హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ DK శివకుమార్ అనే నేను
Breaking News
పెట్రోల్ ధరలు రూ.10 పెరగాల్సింది!
Published on Tue, 05/26/2026 - 17:14
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం, ప్రజలపై అదనపు భారం పడకుండా 76 రోజుల పాటు ఇంధన ధరలను నియంత్రించేందుకు ప్రయత్నించిందని తెలిపారు. ప్రస్తుతం పెరిగిన ధరలు, చాలా రోజులకు ముందే పెరగాల్సి ఉండగా.. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల కొంతకాలం వరకు ప్రజలకు ఉపశమనం లభించిందని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం ద్వారా.. ఈ ఏడాది లక్ష కోట్ల రూపాయలకుపైగా ఉపశమనం కల్పించిందని సీతారామన్ చెప్పారు. ప్రభుత్వం ఆ సమయంలో పన్ను తగ్గింపులు చేయకపోయి ఉంటే, అప్పుడే లీటరుకు రూ.10 వరకు ధరలు పెరిగేవని వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న ధరల పెంపు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నిర్ణయమని, ఎందుకంటే ఆయా సంస్థలే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురును కొనుగోలు చేసి విక్రయిస్తున్నాయని వివరించారు.
ఇరాన్ యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరత నెలకొంటోందని, దీని ప్రభావం భారతదేశంపై కూడా పడుతోందని ఆర్థిక మంత్రి తెలిపారు. ముఖ్యంగా 'మూడు ఎఫ్‌లు' - ఫ్యూయల్ (ఇంధనం), ఫర్టిలైజర్ (ఎరువులు), ఫారెక్స్ (విదేశీ మారక నిల్వలు) విషయంలో దేశం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరగడం వల్ల దేశీయ ఖర్చులు కూడా అధికమవుతున్నాయని ఆమె హెచ్చరించారు.
ఇక విదేశీ మారక నిల్వలను ఆదా చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును పాటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక స్థిరత్వం కోసం విదేశీ కరెన్సీ నిల్వలను కాపాడుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.
ఇంధనంతో పాటు.. ఎరువుల ధరలు కూడా ఊహించని స్థాయిలో పెరిగాయని సీతారామన్ తెలిపారు. అలాగే బంగారం ధరలు భారీగా పెరగడం వల్ల విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతోందని చెప్పారు. భారతదేశం బంగారం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటం వల్ల ఇది ఆర్థిక వ్యవస్థకు సవాలుగా మారుతోందని ఆమె అభిప్రాయపడ్డారు.
రూపాయి విలువ పడిపోవడంపై కూడా ఆర్థిక మంత్రి స్పందించారు. రూపాయి బలహీనత, పెట్టుబడుల పరిస్థితులపై ప్రజల నుంచి, వివిధ విభాగాల నుంచి అనేక సూచనలు వచ్చాయని తెలిపారు. వాటన్నింటినీ ప్రభుత్వం సమగ్రంగా పరిశీలిస్తోందని, దేశ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసేందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.
ఇదీ చదవండి: గడ్కరీ కీలక ప్రకటన.. వచ్చేస్తోంది కొత్త రకం స్టవ్!
Tags : 1