ఇదిగో ఇన్వెస్ట్‌మెంట్‌కూ ఇదే సూత్రం..

Published on Mon, 04/28/2025 - 12:17

మీరో రోడ్‌ ట్రిప్‌కు బైల్దేరారు. కారు విండోలు కిందికి దించి, స్వేచ్ఛగా, ఝామ్మంటూ, జోరుగా దూసుకెళ్తున్నారు. దారిలో ఏ అడ్డంకి వచ్చినా దాటేయగలను అనే ఆత్మవిశ్వాసంతో వెళ్తున్నారు. కానీ, ఇంతలోనే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కుండపోతగా వాన మొదలైంది. ముందేమీ సరిగ్గా కనిపించడం లేదు. కారు పట్టు తప్పిపోతోంది. అప్పటిదాకా థ్రిల్లింగ్‌ అనిపించిన జర్నీ కాస్తా, ఒక్కసారిగా గందరగోళంగా మారిపోయింది. అప్పుడు అనిపిస్తుంది. మీరు అనుకున్నంత స్థాయిలో రిస్కులను ఎదుర్కొనేంత సన్నద్ధత మీకు లేదేమోనని.  

ఇదిగో, పెట్టుబడులకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. చాలా మంది ఇన్వెస్టర్లకు తాము చాలా రిస్కు తీసుకోగలమనో లేదా ఒక మోస్తరుగా తీసుకోగలమనో తమ తమ రిస్కు సామర్థ్యాల విషయంలో ఒక భావన ఉంటుంది. కానీ వాస్తవ ప్రపంచంలో పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఈ ధీమాను విపరీతంగా పరీక్షిస్తాయి. మార్కెట్లో ఒడిదుడుకులను ఆచరణలో ఎదుర్కొనడమనేది థియరీలో చెప్పినంత సులువైన వ్యవహారం కాదు. ఇలా, మనకు ఉన్నాయనుకునే రిస్కు సామర్థ్యాలకు, వాస్తవంగా ఉన్న సామర్థ్యాలకు మధ్య వైరుధ్యం నెలకొన్నప్పుడు, భావోద్వేగాలకు లోనై, నిర్ణయాలు తీసుకుంటాం.

కంగారుపడిపోయి, ముందుగానే తప్పుకుంటాం లేదా సామర్థ్యానికి మించి మరింత రిస్కు తీసుకుంటాం. ఊహించుకుంటున్న సామర్థ్యాలకు, వాస్తవ సామర్థ్యాలకు మధ్య వ్యత్యాసాన్ని ముందుగానే గుర్తించి, క్రియాశీలకంగా చక్కదిద్దుకుంటే సంపద సృష్టికి దోహదపడుతుంది. లేకపోతే సంపద నాశనానికి దారితీస్తుంది. మరికొందరు ఇన్వెస్టర్లు, మరింత ఎక్కువగా రిస్కులు తీసుకోగలిగినప్పటికీ, తమకు అంత సామర్థ్యం లేదని భావిస్తుంటారు. ఇలా మరీ మెతక వైఖరి వల్ల వృద్ధి అవకాశాలను కోల్పోతుంటారు.  

అవగాహన ఉండాలి..  
రిస్కు సామర్థ్యం అనేది ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడుల వ్యవధి, వ్యక్తిత్వాన్ని బట్టి ఇన్వెస్టరు ఏ స్థాయిలో రిస్కును తీసుకోగలుగుతారనేది చూచాయగా తెలియజేస్తుంది. ఇక రిస్క్‌ సహనశీలత అనేది, మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నప్పుడు ఇన్వెస్టరు వాస్తవంగా – ఇటు భావోద్వేగాలపరంగా అటు ఆర్థికంగా – ఎంత వరకు రిస్కు తీసుకుంటారనేది తెలియజేస్తుంది. ఉదాహరణకు ఈక్విటీల విషయంలో తాను ఎంతైనా రిస్కు తీసుకోగలనని ఓ ఇన్వెస్టరు అనుకోవచ్చు. కానీ మార్కెట్లు పతనమవుతున్నప్పుడు కంగారుపడిపోయి, అమ్మేయొచ్చు. అంటే, తాము రిస్కుల విషయంలో ముందుగా ఊహించుకున్న దానికన్నా సహనశీలత చాలా తక్కువగా ఉందని అర్థం. ఇలా ఊహించుకునే దానికి, వాస్తవానికి మధ్య ఉండే వ్యత్యాసం వల్ల భావోద్వేగాలకు లోనై నిర్ణయాలు తీసుకోవడంతో ఆర్థిక ప్రణాళికలు తల్లకిందులవుతాయి.  

రిస్కులపై భ్రమలు.. 
మనం ఊహించుకునే రిస్కు సామర్థ్యాలకు, వాస్తవ పరిస్థితికి మధ్య వ్యత్యాసాలకు చాలా కారణాలే ఉంటాయి: 
మార్కెట్‌ పరిస్థితులు: బుల్‌ మార్కెట్లు మనకు ఆత్మవిశ్వాసం ఉన్నట్లు భ్రమింపచేస్తాయి. మరోవైపు, మార్కెట్లు పతనమైనప్పుడు తీవ్రమైన భయం వేస్తుంది. దీంతో ఇన్వెస్టర్లు, ముందూ వెనుకా ఆలోచించకుండా తమ రిస్కు సామర్థ్యాలను పక్కనపెట్టి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు.  

అనుభవం: మొదటిసారిగా ఇన్వెస్ట్‌ చేస్తున్నవారు, మార్కెట్ల పతనాన్ని తొలిసారి చవిచూసే వరకు తాము ఎలాంటి రిస్కులనైనా ఎదుర్కొనగలమనే భావనలో ఉండొచ్చు. కానీ అనుభవజ్ఞులైన ఇన్వెస్టర్లకు మాత్రమే వాస్తవిక దృక్కోణం ఉంటుంది.  
భావోద్వేగాలపరమైన పక్షపాత ధోరణులు: నష్టాన్ని అస్సలు ఇష్టపడకపోయే ధోరణి ఉంటే, లాభాలు ఎంత వచ్చినా గానీ కాస్తంత నష్టం వస్తే చాలా కష్టంగా అనిపించేలా చేస్తుంది. అలాగే, ఇటీవలి కాలంలో కనిపించిన ధోరణుల వైపు మొగ్గు చూపే ఆలోచన విధానం ఉంటే, మార్కెట్లు స్వల్పకాలిక ఒడిదుడుకులకు లోనైనా ఇన్వెస్టర్లు భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి తలెత్తుతుంది. గుంపును అనుసరించి  ముందుకెళ్లే ధోరణి, ఇన్వెస్టర్లు తమకు అనువు కాని రిస్కులను తీసుకునేలా ప్రేరేపిస్తుంది.  

జీవితంలో మార్పులు: యువ ప్రొఫెషనల్స్‌కు కాస్తంత రిస్కులు తీసుకునే సామర్థ్యాలు ఎక్కువే ఉండొచ్చు. కానీ పెళ్లి, పిల్లలు, రిటైర్మెంట్‌కు దగ్గరవుతుండటంలాంటి పరిస్థితుల కారణంగా ప్రాధాన్యతలు మారొచ్చు. దానికి అనుగుణంగానే రిస్క్‌ సామర్థ్యాలూ మారొచ్చు.  
కాలవ్యవధిపై భ్రమలు: పెట్టుబడులు మొదలెట్టినప్పుడు తమకు బోలెడంత సమయం ఉందని ఇన్వెస్టర్లు భావిస్తుంటారు. కానీ స్వల్పకాలికంగా నష్టాలు ఎదురైనప్పుడు, అసలు సమయమే లేదనే రీతిలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు.  

సామర్థ్యాలకు తగ్గట్లుగా పెట్టుబడులు.. 
ఇన్వెస్టర్లు తమ వాస్తవిక రిస్కు సామర్థ్యాల గురించి అర్థం చేసుకున్న తర్వాత, తదనుగుణంగా పోర్ట్‌ఫోలియోను సరి చేసుకోవడం చాలా కీలకం. ఈక్విటీలు, ఫిక్సిడ్‌ ఇన్‌కం, ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాలతో పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యాన్ని పాటిస్తే, రిస్కులను సమర్ధంగా ఎదుర్కొనేందుకు వీలవుతుంది. పెట్టుబడులను దీర్ఘకాలికంగా కొనసాగించడం ద్వారా ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్లు (సిప్‌) ఉపయోగపడతాయి. జీవితంలోని దశలు, మార్కెట్‌ పరిస్థితులను బట్టి రిస్క్‌ సామర్థ్యాలు మారిపోతుంటాయి కాబట్టి, మధ్యమధ్యలో పోర్ట్‌ఫోలియోను సమీక్షించుకుంటూ ఉండాలి.

క్రమం తప్పకుండా రీబ్యాలెన్స్‌ చేసుకుంటూ ఉంటే రిస్కులకు తగ్గట్లుగా మెరుగైన రాబడులను పొందేందుకు సాధ్యపడుతుంది. ప్రొఫెషనల్‌ సలహాలను తీసుకుంటే మనకు అనువైన వ్యూహాలను అమలు చేసేందుకు వీలవుతుంది. పెట్టుబడులు విజయవంతం కావాలంటే మనపై మనకు అవగాహన ఉండటం ముఖ్యం. తప్పుగా అంచనా వేసుకుంటే, భావోద్వేగాలపరమైన నిర్ణయాలతో అంతిమంగా ఆర్థిక ప్రణాళికలు పట్టాలు తప్పుతాయి. క్రమం తప్పకుండా సమీక్షించుకుంటూ ఉండటం, క్రమశిక్షణతో పెట్టుబడులు, సమతుల్యమైన వ్యూహాలు వంటి అంశాలు  లక్ష్యాల సాధన దిశగా ముందుకెళ్లేందుకు ఉపయోగపడతాయి.

ఎలా గుర్తించాలి.. 
వాస్తవిక రిస్క్‌ సామర్థ్యాలను అర్ధం చేసుకోవాలంటే గతంలో చేసిన పెట్టుబడుల ధోరణులను ఒకసారి విశ్లేషించుకోవాలి. మార్కెట్లు పతనమైనప్పుడు కూడా పెట్టుబడులను కొనసాగించారా లేదా కంగారు పడిపోయి, నిష్క్రమించారా? అనే అంశాన్ని పరిశీలించుకోవాలి. ఆదాయ స్థిరత్వం, పెట్టుబడుల కాలవ్యవధి, ఒడిదుడుకుల విషయంలో భావోద్వేగాలపరమైన స్పందన తదితర అంశాలను పరిగణనలోకి తీసుకునే రిస్క్‌ ప్రొఫైలింగ్‌ సాధనాలు ఇందులో కాస్త సహాయపడగలవు. ఇక అసెట్లకు జరిపే కేటాయింపులు కూడా మనం ఎంతవరకు రిస్కులను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉంటామనే విషయాన్ని తెలియజేస్తుంది.

ఉదాహరణకు పెట్టుబడుల విషయంలో చాలా దూకుడుగా, చురుగ్గా ఉంటాననుకునే వ్యక్తి ఎక్కువగా ఫిక్సిడ్‌ ఇన్‌కం అసెట్స్‌వైపే మొగ్గు చూపుతున్నారంటే, తాము ఊహించుకుంటున్న దానికన్నా వారి రిస్క్‌ సామర్థ్యాలు తక్కువగా ఉన్నట్లు భావించవచ్చు.  పెట్టుబడుల కాలవ్యవధి, ఆర్థిక లక్ష్యాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. స్వల్పకాలిక లిక్విడిటీ అవసరాలు ఉన్న వారితో పోలిస్తే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు సాధారణంగా కాస్తంత ఎక్కువ రిస్కులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక చిన్న స్ట్రెస్‌ టెస్టుతో వాస్తవ పరిస్థితులను అంచనా వేసుకోవచ్చు. పోర్ట్‌ఫోలియో 20 శాతం పడిపోయినా ఎలాంటి మార్పులు, చేర్పులూ చేయకుండా ఓర్చుకోగలమా అనే చిన్న ప్రశ్న వేసుకుంటే మన రిస్క్‌ సామర్థ్యాలు మనకు అర్థమవుతాయి.

- రోహిత్‌ మట్టూ, నేషనల్‌ హెడ్‌ – రిటైల్‌ సేల్స్, యాక్సిస్‌ మ్యుచువల్‌ ఫండ్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)