బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
Breaking News
రష్యా-ఉక్రెయిన్ వార్.. రహస్య రికార్డులు లీక్!
Published on Mon, 11/09/2026 - 09:05
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆ దేశ సైనిక వ్యవస్థను, జనాభాను తీవ్రంగా కుదిపేస్తోంది. సరిహద్దుల్లో జరుగుతున్న రక్తపాతానికి సంబంధించి ఇప్పటివరకు మాస్కో అధికారికంగా గోప్యత పాటిస్తూ వస్తున్నప్పటికీ తాజాగా వెలుగులోకి వచ్చిన రహస్య పత్రాలు దిగ్భ్రాంతికర నిజాలను బట్టబయలు చేశాయి. రష్యా గణాంకాల సంస్థ ‘రోస్సాట్’కు చెందిన రహస్య డాటా లీక్ కావడం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ లీకైన మరణాల రికార్డుల విశ్లేషణ ప్రకారం.. ఉక్రెయిన్ యుద్ధ రంగంలో మరణించిన రష్యా సైనికుల సంఖ్య ఏకంగా 4,50,000 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
పెరుగుతున్న మరణాల రేటు
ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థల నివేదికల ఆధారంగా ఈ యుద్ధం మొదలైన నాటి నుంచి రష్యాలో సైనిక మరణాల సంఖ్య ఊహించని విధంగా పెరిగింది. బయటపడిన ఈ డాటా వివరాల ప్రకారం.. 2022లో యుద్ధం ప్రారంభమైన కొత్తలో ఉన్న మరణాల రేటుతో పోలిస్తే రాను రాను పరిస్థితి మరింత దిగజారింది. వార్షికం యుద్ధ సంబంధిత మరణాలు 2022 నాటితో పోలిస్తే తరువాతి సంవత్సరాల్లో భారీగా పెరిగాయి. కేవలం యుద్ధ క్షేత్రంలోనే కాకుండా తీవ్రమైన గాయాలపాలై ఏడాది గడిచాక మరణించిన వారు, అనారోగ్యాలు, ఇతర కారణాలతో ప్రాణాలు కోల్పోయిన సైనికుల వివరాలు కూడా ఈ సివిల్ రిజిస్ట్రీ రికార్డుల ద్వారా బట్టబయలయ్యాయి.
భూభాగం కోసం భారీ రక్తపాతం
ఫ్రంట్‌లైన్‌లో రష్యా సాధిస్తున్న కొద్దిపాటి ప్రాదేశిక పురోగతికి సైతం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఉక్రెయిన్‌లో ప్రతి కిలోమీటర్ భూభాగాన్ని ఆక్రమించడానికి రష్యా సైన్యం పెద్దమొత్తంలో ప్రాణనష్టాన్ని చూడాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా డొనెట్స్క్ ప్రాంతంలోని బాక్ముట్ వంటి భీకర పోరాటాలు జరిగిన చోట్ల వేలాది మంది రష్యా సైనికులు బలయ్యారు. 30 నుంచి 49 సంవత్సరాల మధ్య వయస్సు గల పురుష జనాభా ఈ యుద్ధం బారిన పడుతుండటంతో ఇది రష్యా భవిష్యత్తు జనాభా లెక్కలపై, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెరుగుతున్న ఒత్తిడి
యుద్ధంలో తమ వైపు జరుగుతున్న ప్రాణనష్టానికి సంబంధించి రష్యా ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి సమగ్ర అధికారిక గణాంకాలను బహిరంగంగా ప్రకటించడం లేదు. అయితే, తాజా రోస్సాట్ డాటా లీక్ ఉదంతం మాత్రం మాస్కో పాలకుల వాదనలను ఇరుకున పెట్టింది. యుద్ధం దీర్ఘకాలం పాటు కొనసాగుతున్న కొద్దీ ప్రాణాల నష్టం అంతకంతకూ పెరుగుతుండటం రష్యా అంతర్గత సామాజిక పరిస్థితులను సంక్షోభంలోకి నెట్టే ప్రమాదముందని కొందరు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: జెఫ్ బెజోస్‌కు నెలవారీ అద్దె ఎంత వస్తుందంటే..
Tags : 1