హాలీవుడ్ ఉలిక్కిపడేలా..!NTR NEEL భారీ యాక్షన్ సీక్వెన్స్
Breaking News
మెండుగా వ్యాపార విశ్వాసం!
Published on Wed, 01/21/2026 - 07:56
భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) వ్యాపార విశ్వాస సూచీ ఐదు నెలల గరిష్టానికి ఎగిసింది. 2025–26 క్యూ3లో (2025 అక్టోబర్–డిసెంబర్) 66.5కు చేరింది. డిమాండ్, లాభదాయకత, పెట్టుబడులకు సానుకూల పరిస్థితులపై ఆశావహ ధోరణి నెలకొంది. అన్ని రంగాలకు చెందిన కంపెనీలు, ఎంఎస్‌ఎంఈలను సర్వే చేసి సీఐఐ వ్యాపార విశ్వాస సూచీ (బీసీఐ) వివరాలను విడుదల చేసింది.
175కు పైగా కంపెనీలు (ప్రభుత్వ, ప్రైవేటు) అభిప్రాయాలు పంచుకున్నాయి. దేశీ డిమాండ్ కీలక చోదకంగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. 2025–26 రెండో త్రైమాసికంలో (సెప్టెంబర్ క్వార్టర్) అధిక డిమాండ్‌ను చూసినట్టు సర్వేలో మూడింట రెండొంతుల కంపెనీలు చెప్పాయి. జీఎస్‌టీ శ్లాబుల కుదింపు, పండుగల సందర్భంగా వినియోగం పెరగడం సానుకూలించినట్టు సీఐఐ నివేదిక తెలిపింది. పెట్టుబడులు, నియామకాల ఉద్దేశ్యాలు బలంగా ఉన్నట్టు పేర్కొంది. మార్చిలోపు ఆర్‌బీఐ రెపో రేటును తగ్గిస్తుందని 69 శాతం సంస్థలు అభిప్రాయపడ్డాయి. ఇకమీదటా వృద్ధి నిలకడగా కొనసాగేందుకు వీలుగా బడ్జెట్‌లో సంస్కరణలు కొనసాగుతాయన్న నమ్మకాన్ని సీఐఐ వ్యక్తం చేసింది.
వినియోగానికి జీఎస్‌టీ దన్ను
జీఎస్‌టీలో శ్లాబుల సంఖ్యను కుదించడం ఫలితంగా 375కు పైగా ఉత్పత్తులపై రేట్లు దిగిరావడంతో.. తమ అమ్మకాలు 5–20 శాతం మధ్య పెరిగినట్టు సీఐఐ సర్వేలో 56.3 శాతం సంస్థలు తెలిపాయి. సాహసోపేతమైన సంస్కరణలతో ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ స్థానం స్థిరపడినట్టు పేర్కొంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య అనిశ్చితుల మధ్య బలమైన పనితీరు చూపించినట్టు తెలిపింది. వ్యాపార విశ్వాసం క్రమంగా పెరుగుతుండడం అన్నది విదేశీ ప్రతికూలతలను పరిశ్రమ అధిగమించగలదని తెలియజేస్తున్నట్టు సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వృద్ధి రేటు మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు.
బడ్జెట్‌పై కీలక సూచనలు
ప్రభుత్వం మూలధన వ్యయాలను స్థిరంగా కొనసాగించాలని, రూ.150 లక్షల కోట్లతో నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ 2.0ను ప్రారంభించాలని బడ్జెట్ 2026కు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖకు సీఐఐ సూచించడం గమనార్హం. వ్యూహాత్మక నిధుల మద్దతుతో దేశ పరిశ్రమ పోటీతత్వాన్ని పెంచాలని కోరింది. ఇండియా డెవలప్‌మెంట్ అండ్ స్ట్రాటజిక్ ఫండ్ (ఐడీఎస్‌ఎప్)ను ఏర్పాటు చేయాలని కూడా సూచించింది. రూ.1,000 కోట్లతో అత్యాధునిక అధ్యయనం, పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయాలని, రూ.1,000 కోట్లతో డిజిటైజేషన్ ఫండ్‌ను నెలకొల్పాలని కోరింది.
ఇదీ చదవండి: సహజ వజ్రాలకే ‘డైమండ్’ గుర్తింపు
Tags : 1