Breaking News

రూపాయి బలం మన చేతుల్లోనే!

Published on Sun, 09/20/2026 - 07:53

భారతదేశం కరెంట్‌ ఖాతా లోటు గతేడాది 22.9 బిలియన్‌ డాలర్లు. ఆ లోటును ఎవరో ఒకరు నిధులతో పూరించాల్సిందే. ఆ ఏడాది మొత్తం విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడి దారులు దాదాపు 16 బిలియన్‌ డాలర్ల అమ్మకందారులుగా ఉన్నారు. మరి ఆ లోటును ఎలా భర్తీ చేశాం? అప్పు ద్వారా. ఈక్విటీ స్థానంలో అప్పు ఉపయోగిస్తూ, మిగిలిన తేడాను తన సొంత రక్షణ నిల్వ (బఫర్‌)తో భర్తీ చేసుకుంటున్న దేశం మనది.

రూపాయిని కేవలం ఒక బ్యారెల్‌ ఆయిల్‌ బలహీనపరచలేదు. నమ్మదగినవిగా ఉండాల్సిన విదేశీ మూలధన రాబడులపై ఆధారపడే నిధుల సమీకరణ నమూనా దాన్ని బలహీనపరి చింది. ఈ రూపాయి విలువను కాపాడటానికి, విదేశీమారక ద్రవ్య నిల్వలను సంరక్షించుకోడానికి ప్రత్యేక మార్గం ద్వారా– ఆగస్టు 31 నాటికి బ్యాంకులు ఎఫ్‌సీఎన్‌ఆర్‌ (బి) డిపాజిట్ల ద్వారా 127.2 బిలియన్‌ డాలర్లు సమీకరించాయి. విదేశీ కరెన్సీ రిస్క్‌లో గణనీయమైన భాగాన్ని ఆర్బీఐ తీసుకోవడం మనం గమనించాల్సిన ఆందోళన కలిగించే సంగతి.

రూపాయి విలువ సమస్యలో కొంతభాగం ఆయిల్‌ వల్లే ఎదురవుతోంది. కానీ ఒక ముఖ్యమైన భాగం మన పెట్టుబ డుల చక్రం (ఇన్వెస్ట్‌మెంట్‌ సైకిల్‌) నుంచి వస్తోంది. మన సొంత పొదుపులతో నిధులు సమకూర్చలేని పెట్టుబడిలోని భాగం బయటినుంచి పెట్టుబడులు రావలసిన అవసరాన్ని సృష్టిస్తుంది. మదుపు, పొదుపుల మధ్య ఉన్న అంతరం గణాంక సమానత్వ సూత్రం ప్రకారం కరెంట్‌ ఖాతా లోటుగా కనిపిస్తుంది.

ఇక్కడే ఒక నిష్పత్తి గురించి ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. అదే అదనపు మూలధన ఉత్పత్తి నిష్పత్తి– ఐసీఓఆర్‌. ప్రతి ఆర్థిక వ్యవస్థలో డబ్బు, ఉత్పత్తి మధ్య ఒక నిశ్శబ్ద మారకపు రేటు ఉంటుంది. ఒక రూపాయి అదనపు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) సృష్టించడానికి ఎన్ని రూపాయల అదనపు పెట్టుబడి అవసరం?  

మూలధన ఉత్పత్తి నిష్పత్తిలో ప్రతి అర పాయింట్‌ తగ్గింపు, అదనంగా ఒక్క రూపాయి పెట్టబడి పెట్ట కుండా, అదనంగా ఒక్క డాలర్‌ విదేశీ మూలధనం తీసుకురాకుండా, ఏడాదికి దాదాపు 0.7 నుంచి 1 శాతం అదనపు వృద్ధిని అందించ గలదు. 2004–07 ఆర్థిక సంవత్స రాల మధ్య భారత దేశం ఐసీఓఆర్‌ దాదాపు 4కి పడిపోయింది. అభివృద్ధి రేటు 9 శాతం ఉండటంలో దాని ప్రభావం కనిపిస్తుంది. కొన్ని సంవత్సరాల పాటు భారత్‌ 9 శాతం అభివృద్ధి రేటు సాధిస్తూ, ప్రపంచం నుంచి అప్పు తీసుకోవడం కాకుండా ప్రపంచానికి అప్పు ఇచ్చింది. 2012 నాటికి ఐసీఓఆర్‌ బాగా దిగజారింది. కరెంట్‌ ఖాతా లోటు జీడీపీలో 4.8 శాతానికి చేరింది. ఇప్పటి వరకు నమోదైన గణాంకాల్లో ఇదే అత్యంత అధిక స్థాయి.

దేశంలో వేగవంతమైన అభివృద్ధి చోదక శక్తి అయిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల) రంగానికి తగినంతగా పెట్టుబడులు అందలేదు. ఈ ఎమ్‌ఎస్‌ ఎమ్‌ఈల్లో 32 కోట్ల మందికి పైగా పనిచేస్తున్నారు. దేశంలోని మొత్తం మూలధన నిల్వలో చాలా చిన్న భాగంతోనే అవి తమవైన ఉత్పత్తిని సృష్టిస్తున్నాయి. చిన్న, ఎగుమతి ఆధారిత, పోటీ ద్వారా పరీక్షించబడే సంస్థలు మూలధనాన్ని వేగంగా ఉత్పత్తిగా మారుస్తాయి.

కేంద్రీకృత మెగా ప్రాజెక్టులు మాత్రం సాధారణంగా దిగుమతి చేసుకున్న విడిభాగాలతో ఆధారపడి విదేశీ ద్రవ్యభారాన్ని పెంచుతూ నెమ్మదిగా పెట్టుబడిని ఉత్పత్తిగా మారుస్తాయి. ఇదే ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలను భారత దేశానికి ఒక శక్తిమంతమైన ఐసీఓఆర్‌ ఇంజిన్‌గా మారుస్తుంది. కానీ వాటిని ఒకదానితో ఒకటి కలిపే అనుసంధాన వ్యవస్థ అదే స్థాయిలో లేదు. ఈ అంతరం నిర్మాణాత్మక ఐసోలేషన్‌. దీర్ఘకాలిక కొనుగోలుదారు లేని సంస్థకు సాంకే తిక స్థాయిని పెంచుకోవడానికి కారణం ఉండదు. కేవలం రుణం ఇవ్వడం వల్ల ఆ సమస్య పరిష్కారం కాదు.

తిరుప్పూర్, లుథియానా వంటి ప్రాంతాల్లో పారిశ్రామిక సమూహాలు ఉన్నాయి. కానీ వాటికి అవసరమైన వ్యవస్థాగత సంస్థలు లేవు. పారిశ్రామిక మండలాలను శక్తిమంతం చేసిన సమష్టి మద్దతు వ్యవస్థ మనదగ్గర లేదు. ఉమ్మడి కొలతలు, ప్రమాణాలు, నాణ్యతా పరీక్షలు, కామన్‌ హీట్‌ ట్రీట్మెంట్, కామన్‌ డిజైన్‌ స్టూడియోలు, స్కిల్‌ యూనివర్సిటీ, రీసెర్చ్‌ సెంటర్, స్టార్ట్‌ అప్‌ ఇకో సిస్టం– ఇలా  ఒకే ప్రాంతంలో ఉండటం పోటీని పెంచుతుంది. ఆ దగ్గరతనాన్ని సామర్థ్యంగా మారుస్తాయి. అందుకు మనకు ‘సెంట్రల్‌ హబ్స్‌’ అవసరం. ఇది సాంప్రదాయ ఇండస్ట్రియల్‌ పార్క్‌కు ఒక మెట్టు పైనే.

మన మూలధన సామర్థ్యాన్ని మెరుగుపరిస్తే, భారత్‌కు తక్కువ విదేశీ ద్రవ్యం అవసరం అవుతుంది. విదేశీ మూల ధనం మనకు అనవసరం అన్నది కాదు లక్ష్యం; మన అవకా శాలను చూసి విదేశీ మూలధనం మన వెంట రావడం లక్ష్యం.  

- పి.వి. విజయ్‌ కుమార్‌

వ్యాసకర్త యూరొటెక్‌ గ్రూప్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ 

Videos

నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై

టీడీపీ నేతపై జర్నలిస్ట్ హిమబిందు సంచలన ఆరోపణలు

రాకాతో హాలీవుడ్ ను టార్గెట్ చేసిన అల్లు అర్జున్?

తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు..

గుంటూరులో మరో లాకప్ డెత్.. అడ్వకేట్ రజిని స్ట్రాంగ్ వార్నింగ్

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆరోపణలపై ప్రసన్న ఫైర్

చంద్రబాబుకు బిగ్ షాక్.. తిరుమల లడ్డూపై ఈడీ సంచలన ప్రకటన

పద్థతి మార్చుకో.. MLAపై రెచ్చిపోయిన చంద్రబాబు

నిండా ముంచేసిన లలితా జువెల్లరీ స్టాక్.. అసలేం జరిగిందంటే?

అమలాపురంలో భారీ పేలుడు.. ఇల్లు ధ్వంసం

Photos

+5

హాఫ్ శారీలో మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ (ఫోటోలు)

+5

నాని ది ప్యారడైజ్ స్టైలిష్ లుక్‌.. (ఫోటోలు)

+5

గణేశుడి సన్నిధిలో విజయ్‌ దేవరకొండ..(ఫోటోలు)

+5

అందాల అషు.. (ఫోటోలు)

+5

కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు)

+5

ఎర్రచీరలో శోభిత ధూళిపాళ.. చూపుతిప్పుకోనివ్వని అందాలు (ఫోటోలు)

+5

గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు

+5

బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు)

+5

నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు)

+5

తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు)