Vijayawada : చెవిరెడ్డి రిలీజ్.. జైలు వద్ద YSRCP సంబరాలు
Breaking News
ఎకనామిక్ సర్వే 2026.. మారథాన్ వేగం అవసరం: సీఈఏ
Published on Thu, 01/29/2026 - 13:53
దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే ఆర్థిక సర్వే 2026ను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ సర్వేలోని ముఖ్యాంశాలను వివరిస్తూ.. మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా భారతదేశం తన వ్యూహాలను ఎలా మార్చుకోవాలో స్పష్టం చేశారు.
‘ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చితి దృష్ట్యా భారతదేశం నిరాశావాదం కంటే వ్యూహాత్మక సంయమనాన్ని ప్రదర్శించాలని సర్వే సూచించింది. భారతదేశం ఇప్పుడు ఒకే సమయంలో మారథాన్, స్ప్రింట్ రెండింటినీ ఎదుర్కోవాలి. అంటే దీర్ఘకాలిక వృద్ధిని (మారథాన్) కొనసాగిస్తూనే, తక్షణ సవాళ్లను ఎదుర్కోవడంలో వేగాన్ని (స్ప్రింట్) ప్రదర్శించాలి. సరఫరా వ్యవస్థలో స్థిరత్వం, వనరుల సృష్టి, దేశీయ వృద్ధిని పెంచడం, అనిశ్చితులను తట్టుకునే సామర్థ్యం చాలా కీలకం’ అన్నారు.
పెరిగిన నిడివి
ఈ ఏడాది ఆర్థిక సర్వే గతంలో కంటే భిన్నంగా, మరింత సమగ్రంగా రూపొందించారు. ఇందులో 17 అధ్యాయాలున్నాయి. మునుపటి కంటే సర్వే నిడివి పెరిగింది. పదిహేడు అధ్యాయాలతో కూడిన ఈ ఎడిషన్ ఆర్థిక వ్యవస్థలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా విశ్లేషించింది. గతంలో అధ్యాయాల అమరిక ఆర్థిక అంశాల ప్రాధాన్యతపై ఆధారపడేది, కానీ ఇప్పుడు జాతీయ అవసరాలు, సమయ-ఔచిత్యం (Time-relevance) ఆధారంగా సిద్ధం చేశారు.
రాజకీయాల ఆధారంగానే విధానాలు
2026లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గడ్డుకాలాన్ని ఎదుర్కోవచ్చని సర్వే హెచ్చరించింది. 2025 నాటి పరిస్థితులే కొనసాగినప్పటికీ భద్రతా పరంగా ప్రపంచం మరింత బలహీనంగా మారుతుందని విశ్లేషించింది. ‘భద్రత పరిధి సన్నగిల్లడంతో చిన్నపాటి ఆర్థిక లేదా రాజకీయ ఒత్తిళ్లు పెద్ద వ్యవస్థాగత నష్టాలకు దారితీయవచ్చు. ప్రపంచ దేశాల మధ్య అపనమ్మకం పెరుగుతోంది. ఆర్థిక వ్యవస్థలు సమీకృతంగా ఉన్నా కొన్ని సమస్యలకు అవకాశం ఉంది. భౌగోళిక రాజకీయ పోటీ తీవ్రమవ్వడం వల్ల వాణిజ్య విధానాలు ఇప్పుడు భద్రత, రాజకీయాల ఆధారంగానే రూపొందుతున్నాయి’ అని సర్వేలో తెలిపారు.
కరెన్సీ, ఎగుమతుల మధ్య సంబంధం
‘సాధారణంగా ఒక దేశ కరెన్సీ బలంగా ఉండాలంటే ఆ దేశం విదేశీ మారక ద్రవ్యాన్ని (Forex) నిరంతరం ఆర్జించాలి. దీనికి తయారీ రంగ పోటీతత్వం, ఎగుమతులు వెన్నెముక వంటివి. ఎగుమతులు పెరిగితే రూపాయి విలువ స్థిరంగా ఉంటుంది. తయారీ రంగం బలోపేతమైతే దిగుమతులపై ఆధారపడటం తగ్గి, కరెన్సీ మరింత బలోపేతం అవుతుంది’ అని సర్వే తెలిపింది.
ఇదీ చదవండి: గోల్డ్ ధర.. గుండె దడ!
Tags : 1