Breaking News

హైకోర్టు పోయె.. బెంచ్‌ వచ్చె!

Published on Fri, 01/31/2025 - 03:22

సాక్షి, అమరావతి / సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాయలసీమ­వాసుల హైకోర్టు ఆశలకు శాశ్వతంగా గండికొట్టిన టీడీపీ ప్రభుత్వం.. కర్నూలులో బెంచ్‌ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం ద్వారా న్యాయ రాజధానిగా చేయాలనే సంకల్పంతో గత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan mohan Reddy) ప్రభుత్వం లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, వక్ఫ్‌ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టు, ఏపీఈఆ­ర్‌సీని కర్నూలులో ఏర్పాటు చేసింది. ఇందులో ఏపీఆర్‌సీకి శాశ్వత భవనాన్ని నిర్మించింది. 

ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చి­న కూటమి ప్రభుత్వం హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని, కర్నూల్లో బెంచ్‌ మాత్రమే ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో కర్నూలులో 15 మంది న్యాయమూర్తు­లకు సరిపడా వసతి, నివాస సదుపాయాలు, కోర్టు రూము­లు, సిబ్బంది గదులు, న్యాయవాదులకు వసతి ఇతర సౌక­ర్యా­లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తమ ముందుంచాలని కలెక్టర్‌ రంజిత్‌ బాషాను హైకోర్టు(High Court) ఆదేశించింది.

కర్నూలులో బెంచ్‌ ఏర్పాటు విషయంలో ప్రధాన న్యాయ­మూర్తి నియమించిన న్యాయమూర్తుల కమిటీ ముందు ఉంచేందుకు వీలుగా ఈ వివరాలను అందచేయాలని పేర్కొంటూ హైకోర్టు రిజిస్ట్రార్‌ (విజిలెన్స్‌) శ్రీనివాస శివరామ్‌ ఈ నెల 29న కలెక్టర్‌కు లేఖ రాశారు. దీన్ని అత్యవసరంగా భావించాలని కోరడంతో కలెక్టర్‌ తక్షణమే స్పందించి ఆర్‌ అండ్‌ బీ ఎస్‌ఈ, మునిసిపల్‌ కమిషనర్, ఆర్డీవోలకు ఈ బాధ్యతను అప్పగించగా.. కర్నూలులో మూడు భవనాలను ‘బెంచ్‌’ కోసం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. 

ప్రజలకు అందుబాటులో ఉండేలా..
కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్‌ ఏర్పాటు భవనం కోసం ప్రధానంగా ఏపీఈఆర్‌సీ భవనాన్ని అధికారులు ప్రతిపాదించి­నట్లు సమాచారం. అధికారులు ప్రతిపాదించిన మూడు భవ­నాల్లో ఇదే కొత్తది కావడం, ప్రజలకు అందుబాటులో ఉన్నందున ఇక్కడే హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేస్తారనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. భవనాల గుర్తింపు కోసం ప్రభు­త్వం కేవలం ఒక్క రోజు మాత్రమే గడువు ఇచ్చిన నేపథ్యంలో అధికారులు మొత్తం మూడు భవనా­లను సూచించినట్లు చెబుతున్నారు. 

ఇందులో ఏపీఈఆర్‌సీ భవనంతోపాటు జగన్నా­థ­­గట్టుపై నిర్మిస్తున్న క్లస్టర్‌ యూనివర్సిటీ భవనం, హైదరా­బాద్‌–­చెన్నై సమీపంలోని ఓ ప్రైవేట్‌ భవనం ఉన్నాయి. వీటి వివరాలను కలెక్టర్‌ గురు­వారం రిజిస్ట్రార్‌కు పంపినట్లు సమా­చారం. దీనిపై కలెక్టర్‌­ను వివరణ కోరగా.. భవనాలను పరిశీ­లి­స్తున్నామని, ఇంకా ఖరారు చేయలేదని వెల్లడించారు. 

కాగా, ఒకవేళ జగన్నాథ గట్టుపై ఉన్న భవనాలను హైకోర్టు బెంచ్‌(High Court Bench) కోసం ప్రతిపాదిస్తే అక్కడున్న క్లస్టర్‌ యూనివర్సిటీని సిల్వర్‌ జూబ్లీ కాలేజీ భవనాలకే పరిమితం చేసే అవకాశం ఉంది. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు నిర్ణయంతో ఏపీ­ఈఆర్‌­సీని అమరావతికి తరలించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

మంత్రివర్గం తీర్మానం 
కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్‌ ఏర్పాటును ఆమోదిస్తూ గతేడాది అక్టోబర్‌లో రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేసింది. అటు తరువాత అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్‌ ఏర్పాటు ప్రతిపాదనపై అభిప్రాయాలు తెలియచేసే నిమిత్తం ఫుల్‌ కోర్టుకు నివేదించాలని కోరుతూ న్యాయశాఖ కార్యదర్శి గత ఏడాది అక్టోబర్‌ 28న హైకోర్టు రిజిష్ట్రార్‌ జనరల్‌కి లేఖ రాసిన విషయం తెలిసిందే. 

ఇదిలా ఉండగా బెంచ్‌ ఏర్పాటుపై నలుగురు సీనియర్‌ న్యాయమూర్తులతో హైకోర్టు ప్రధాన న్యాయ­మూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ కమిటీని నియమించారు. జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి, జస్టిస్‌ రావు రఘునందన్‌రావు, జస్టిస్‌ నైనాల జయసూర్య, జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ ఇప్పటికే ప్రాథమికంగా సమావేశమైనట్లు తెలిసింది. కమిటీ నివేదికను ప్రధాన న్యాయమూర్తి ఫుల్‌కోర్టు ముందుంచి చర్చించే అవకాశం ఉంది. ఫుల్‌కోర్టు తీసుకునే నిర్ణయం ఆధారంగా కర్నూలులో శాశ్వత బెంచ్‌ ఏర్పాటు ఓ కొలిక్కి వస్తుంది.

15 మంది న్యాయమూర్తుల కేటాయింపు?
కర్నూలులో శాశ్వత బెంచ్‌ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందుకున్న తరువాత జిల్లాల వారీగా దాఖలైన కేసుల గణాంకాలను హైకోర్టు సిద్ధం చేసినట్లు తెలిసింది. హైకోర్టులో మొత్తం కేసుల్లో 40 శాతం రాయలసీమ జిల్లాల నుంచే దాఖలవుతున్నాయి. దీని ఆధారంగా కర్నూలులో ఏర్పాటయ్యే శాశ్వత బెంచ్‌ న్యాయమూర్తుల సంఖ్యను ప్రాథమికంగా ఖరారు చేసినట్లు హైకోర్టు వర్గాలు చెబుతున్నాయి. 

హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37 కాగా, ప్రస్తుతం 30 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. 40 శాతం కేసులు రాయలసీమ నుంచి దాఖలవుతున్నందున మొత్తం 37 మంది న్యాయమూర్తుల్లో అందుకు అనుగుణంగా 15 మందిని కర్నూలు(Kurnool) బెంచ్‌కు కేటాయించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు హైకోర్టు వర్గాలు చెబుతున్నాయి. 

మిగిలిన 22 మంది న్యాయమూర్తులు అమరావతిలో ఉన్న హైకోర్టు ప్రిన్సిపల్‌ బెంచ్‌లో న్యాయమూర్తులుగా కొనసాగే వీలుంది. ఈ క్రమంలోనే కర్నూలులో 15 మంది న్యాయమూర్తులకు సరిపడా మౌలిక సదుపాయాల గురించి ఆరా తీస్తూ కర్నూలు కలెక్టర్‌కు హైకోర్టు లేఖ రాసినట్లు భావిస్తున్నారు.

కర్నూలు బెంచ్‌ పరిధిలోకి ప్రకాశం, నెల్లూరు?
ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కలిపి రాయలసీమ జిల్లాలతో కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించినట్లు తెలిసింది. అయితే దీన్ని ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన నాయకులు, న్యాయవా­దులు వ్యతిరేకిస్తు­న్నారు. 

కర్నూలు వెళ్లాలంటే తమకు నేరుగా రైలు సౌకర్యం లేదని, రోడ్డు ద్వారా వెళ్లాలంటే కనీసం 7 నుంచి 9 గంటల సమయం పడుతుందని ఇరు జిల్లాల వారు ప్రభుత్వానికి నివేదించారు. అయితే వీరి అభ్యంతరాలను ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)