5 రోజుల్లో రూ.663 కోట్లు! బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న రామాయణం
Breaking News
కాలుకు గాయం అయితే లేఆఫ్!
Published on Thu, 11/12/2026 - 13:11
ప్రస్తుత పోటీ ప్రపంచంలో కార్పొరేట్ సంస్థల పనితీరు, మానవతా విలువలకు పడుతున్న తూట్లు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. విధుల్లో ఉన్న సమయంలో లేదా వ్యక్తిగత జీవితంలో అనుకోని ప్రమాదాల బారిన పడి అనారోగ్యానికి గురయ్యే ఉద్యోగులకు అండగా ఉండాల్సిన యాజమాన్యాలు, కొద్ది నెలల అనారోగ్య సెలవులను కూడా భరించలేక కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన కార్పొరేట్ రంగంలోని మానవతా లోపాలను, ఉద్యోగ భద్రతపై నెలకొన్న ఆందోళనలను మరోసారి అద్దం పడుతోంది.
సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న వివరాల ప్రకారం, 28 ఏళ్ల ఓ యువతి కాలుకు తీవ్రమైన గాయంతో ఇబ్బంది పడుతోంది. అదే సమయంలో సంస్థ నుంచి అకస్మాత్తుగా లేఆఫ్ మెయిల్ వచ్చింది. సాధారణంగా ఉద్యోగులు అనారోగ్యానికి గురైనప్పుడు లేదా ప్రమాదాలు జరిగినప్పుడు చట్టపరంగా గానీ, నైతిక పరంగా గానీ యాజమాన్యాలు అండగా ఉండాలి. అయితే, సంబంధిత కంపెనీ మాత్రం ఆ బాధితురాలు వరుసగా వైద్య సెలవులు (మెడికల్ లీవ్స్) పెట్టడాన్ని సాకుగా చూపి ఎలాంటి ముందస్తు సమాచారం లేదా నోటీసు పీరియడ్, నష్టపరిహారం (సెవరెన్స్ పే) అందించకుండానే ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కంపెనీ నిర్ణయంపై వ్యతిరేకత
శారీరక వేదనతో పాటు ఉద్యోగం కోల్పోవడంతో ఆ యువతి తీవ్రమైన మానసిక, ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా వాపోయారు. ‘వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో సెలవు కోరడం నేరమా?’ అంటూ ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట చర్చకు దారితీసింది. కార్పొరేట్ సంస్థల్లో మానవ వనరుల విభాగాలు ఉద్యోగుల సంక్షేమం కంటే కంపెనీ ఉత్పాదకతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయనే విమర్శలకు ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తోంది.
పెరుగుతున్న కార్పొరేట్ లేఆఫ్‌ల నేపథ్యంలో ఉద్యోగులకు రక్షణ లేకుండా పోతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చట్టపరమైన నిబంధనలు, లేబర్ చట్టాలు బలహీనంగా ఉన్న చోట యాజమాన్యాలు ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలకు పాల్పడుతున్నాయని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఒకవైపు అనారోగ్యంతో పోరాడుతూ, మరోవైపు ఉపాధిని కోల్పోయిన ఆ యువతి ఉదంతం కార్పొరేట్ ప్రపంచంలోని వాస్తవాలను కళ్లకు కడుతోంది.
ఇదీ చదవండి: ఎన్విడియా సీఈఓ వారసుల జీతం ఎంతంటే..
Tags : 1