కీచక డాక్టర్ కి బడితపూజ.. చెప్పులతో దేహశుద్ధి చేసిన మహిళలు
Breaking News
మహిళలకు ప్యాసివ్ పెట్టుబడుల దన్ను
Published on Mon, 03/16/2026 - 08:23
దేశీయంగా పర్సనల్ ఫైనాన్స్ వ్యవహారాల్లో నెమ్మదిగానే అయినా, గమనించతగ్గ మార్పులే జరుగుతున్నాయి. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. డేటా ప్రకారం గత ఐదేళ్లలో కుటుంబాల ఆర్థిక ప్రణాళికల్లో మహిళల పాత్ర గణనీయంగా పెరిగింది. ప్రతి నలుగురు ఫండ్ మదుపరులలో ఒకరు మహిళే ఉంటున్నారు. ఇది పెట్టుబడుల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుండటాన్నే కాకుండా, వివిధ అసెట్స్, స్కీముల విషయంలో మారుతున్న వారి దృక్పథాన్ని కూడా తెలియజేస్తోంది.
పెట్టుబడుల విషయంలో మహిళలు సాధారణంగా చాలా జాగ్రత్తగా, క్రమశిక్షణతో వ్యవహరిస్తారు. లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుంటారు. మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకుని, తమ లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యాలకు తగ్గ అవకాశాలు పరిశీలిస్తారు. అవసరమైతే నమ్మకమైన ఆర్థిక సలహాదారులను కూడా సంప్రదిస్తారు. ఈ నేపథ్యంలో మహిళలకు ప్యాసివ్ ఇన్వెస్టింగ్, అంటే ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెట్టడం ఒక సులభతరమైన, సరైన ప్రారంభంగా నిలుస్తోంది.
తక్కువ ఖర్చుతో, స్పష్టమైన నియమాల ఆధారంగా ఉండే ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అనేది కోర్ పోర్ట్‌ఫోలియోను తీర్చిదిద్దుకోవడంతో పాటునిర్దిష్ట రంగాలు లేదా థీమ్‌లలో విస్తృతంగాఇన్వెస్ట్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అందుకే వీటిపై ఆసక్తి పెరుగుతోంది. తాజా యాంఫీగణాంకాల ప్రకారం, ప్రస్తుతం ప్యాసివ్ ఫండ్ల నిర్వహణలో దాదాపు రూ. 15 లక్షల కోట్ల ఆస్తులు ఉండటం ఇందుకు నిదర్శనం. ఇందులోరంగాలవారీ ఇండెక్స్‌లు, గోల్డ్, సిల్వర్లాంటి కమోడిటీ ఇండెక్స్‌లు, వేల్యూ .. క్వాలిటీ థీమ్ ఆధారిత ఫండ్స్‌లో కూడా పెట్టుబడులు పెరుగుతున్నాయి.
ప్రణాళికాబద్ధంగా..
డిజిటల్ మౌలిక సదుపాయాల పురోగతితో మహిళలకు పెట్టుబడి సాధనాలు మరింత అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా వివిధ సాధనాలవ్యాప్తంగా ఇన్వెస్ట్ చేయగలిగే సామర్థ్యాలు వచ్చినప్పుడే సిసలైన సాధికారత లభించినట్లవుతుంది. విదేశీ పర్యటన కోసం లేదా ఉన్నత విద్య కోసం నిధులను సమకూర్చుకోవడం, కొత్త వాహనం కొనుగోలు చేయడం, పిల్లల చదువులు, ఆరోగ్యం, రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత.. ఇలా అనేక లక్ష్యాలు ఉండొచ్చు. ఇలాంటివాటిని సాకారం చేసుకునేందుకు వివిధ ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌ల్లాంటి ప్యాసివ్ ఫండ్స్ ఆకర్షణీయంగా ఉంటున్నాయి.
బ్లూచిప్, లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే నిఫ్టీ 100 లేదా నిఫ్టీ 50 ఇండెక్స్‌ను అనుసరించే ఈక్విటీ ఇండెక్స్ ఫండ్ లేదా ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెట్టుబడుల ప్రస్థానాన్ని ప్రారంభించవచ్చు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు ఇది బలమైన పునాదిగా కూడా నిలుస్తుంది. అలాగే, మరింత మెరుగైన ఫలితాల కోసం ఫ్యాక్టర్ ఆధారిత ప్యాసివ్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. వేల్యూ, క్వాలిటీ, లో వోలటాలిటీ లేదా మొమెంటంలాంటి లక్షణాల ఆధారంగా ఇవి ఉంటాయి. తరతరాలుగా భారత మహిళలకు పసిడి, వెండితో ఎనలేని అనుబంధం ఉంటోంది.
ఈ నేపథ్యంలో గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లు లేదా ఫండ్ ఆఫ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలో వీటికి కూడా చోటు కల్పించవచ్చు. సరైన స్థాయిలో కేటాయిస్తే, అనిశ్చితుల్లో ఈక్విటీలు నెమ్మదించినా, పోర్ట్‌ఫోలియోపై తీవ్ర ప్రభావం పడకుండా హెడ్జింగ్ సాధనంగా కూడా ఇవి రక్షణ కలి్పస్తాయి. ఇండెక్స్ ఫండ్లలో బాండ్స్లాంటి స్థిరాదాయాన్ని ఇచ్చే సాధనాలకు సంబంధించిన ఫండ్స్ కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూరిటీలాగా, ముందుగా నిర్ణయించిన మెచ్యూరిటీ తేదీతో ఉంటాయి. ఇలాంటివి సమీప భవిష్యత్తులో నిర్దిష్ట ఆరి్థక లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడతాయి.
సిప్ శ్రేయస్కరం..
ఇక సిప్ విధానం ద్వారా ప్యాసివ్ ఫండ్స్‌లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం. దీనితో పెట్టుబడుల విషయంలో క్రమశిక్షణ పెరుగుతుంది. అలాగే, రూపీ కాస్ట్ యావరేజింగ్ ప్రయోజనం కూడా లభిస్తుంది. ఇండెక్స్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్‌లలో సిప్ మార్గంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా క్రమంగా పెట్టుబడిని పెంచుకోవచ్చు. మార్కెట్ టైమింగ్ గురించి ఆందోళన చెందనక్కర్లేదు. రోజువారీ వార్తల ప్రభావంతో పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితీ ఉండదు.
చివరిగా చెప్పేదేమిటంటే దేశీయంగా మహిళలు గతంలో ఎన్నడూ లేనంత స్థాయి లో సంపదను నిర్వహిస్తున్నారు. వారిలో ఖర్చులపై అవగాహన పెరిగింది. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై ఫోకస్ పెరిగింది. వారి పెట్టుబడులు ఇప్పుడు మరింత ప్రణాళికాబద్ధంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండెక్స్ ఫండ్స్ అనేవి మహిళా ఇన్వెస్టర్లు తమ సామర్థ్యాలను, తెలివైన పెట్టుబడి నిర్ణయాలుగా మార్చుకునేందుకు ఒక చక్కని, సరళమైన అవకాశాన్ని కల్పిస్తాయి. మారే లక్ష్యాలు, పెరిగే బాధ్యతలకు అనుగుణంగా పెట్టుబడులను మల్చుకునేందుకు పునాదిగా నిలుస్తాయి.
Tags : 1