వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి
Breaking News
ఈపీఎఫ్ వేతన పరిమితి పెంపు.. ఈడీఎల్ఐ పరిస్థితి ఏమిటి?
Published on Sat, 09/26/2026 - 15:36
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) పరిధిలోని వేతన పరిమితిని నెలకు రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. 2014 తర్వాత దాదాపు 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ కేంద్ర కార్మిక శాఖ సెప్టెంబర్ 17న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా సుమారు 50 లక్షల మందికి పైగా కొత్త ఉద్యోగులు సామాజిక భద్రతా పరిధిలోకి రానున్నారు. అయితే ఈ వేతన పరిమితి పెంపుతో ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్ఐ) పథకం కింద పొందే ఉచిత జీవిత బీమా రక్షణ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
పీఎఫ్, పెన్షన్ విరాళాల్లో మార్పులు
నూతన నిబంధనల ప్రకారం, వేతన పరిమితి పెరగడంతో ఎంప్లాయర్ (యాజమాన్యం), ఉద్యోగి కాంట్రిబ్యూషన్లలో కీలక మార్పులు రానున్నాయి.
ఈపీఎఫ్ నిధి: బేసిక్ వేతనం ఆధారంగా పీఎఫ్ విరాళం లెక్కిస్తారు. వేతన పరిమితి రూ.25,000కు పెరగడం వల్ల గరిష్టంగా కంపెనీ విరాళం రూ.1,800 నుంచి రూ.3,000కు పెరుగుతుంది.
ఈపీఎస్ పెన్షన్: ఇదివరకు రూ.15,000 పరిమితి ప్రకారం పెన్షన్ ఫండ్‌కు వెళ్లే గరిష్ట మొత్తాన్ని రూ.1,250గా నిర్ణయించారు. కొత్త పరిమితి ఆధారంగా (8.33%) ఇది గరిష్టంగా రూ.2,083 వరకు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత లభించే నెలవారీ పెన్షన్ లబ్ధి చేకూరుతుంది.
ఇన్-హ్యాండ్ శాలరీపై ప్రభావం
కొత్త పరిమితి కారణంగా రూ.15,000 నుంచి రూ.25,000 మధ్య మూల వేతనం కలిగిన ఉద్యోగులకు ప్రతి నెలా పీఎఫ్ మినహాయింపు పెరుగుతుంది. సీటీసీ ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగుల నెలవారీ చేతికి వచ్చే జీతం (టేక్ హోమ్ సాలరీ) కొద్దిగా తగ్గినప్పటికీ సుదీర్ఘకాలంలో లభించే వడ్డీ, రిటైర్మెంట్ కార్పస్ పెరుగుతాయి.
ఈడీఎల్ఐ ఇన్సూరెన్స్ కవరేజ్ పరిస్థితి ఏమిటి?
ఈ వేతన పరిమితి పెంపుతో ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్ఐ) పథకం కింద పొందే ఉచిత జీవిత భీమా రక్షణ మరింత ఎక్కువ మందికి విస్తరిస్తుంది. కొత్తగా పీఎఫ్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులందరికీ ఈ ఇన్సూరెన్స్ రక్షణ లభిస్తుంది. అయితే, ప్రస్తుత సమాచారం ప్రకారం ఈడీఎల్ఐ కింద లభించే గరిష్ట బీమా పరిమితి రూ.7 లక్షలుగా కొనసాగుతోంది. ప్రభుత్వ యంత్రాంగం వేతన పరిమితి ఆధారంగా ఈ ఉచిత ఇన్సూరెన్స్ క్లెయిమ్ గరిష్ట పరిమితిని పెంచే అవకాశం ఉన్నప్పటికీ దీనిపై ఇంకా అధికారిక మార్పు నోటిఫికేషన్ వెలువడాల్సి ఉంది.
ఇదీ చదవండి: ఆధార్ వ్యవస్థనే అబ్బురపరిచిన కవలలు
Tags : 1