ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకున్నాడు చంపేశాడు
Breaking News
నూతన సంవత్సరంలో కొత్త మార్పులతో ముందుకు..
Published on Mon, 04/06/2026 - 12:06
కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు.. ఇంచుమించుగా కొత్త తెలుగు సంవత్సరమైన పరాభవ కూడా మొదలు.. కొత్త ఆదాయపు చట్టం అమల్లోకి వచ్చింది. కొత్త నియమాలు.. కొత్త దేవుడొచ్చాడు. దేవుడు మారాడు కానీ మన బాధ్యతలు మారలేదు. కర్తవ్యం యథాతథం. పూజా యథాతథమే. సకాలంలో కర్తవ్యం పూర్తి చేస్తే అనుగ్రహం, శాంతి కలుగుతాయి. లేదంటే ఆగ్రహం, అశాంతి.
ఆదాయ పన్ను చట్టం 2025లో సాంకేతికంగా చూస్తే సెక్షన్లు, చాప్టర్లు తగ్గాయి. అక్షరమాల పోయి, అంకెల మాల అయ్యింది. చాలా విషయాల్లో హేతుబద్ధీకరణ జరిగింది. మాటిమాటికీ బ్రాకెట్లు వాడేవారు. ఇప్పుడవి లేవు. క్లాజులు, సబ్‌క్లాజులు తగ్గాయి. వివరణలు తగ్గాయి. సులభంగా, అర్థమయ్యేలా ఉంది. కొత్త చట్టం, నియమాలు అమలయ్యే వేళ, మార్పుల గురించి తెలుసుకుందాం.
ఇక నుంచి ఆర్థిక సంవత్సరాన్ని ఆదాయపు సంవత్సరం, పన్ను సంవత్సరం అంటారు. మొన్నటి వరకు రెండు పదాలు.. అంటే ఒకటి ఆదాయపు సంవత్సరం, రెండోది మదింపు సంవత్సరంగా ఉండేవి. ఇప్పుడు ఒకే పదం.. ఒకే సంవత్సరం. ప్రస్తుతం మనం 2026–27 పన్ను సంవత్సరంలో ఉన్నాం.
జీతం రూపంలోని ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఒక్కొక్క అంశం దగ్గర ఒక్కొక్క నిర్వచనం. ‘జీతం’ అంటే ఏమిటనేది ఉండేది. ఇప్పుడు ఏ అంశమైనా ఒకే నిర్వచనం. దీని వల్ల ఎటువంటి తికమక ఉండదు. తప్పుడు లెక్కలకు ఆస్కారం లేదు.
మనం ఫైల్ చేసిన ఐటీఆర్ తప్ప మిగతా అన్నింటి నంబర్లు మారిపోయాయి. దశాబ్దాల చరిత్ర గల ఫారం 16 మారిపోతోంది. కొత్త నంబరు 130. ఈ మార్పుకంటే అందులోని అంశాల్లో మార్పులు మరింత ముఖ్యమైనవి. ఇన్నాళ్లు, కేవలం ఆదాయం, పన్ను భారం, టీడీఎస్ వివరాలకే పరిమితం అయింది. ఇప్పుడు ఫోకస్ మారింది. కొత్త చట్టంలోని నియమాల ప్రకారం ‘పన్ను సంవత్సరం’ అని ప్రస్తావిస్తారు. ఉద్యోగి వివరాలను అటు యజమాని తెలియజేస్తారు. పన్ను భారమే కాకుండా ఏ రేటు ప్రకారం ఎంతెంత అనేది చెప్పాలి. అంతే కాకుండా ఈ సమాచారం టీడీఎస్ రిపోర్టింగ్లోని అంశాలకు సరిపోలి ఉండాలి. అప్డేటెడ్ సిస్టంతో ఇంటిగ్రేట్ చేస్తున్నారు. ఫారం 130లోని అంశాలు యజమాని బాధ్యత అయినప్పటికీ, మీరు 130లోని ప్రతి అంశాన్ని చెక్ చేసుకోండి.
అలాగే 26ఏఎస్/ఏఐఎస్‌కి స్వస్తి పలికారు. కొత్త నంబరు 168. పేరులో చిన్న మార్పు..నంబరులో మార్పు. 26ఏఎస్ కేవలం టీడీఎస్, టీసీఎస్, ట్యాక్స్ చెల్లింపుల వరకే పరిమితం. కానీ 168లో ఫోకస్ అంతా విశ్వమయం. అన్ని ఆర్థిక వ్యవహారాల సమాచారం, ట్రాకింగ్ ఉంటుంది. ట్యాక్స్ పద్దులకే 26ఏఎస్ పరిమితం కాగా, ఫారం 168లో పన్ను పద్దులతో పాటు షేర్లు, డిపాజిట్లు, ఇన్వెస్ట్‌మెంట్స్, ఖర్చులు మొదలైనవి కూడా
ఉంటాయి.ఇక్కడ గమనించాల్సినదేమిటంటే ఫారం 130 అనేది యజమాని బాధ్యత. ఫారం 168 డిపార్టుమెంటు వారి బాధ్యత. కానీ ఈ రెండింటి వల్ల ప్రభావితం అయ్యేది మీరు. మీ ప్రమేయం లేకపోయినా ఇవి మిమ్మల్ని శాసిస్తాయి. జాగ్రత్తగా పరిశీలించండి.
మరో ఫారం 16ఏ కాస్తా ఫారం 131గా అవతారం ఎత్తుతోంది. జీతం కాని ఆదాయాలన్నింటి మీద టీడీఎస్‌లు ఇందులో ఉంటాయి. ఫారం 131 కూడా కొత్త చట్టానికి, కొత్త రూల్స్‌కి అనుసంధానంగా ఉంటుంది. మీరు చెక్ చేసుకోండి.
ఉద్యోగస్తులకు శుభవార్త. విద్య అలవెన్స్, హాస్టల్ అలవెన్స్, గిఫ్ట్ ఓచర్ లిమిట్, భోజన కూపన్ అలవెన్స్ మొదలైన వాటి మీద పరిమితిని గణనీయంగా పెంచారు. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంతో సమంజసంగా, సమయోచితంగా ఆచరణాత్మకమైన విధంగా ఈ పరిమితులు పెంచారు.
ఇక హెచ్‌ఆర్‌ఏ విషయంలో గతంలో 50 శాతం పరిమితిని కేవలం నాలుగు ప్రధాన నగరాలకే పరిమితం చేసేవారు. ఇప్పుడు మరికొన్ని నగరాలకు విస్తరింపచేశారు. అందులో హైదరాబాద్ ఉంది.
పాన్ నంబరుని కంపల్సరీగా తెలియజేసే పరిమితులను పెంచారు.
ఇన్‌కం ట్యాక్స్‌తో సంబంధం లేకపోయినా, రిజర్వ్ బ్యాంకు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆన్‌లైన్ చెల్లింపుల విషయంలో కూడా మార్పులు వచ్చాయి. వివరాలు రాబోయే రోజుల్లో మరింతగా తెలుసుకుందాం.
Tags : 1