Breaking News

నడి సంద్రంలో చిక్కుకుని..

Published on Mon, 07/06/2026 - 05:49

సాక్షి, విశాఖపట్నం/పూసపాటిరేగ: బతుకుదె­రువు కోసం నడి సంద్రంలోకి వెళ్లిన మత్స్యకార కుటుంబాల్లో కల్లోలం నెలకొంది. వాతావరణం ప్రతికూలంగా మారడం, సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో విశాఖ నుంచి చేపల వేటకు బయలుదేరిన రెండు మత్స్యకారుల బోట్లు వేర్వేరు ప్రాంతాల్లో గల్లంతయ్యాయి. వీటిల్లో మొత్తం 16 మంది మత్స్యకారులున్నట్లు గుర్తించారు. ఇందులో ఒక బోటు డ్రైవర్‌ చైనా కార్గో షిప్‌ సహాయంతో ప్రమాదం నుంచి బయటపడగా.. ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. మరో బోటులో ఉన్న 9 మంది మత్స్యకారులు ప్రమాదపుటంచుల వరకూ వెళ్లి అతికష్టంమ్మీద పూరీ తీరానికి ప్రాణాలతో చేరుకున్నారు. గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం కోస్ట్‌గార్డ్, నేవీ, మెరైన్‌ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 

మొదటి బోటులో ఏం జరిగిందంటే..!
విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి ఐఎన్‌డీ ఏపీ అండ్‌ వీఎస్‌ అండ్‌ ఎంఎం అండ్‌ 83 నంబర్‌ బోటులో ఏడుగురు మత్స్యకారులు జూలై 1న చేపల వేటకు బయలుదేరారు. శనివారం మధ్యాహ్నం నుంచి ఈ బోటు ఆచూకీ లేకుండా పోయింది. గల్లంతవడానికి ముందు రాత్రి బోటులో ఉన్నవారు తమ కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి.. ‘గంగవరం దగ్గర్లో ఉన్నాం... గంటలో హార్బర్‌కు చేరుకుంటాం’ అని చెప్పారు. గంట తర్వాత వారి ఫోన్‌లు కలవకపోవడంతో మత్స్యకార కుటుంబాలు ఆందోళనతో అధికారులకు సమాచారం ఇచ్చాయి. మొదటి బోటు డ్రైవర్, ఓనర్‌ అయిన కారి‡ చిన్నా.. చైనా కార్గో నౌక సహాయంతో సురక్షితంగా బయటపడ్డాడు. 

తీవ్ర ప్రతికూల పరిస్థితుల మధ్య చైనాకు చెందిన పనామా (కార్గో) నౌక ఈ బోటును గుర్తించింది. వాణిజ్య నౌక సిబ్బంది లైఫ్‌ జాకెట్‌ వేసి సురక్షితంగా రక్షించారు. ప్రస్తుతం ఆయన కోస్ట్‌గార్డ్‌ సంరక్షణలో ఉన్నారు. మరో ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ తెలియరాలేదు. గంగవరం నుంచి 10 నాటికల్‌ మైళ్ల దూరంలోకి ఎలా వెళ్లారన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారిగా ఇంజన్‌ పనిచేయలేదని.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గంటకు 40 నుంచి 50 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తుండటం.. యాంకర్‌ తాడు ఒక్కసారిగా తెగిపోవడంతో బోటు దిశ మారి కొట్టుకుపోయిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు మత్స్యశాఖ కమిషనర్‌ కార్యాలయం ప్రకటించింది. 

ఈత కొడుతూ షిప్‌ వద్దకు వెళ్లేందుకు యత్నించి..
డ్రైవర్‌ చిన్నాను రక్షించిన సమయంలో.. మరో ముగ్గురు మత్స్యకారులు ప్రాణాలు దక్కించుకునేందుకు ఈత కొడుతూ ఆ షిప్‌ వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అలసిపోయి సముద్రంలో గల్లంతయ్యారు. మిగిలిన వారు మరో పడవను గానీ తీరాన్ని గానీ చేరుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ వారి ఆచూకీ లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్‌.. 
సమాచారం అందిన వెంటనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గల్లంతైన మత్స్యకారుల కోసం కోస్ట్‌గార్డ్, నేవీ, మెరైన్‌ పోలీసు బృందాలు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టాయి. నేవీకి చెందిన రెండు నౌకలు, కోస్ట్‌గార్డ్‌కు చెందిన రెండు హెలికాప్టర్లతో పాటు కాకినాడ నుంచి మరో కోస్ట్‌గార్డ్‌ నౌక ముమ్మరంగా గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యాయి. బోటు ప్రయాణించిన దిశ, చివరి సిగ్నల్స్‌ ఆధారంగా సెర్చ్‌ ఆపరేషన్స్‌ కొనసాగిస్తున్నారు. సమీపంలోని అన్ని మర్చంట్‌ నౌకలను కూడా రెస్క్యూ బృందాలు అప్రమత్తం చేశాయి.

పరామర్శించిన వైఎస్సార్‌సీపీ నాయకులు
గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులను వైఎస్సార్‌ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, విశాఖ దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్‌కుమార్‌ ఆదివారం సాయంత్రం పరామర్శించారు. ప్రమాదం జరిగి 24 గంటలు గడిచినా ప్రభుత్వం తగిన చొరవ చూపకపోవడం విచారకరమని కేకే రాజు పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి యుద్ధప్రాతిపదికన గల్లంతైన వారిని గుర్తించాలని, బాధిత కుటుంబాలకు పూర్తి భరోసాతో పాటు మునిగిపోయిన బోటుకు తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మత్స్యకారులు గల్లంతు కావడంపై ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. గల్లంతైన వారిని సురక్షితంగా రక్షించేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణపై మత్స్యకార కుటుంబాల మండిపాటు
మత్స్యకారులను కాపాడాలని రాత్రి పూట బాధిత కుటుంబాలు సమాచారం అందించినా ప్రభుత్వం సరిగా స్పందించలేదని మండిపడుతున్నారు. ఉదయం తర్వాత తాపీగా రెస్క్యూ ఆపరేషన్‌ మొదలు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. పరామర్శకు వచ్చిన జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణను మత్స్యకార కుటుంబాలు నిలదీశాయి. మత్స్యకారులు ప్రమాదకర పరిíస్థితుల్లో ఉంటే ఫోన్లలో కాలక్షేపం చేయడం ఏమిటని మండిపడ్డాయి. విశాఖ ఎంపీ భరత్‌ మత్స్యకారుల గురించి కనీసం ఆరా తీయలేదు. ఇతర టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు అటువైపు కన్నెత్తి చూడలేదు.

అచ్చెన్నా..! నిస్సిగ్గుగా అబద్ధాలా!
గల్లంతైన మత్స్యకారుల్లో ఒకరిని ప్రభుత్వం రక్షించిందంటూ మంత్రి అచ్చెన్న ప్రెస్‌నోట్‌ విడుదల చేయటంపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సురక్షితంగా బయటపడిన డ్రైవర్‌ చిన్నా.. సమీపంలో కనిపించిన చైనాకి చెందిన ఎంవీ యూనివర్స్‌ వెల్దీ అనే షిప్‌ వద్దకు ఈదుకుంటూ వెళ్లి ప్రాణాలు కాపా­డు­కున్నానని స్పష్టంగా చెప్పాడు. మంత్రి అచ్చెన్న మాత్రం ప్రభుత్వం కాపాడిందంటూ ప్రకటించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఇక పూరీలో గల్లంతైన మెకనైజ్డ్‌ బోటు గాలుల తీవ్రతకు అతికష్టమ్మీద ఒడ్డుకు వచ్చింది. సమీపంలో ఉన్న ఒడిశాకు చెందిన మెరైన్‌ పోలీసులు అప్రమత్తమై అందులో ఉన్నవారిని కాపాడారు. వీరిని కూడా తామే రక్షించామంటూ అచ్చెన్న ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పూరీ తీరంలో మరో పడవ
జూన్‌ 30న విశాఖ నుంచి చేపల వేటకు వెళ్లిన మరో బోటు పూరీ (ఒడిశా) తీరంలో ప్రమాదానికి గురైంది. ఇందులో మొత్తం 9 మంది మత్స్యకారులు ఉండగా ఎట్టకేలకు అంతా సురక్షితంగా ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నారు. పడవ ఇంజన్‌ దెబ్బతినడం, యాంకర్‌ తాడు అకస్మాత్తుగా తెగిపోవడంతో బోటు నియంత్రణ కోల్పోయి వేగంగా ఒడ్డు వైపు కొట్టుకొచ్చింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న జాలర్లు తమను కాపాడాలంటూ వీడియో రూపంలో అధికారులకు సమాచారం అందించారు. వేగంగా కొట్టుకొస్తున్న బోటులో ఉన్న 9 మంది మత్స్యకారులు ప్రాణాలు అరచేత పట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు. అదృష్టవశాత్తూ బోటు సురక్షితంగా ఆదివారం రాత్రి పూరీ తీరానికి చేరుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

కళ్లెదుటే నా వాళ్లందరినీ కోల్పోయా...!
‘వేట ముగించుకుని వలలు కడిగేసి తిరిగి వస్తుండగా ఒడ్డుకు సుమారు 10 మైళ్ల దూరంలో ఊహించని విధంగా మా బోటు ఒక్కసారిగా తిరగబడిపోయింది. బోటులో ఉన్న ఏడుగురిలో ఒకరు లోపలే చిక్కుకుపోగా మిగిలిన ఆరుగురు నీళ్లలో దొరికిన ఆధారాలను పట్టుకుని రాత్రి 9 గంటల వరకు ప్రాణాలతో పోరాడాం. ఆ తర్వాత బోటు పూర్తిగా మునిగిపోయింది. తీవ్ర అలసటతో రాత్రి 11 గంటల సమయంలో ఒకరు కళ్లెదుటే ప్రాణాలు వదలడంతో తీవ్ర విషాదంలో కూరుకుపోయాం. తెల్లారేసరికి ఐదుగురం మిగిలాం. ఆ సమయంలో దూరంగా ఒక షిప్‌ కనిపించింది. కండరాలు పట్టేయడంతో మా పెద్దన్న ఇక ఈదలేనని అక్కడే ఉండిపోగా... ప్రాణాలు దక్కించుకోవచ్చన్న ఆశతో మిగిలిన నలుగురం ఆ ఓడ వైపు ఈదుకుంటూ వెళ్లాం. 

నేను ముందుగా వెళ్లి ఆ ఓడ యాంకర్‌ని గట్టిగా పట్టుకున్నా. కానీ అది గాలిలో వేలాడుతుండటంతో చేజారి మళ్లీ నీళ్లలో పడిపోయా. ప్రాణభయంతో గట్టిగా కేకలు వేయడంతో ఓడలోని సిబ్బంది లైఫ్‌ జాకెట్‌ విసిరి తాడు సాయంతో నన్ను పైకి లాగి కాపాడారు. కానీ నాతో పాటు ఈదుకుంటూ వచ్చిన మిగిలిన ముగ్గురి పరిస్థితి ఏమైందో తెలియదు. నాతోపాటు వేటకు వచ్చిన వాళ్లంతా నా సొంత అన్నలు, వాళ్ల పిల్లలు, దగ్గరి బంధువులే. నా కళ్లెదుటే నా వాళ్లందరినీ కోల్పోయా. నా జీవితం ఇలా ఒంటరిగా మిగిలింది. – కారి చిన్నా, బోటు ఓనర్, డ్రైవర్‌

మత్స్యకారుల గల్లంతుపై వైఎస్‌ జగన్‌ ఆందోళన
గాలింపు చర్యలు ముమ్మరం చేయాలి
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ధైర్యం చెప్పాలి
సాక్షి, అమరావతి: విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి మత్స్యకారులు గల్లంతైన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల బోటు సాంకేతిక కారణాలతో తిరిగి రాకపోవడం, వారితో సంబంధాలు తెగిపోవడం బాధాకరమన్నారు. మత్స్యకారుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నందున ప్రభుత్వం మరింత వేగంగా స్పందించి గాలింపు చర్యలను విస్తృతంగా చేపట్టాలని కోరారు.

కోస్టుగార్డు, నేవీ, మెరైన్‌ పోలీసు విభాగాల సమన్వయంతో గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని సూచించారు. అవసరమైతే అదనపు నౌకలు, హెలికాప్టర్లు వినియోగించి మత్స్యకారులను గుర్తించి రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలన్నారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ధైర్యం చెప్పాలని, వారికి ఎప్పటికప్పుడు గాలింపు చర్యల వివరాలు తెలియజేయాలని సూచించారు. ఈ కష్ట సమయంలో మత్స్యకారుల కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని వైఎస్‌ జగన్‌ తెలిపారు. 

బాధిత మత్స్యకారుల కుటుంబాలను విశాఖ ప్రాంత వైఎస్సార్‌సీపీ నాయకులు సంప్రదించి అవసరమైన సహాయం అందించాలని, అధికారులతో సమన్వయం చేస్తూ గాలింపు చర్యల పురోగతిని తెలుసుకోవాలని నిర్దేశించారు. గల్లంతైన మత్స్యకారులు సురక్షితంగా తిరిగి రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)