తిరుపతిలో అయ్యప్ప భక్తులకు అవమానం
Breaking News
ఉద్యోగంతో ఊడిగం చేయాల్సిందేనా..!
Published on Tue, 11/11/2025 - 12:26
టెస్లా, స్పేస్ఎక్స్కు సారథ్యం వహిస్తూ వాటిని విజయపథంలో నడిపించేందుకు వారానికి 120 గంటలు, రోజుకు సుమారు 17 గంటలు పనిచేశానని ఎలాన్ మస్క్ ఇటీవల ఒక సందర్భంలో తెలిపారు. చాలాసార్లు రాత్రిళ్లు కూడా పని చేసేవాడినని చెప్పారు. ప్రొడక్షన్‌ను పర్యవేక్షించడానికి ఫ్యాక్టరీలోనే నిద్రపోయిన సంఘటనలున్నాయని తెలిపారు. మస్క్ 2022లో ఎక్స్‌ను కొనుగోలు చేసినప్పుడు ఉద్యోగులకు ‘పని చేయడానికి జీవితాలను అంకితం చేయాలి లేదా సంస్థలో పని చేయడం మానేయాలి’ అని తన వైఖరిని స్పష్టం చేశారు. ఇటీవల ఇన్ఫోసిస్ ఛైర్మన్ నారాయణమూర్తి ఇదే తరహా వ్యాఖ్యలు చేసి వైరల్‌గా నిలిచారు. ఈనేపథ్యంలో జీవితంలో విజయం సాధించిన వారు వర్క్-లైఫ్ సమతుల్యతను వదులుకున్నవారేనా అనే ప్రశ్న తలెత్తుతోంది.
విజయానికి త్యాగం తప్పనిసరి..
ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్ మార్క్ క్యూబన్ వ్యాఖ్యలు ఇటీవల వివాదాస్పదమయ్యాయి. అయితే, తనకు నిజాయితీ కలిగిన వ్యక్తిగా పేరుంది. ది ప్లేబుక్ సిరీస్‌లో ఆయన వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కాన్సెప్ట్ ఉండదని చెప్పారు. ఆయన అభిప్రాయం ప్రకారం, సాధారణంగా 9–5 ఉద్యోగం చేస్తున్నవారు కొంత సమతుల్యతను పొందగలరేమో కానీ అత్యుత్తమ స్థానాన్ని కోరుకునే వారికి అది అసాధ్యమన్నారు. విజయానికి త్యాగం తప్పనిసరని చెప్పారు.
సమతుల్యత కంటే సమన్వయం ముఖ్యం
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాత్రం వర్క్-లైఫ్ సమతుల్యతకు ఆమోదం తెలిపారు. ‘నేను ఇంట్లో సంతోషంగా ఉంటేనే నా పనిలో ఉత్తమంగా ఉంటాను. పని, వ్యక్తిగత జీవితం మధ్య పోటీ కాకుండా పరస్పర సహకారం అవసరం. సమతుల్యత కంటే సమన్వయం కీలకంగా ఉంటుంది’ అన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా ఈ ఆలోచనకు అనుకూలంగా ఉన్నారు. ‘వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కంటే రెండింటి మధ్య సమన్వయం చాలా ముఖ్యం. అంటే మన ఆసక్తులు, విలువలను వృత్తిలోనూ ఉండేలా జాగ్రత్తపడితే మెరుగైన ఫలితాలు ఉంటాయి’ అన్నారు.
9-9-6 రూల్..
చైనాలోని అలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్ మా ‘9-9-6’ పని సంస్కృతిని సమర్థించారు. అంటే ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు, వారానికి 6 రోజులు పని చేయాలి. యువత వృత్తిపరంగా ఎదగాలంటే దీన్ని అనుసరించాలని చెబుతున్నారు. అయితే ‘మీకు ఇష్టమైన పని దొరికితే 9-9-6 పని సమస్య కాదు’ అని అన్నారు.
ఇదీ చదవండి: విద్య అంటే కేవలం చదువేనా?
Tags : 1