రించాలి. తద్వారా అందుబాటులో ఉన్న మొత్తం రిస్క్‌ క్యాపిటల్‌ను మెరుగ్గా వాడుకునేందుకు వీలు ఏర్పడుతుంది.

  • నగర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వమే భారీగా పెట్టుబడులు పెట్టాలి. కాలుష్య నివారణకు, ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు, పారిశుద్ధ్యాన్ని పెంచేందుకు, గృహ వసతి కల్పనకు ప్రయత్నాలు ముమ్మరం కావాలి.

  • చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికి ఈక్విటీ మద్దతు కల్పించాలి. రుణ సౌకర్యం కల్పించడం ఒక్కటే సరిపోదు.

  • ప్రభుత్వ రంగ సంస్థల వద్ద వృథాగా పడిఉన్న మొత్తాలను పెట్టుబడుల రూపంలోకి మార్చేలా ప్రోత్సహించాలి. కొన్నేళ్లపాటు డివిడెండ్లను త్యాగం చేయాల్సి వచ్చిన వెనకాడరాదు.

  • ప్రభుత్వంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగులు లేకుండా చూడాలి. ఎనిమిదో పే కమిషన్‌ ద్వారా గ్రామీణ, నగర ప్రాంతాలు రెండింటిలోనూ తగిన వేతన పరిమితులు ఏర్పాటయ్యేలా చూడాలి.

  • పరోక్ష పన్నుల భారాన్ని తగ్గించి, ద్రవ్యోల్బణ నియంత్రణకు చర్యలు తీసుకోవాలి.

  • యూరప్‌తో కుదిరిన ఫ్రీట్రేడ్‌ అగ్రిమెంట్‌ ద్వారా గరిష్టంగా లాభం పొందేందుకు చిన్న, మధ్య తరహా పరిశ్రమలతోపాటు పెద్ద కంపెనీలకు కూడా లక్ష్యాల ఆధారిత ప్రోత్సాహకాలు అందించాలి.

  • ఇన్నోవేషన్‌ ద్వారా విలువను జోడించడంలో భారీ కార్పొరేషన్ల పాత్రను గుర్తించి తగు విధంగా ప్రోత్సహించాలి.

మొత్తమ్మీద చూస్తే.. ఆర్థికాభివృద్ధి విషయంలో ప్రభుత్వ, ఆర్థికవేత్తల వ్యూహంపై పునరాలోచన జరగాలి. వివిధ దేశాలతో చేసుకున్న ఫ్రీట్రేడ్‌ అగ్రిమెంట్‌ ఇస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ప్రభుత్వ సేవల రంగంలో పెట్టుబడులు గణనీయంగా పెంచాలి. భారీ కార్పొరేషన్లకు కాకుండా చిన్న, మధ్యతరహా పరిశ్రమలతోపాటు ఆర్థికపరమైన మద్దతుకు ప్రాధాన్యత కల్పించాలి. అంతర్జాతీయ స్థాయిలో పోటీతత్వం ఉండేందుకు కార్మిక, పెట్టుబడి ఉత్పాదకతలను పెంచే విషయమై దృష్టి పెట్టాలి. యువతకు పబ్లిక్‌ సర్వీసుల్లో అవకాశాలను సృష్టించాలి.

- అనిల్‌ కె.సూద్‌, అధ్యాపకులు, ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ ఇన్‌ కాంప్లెక్స్‌ ఛాయిసెస్‌, హైదరాబాద్‌.

Videos

CheviReddy: కూటమిపై తిరుగుబాటు.. రాబోయే స్థానిక ఎన్నికల్లో గుణపాఠం

Donald : ఆయన భార్య అందగత్తె.. అందుకే పదవి ఇచ్చా!

Vidadala: పోలీసులకు ముడుపులు ఎమ్మెల్యే ప్రత్తిపాటి ఆధ్వర్యంలో పేకాటలు

Chitoor: స్కూల్ బస్సును ఢీకొట్టిన కంటైనర్ 30 మంది విద్యార్థులకు గాయాలు

ఫోన్ ట్యాపింగ్ కేసుపై డీకే అరుణ షాకింగ్ కామెంట్స్

ఫామ్ హౌస్ కు జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్‌తో కీలక భేటీ

Prof Nageshwar: విచారణ చేయకుండా కల్తీ జరిగిందని ఎలా చెప్తారు?

దేవుడితో పెట్టుకొని మహా పాపం చేశారు బాబును బోనులో నిలబెట్టాల్సిందే!

రోజులు లెక్కపెట్టుకోండి..!! పోలీసులకు పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్

Tirumala Laddu: బయటపడ్డ బాబు భోలే బాబా డెయిరీ రహస్యం ఇవిగో ఆధారాలు

Photos

+5

అరుణాచలంలో సందీప్ మాస్టర్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ క్రికెటర్‌ శ్రీకాంత్‌ (ఫోటోలు)

+5

సందడి సందడిగా మేడారం జాతర..కిక్కిరిసిన భక్తులు (ఫొటోలు)

+5

సికింద్రాబాద్‌ దగ్గరలో ఉన్న ఈ ప్రసిద్ధ ఆలయాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా? (ఫొటోలు)

+5

చీరలో వావ్ అనేలా స్రవంతి (ఫొటోలు)

+5

పారిస్ వీధుల్లో సందడిగా హీరోయిన్ 'స్నేహ' ఫ్యామిలీ (ఫోటోలు)

+5

ఉయ్యూరు : నేత్ర పర్వం.. ఊయల ఉత్సవం (ఫొటోలు)

+5

బేగంపేటలో ఆకట్టుకుంటున్న వింగ్స్‌ ఇండియా ప్రదర్శన (ఫొటోలు)

+5

రెచ్చిపోయిన ఆర్సీబీ బౌలర్లు.. ఫైనల్లో RCB ..(ఫొటోలు)

+5

రంగస్థలం బ్యూటీ పూజిత పొన్నాడ లేటేస్ట్ పిక్స్ (ఫొటోలు)